
కశ్యపుడి వంశంలో పిప్పలుడు అనే విప్రుడు ఉండేవాడు. అతడు శమదమాది సద్గుణ సంపన్నుడు. శీత వాత ఆతపాదులను ఒకేరీతిలో సహించగల స్థిరచిత్తుడు. వేదవేదాంగాలను అధ్యయనం చేసిన పండితుడు. పిప్పలుడు నిత్య దరహాస ముఖారవిందంతో ఉండేవాడు. నిత్య నైమిత్తిక కార్యాలను క్రమం తప్పకుండా ఆచరించేవాడు. ఒకసారి పిప్పలుడు తపస్సు ప్రారంభించాడు. అతడి తపస్సు నానాటికీ తీవ్రం కాసాగింది. అతడు తపస్సు ప్రారంభించి వెయ్యేళ్లు గడిచింది. కేవలం వాయుభక్షకుడిగా ఉంటూ నిశ్చలంగా ఒకేచోట కూర్చుని తపస్సు చేస్తుండటంతో అతడి శరీరం శల్యావశిష్టమైంది. శరీరంపై చీమల వంటి కీటకాలు పుట్టలు పెట్టాయి. వాటి చుట్టూ తీగలు, లతలు పాకాయి. పిప్పలుడి చుట్టూ ఏర్పడిన పుట్టలలోంచి అగ్నిజ్వాలలు వెలువడసాగాయి. దేవతలు అతడి తపోతీవ్రతను నివ్వెరపోయి తిలకించసాగారు. అతడి తపస్సు ఎన్నాళ్లకూ చెదరకపోవడంతో సంతోషించిన దేవతలు, అతడి మీద పుష్పవృష్టి కురిపించారు.
‘విప్రోత్తమా! నువ్వు వేదవేదాంగ కోవిదుడవు. శ్రుతిస్మృతి విహిత ధర్మజ్ఞుడవు. నీ తపస్సుకు మేమంతా సంతోషించాం. ఏ వరాలు కావాలో కోరుకో! తప్పక నెరవేరుస్తాం’ అని పలికారు.దేవతల మాటలు వినిపించగానే పిప్పలుడు కళ్లు తెరిచాడు. ఎదుట కనిపించిన దేవతలకు వినయంగా నమస్కరించాడు. ‘దేవతలారా! మీ దయానుగ్రహాలకు పరవశుడనయ్యాను. నేను విద్యాధరుడనై, కామగమనుడనై, సువర్ణ రత్నఖచిత దివ్యరథంలో సకల లోకాలలో సంచరించేలా వరాన్ని అనుగ్రహించండి’ అని ప్రార్థించాడు.
దేవతలు ‘తథాస్తు’ అని వరం అనుగ్రహించి, అంతర్ధానం చెందారు.దేవతల వరప్రభావంతో పిప్పలుడు సకల విద్యావిశారదుడై, విద్యాధరుడయ్యాడు. మణిమయ స్వర్ణ విమానంలో సకల లోకాలలోనూ యథేచ్ఛగా సంచరించసాగాడు. జగమంతా తన స్వాధీనమైందని సంబరపడసాగాడు.
సంకల్ప మాత్రాన ఎక్కడికైనా స్వేచ్ఛా విహారం చేయగల శక్తి సంక్రమించడంతో పిప్పలుడిలో గర్వం పెరిగింది.‘ముల్లోకాలలోనూ నన్ను మించినవాడు వేరొకడు లేడు. దేవ దానవ మానవులలో నన్ను మించినవాడు మరొకడు ఉండడు’ అనుకోసాగాడు.ఒక నదీతీరంలో నివాసం ఉండే ఒక సారసపక్షి పిప్పలుడి తీరుతెన్నులను చాలాకాలంగా గమనించసాగింది. ఒకనాడు ఆ సారసపక్షి ‘ఓ విప్రోత్తమా! జగమంతా నీ స్వాధీనమైందని, సంకల్పమాత్రాన సకలలోక సంచారం చేయగలుగుతున్నందున మహామహిమాన్వితుడవయ్యానని గర్విస్తున్నావు. ఘోర తపస్సులు చేసి, దేవతల నుంచి అనేక దివ్యవరాలు పొందినా, గర్వోన్నతి వల్ల అధోగతి పాలైన వారి గురించి నువ్వు ఎరుగవు. నువ్వు పరాపరాలను ఎరుగవు. నువ్వు మూఢుడివి. కుండలపుత్రుడైన సుకర్ముడనే విప్రుడు పరాపరాలైన ఆత్మానాత్మలను ఎరిగిన విజ్ఞుడు.
అతడితో సమానుడైన జ్ఞానవంతుడు ముల్లోకాలలోనూ మరొకడు లేడు. వేదాధ్యయన సంపన్నుడు, సకల శాస్త్రకోవిదుడు అయిన సుకర్ముడు యజ్ఞయాగాదులేవీ ఆచరించలేదు. బాల్యం నుంచి అనునిత్యం మాతృపితృ సేవలో తరిస్తూ, ఆ కర్మయోగ ప్రభావంతో మహాజ్ఞానిగా ఎదిగాడు. నువ్వు జ్ఞానహీనుడివై అనవసరంగా గర్విస్తున్నావు’ అని పలికింది.సారసపక్షి మాటలకు పిప్పలుడు ఉక్రోషం చెంది, ‘పక్షి రూపంలో నన్ను నిందిస్తున్నావు. దేవ దానవ యక్ష గంధర్వాదులలో నువ్వెవరివి? పరాపరాలైన ఆత్మానాత్మలు ఏవి? వాటి స్వరూపమేది? చెప్పు’ అన్నాడు.‘కుండల పుత్రుడైన సుకర్ముడి వద్దకు వెళ్లి, అడుగు. ఆత్మానాత్మ స్వరూపాన్ని అతడే నీకు చెప్పగలడు’ అని పలికింది సారసపక్షి.
పిప్పలుడు కుండలుని ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో సుకర్ముడు తన తల్లిదండ్రులకు పాదసేవ చేస్తూ కనిపించాడు. అది చూసి, పిప్పలుడు ద్వారం వద్దనే నిలిచిపోయాడు.సుకర్ముడు ద్వారం వద్ద నిలిచి ఉన్న పిప్పలుడిని గమనించి, వెంటనే లేచి వెళ్లి అతడిని స్వాగతించి, లోనికి తీసుకువచ్చాడు. ఉచితాసనంపై కూర్చుండబెట్టి, కుశల ప్రశ్నలు వేశాడు.‘పిప్పలా! నీ వృత్తాంతం నాకు తెలుసు. సారసపక్షి నీ గర్వాన్ని పరిహసించి, నా వద్దకు పంపడం వల్లనే ఇలా వచ్చావు కదూ’ అన్నాడు సుకర్ముడు.సుకర్ముడి మాటలతో పిప్పలుడికి కాసేపు నోట మాట రాలేదు. కొద్దిసేపటికి తేరుకుని, ‘నువ్వు మహాజ్ఞానివని, పరాపరాలైన ఆత్మానాత్మలను నువ్వెరుగుదువని ఆ పక్షి నాతో చెప్పింది.
ఆత్మానాత్మల నిజస్వరూపమేది? నాకు వివరంగా చెప్పు’ అని అడిగాడు.పిప్పలుడికి తన పట్ల శంక తొలగిపోలేదని అతడి ప్రశ్నల ద్వారా గ్రహించాడు సుకర్ముడు.అతడికి విశ్వాసం కలిగించడానికి ఇంద్రాది దేవతలను ఆహ్వానిస్తూ ఆవాహన మంత్రాలు పఠించాడు.వెంటనే అక్కడ ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమయ్యారు. ‘సుకర్మా! మమ్మల్ని ఎందుకు పిలిచావు?’ అని అడిగారు.‘దేవతలారా! ఈ పిప్పలుడికి విశ్వాసం కలిగించడానికే మిమ్మల్ని ఆహ్వానించాను. అంతకంటే వేరే ప్రయోజనం ఏదీ ఆశించి కాదు. ఇక మీరు మీ నిజస్థానాలకు వెళ్లవచ్చు’ అన్నాడు.
‘నిష్ఫలంగా వెళ్లడం మాకు తగదు. ఏదైనా వరం కోరుకో’ అన్నారు దేవతలు.‘నాకు అనవరతం మాతా పితృభక్తిని, వారికి వైకుంఠవాస ప్రాప్తిని కలిగించండి. అంతే చాలు’ అన్నాడు సుకర్ముడు.దేవతలు ‘తథాస్తు’ అని పలికి అంతర్ధానమయ్యారు.ఇదంతా పిప్పలుడు చేష్టలుడిగి తిలకించాడు.సుకర్ముడు అతడితో ‘పిప్పలా! నిన్ను నా వద్దకు పంపిన సారసపక్షి సాక్షాత్తు చతుర్మఖ బ్రహ్మ’ అని చెప్పి, ఆత్మజ్ఞానాన్ని బోధించాడు.
∙సాంఖ్యాయన