ఈ వారం కథ: ముట్టుకోకు | This week's story of funday | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: ముట్టుకోకు

Aug 3 2025 7:43 AM | Updated on Aug 3 2025 7:43 AM

This week's story of funday

‘‘చదవేస్తే ఉన్న మతి పోయిందట! పిచ్చి అనుమానాలతో పిల్లల బుర్రలు పాడు చేస్తే ఇలానే ఉంటుంది మరి! నా కొడుకు కష్టమంతా బూడిదలో పోసేశావ్, నీ అతితెలివి తగలెయ్యా! బ‘‘మా అత్తగారు ఆ రోజు నా మనసులో గుచ్చిన ఆ ముల్లు ఇంకా పచ్చిగానే ఉంది.‘‘అసలు మగ పిల్లాడిని పెంచే విధానం ఇదేనా! మగపిల్లాడంటే పులిబిడ్డలా ఉండాలి, పిరిగ్గొడ్డులా కాదు.’’ గుచ్చిన ముల్లునే ఇంకా లోనికి దించుతూ అటూ ఇటూ తిప్పితే ఎలా ఉంటుందో అలా ఉంది నాకప్పుడు.మారుతున్న కాలంతో పాటూ వంకర్లు పోతున్న మనుషుల మెదళ్ళ గురించి, ఆ వంకర్లలో నుంచి పుట్టే వికృత కృత్యాల గురించి ఆవిడకి వివరించి చెప్పే ధైర్యం నాకు లేదు, అర్థం చేసుకునే పెద్ద మనసు ఆవిడకి లేదు. నాలాంటి పిరికి కోడళ్ళం ఉన్నాం ఈ రోజుల్లో కూడా! భయభక్తులతో నేనూ, ఆధిపత్యంతో అత్తగారూ, కెరీర్లో పడుతూ లేస్తూ మా ఆయన.

 నిస్సారంగా సాగిస్తున్న మా జీవితాల్లోకి ఆ సంఘటన ఓతుఫానులా వచ్చి వెళ్ళినా, అది వదిలి వెళ్ళిన గుర్తులు ఎప్పటికీ చెరిగిపోవు. పదేళ్ళు కష్టపడ్డా దక్కని ఫలితం ఒక్క విందు దౌత్యం ద్వారా దక్కుతుందంటే వెనుకాడుతామా? ఉదయం నాలుగున్నరకే లేచి రెండు రకాల టిఫిన్లూ, వాటికి రెండు చట్నీలూ, సాంబారూ; మధ్యాహ్నం లంచ్‌ కోసం కొర్రమీను పులుసు, టైగర్‌ రొయ్యల వేపుడు, నాటు కోడి ఇగురు, మటన్‌ బిర్యానీ; వాటికి తోడు శాకపాకాలు కూడా ఉండాలిగా అన్నట్టు ఆలూ ఫ్రై, టమాటా పప్పు, రసం, అప్పడాలూ, పెరుగూ; ఇవన్నీ చాలవన్నట్టు చక్కెర పొంగలి, అరటిపండూ, ఐస్‌ క్రీమూ– బడా గెస్ట్‌ కోసం భారీ మెనూ సిద్ధం చేసుకొని,వంట పూర్తిచేసి, మొహాన కాసిన్ని నీళ్ళు జల్లుకొని, ముస్తాబై నవ్వు సింగారించుకొని కూర్చున్నా.మా ఆయన, తనకు దక్కబోతున్న పది కోట్ల కాంట్రాక్టు గురించి; దాన్ని ప్రసాదించబోయే మంత్రిగారి బామ్మర్ది గురించి వేచి చూస్తూ, ఇంటి గేటు దగ్గరే పచార్లు కొడుతూ ఉన్నారు.

 మంత్రిగారి బామ్మరిదే మా బడా గెస్టు. పదేళ్లుగా చిన్నచిన్న సబ్‌ కాంట్రాక్టులు చేసుకుంటూ బండి లాక్కొస్తున్న మా ఆయనగారికి దొరక్క దొరక్క ఎదురుపడ్డ పది కోట్ల రోడ్డు కాంట్రాక్టుని విందు దౌత్యం ద్వారా దక్కించుకోవాలని ఆయన ఉబలాటం. అన్నీ పోనూ ఓ పది శాతమైనా మిగిలితే చాలు, జీవితంలో ఓ మెట్టెక్కినట్టే! ఉదయం టిఫిన్ల నుంచి మధ్యాహ్నం భోజనాల సమయం వరకూ పెద్ద పెద్దోళ్లతో మంతనాలన్నీ మా ఇంట్లోనే! వారి కోసమే ఈ భారీ మెనూ. కాంట్రాక్టులంటే కమిషన్లూ, పర్సెంటేజీల అధికారిక పొట్లాల పంపిణీ ఉండనే ఉంటుంది కాని, మనీ పర్సుని తృప్తిపరిస్తే అది ఖాళీ అయ్యేవరకే గుర్తుంటుంది, మనిషి అహాన్ని తృప్తిపరిస్తే మనిషి ఉన్నంతవరకూ గుర్తుపెట్టుకుంటాడు. అతిథి మర్యాదలకున్న పవర్‌ అలాంటిది. పైగా ఆ వచ్చేవాడు పెళ్లీ పెటాకులు లేని బెమ్మచారిట! ఇంటికి పిలిచి భోజనాలు పెడితే తెగ పొంగిపోతాడట! ఆ వీక్‌నెస్‌ పట్టేశారు మావారు.గంట సేపు వెయిటింగ్‌ తర్వాత పెద్ద పడవ లాంటి కారులో దిగాడు మంత్రిగారి బామ్మర్ది. 

మాసిన తెలుపు నలుపుల గడ్డం, లోపలకెళ్లిన సీసాల కొద్దీ మద్యాన్ని మోయలేక ఊరిపోయి వేలాడుతున్నట్టున్న పొట్ట, మెడలో కట్లపాములాంటి బంగారపు గొలుసు, చేతికి బ్రేస్లెట్, బొటనవేళ్ళు తప్ప మిగతా ఎనిమిది వేళ్లకు ఎనిమిది ఉంగరాలు ధరించిన ఆ భారీ ఆకారం ఊగుతూ మా ఇంట్లో చొరబడింది, సాదర స్వాగతాలతో!మా సోఫా సెట్‌లో కుర్చీలు ఈయనకు సరిపోతాయా అన్న అనుమానం గుండెను గుంజేసింది కాసేపు. ఇంతాచేసి ఇలాంటి చోట అభాసు పాలైపోతే ఎలా! పర్లేదు, కుదురుకొని సర్దుకున్నాడు. ఈ మంత్రుల తమ్ముళ్ళు, బామ్మరుదులు ఏదో ఇలానే ఉండాలని రూల్‌ పెట్టుకుంటారో ఏంటో! అచ్చం సినిమాల్లో చూపించినట్టు ఉన్నాడు. టిఫిన్లకు కూర్చున్నారు. పక్కనే నిలబడి అతి వినయం ప్రదర్శిస్తూ వడ్డిస్తున్నాను. ఆ పక్కగా ఆడుకుంటున్న మా ఐదేళ్ల చింటూగాడు పరిగెత్తుకుంటూ వచ్చి బంతిని తీసుకున్నాడు. అతడు ముచ్చటగా చూసి నవ్వేడు. గంభీరమైన ఆ ముఖానికి నవ్వు కూడా వచ్చా! అనిపించింది. టిఫిన్లు పూర్తయి భారీ ఆకారాన్ని మళ్ళీ సోఫాకి తరలించి ప్రాజెక్టుకి సంబంధించిన ఫైలు ఏదో తెమ్మని ఆయన్ని లోపలికి పంపేడు.

‘‘టిఫిన్‌ తర్వాత నాకు జ్యూస్‌ అలవాటు... తీసుకొస్తారా?’’ ఆర్డరు వేసి నన్ను వంటగదిలోకి పరిగెత్తించాడు. అతడు చింటూగాడిని ఎత్తుకొని బుగ్గలు నిమరడం నేను కిచెన్‌లోకి వెళ్తుండగా నా కంటబడ్డ ఆఖరి దృశ్యం. అంతే!ఓ రెండు నిమిషాల తర్వాత..‘‘బ్యాడ్‌ అంకుల్‌! బ్యాడ్‌ టచ్‌!! బ్యాడ్‌ అంకుల్‌! బ్యాడ్‌ టచ్‌!’’ చింటూగాడి అరుపులకు గుండె జలదరించినట్టైంది. పరిగెత్తుకొని హాల్లోకి వచ్చి చూశాను. చింటూని విదిలించి కింద పడేసి, కోపంగా చూస్తూ ఇంటి బయటకు తన భారీ కాయాన్ని జరజరా లాక్కుంటూ పోతున్నాడు.మా ఆయన బెడ్రూమ్‌లోంచి బయటకొచ్చి ఫైలు పట్టుకొని నిలబడి హతాశుడై చూస్తున్నాడు. బయటకు పోతున్న అతడి వెంట ‘‘సార్సార్‌! సారీ సార్‌...!’’ అంటూ పరిగెత్తాడు. అతడి కారు మా ఆయన్ని పట్టించుకోలేదు.చింటూని దగ్గరకు తీసుకొని హత్తుకొని కూర్చున్నాను.

 ‘‘అసలేమైంది చింటూ?’’ అనునయిస్తూ అడిగాను.‘‘ఏమైందేంటే?? వాడిని ఎత్తుకొని కాస్త ముద్దు చేశాడాయన, అంతే! నేనిక్కడే ఉన్నానుగా!’’ గయ్యిమంది మా అత్తగారు.‘ఊరికే వాడు బ్యాడ్‌ టచ్‌ అని ఎందుకు అరుస్తాడు? వాడికి బ్యాడ్‌ టచ్‌ అంటే ఏమిటో వివరించి చెప్పానుగా ఎప్పుడో! అంటే వచ్చిన వెధవ ఏమైనా అఘాయిత్యం!’ తల్చుకుంటేనే వెన్నులో వణుకొచ్చేసింది. వివరంగా చింటూని అడగాలనుకున్నా. ఆవిడ ముందు నా గొంతు పెగలలేదు.‘పక్కగదిలో కూర్చొని సాయికోటి రాసుకుంటున్న ఈవిడ హాల్లోకి ఎపుడు చూసిందని, వాడికి వత్తాసు పలుకుతోంది!?’ నా బుర్రకేమీ తోచలేదు.‘‘మొత్తం నాశనం అయిపోయింది. ఛా!!’’ ఇంట్లోకి వస్తూనే చేతిలో ఫైలుని విసిరికొట్టాడు మా ఆయన.కాయితాలన్నీ చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. పిచ్చెక్కినట్టు అరవటం మొదలుపెట్టాడు.పిల్లోడికి ఏమైందో అనే ఆదుర్దా కూడా లేకుండా కాంట్రాక్ట్‌ పోయిందనే బాధపడటం నాకు ఆశ్చర్యమే కాదు, అసహ్యం కూడా వేసింది. 

ముడిపడ్డ నా నొసటిని, మా వారివైపు చీదరింపుతో కూడిన నా చూపుని కూడా భరించలేకపోయింది మా అత్తగారు.‘‘చదవేస్తే ఉన్న మతి పోయిందట! పిచ్చి అనుమానాలతో పిల్లల బుర్రలు పాడుచేస్తే ఇలానే ఉంటుంది మరి! నా కొడుకు కష్టమంతా బూడిదలో పోసేశావ్, నీ అతితెలివి తగలెయ్యా! అసలు మగ పిల్లాడిని పెంచే విధానం ఇదేనా? అయినా చింటూ ఏమైనా ఆడపిల్లా? మగపిల్లాడంటే పులిబిడ్డలా ఉండాలి. పిరిగ్గొడ్డులా కాదు’’ అత్తగారు విరుచుకుపడింది. నా ఒళ్ళో ఉన్నవాడిని రెక్కపట్టుకు లాక్కుపోయి బెడ్రూం తలుపేసుకు కూర్చుంది.నా బుర్ర గిర్రున తిరిగింది. అసలక్కడ ఏం జరుగుతోందో నాకేం అంతుబట్టలేదు. ఇలాంటి పరిస్థితిలో ఓ తండ్రి, నానమ్మ ప్రవర్తించాల్సిన తీరు కచ్చితంగా ఇది కాదు. ఒక్కసారిగా అగాథంలోకి కూరుకుపోయిన భావనేదో కమ్మేసింది.

మా ఆయనగారు బిక్కుబిక్కుమంటూ అతడికి ఫోన్‌ చేసి తిరిగి రప్పించే ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నాడు. అతడు ఫోన్‌ ఎత్తినట్టు లేడు. ఎవరెవరికో ఫోన్లు చేసి, కాంట్రాక్టు చేజారిపోకుండా చూసేందుకు దేబిరిస్తున్నాడు. అత్తగారు మూసిన తలుపింకా తెరవలేదు. లోపల చింటూ ఎలా ఉన్నాడో! తలుపు తట్టే ధైర్యం నాకు లేదు. నా బేలతనానికి నాకే సిగ్గేసింది.డబ్బు కోసం కన్న కూతుర్ల శీలాన్ని తాకట్టు పెట్టే తల్లిదండ్రులు ఉంటారని చాలా చోట్ల చదివి ఉన్నాను.ఇప్పుడు ఇంచుమించు అలాంటి వాళ్ళనే చూస్తున్నాను అనిపించేసింది. ఓహ్‌! మగపిల్లలకి శీలం లాంటిదేదీ ఉండదు కదూ! మరిప్పుడు తాకట్టు పెట్టినదాన్నేమంటారో!నా తడి కళ్ళు నిస్సహాయంగా తలుపుకేసి చూస్తుండిపోయాయి. అర్హతకు తగ్గ అవకాశాలు, విజయాలు దక్కకపోతే మనిషి మరీ ఇంత దిగజారిపోతాడా? కొడుకుని పట్టించుకోకుండా ఎవరెవరికో ఫోన్లు చేసి దేబిరిస్తున్న మా ఆయన మొహం చూడాలంటే కంపరం మొదలయింది. 

మూడు గంటలు గడిచాయి. ఆయన ప్రయత్నాలేవీ ఫలించినట్టు లేవు. అసలైనోడే అలిగి వెళిపోతే కొసరు పెద్దమనుషులు కూడా మొహం చాటేశారు. కాంట్రాక్టు గాలిలో కలిసినట్టే. సమయం గడుస్తున్న కొద్దీ రక్తపోటు పెరిగి ఆయన మొహం వికృతంగా కొంకర్లుపోతోంది. ఇంకాసేపైతే కిందపడి గిలగిలా కొట్టుకునేవాడే. గేటు బయట కారు శబ్దం విని దిగ్గున లేచాడు. పరిగెత్తుకు వెళ్ళి అతడి చేతులు పిసుకుతూ సారీలు చెప్పుకుంటూ లోపలికి తీసుకొచ్చాడు .వాడి మొహంలో ఇందాకటి గాంభీర్యం ఇప్పుడు లేదు, పాలిపోయింది. పీడోఫిల్‌ ... చిన్నపిల్లలపై కామవాంఛలను పెంచుకునే వెధవలను అలానే పిలుస్తారట! ఎక్కడో చదివిన గుర్తు. వీడు అందుకే పెళ్లి పెటాకులు లేకుండా ఆంబోతులా తిరుగుతున్నాడనమాట!వాడ్ని చూస్తూనే నా నరాలు పొంగాయి. చికెనూ మటనూ కోసిన కత్తితోనే వాడి పీక కోసేయాలన్నంత కసి.‘‘బాగా ఆలస్యం అయిపోయింది. సార్‌గారు వచ్చేశారు కదా, భోజనం వడ్డించు’’ ఆయనగారి ఆర్డరు!కారు శబ్దం వింటూనే బెడ్రూమ్‌ తలుపు తెరుచుకుంటూ బయటకొచ్చింది మా అత్తగారు. వస్తూనే వంగి వంగి దండాలెట్టేసింది. 

చింటూ లోపల పడుకున్నట్టున్నాడు. ఏ చప్పుడూ లేదు.‘‘ఏంటి చూస్తున్నావ్‌ వడ్డించూ!!’’ అత్తగారి హుకుం జారీ అయింది. నాలోని దద్దమ్మ కోడలు తలవంచేసింది. వచ్చినోడు ఎంత వెధవ అయినా, ఎంతటి ఘాతుకానికి ఒడిగట్టినా, వాణ్ని చూస్తేనే మన ఒంట్లో రక్తం సలసలా కాగుతున్నా, మర్యాదలకు మాత్రం లోటు రానివ్వకూడదు. దద్దమ్మ కోడళ్ళ రూల్‌బుక్‌లో మొదటి రూల్‌ ఇదే కావొచ్చు!మటను బొమికల్లో మజ్జను కూడా జుర్రుకుంటూ మెక్కుతున్న ఆ కుక్కను చూస్తే ఒళ్ళంతా కంపరమేసింది. పక్కనే జీ హుజూర్‌ ! అంటూ నిల్చున్న మా వాళ్ళను చూస్తే అంతకంటే జుగుప్సగా ఉంది.‘‘మీరు చదువుకున్నవారిలా ఉన్నారే!’’ నాకేసే చూస్తూ అడిగాడు ఆ కుక్క.వాడికి జవాబిచ్చే స్థితిలో నేను లేను. చాలాసేపటి నుంచి పంటి బిగువున అదిమిపట్టిన కోపం, కట్టలు తెంచుకోవడం నాకిష్టం లేదు.

 దద్దమ్మల రూల్‌ పుస్తకంలో ఇది మరో రూల్‌.‘ఆ! ఏదో చదివిందిలెండి. ఈకాలం ఆడపిల్లల చదువులు ఉద్యోగాలకి చాలవు ఇల్లు చక్కబెట్టడానికి పనికిరావూ..’’ వెకిలి కామెంటు విసిరింది అత్తగారు.అతడు పట్టించుకోలేదు. ‘‘ఏమ్మా! బ్యాడ్‌ టచ్‌ గురించి పిల్లలకి చెప్పడం తెలిసింది సరే, మరి ఆ తర్వాత పిల్లాడిని జరిగిన విషయం గురించి వాకబు చేశావా తల్లీ?’’ గతుక్కుమన్నాను. అతడు ఎగతాళి చేస్తున్నాడో, సవాలు చేస్తున్నాడో అర్థం కాలేదు. బెడ్రూమ్‌ వైపు అత్తగారి వైపు మార్చి మార్చి చూశాను. ‘‘పోవే! పోయి వాణ్ని తీసుకురా! ’’ అన్నట్టు కళ్ళతోనే సైగ చేసిందావిడ.పరిగెత్తుకు లోపలికి వెళ్ళాను. చింటూని గుండెలకి హత్తుకుని, బుజ్జగిస్తూ ఆరా తీశాను. నాలుగు గంటల మానసిక క్షోభ తర్వాత గుండెలపై నుండి టన్ను బరువు దించినట్టైంది. వాడి చేయి పట్టుకుని మెల్లగా డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు తెచ్చాను. చింటూ కళ్ళలో బెరుకు, భయం లాంటివేవీ నాకు కనపడలేదు. అతడిని చూసి, ‘‘నీ జట్టు పీస్‌! బ్యాడ్‌ అంకుల్‌.’’ అన్నాడు.మా ఆయన గొంతు తడారిపోవడం తెలుస్తూనే ఉంది. గుటకలు మింగుతూనే ఉన్నాడు.

‘‘తప్పు! అలా అనకూడదు చింటూ!’’ చింటూ చెయ్యి పట్టుకులాగి చిన్నగా కుదుపుతూ గయ్యిమన్నాడు మా ఆయన.‘‘ఈ అంకుల్‌ నాతో ఫైటింగ్‌ చేస్తూ నా సీటుపైన గిచ్చేశాడు.‘‘ బుంగ మూతి పెట్టి చెప్పాడు బుజ్జాయి చింటూ.మా ఆయనగారూ, అత్తగారూ తెచ్చి పెట్టుకున్న నవ్వుతో బిగ్గరగా నవ్వేసి, ‘‘తప్పు నాన్నా! అంకుల్‌ సరదాగా చేశారు. బ్యాడ్‌ అంకుల్‌ అనకూడదు’’ అని, చింటూతో బలవంతంగా ‘సారీ’ కూడా చెప్పించేశారు.చింటూ చెప్పిన విషయం నమ్మాలనే అనిపించింది. ఊహించినట్లుగా ఏ ఘోరమూ జరగలేదని తెలిశాక, తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాను.‘‘పూర్తిగా తెలుసుకోకుండా ఈ విషయం బయటకెళ్తే నా పరువేం కానూ?’’ నవ్వుతూనే చురక వేశాడు అతడు.‘‘ఈ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం చేశావా?’’ అన్నట్టు కింద నుంచి పైవరకు కొరకొరా చూసింది అత్తగారు.అతడ్ని అనవసరంగా అనుమానించినందుకూ, అడ్డమైన పుస్తకాలూ చదివేసి, అనవసర భయాలతో బ్యాడ్‌ టచ్, గుడ్‌ టచ్‌ అంటూ పిల్లల మనసులు పాడు చేసినందుకు నాలో నేనే కుచించుకుపోయేలా చేసిన చూపు అది.‘‘చక్కెర పొంగలి చాలా బాగుంది. 

మా అమ్మ గుర్తొచ్చింది’’ చేతి వేళ్ళను చప్పరిస్తూ చెప్పేడతడు.జరిగిన దాన్ని మనసులో పెట్టుకోకుండా ఎంత బాగా మాట్లాడుతున్నాడో అన్నట్టు మొహాలు పెట్టి మురిసిపోయారు మావాళ్లిద్దరూ. అతడి మంచితనపు ప్రదర్శన పెరిగే కొద్దీ నా వైపు కొరకొర చూపులు ఎక్కువయ్యాయి.‘‘మా అమ్మ మీ కంటే వంట బాగా చేసేది. కాని, మీకున్న తెలివితేటలు ఆవిడకు ఉండి ఉంటే నా జీవితం వేరేలా ఉండేది.’’ అతడి మాట అర్థంకాక మొహాలు చూసుకున్నాం. ‘‘బ్యాడ్‌ టచ్‌ అంటే ఏంటో నాకు చిన్నప్పుడే తెలుసు. మా అమ్మ చెప్పలేదు. మా మావయ్య తెలియజెప్పాడు, చేతలతో. నేను జరిగినది చెప్పినా అమ్మ నమ్మలేదు. ఆమెది సొంత తమ్ముడిపై ప్రేమో, లేక అసలు అలాంటి వెధవ బుద్ధుల గురించి తెలియనితనమో! అమ్మ కూడా నన్ను నమ్మటం లేదనే వేదన, ఆమె నమ్మకపోయేసరికి ఇంకా ఎక్కువైన మావయ్య వేధింపులు... ఆ రోజులు చాలా భయంకరంగా ఉండేవి. కలల్లో కూడా వెంటాడే భయం... బాల్యమంతా ఆ భయంతోనే గడిచిపోయింది. సరిగ్గా చదువు వంటబట్టలేదు. 

కొత్తవాళ్ళతో మాట్లాడాలంటే భయం. పెళ్లి చేసుకోవాలంటే భయం. కొన్నిసార్లు నా మనసు ఇంకా పిల్లాడి లాగానే ఉండిపోయిందని అనిపిస్తూ ఉంటుంది. అల్లకల్లోలంగా ఉండే మనసుని శాంతింపజేయడానికి తాగుడు అలవాటు చేసుకున్నా, ఫలితం లేదు. సైకాలజిస్టుల చుట్టూ తిరిగా... మొత్తానికి ఆ కూపంలోంచి బయట పడేసరికి నలభైఏడేళ్ళు దాటిపోయాయి. ఇప్పడూ ఓ కుటుంబం కావాలనిపిస్తుంది కాని, ఇలాగే అలవాటైపోయింది. అందుకే ఎవరైనా ఇంటికి పిలిచి భోజనం పెడితే కాదనకుండా వాలిపోతా! పిల్లలతో ఆడుకుంటూ ఉంటే ఏదో తెలియని ఆనందం. కాని, చింటూ అలా అరిచే సరికి నా గతం మొత్తం కెలికినట్టయింది. ఏమీ అనుకోకండి సారీ! చింటూ సారీ నాన్నా! ఈసారి బాగా ఫైట్‌ చేద్దాం నో చీటింగ్‌. అమ్మా! మా అమ్మ కూడా మీలాగా ఉండి ఉంటే నా జీవితం ఇలా ఉండేది కాదు’’ అంతటి భారీ మనిషి కంటి నుండి కన్నీరు మాత్రం అతి తేలికగా జారిపోయింది.

అలాంటి వ్యక్తి నుంచి అలాంటి మాటలు వినేసరికి అంతా నిశ్చేష్టులయిపోయారు. చిరునవ్వుతో అతడికి వీడ్కోలు పలికేశాము. మా అత్తగారు చింటూ తల నిమిరి నా వైపే చూస్తూ నిలబడిపోయింది.అంతకు ముందున్న కరకు చూపు కాదది. మా ఆయన దగ్గరుండి కారు డోర్‌ మూసి మరీ ఆయన్ని సాగనంపి, లోపలికొచ్చి మురిపెంగా ప్రాజెక్టు ఫైలుని చూసుకొని నవ్వుకుంటున్నాడు. నేను కూడా హాయిగా ఊపిరి తీసుకున్నాను. కాని, గుండెలో ఏదో గుచ్చుతున్నట్టు, గుండె గోడకి ఏదో బీటలు పడ్డట్టు అనిపించింది. గట్టిగా ఊపిరి తీసుకున్నాను. బీటలు పడాల్సింది బద్దలవ్వాల్సింది నా గుండె కాదు, నా దద్దమ్మతనం. అర్థమైంది నాకు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement