టేబుల్ మీద ఉన్న ఫోన్ రింగ్‌టోన్ మోగుతోంది.‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లు’’ అని పాట వినిపిస్తోంది.ఫోన్ చేసింది ఎవరో అనే ఆలోచన లేకుండా, అదే పాటను హమ్ చేస్తూ...‘‘నేనో జీరోని, వ్యాల్యూ లేనోన్ని’’ అంటూ ఫోన్ ఎత్తాడు రఘువరన్ .వెంటనే, ఆ పక్కనుంచి ‘‘ఒరేయ్! రాసిన లాస్ట్ అటెంప్ట్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ అయ్యింది రా!’’ అని బాధతో చెప్పాడు ఫ్రెండ్. రఘువరన్ మాత్రం షాక్ కాకుండా, చిరునవ్వు చిందిస్తూ, హీరో రజనీకాంత్‌లా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని, ‘‘చూడు ఇదంతా మామూలే, నువ్వు బాధపడకు’’ అన్నాడు.‘‘ఒరేయ్! ఫెయిల్ అయ్యింది నువ్వురా!’’ అన్న వెంటనే, రఘువరన్, ‘‘తెలుసు! నన్ను అదృష్ట దేవత డైరెక్ట్‌గా వచ్చి వరాలు ఇచ్చినా, నా బెస్ట్ ఫ్రెండ్ వాటిని సక్సెస్‌ఫుల్‌గా ఫెయిల్ చేయగలడు’’ అన్నాడు. ‘‘ఎవర్రా వాడు? చెప్పు వాడ్ని చంపేద్దాం..’’‘‘రేయ్, వాడ్ని ఏం అనకు. నేను పుట్టినప్పటి నుంచి నన్ను ఒక్క క్షణం కూడా వీడని ఫ్రెండ్‌రా వాడు. నా వన్ అండ్ ఓన్లీ బెస్ట్, బ్లడ్ ఫ్రెండ్ నా బ్యాడ్ లక్! బై!’’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.
తర్వాత మళ్లీ అదే పాట పెట్టుకొని ‘‘నా బాధే నాకు భంగు, నే చెత్త కుప్ప కింగు, నా ఫేట్ నల్లరంగు, నే కొమ్మల్లో పతంగు!’’ అని పాడుతూ, డ్యాన్ ్స చేస్తూ స్నానం పూర్తి చేసి, ఇంటర్వ్యూకి బయలుదేరాడు. ఇలా దాదాపు దశాబ్దంపాటు, రఘువరన్ రోజూ ఉదయం రెడీ అవ్వడం, మధ్యాహ్నం ఇంటర్వ్యూ అటెండ్ కావడం, సాయంత్రం స్నేహితుల గొప్పలు వింటూ ఇంటికొచ్చి భోజనం చేయడం, రాత్రి కొత్త ఉద్యోగానికి అప్లయ్ చేసి నిద్రపోవడం అంతే! ఇదే రఘువరన్ జీవితం.ఇలా ఒక తుప్పు పట్టిన చక్రంలా, రోజులన్నీ ఒకేలా గడుస్తున్న సమయంలో ఒక రాత్రి ల్యాప్‌టాప్ మూసి పడుకోబోతుంటే, తెర మీద వింత అక్షరాలు మెరిశాయి. ‘‘బ్యాడ్ లక్‌కి బై చెప్పి, లక్‌కి హాయ్ చెప్పాలనుందా?అయితే వెంటనే ఈ ఆర్టిఫిషియల్ లక్ యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోండి.
ఇది నంబర్ వన్ లక్ గ్యారంటీ యాప్!’’రఘువరన్ రెండు క్షణాలు స్క్రీన్ చూస్తూ ఆగిపోయాడు.‘‘ఇలాంటి యాప్స్ కూడా ఉంటాయా? ఉన్నా పనిచేస్తాయా?’’ అని అనుకుంటూ ఇన్ స్టాల్ బటన్ నొక్కాడు. యాప్ ఓపెన్ చేయగానే, కంప్యూటరైజ్డ్ వాయిస్, ‘‘వెల్‌కమ్! ప్లీజ్ సెలెక్ట్ యువర్ ప్యాకేజ్. డైలీ ఫ్రీ లక్. ప్రీమియం లక్. జాక్‌పాట్ లక్.’’ ‘‘అబ్బో! ఇప్పడు అదృష్టం కూడా డేటా ప్లాన్ ్స ఇస్తుందా?’’ అనుకుంటూ... ఫ్రీ లక్ సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పుడే యాప్ నుంచి ఫన్నీ నోటిఫికేషన్ :‘‘ఈ రోజు ఇంటర్వ్యూలో మిస్టర్ రఘువరన్ కడియాలా, యూ ఆర్ సెలెక్టెడ్!’’ ఆ మెసేజ్ చూసి నవ్వుకుంటూ బెడ్ మీద పడ్డాడు. ‘‘ఏమో, ఏడేళ్ల తర్వాత ‘బేవార్స్, ఇడియట్’ అన్నవాళ్లు, నిజంగానే ‘మిస్టర్ రఘువరన్ ’ అంటారేమో!’’ అని అనుకుంటూ కళ్ళు మూశాడు.
మరుసటి ఉదయం టింగ్..! ఫోన్ నోటిఫికేషన్: ‘‘యువర్ డైలీ ఫ్రీ లక్ యాక్టివేటెడ్!’’తన బ్యాడ్ లక్ గురించి బాగా తెలిసిన రఘువరన్ ఏమాత్రం ఎగై్జట్ కాలేదు. మూమూలుగానే ఇంటర్వ్యూకి రెడీ అయ్యి బైక్‌లో బయలుదేరాడు. ఆరోజు ఎందుకో, అన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ గ్రీన్ . జేబులోని పెన్ ఇంక్ లీక్ కాలేదు. షూస్‌కి దుమ్ము అంటలేదు. లిఫ్ట్ కరెక్ట్‌గా వర్క్ అయ్యింది. వేడి కాఫీ కిందపడకుండా తాగాడు. ఇంటర్వ్యూలో కూడా అచ్చం యాప్ చెప్పిన ట్టు. ‘‘మిస్టర్ రఘువరన్ కడియాలా, యూ ఆర్ సెలెక్టెడ్!’’ అన్నారు. జాబ్ ప్యాకేజీ కూడా బాగానే ఉంది. ఆ తర్వాత కూడా ఆడగకుండానే షాపింగ్ చేసిన తర్వాత ఆఫర్ అంటూ డిస్కౌంటు ఇచ్చారు. బైక్‌కి టైర్ పంచర్, పెట్రోల్ అయిపోవటం లాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి వెళ్లాడు. అపార్ట్‌మెంట్‌లో కూడా పార్కింగ్ ఈజీగా దొరికింది. ఆ రోజు అంతా బాగా గడిచిపోయింది. అంతా యాప్ చెప్పినట్టు రోజంతా అదృష్టంతో నిండిపోయింది. దీంతో, అప్పటి దాకా, రింగ్ టోన్ మోగితే కానీ, చూడని ఫోన్ ముఖాన్ని కళ్లార్పకుండా చూశాడు. కుతూహలంతో ఆ యాప్ తెరిచాడు. ఇదంతా నిజమేనా? అని సందేహంతోనే నిద్రపోయాడు.
మళ్లీ ఉదయాన్నే ఫోన్ నోటిఫికేషన్ . ‘‘యువర్ ఫ్రీ లక్ ఈజ్ ఓవర్! అప్‌డేట్ కోసం రూ. 99 ప్రీమియం ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’ఇదంతా నమ్మాలా వద్దా అన్న అయోమయంలోనే రఘువరన్ ప్రీమియం ప్యాకేజీని సెలెక్ట్ చేసుకున్నాడు.ఆ రోజూ కూడా రఘువరన్ కి అదృష్టమే కలిసివచ్చింది. బస్సులో ఎక్కినప్పుడల్లా కిటికీ సీటు ఖాళీగా ఉంటుంది. బిస్కెట్‌ను టీలో ముంచినప్పుడు కూడా జారిపోకుండా తింటున్నాడు.బార్ బిల్లు ఎప్పుడూ ఫ్రెండ్‌గాడికే పడుతోంది. దొంగిలించిన వాలెట్‌ని దొంగే తిరిగి తెచ్చి ఇస్తున్నాడు.అడుగు బయట పెట్టగానే ఘోరంగా కురుస్తున్న వాన ఒక్కసారిగా సైలెంట్‌గా మారుతోంది. ఆఫీసులో బాస్ అడక్కుండానే పొగుడుతున్నాడు. ఆఫీస్ బాయ్ కూడా అడక్కుండానే వాటర్, టీ కాఫీలు తెచ్చి టేబుల్ పై పెడుతున్నాడు. మొబైల్ బ్యాటరీ వన్ పర్సెంట్ ఉన్నా, మూడు రోజులు వరకు ఆన్‌గానే ఉంటుంది. ఫేవరెట్ వైట్ షర్ట్‌ని వాషింగ్ మెషీన్‌లో వేసినా, అది ఏ కలర్ అంటకుండా, చాలా చక్కగా మారి, మృదువుగా, సువాసనతో బయటకు వస్తుంది.
అనుకోకుండా, చేయి ఎత్తితే, అటుగా వెళ్తున్న వక్తి, లిఫ్ట్ అనుకొని, నేరుగా స్కూటీ మీద ఎక్కించుకొని ఇంటి వద్ద దింపాడు. ఇంతేకాదు, ఏటీఎమ్‌లో ఐదు వందల రూపాయలు విత్‌డ్రా చేసుకోగా, మెషిన్ ఐదు వంద నోట్లకు బదులు యాభై నోట్లను ఇచ్చేసింది. ఆన్‌లైన్‌లో బ్యాటరీ ఆర్డర్ పెడితే, డెలివరీలో స్మార్ట్ వాచ్, బ్లూటూత్ స్పీకర్ వచ్చాయి. ఇలా అప్పటి వరకు హారర్ సినిమాలా సాగిన రఘువరన్ జీవితం, ఒక్కసారిగా, సూపర్ హిట్ కామెడీ సినిమాలా సాగిపోతోంది. సరిగ్గా, ఒక నెల తర్వాత మళ్లీ ఫోన్ నోటిఫికేషన్ ‘‘యువర్ ప్రీమియం లక్ ఈజ్ ఓవర్! అప్‌డేట్ కోసం రూ. 999 జాక్‌పాట్ లక్ ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’ ఈసారి ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే పేమెంట్ చేశాడు.వెంటనే నోటిఫికేషన్ , ‘‘బొంబాయి లాటరీ నంబర్ 5834.’’ ఆ నంబర్ చూసిన వెంటనే రఘువరన్ పరుగెత్తుకుంటూ వెళ్లి లాటరీ కొన్నాడు. నంబర్ కూడా అదే 5834. ఇక అప్పటి నుంచి రఘువరన్ కి నిద్ర పట్టడం లేదు. ప్రతిరోజూ అదృష్టం ఇచ్చే ఆనందాలను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.
క్యూలో నిల్చున్నా, వెయిట్ చేసే పని లేకుండా గణేశ్ అన్నదానంలో భోజనం దొరికినా ఆస్వాదించలేకపోయాడు.ఆఫీసులో అందమైన అమ్మాయి నవ్వుతూ పొగుడుతున్నా తిరిగి నవ్వలేకపోయాడు.చికెన్ బిరియానీ ఆర్డర్ చేస్తే, అందులో లెగ్‌పీస్ వచ్చినా ఎంజాయ్ చేయలేకపోయాడు. బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్ అడ్రస్‌ని పది సార్లు అడగకుండానే వేగంగా డెస్టినేషన్ కు తీసుకెళ్తున్నా సంతోషం లేదు. తన పాత క్రష్ సడెన్ గా ‘నిన్ను కలవాలని ఉంది’ అని మెసేజ్ పంపినా, అతను ‘ఊమ్’ అని రిప్లయ్ ఇస్తున్నాడు. అమెజాన్ లో బ్యాటరీ ఆర్డర్ చేశాడు, డెలివరీలో డ్రోన్ , స్మార్ట్‌వాచ్, బ్లూటూత్ స్పీకర్ వచ్చాయి! ‘సారీ సర్, సిస్టమ్ గ్లిచ్’ అని కంపెనీ వాళ్లు చెప్పి, మీరు ఆ వస్తువులను కావాలనుకుంటే మీ వద్ద పెట్టుకోవచ్చు అని చెప్పి, ప్రతి సారి గ్లిచ్ కేవలం రఘుకే వస్తున్నాయి. అలా ప్రతిరోజూ అదృష్టం తన తలుపు తట్టి మరీ ఇచ్చే ఆనందాలు అన్నీ క్రమంగా తనకు బోరింగ్‌గా మారిపోయింది.
షాపింగ్‌కి వెళ్లినా రఘు ఏ షర్ట్ పట్టుకున్నా దానిపైనే ‘టుడే ఫ్రీ ఆఫర్!’ బోర్డు వొచ్చేస్తుంది! చాలా డిస్కౌంట్ ఆఫర్‌తో షాపింగ్ చేసినా, తరువాత కాసేపటికే బ్యాంక్ నుంచి మెసేజ్ ‘మీ కొనుగోలుపై క్యాష్‌బ్యాక్ రూ. 4999.’ వచ్చినా కూడా తనకు ఆనందం లేదు. ఎప్పుడూ లాటరీ విన్నర్ అనౌన్ ్సమెంట్ కోసమే ఎదురుచూస్తూ, అదృష్టంపై చిన్న చూపు మొదలయింది. సరిగ్గా, నలభై ఐదు రోజుల తర్వాత ఆ రోజు వచ్చింది.విన్నింగ్ నంబర్‌ను అనౌన్ ్స చేశారు. యాప్ చెప్పినట్టుగానే విన్నింగ్ లాటరీ నంబర్ 5834.ఇక రఘువరన్ ఆనందానికి అవధులు లేవు.లాటరీ ప్రైజ్ వంద కోట్లు.‘‘ఇక నా కష్టాలన్నీ పోయాయి!’’ అని ఆ రోజంతా ఫుల్ పార్టీ చేసుకొని పడుకున్నాడు.ఉదయం లేవగానే ఫోన్ నోటిఫికేషన్ , ‘‘యువర్ జాక్‌పాట్ లక్ ఈజ్ ఓవర్! అప్‌డేట్ కోసం రూ. 9999 జాక్‌పాట్ లక్ అప్‌డేషన్ ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోండి.’’‘‘వంద కోట్లు ఉంటే నాకు ఇంకా లక్‌తో పని ఏముంది’’ అనుకొని యాప్‌ను అన్‌ఇన్ స్టాల్ చేసి బొంబాయి లాటరీ ఆఫీసుకు వెళ్లాడు.
చాలా కాన్ఫిడెంట్‌గా లాటరీ టికెట్ ఇచ్చి. ‘‘ఐ వాంట్ ఓన్లీ క్యాష్’’ అన్నాడు.కౌంటర్‌లోని వ్యక్తి టికెట్ తీసుకొని, ‘‘సారీ సార్, ఈ లాటరీ టికెట్ ఎక్స్‌పైర్ అయింది’’ అన్నాడు.వెంటనే షాక్‌తో టికెట్ తీసుకొని చెక్ చేసుకున్నాడు. నిజంగానే అది లాస్ట్ ఇయర్ టికెట్.‘‘మరి నాకు డబ్బులు రావా!’’ అని బాధతో అడిగాడు.‘‘సారీ సార్!’’ అంటూ టికెట్ తిరిగి అతని చేతిలో పెట్టారు.వెంటనే రింగ్‌టోన్ మోగింది. ‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లో’’. ఈసారి చాలా సైలెంట్‌గా ఫోన్ ఎత్తాడు.‘‘రఘువరన్ , డ్యూ టు యువర్ లోయర్ పర్ఫార్మెన్ ్స అండ్ నో కమిట్‌మెంట్ ఫర్ ఆఫీస్ వర్క్, లాట్ ఆఫ్ లీవ్స్, యూ ఆర్ టెర్మినేటెడ్’’ అని చెప్పి ఫోన్ కట్ చేశారు.రఘువరన్ కి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు.‘‘ఇదంతా నేను కేవలం పదివేల రూపాయలకు కక్కుర్తి పడి కోల్పోయానా!’’ అని అనుకుంటూ అయోమయంలో పడ్డాడు.యాప్ అప్‌డేట్ చేసుకోకపోవడమే కారణం అనుకొని వెంటనే యాప్‌ను మళ్లీ ఇన్ స్టాల్ చేయడానికి ప్రయత్నించాడు. ఎంత వెతికినా ఆ యాప్ దొరకలేదు.
ఇక చేసేదేమీ లేక లాటరీ ఆఫీసు నుంచి బయటకు వచ్చాడు.కాలు బయట పెట్టగానే చెప్పు తెగిపోయింది. చాలా కష్టంగా రోడ్డు దాటుకొని నిల్చుంటే వెంటనే ఓ కారు అటుగా పోయి బకెట్ బురదను అతని బట్టలపై చల్లి వెళ్లింది. పైపై తుడుచుకొని బస్‌స్టాండ్‌కు పరుగెత్తుకుంటూ వెళ్తే, అప్పటిదాకా ఆగి ఉన్న బస్సు రఘువరన్ రాగానే చాలా అర్జెంట్ పని ఉన్నట్లు వేగంగా బయలుదేరింది. దీంతో, ‘ఓరి దేవుడా! ’ అని కాస్త పైకి తలెత్తి చూస్తే, ఎదురుగ్గా, ఒక బోర్డింగ్.. ‘ఐ యామ్ బ్యాక్!’. అది చూడగానే, అప్పటిదాకా దిగాలుగా ఉన్న రఘువరన్ ముఖం ఒక్కసారిగా చిరునవ్వు చిందించింది. ‘‘ఇన్ని రోజులు బ్యాడ్‌లక్ నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్నా, కాదు.. కాదు.. బ్యాడ్‌లక్‌కే నేను బెస్ట్ ఫ్రెండ్‌ని!’’ అని అనుకొని స్టయిల్‌గా కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని ‘‘లక్ అన్న మాటే నిల్లో నిల్లు, లైఫ్ ఏమో చాల డల్లో డల్లో’’ అని పాడుకుంటూ చెప్పులు చేతిలో పట్టుకొని నడుచుకుంటూ ఇంటికి బయలుదేరాడు.
∙కొండి దీపిక


