
తిరుమలలో వెలసిన శ్రీవేంకటేశ్వరుని ఆలయం ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవాలయం. ఎన్నో శతాబ్దాలుగా వెలుగొందుతున్న శ్రీవారి ఆలయం వెనుక ఎంతో చరిత్ర, ఎన్నో స్థలపురాణాలు ఉన్నాయి. రాజుల పాలన నుంచి బ్రిటిష్ పాలకుల చేతిలోకి వెళ్లినప్పటికీ, శ్రీ వేంకటేశ్వరుని ఆలయం తన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోగలిగింది. వాటిని నేటికీ కొనసాగించగలుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో శేషాచలంలో ఏడు కొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తిరుమల. కలియుగ వైకుంఠంగా పిలుస్తున్న ఈ ఆలయంలో శ్రీమహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడిగా కొలువై కోరిన కోరికలను తీరుస్తున్నాడని భక్తుల విశ్వాసం.
బ్రిటిష్ ఈస్టిండియా పాలన నుంచి ప్రత్యేక బోర్డుగా ఏర్పడే వరకు ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. బ్రిటిష్ హయాంలో మద్రాసు ప్రభుత్వం ఏడవ రెగ్యులేషన్ ద్వారా 1817లో శ్రీవారి ఆలయాన్ని ఉత్తర ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నియంత్రణలోకి తెచ్చింది. 1821లో బ్రూస్ అనే బ్రిటిష్ అధికారి ఆలయ నిర్వహణ కోసం ‘బ్రూస్ కోడ్’ రూపొందించారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఆలయ పరిపాలనను 1843లో హథీరామ్‌జీ మఠం మహంతులకు అప్పగించింది. అప్పటి నుంచి 1933 వరకు మహంతుల పాలనలోనే ఆలయం విలసిల్లింది.
టీటీడీ పాలక మండలి ఏర్పాటు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి స్వాతంత్య్రం రాకముందే ఏర్పాటైంది. అంతకు ముందు మహంతుల పాలనలో ఉన్న ఆలయాన్ని ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం 1933లో టీటీడీకి పాలక మండలి పరిధిలోకి తీసుకురావడం వల్ల మహంతుల వ్యవస్థ ముగిసింది. దీంతో పాలనా వ్యవహారాలు అధికారుల చేతిలోకి వెళ్ళాయి. పాలనా వ్యవహారాలు మారినా, సుదీర్ఘకాలం తిరుమల వ్యవహారాలను పర్యవేక్షించిన మహంతులకు నేటికీ ప్రత్యేక గౌరవం కొనసాగుతోంది.
హాథీరామ్‌జీ మఠంతో అనుబంధం
ఢిల్లీకి 40 కిలోమీటర్ల దూరంలోని క్రేడల్ క్రేల గ్రామంలో రామానంద మఠం ఉండేది. మఠం అధిపతి అభయ్ ఆనంద్‌జీ శిష్యుడు హాథీరామ్‌జీ దేశయాత్రలో భాగంగా వెంకటాచలానికి చేరుకున్నాడు. శ్రీవేంకటేశ్వరుడిని అయోధ్య రాముడి అంశగా భావించి, కొలుస్తూ ప్రసన్నం చేసుకునేవాడు. హాథీరామ్‌జీ భక్తికి ముగ్ధుడైన శ్రీవారు నిత్యం ఆనందనిలయం దాటి ఆలయానికి సమీపంలోనే ఉన్న హాథీరామ్‌జీ మఠానికి వచ్చి, ఆయనతో పాచికలాడుతూ, భక్తుడిని గెలిపించి, ఆనందపడేవారనే కథలు ఉన్నాయి.
తిరుమలలో శ్రీవారి పేరు తరువాత వినిపించే పేరు విష్వక్సేనుడు. టీటీడీ పాలనా వ్యవహారాలు మహంతుల చేతికి ఈస్టిండియా కంపెనీ అప్పగించినప్పటికీ, ఆలయ నిత్యకలాపాల్లో లోటు లేకుండా చేశారు. అదే సమయంలో పాలనా పగ్గాలు చేతికి తీసుకున్న మహంతులు (çహాథీరామ్‌జీ బాబా వారసులు) తమ పాలన వ్యవహారాలలో విష్వక్సేనుడి అధికార ముద్రను వాడేవారు. మొదటి మహంతు సేవాదాస్ కాలంలోనే శ్రీవారి పుష్కరిణిలో జలకేళీ మండపోత్సవం పేరిట తెప్పోత్సవం ప్రారంభించారు. తిరుమల శ్రీవారికి మహంతు బాబాజీ పేరుతో సుప్రభాత సేవలో గోక్షీర నివేదన, నవనీత హారతి సమర్పించే ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజూ వేకువజామున సుప్రభాత సమయంలో శ్రీవారికి సంప్రదాయబద్ధంగా హారతి అందిస్తున్నారు.
ఆణివార ఆస్థానం వెనుక
వందల సంవత్సరాలు కాలంలో కలిసిపోయినా, తిరుమలలో మాత్రం ఆనాటి ఆచార వ్యవహారలకు ఏమాత్రం భంగం వాటిల్లకుండా కొనసాగిస్తున్నారు. అందులో ఒకటి ఆణివార ఆస్థానం కార్యక్రమం. శాస్త్రోక్తంగా నిర్వహించడంలో టీటీడీ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. తిరుమలలో ఈ కార్యక్రమం నిర్వహించడం వెనుక పెద్ద కథే ఉంది.ఉమ్మడి మద్రాసు రాష్ట్రం ఆర్కాటు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఈస్టిండియా కంపెనీ పాలన సాగించింది.
దీంతో 1843 ఏప్రిల్ 21 నుంచి 1933 వరకు ఆలయ పాలన హాథీరామ్‌జీ మఠం మహంతుల పాలనలో సాగింది. తిరుమల ఆలయానికి మొదటి మహంతుగా1843 జూలై 10న మహంత్ సేవాదాస్ బాధ్యతలు స్వీకరించారు. ఆణివార ఆస్థానం రోజే బ్రిటిషర్లు శ్రీవారి ఆలయ ఆస్తులు, ఆభరణాలు, ఉత్సవ మూర్తులు, ఉత్సవర్లకు ఊరేగింపులో వాడే వాహనాలు, నిత్య కైంకర్యాలకు వాడే పురాతన వస్తువులు, రికార్డులు, లెక్కల అప్పగింత జరిగింది.
ఈ విధంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ తరహా సమీక్ష జరిగేది. టీటీడీ పాలక మండలి ఏర్పడిన తరువాత ఇది వార్షిక బడ్జెట్‌గా మారింది. వందల ఏళ్ల నాటి సంస్కృతీ సంప్రదాయాలను కొనసాగిస్తూనే, ఆనాటి చరిత్ర మరుగున పడకుండా, మహంతుల పరిపాలనా కాలం నాటి పద్ధతుల్లోనే శ్రీవారికి ఆణివార ఆస్థానం ద్వారా లెక్కలు నివేదించే సంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు.