ఓ చూపు చూశారు! | sakshi funday crime stories | Sakshi
Sakshi News home page

ఓ చూపు చూశారు!

Aug 17 2025 8:51 AM | Updated on Aug 17 2025 8:51 AM

sakshi funday crime stories

పెళ్లి, పెళ్లి చూపులు... ఈ రెండు సందర్భాల్లోనూ ఇరుపక్షాలు తమ స్థాయిని చూపించుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఈ వీక్‌నెస్‌నే క్యాష్‌ చేసుకోవడానికి రంగంలోకి దిగిన ఓ గ్యాంగ్‌ 2011లో దేశ వ్యాప్తంగా అనేక కుటుంబాలను ఓ చూపు చూసింది. వరుడు కావాలంటూ ప్రకటన ఇచ్చి, పెళ్లి చూపులకి రమ్మంటూ ఆహ్వానించి, మత్తుమందు కలిపిన పానీయాలు ఇచ్చి అందినకాడికి  దోచుకుపోయిన ఆ ముఠా ఆరు రాష్ట్రాల్లో హడలెత్తించింది. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు చెందిన అన్నదమ్ములు శ్రీనివాస్, రుషికేశ్‌లతో పాటు అదే ప్రాంతానికి చెందిన రమేష్‌ ఓ ముఠాగా ఏర్పడ్డారు. 2003లో నాలుగేళ్ల బాలుడిని డబ్బు కోసం కిడ్నాప్‌ చేసి జైలుకు వెళ్లడంతో నేర జీవితం ప్రారంభించారు.

 2010లో హైదరాబాద్‌ శివారులోని ఓ పంచాయతీ సర్పంచ్‌ని డబ్బు కోసం బెదిరించారు. ఇలాంటి నేరాలు చేస్తే పోలీసులకు దొరికిపోయి జైళ్లు, బెయిళ్లతో ఇబ్బందులు పడుతున్నామని భావించింది. అందువల్ల పోలీసులకు చిక్కే అవకాశాలు తక్కువగా ఉండే లాభసాటి నేరాలు చేయాలనుకున్న ఈ ముఠా తమను గుర్తుపట్టని ప్రాంతాలకు వెళ్లి, అప్పటికే సంబంధం తెగిపోయే టార్గెట్‌లను ఎంచుకుని, పక్కా పథకం ప్రకారం నేరాలు చేయాలని నిర్ణయించుకుంది. తమ పథకాన్ని అమలులో పెట్టడంలో భాగంగా వీళ్లు వేసిన ఎత్తే డమ్మీ పెళ్లి చూపులు. 

దీనికోసం ఈ ముగ్గురూ ఇంటర్‌నెట్‌ నుంచి అందమైన యువతుల ఫొటోలు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వీటి ఆధారంగా తయారు చేసిన బయోడేటాల్లో ఆ యువతి ఉన్నత విద్యనభ్యసించినట్లు, పెద్ద సంస్థలో పని చేస్తున్నట్లు ఆకర్షణీయమైన వివరాలు చేర్చి, అలాంటి యువతికి అదే స్థాయి సంపన్నుడైన వరుడు కావాలంటూ వివిధ మేట్రిమోనియల్‌ సైట్స్‌లో పోస్ట్‌ చేసింది. సంప్రదింపుల కోసం బోగస్‌ వివరాలతో రూపొందించిన ఈ–మెయిల్‌ ఐడీలను పొందుపరచేది. కొన్ని పత్రికల్లోనూ ఇదే తరహాలో ప్రకటనలు ఇచ్చింది. వీటికి ఆకర్షితులై సంప్రదించిన వారిని మాటలతో ముగ్గులోకి దింపేది. వాళ్లు పెళ్లి కుమార్తె వివరాలు కోరితే... తక్షణం చెప్పే వాళ్లు కాదు. అలా చేస్తే ఎదుటి వారికి పూర్తిగా నమ్మకం రాదనే భావనతో కొత్త కథ నడిపే వాళ్లు.

 అంతకు ముందే యువతిని చూసి వెళ్లిన ఐఏఎస్‌/ఐపీఎస్‌ అధికారి అభిప్రాయం చెప్పడానికి రెండుమూడు రోజుల సమయం కోరారని, వారి నుంచి సమాధానం రాకుండా మీకు ఏ విషయం చెప్పలేమంటూ నమ్మబలికే వాళ్లు. ఈ సంప్రదింపులన్నీ ఈ–మెయిల్స్‌ ద్వారానే జరిపేవాళ్లు. అలా కొన్ని రోజులు గడిచాక వరుడి తరఫు వారికి సదరు ఐఏఎస్‌/ఐపీఎస్‌ అధికారికి తమ అమ్మాయి నచ్చిందని చెప్పారని, అయితే ఆయన ఈశాన్య రాష్ట్రాల్లో పని చేస్తున్నందున పెళ్లి చేయమని చెప్పామని నమ్మబలికే వాళ్లు. ఆపై తమ ఆస్తిపాస్తులు వివరాలు తెలుసుకోవడానికి, అమ్మాయిని చూడటానికి, తమ ఆతిథ్యం స్వీకరించడానికి వివిధ ప్రాంతాలకు రావాలంటూ ఆహ్వానించేది. ఇలా పెళ్లి చూపులకు వచ్చే ముందు ఆ వరుడి తరఫు వాళ్లు భారీగా బంగారు నగలు తీసుకుని వచ్చే వాళ్లు. 

వీళ్లు రావడానికి ముందే ‘జస్ట్‌ డయల్‌’ సాయంతో అక్కడి అనువైన ప్రాంతంలో సర్వీస్‌ అపార్ట్‌మెంట్‌తో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఫ్లాట్లు సైతం అద్దెకు తీసుకునేది. అవి తమ సొంతమే అన్నట్లు నమ్మించడానికి అనువుగా ఏర్పాటు చేసేది. కొన్ని సందర్భాల్లో రిసార్టుల్లో సూట్స్‌ బుక్‌ చేసి సిద్ధం చేసేది. ‘అతిథుల’ కోసం ఖరీదైన కార్లనూ ‘జస్ట్‌ డయల్‌’ సహాయంతోనే బుక్‌ చేసి.. వాటిలోనే ఎయిర్‌పోర్టుకు వెళ్లి వారిని రిసీవ్‌ చేసుకునేది. అక్కడ నుంచి వారిని సిద్ధం చేసి ఉంచిన సర్వీస్‌ అపార్ట్‌మెంట్లు, రిసార్టులకు తీసుకువెళ్లి, కాబోయే వియ్యంకుల మాదిరి బిల్డప్‌ ఇస్తూ రెండు మూడు రోజుల పాటు అతిథి మర్యాదలు చేసేది. ఆపై అదను చూసుకుని వారు తినే/తాగే పదార్థాల్లో మత్తుమందు కలిపి వారివద్ద ఉన్న బంగారం, డబ్బు తీసుకుని ఉడాయించేది. మత్తు వదిలాక నిద్రలేచే అతిథులు నిలువు దోపిడికీ గురయ్యామని తెలుసుకుని గొల్లుమనే వాళ్లు. 

ఈ గ్యాంగ్‌ ఓ పక్క ఈ పంథాలో దోపిడీలు చేస్తూనే, మరోపక్క ట్రావెల్స్‌ కార్లపైనా పంజా విసిరేది. ‘జస్ట్‌ డయల్‌’ నుంచి ట్రావెల్స్‌ నిర్వాహకులకు ఫోన్‌ నెంబర్‌ తీసుకుని సంప్రదించేది. వివిధ పుణ్యక్షేత్రాలు తిరిగి రావాలంటూ వాహనాన్ని బుక్‌ చేసుకుని, ప్రయాణాల్లో కొన్ని చోట్ల లాడ్జిల్లో బస చేసేది. అక్కడ కారు డ్రైవర్‌కు మత్తుమందు కలిపిన ఆహారం ఇచ్చి, అతడు స్పృహతప్పాక, కారు తాళాలు తీసుకుని, కారుతో ఉడాయించేది. మత్తు వదిలాక డ్రైవరే లాడ్జి బిల్లు చెల్లించి బయటపడాల్సి వచ్చేది. ఇలా కార్లు చోరీ చేసే ఈ ముఠా, వాటిని బోగస్‌ పత్రాల సాయంతో అమ్మి సొమ్ము చేసుకునేది. ఈ ముఠా హైదరాబాద్, జహీరాబాద్, కేరళ, కర్నూలు, తిరుపతి, ఏలూరు, కర్ణాటక, ముంబై, తమిళనాడు, పాండిచ్చేరీల్లో 24 నేరాలు చేసింది. ఈ ముఠా ఇదే పంథాలో 2003 నుంచి నేరాలు సాగిస్తున్నా, 2011 వరకు ఎక్కడా చిక్కలేదు. 

పెళ్లి చూపులు, అద్దెకు కార్లు పేరుతో జరుగుతున్న నేరాలపై 2011లో హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌ (సీసీఎస్‌) పోలీసులకు సమాచారం అందింది. బాధితులను మత్తులోకి దించేందుకు టాబ్లెట్లు వినియోగించినట్లు తేలడంతో ఆ నేరాలన్నీ ఒకే గ్యాంగ్‌ పనిగా అనుమానించింది. సాంకేతికంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేసి, కేజీ బంగారం, ఐదు వాహనాలు, చోరీ సొమ్ముతో కొన్న ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకుంది. అనివార్య కారణాల నేపథ్యంలో ఈ ముఠాపై నమోదైన కేసుల్లో అత్యధికం కోర్టుల్లో రుజువు కాలేదు. కేసులు నమోదులో జాప్యం, సరైన సాక్ష్యాధారాలు లేకపోవడమే కాకుండా, ఫిర్యాదుదారులూ ధైర్యంగా ముందుకు రాకపోవడంతో వీగిపోయాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement