
హైదరాబాద్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ వ్యవహారం వివిధ ప్రాంతాల నుంచి సాగిన చైల్డ్ ట్రాఫికింగ్‌ను బయటపెట్టింది. నిరుపేద తల్లిదండ్రుల నుంచి చిన్నారులను కొన్నివేల రూపాయలకు కొనుగోలు చేసి, సరోగసీ పేరుతో వారిని రూ.లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకుంది డాక్టర్ నమ్రత గ్యాంగ్. ఈ కారణంగా ఓ వర్గం, ప్రాంతం, రాష్ట్రానికి చెందిన పసిమొగ్గలు మరో చోటుకు తరలివెళ్లిపోయారు. కొన్నేళ్ల కిందట హైదరాబాద్ కేంద్రంగా సాగిన చైల్డ్ కిడ్నాపింగ్స్‌లోనూ ఇలాంటి ఆసక్తికర కోణం ఉంది. అప్పట్లో అపహరణకు గురైన వారి పేరు, వర్గం, భాష.. అన్నీ మారిపోయాయి.
సంతోష్‌నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎంబీ హట్స్‌కు చెందిన నాలుగున్నరేళ్ల బాలుడు మహ్మద్ షరీఫ్ మిస్సింగ్‌కు సంబంధించి 2011 మార్చి 4న అతడి తల్లి రెహానా బేగం ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అప్పట్లో పాతబస్తీలో చిన్న పిల్లల మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. పోలీసులు ఈ కేసుల ఛేదన కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. షరీఫ్ కేసు దర్యాప్తులో భాగంగా స్థానికులను విచారించిన ఈ స్పెషల్ టీమ్‌కు మాదన్నపేట ప్రాంతంలో నివసించే రేష్మా సుల్తానా కదలికలు తెలిశాయి. బాలుడి కిడ్నాప్‌కు నాలుగు రోజుల ముందు నుంచి ఆమె ఎంబీ హట్స్ ప్రాంతంలో సంచరించిందని, చిన్నారులకు బిస్కట్లు, చాక్లెట్లు ఇస్తూ మచ్చిక చేసుకుందని వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకోవడంతో కీలక విషయాలు బయటపడ్డాయి.
కరీంనగర్ నుంచి వచ్చి మాదన్నపేటలో స్థిరపడిన మహబూబ్ ఖాన్ భార్యే ఈ సుల్తానా. వీరిద్దరితో పాటు కమలా అలియాస్ పర్వీన్, నిజామాబాద్‌కు చెందిన డి.మల్లయ్య యాదవ్, డబీర్‌పుర వాసి సజీద్, మాదన్నపేటకే చెందిన షరీఫ్ ఓ ముఠాగా ఏర్పడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చిన్నారులను కిడ్నాప్ చేసి ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో విక్రయించడం మొదలెట్టారు. సంతానలేమితో బాధపడుతున్న భార్యాభర్తలను మల్లయ్య సంప్రదించేవాడు. అక్కడ వారి నుంచి ‘ఆర్డర్’ తీసుకున్న తరవాత ఆ విషయాన్ని నగరంలో ఉన్న ముఠా సభ్యులకు చెప్పేవాడు. సుల్తానా, పర్వీన్, సజీద్, షరీఫ్‌లు పాతబస్తీలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చిన్నారులను గుర్తించారు. వారికి చాక్లెట్లు, బిస్కట్లు ఆశ చూపి అదును చూసుకుని కిడ్నాప్ చేశారు. వీరిని సజీద్ తన ఆటోలో వేములవాడలోని రుద్రంగికి తీసుకువెళ్లి డి.మల్లయ్య యాదవ్‌కు రూ.35 వేల నుంచి రూ.50 వేలకు అమ్మేవాడు. అతడు వీళ్లని సంతానలేమితో ఉన్న దంపతులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు విక్రయించేవాడు.
ఈ గ్యాంగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు తొమ్మిదిమంది చిన్నారులను రెస్క్యూ చేశారు. అప్పుడే ఓ ఆసక్తికర, కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కిడ్నాపింగ్ గ్యాంగ్ ఎక్కువగా పాతబస్తీలోని ఓ వర్గం బాలలను ఎత్తుకుపోయి జిల్లాల్లో ఉన్న మరో వర్గం దంపతులకు విక్రయించేది. ఫలితంగా వారి పేర్లు, భాష, ఆచార వ్యవహారాలన్నీ పూర్తిగా మారిపోయాయి. 2008లో మాదన్నపేట సలార్‌నగర్ నుంచి కిడ్నాప్ అయిన మహ్మద్ ఫర్దీన్ ఖాన్ దాదాపు మూడేళ్ల తరవాత ప్రశాంత్‌గా తన తండ్రి సర్వర్ ఖాన్ వద్దకు వచ్చాడు. అలాగే సంతోష్‌నగర్ పరిధి నుంచి 2009లో అపహరణకు గురైన మహ్మద్ మజీద్, షేక్ నవీద్‌లు... వినయ్, రాహుల్‌గా వారి ఇళ్లకు తిరిగి వచ్చారు. 2011 మార్చి 4న అపహరణకు గురైన షరీఫ్ మాత్రం ఏమార్పు లేకుండా అతడిలానే తన ఇంటికి చేరాడు. ఇలా వారిలో ఒక్కొక్కరిదీ ఒక్కో రకమైన కథగా మారాయి.
ఆ తొమ్మిదిమంది చిన్నారులు పుట్టింది ఎక్కడైనా, చాలాకాలం పాటు పెరిగింది మాత్రం ‘కొన్న తల్లిదండ్రుల’ దగ్గరే. ఈ నేపథ్యంలోనే తమ మాతృభాషను సైతం వాళ్లు మరచిపోయి, తమను పెంచుకుంటున్న వారి భాషనే అలవాటు చేసుకున్నారు. వినయ్‌గా తిరిగి వచ్చిన మజీద్, రాహుల్‌గా మారిన నవీద్ ఉర్దూ, హిందీ భాషలను పూర్తిగా మర్చిపోయి ‘తెలుగుబిడ్డ’లుగా ఇళ్లకు చేరారు. ఇలా రెస్క్యూ అయిన తొమ్మిదిమందీ హైదరాబాద్ వచ్చిన వెంటనే అసలు తల్లిదండ్రుల వద్దకు రాలేకపోయారు. తొలుత పోలీసులు ఆ బాలలను న్యాయస్థానం ద్వారా స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. ఆపై వీరిని కన్న తల్లిదండ్రులు రెండు నెలల తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, తామే కన్నవారమని నిరూపించుకుని, తమ బిడ్డల్ని తమతో తీసుకువెళ్లారు. అప్పటి వరకు ఈ చిన్నారులకు స్టేట్ హోమ్ ఇల్లు అయింది.
అప్పట్లో ఇలా అపహరణలకు గురైన బాలల్లో ఎక్కువమంది పుట్టింది నిరు పేద కుటుంబాల్లో. వీరిలో చాలామంది తల్లిదండ్రులకు తమ పిల్లల్ని చదివించే స్తోమత కూడా లేదు. అయితే కిడ్నాపర్ల కారణంగా ఆర్థికంగా కాస్త స్థిరపడినవారి చెంతకు చేరి విద్యాబుద్ధులు నేర్చుకోవడానికి స్కూళ్లల్లో చేరారు. పోలీసులు రెస్క్యూ చేయడంతో మళ్లీ అసలు తల్లిదండ్రుల వద్దకు చేరి, అప్పటి వరకు ఉన్న సౌకర్యాలు, అలవాట్లు, కట్టుబాట్లను పూర్తిగా మరచిపోవాల్సి వచ్చింది. ఒక రకంగా చూస్తే ఈ ఎపిసోడ్‌లో చిన్నారులు కోల్పోయిందే ఎక్కువ. పిల్లలపై మమకారంతో వీరిని ఖరీదు చేసిన చాలామంది దంపతులు కేసులను ఎదుర్కొన్నారు.