చావంటే అందరికీ భయం ఉంటుంది. కాని పాళ్ళల్లోనే తేడా. అమృతనాథానికి చావంటే చాలా భయం. చిన్నప్పుడు శవాన్ని పాడె మీద మోసుకెళ్తూ వాయించే డప్పులని వినలేక చెవులు మూసుకునేవాడు. శవం మీద చల్లిన పూలు రోడ్ మీద కనిపిస్తే, వాటిని తొక్కకుండా వెళ్ళేవాడు. శవం కనిపిస్తే ఆ రోడ్డులోంచి వెంటనే ఇంకో రోడ్డులోకి మళ్ళేవాడు. ఎంత దగ్గరి బంధువు మరణించినా సరే, వారి శవాన్ని చూడటానికి వెళ్ళేవాడు కాదు. ఎప్పుడో వెళ్ళి పరామర్శించేవాడు. టెలిగ్రామ్ రోజుల్లో వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ వస్తే వెంటనే బయటకి వెళ్ళిపోయి, చాలాసేపటికి తిరిగి వచ్చేవాడు. అతని తొమ్మిదో ఏట పొరపాటున తాత శవం ఉన్న గదిలో రాత్రంతా ఉండటం ఆ భయానికి ప్రధాన కారణం.
ఈ భయాన్ని ‘తనటోఫోబియా’ అంటారని ఆయనకి ఓ సందర్భంలో మేనల్లుడు చెప్పి, సైకియాట్రిస్ట్‌ని కలిస్తే, దాన్ని జయించవచ్చని సూచించాడు. కాని ఆయన వెళ్ళలేదు.అలాంటి అమృతనాథానికి ఓరోజు హార్ట్ ఎటాక్ వచ్చి ముచ్చెమటలు పోశాయి. ఇంట్లోనే ఉన్న ఆయన కొడుకు వెంటనే అంబులె న్ ్సకి ఫో న్ చేసాడు. తెల్లవారుఝాము కాబట్టి ట్రాఫిక్ లేక అంబులె న్ ్స పన్నెండు నిమిషాల్లో వచ్చింది. పారామెడిక్స్ ఆయనకి ప్రాథమిక చికిత్స చేశారు.
ఇంజక్ష న్ కే భయపడే అమృతనాథం హాస్పిటల్లో చేరాడని తెలిసి ఆయన శ్రేయోభిలాషులంతా బాధపడ్డారు. వైద్య పరీక్షలు చేశాక గుండెకి రక్తాన్ని చేర్చే రక్తనాళాల్లో చాలా బ్లాక్స్ ఉన్నాయని, ఆపరేష న్ తప్పదని డాక్టర్స్ చెప్పారు. ఆయన మరణిస్తానని భయపడి ఒప్పుకోలేదు. కాని భార్య, అల్లుడు, కొడుకు ఆయనకి నచ్చచెప్పారు.‘‘ఈసారి గుండెపోటు వస్తే పోవటం ఖాయమట! స్టాటిస్టిక్స్ ప్రకారం కేవలం పది శాతం మాత్రమే హార్ట్ సర్జరీలో పోయే అవకాశం ఉంది నాన్న.’’ కొడుకు చెప్పాడు.అంతా నచ్చచెప్పాక అందుకు అంగీకరించి కాగితం మీద సంతకం చేశాడు.
అమృతనాథం ఆపరేష న్ ముందు రాత్రి తినటానికి ఏమీ పెట్టలేదు. మర్నాడు ఉదయం మంచినీళ్ళు కూడా తాగనివ్వలేదు. ఆయన్ని వీల్‌చైర్‌లో ఆపరేష న్ థియేటర్‌కి తీసుకెళ్తూంటే ఆయన మొహం చూసిన కొత్తవాళ్ళకి కూడా అందులో చావు భయం స్పష్టంగా కనపడింది. ఆయనని ఆపరేష న్ బల్ల మీద పడుకోబెట్టాక డాక్టర్ నవ్వుతూ భుజం మీద తట్టి చెప్పాడు.‘‘మీరు తేరుకున్నాక మా ఇంటికి స్వీట్స్ డబ్బాతో వస్తారు. నేను కాజూబర్ఫీ అభిమానినని గుర్తుంచుకోండి. అన్నట్లు మీకు అంకెలన్నీ వచ్చా?’’‘‘వచ్చు.’’‘‘వంద దాకా?’’‘‘ఇంకా పైనే వచ్చు.’’‘‘ఐతే ఇక నిశ్చింతగా వంద నించి వెనక్కి బయటకి లెక్క పెట్టండి.’’ఆయన ఆరంభించాడు.‘‘వంద... తొంభైతొమ్మిది... తొంభైఎనిమిది... తొంభైఏడు... తొంభైఆరు...’’తొంభై దాటకుండానే ఆయనకి ఎనస్తీషియాతో çస్పృహ తప్పింది.అమృతనాథానికి మెలకువ వచ్చింది.
ఆయనకి శరీరం లేనట్లుగా ఎంతో తేలికగా అనిపించింది. చుట్టూ చూస్తే ఆహ్లాదకరమైన, విశాలమైన తోట కనిపించింది. ఎన్నడూ చూడని రంగుల పువ్వులు, పక్షులతోపాటు ఎన్నడూ వినని అత్యంత మధురమైన సంగీతం వినిపిస్తోంది. ముక్కుకి మధురమైన వాసనలు.‘‘అమృతం.’’ఆయన్ని తల్లి పిలిచే పిలుపది!‘‘అమ్మా... నేను ఎక్కడున్నాను?’’ ఆవిడని చూడగానే అమృతనాథం అడిగాడు.‘‘అత్యంత ఆనందకరమైన చోట. ఈయన్ని గుర్తుపట్టావా? మీ నాన్నగారు. నీ రెండో ఏట పోయారు. కాబట్టి మీరు ఒకరినొకరు గుర్తు పట్టలేరు.’’‘‘ఏరా అమృతం. ఎలా ఉంది నీకు?’’ ఆయన ప్రాణమిత్రుడు పలకరించాడు.‘‘నా మనసు ఎన్నడూ అనుభవించనంత అత్యంత ప్రశాంతంగా, కారణం లేకుండా అత్యంత ఆనందంగా ఉంది. ఇక్కడ నించి ఎక్కడికీ వెళ్ళాలని లేదు.’’ చెప్పాడు.
‘‘రా. అందరినీ చూద్దువు గాని.’’అతని చేతిని పట్టుకుని నడిపించసాగారు. సర్జ న్ మాటలు వినపడ్డాయి.‘‘అమృతనాథంగారు... నా మాట వినపడుతోందా? వినపడితే నా వేలిని నొక్కండి... మీకు నా గొంతు వినపడుతోందా? నర్స్ ఆ ఇంజక్ష న్ ఇంకోటి ఇవ్వు.’’ ‘‘నన్నెవరో పిలుస్తున్నారు.’’ అమృతనాథం చెప్పాడు.‘‘ఓ. ఐతే వెళ్ళు.’’ తల్లి చెప్పింది.‘‘కాని నాకు వెళ్ళాలని లేదమ్మా.’’ ఆయన దిగులుగా చెప్పాడు.‘‘తప్పదు. పిలుపు వినపడితే వెళ్ళి తీరాలి. అలా అందరికీ వినపడదు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడానికి ఎదురు చూస్తూంటాం.’’ అమృతనాథం తండ్రి ఆప్యాయంగా చెప్పాడు.‘‘గుడ్‌బై రా.’’ మిత్రుడు కూడా అసంతృప్తిగా చెప్పాడు.‘‘ఎలక్ట్రిక్ షాక్స్, ఆ ఇంజక్ష న్ పని చేశాయి. గుండె మళ్ళీ ఆడుతోంది. రివైవ్ అయ్యారు.’’ సర్జ న్ ఆనందంగా చెప్పాడు.ఆయన త్వరగా కోలుకున్నాడు. ఇప్పుడు అమృతనాథంలో చావు భయం పూర్తిగా పోయింది. బదులుగా దాన్ని ఇష్టపడసాగాడు.
∙మల్లాది వెంకట కృష్ణమూర్తి



