
భూమికి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలోని గెలాక్సీ నుంచి వచ్చిన ఆ వ్యోమనౌకలోంచి కొందరు దిగారు. వారందరి సగటు ఎత్తు నాలుగు అడుగుల రెండు అంగుళాలు. వారు తమ వెంట తెచ్చిన ఓ డజనుమంది ఖైదీలని భూగోళం మీద దింపారు. వారంతా జంటలే. వారి చేతులకి వేసిన బేడీలని విప్పారు. ‘‘మీరు చేసిన ఘాతుకాలకి మిమ్మల్ని మనం గ్రహం నుంచి వెలివేయడంతో ఇక్కడికి తెచ్చి వదలమనే తీర్పుని అమలు చేస్తున్నాం. చివరగా మీరు చెప్పుకోవాల్సింది ఏదైనా ఉందా?’’ ఆ నౌక కెప్టెన్ అడిగాడు.
‘‘మా స్వగ్రహం నుంచి ఇలా దూరంగా మమ్మల్ని పంపడం సబబు కాదని, ఇక మీదట ఎలాంటి నేరాలు చేయమని, తిరిగి మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళమని కోరుతున్నామని మన రాజుకి చెప్పండి.’’ ఆ డజనుమందిలోని ఒకరి భార్య ఆవేదనగా చెప్పింది.‘‘చెప్తాం. మీ సందేశం ఆయనకి చెప్పినా ప్రయోజనం ఉంటుందని అనుకోము. ప్రశాంతంగా జీవించేవారికే ఆ గ్రహం. మనలో ఎవరిలో నేరప్రవృత్తి ప్రవేశిస్తుందో వారి డీఎన్‌ఏ పుట్టేవారు మన గ్రహంలో ఉండకూడదని, వారిని వెలివేయాలనే చట్టాన్ని మన రాజుగారు అమలు చేశారు. ఇది మన గ్రహంలోని శాంతికి ముఖ్యమని రాజుగారు భావిస్తున్నారు.’’‘‘అక్కడ మీరు చేసిన నేరం ఘోరాతి ఘోరమైంది.
మన గ్రహవాసులు అందర్నీ ఒకేసారి చంపే మారణాయుధాన్ని తయారు చేసి, మన రాజుని బెదిరించి డబ్బు కోరారు. కాబట్టి గ్రహ బహిష్కరణ శిక్షని అమలు జరిపి వెళ్ళిపోతున్నాం.’’ మరొకరు చెప్పారు.వాళ్ళు ఆ వ్యోమనౌకలోకి ఎక్కడం, అది పైకిలేచి క్రమంగా దూరమై కనపడకుండా పోవడాన్ని చూశారు. క్షణాల్లో కనుమరుగైన ఆ వ్యోమనౌకని చూశాక వారిలోని ఒకడు క్రూరంగా నవ్వి చెప్పాడు.‘‘వాళ్ళు తిరిగి వెళ్ళాక కాని మన శక్తి తెలీదు. సమయానికి మనం డీయాక్టివేట్ చేయడం లేదు కనుక ఆ మారణాయుధాలన్నీ పేలిపోయి, ఆ గ్రహానికి వెళ్ళాక వాళ్ళకి అక్కడ శ్మశానం తప్ప మరేం కనిపించకపోవడంతో మన తడాఖా అర్థమవుతుంది.’’ఆ నేరస్తులంతా చుట్టూ చూశారు. రాళ్ళు, రప్పలు, మట్టి. దూరంగా పచ్చదనం కనిపించడంతో అటువైపు నడిచారు. ఆ చెట్లకి కాసిన పళ్ళవంక చూసి వారిలోని ఒకరు ఆనందంగా చెప్పారు.
‘‘అమ్మయ్య! ఈ గ్రహంలో తిండికీ, నీళ్ళకి కొరత లేదు.’’‘‘నీళ్ళేవి?’’ మరొకరు చుట్టూ చూస్తూ అడిగారు.‘‘వెదికితే కనిపిస్తాయి. నీళ్ళు లేకుండా చెట్లు జీవించలేవు కదా?’’ఆ డజనుమంది భార్యాభర్తలు ఆ గ్రహాన్నంతా తిరిగి చూడసాగారు.వందేళ్ళల్లో వారు ఏడు వందల ముప్ఫై రెండుమందిగా మారారు. మరో వందేళ్ళల్లో పదిహేను వేల ఆరువందల ఎనభై నాలుగు మందిగా... అలా ప్రతి శతాబ్దానికీ ఆ జాతి అభివృద్ధి చెందసాగింది. ఒకే భాష మాట్లాడే గ్రహం నుంచి వాళ్ళు వచ్చారు. కాని ఈ గ్రహంలోని వారు దెబ్బలాడుకుని అనేక ప్రాంతాలకి వెళ్ళడంతో అనేక భాషలు ఏర్పడ్డాయి.
వాతావరణం వల్ల చర్మం రంగులో మార్పు సంభవించింది. చట్టాల్లో, ఆచార వ్యవహారాల్లో వారి మధ్య స్పష్టమైన భేదం ఉంది. అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాక కాలంతో పాటు వారి మేధస్సు కూడా అభివృద్ధి చెందింది.తమ పూర్వీకులు ఓ గ్రహం నుంచి బహిష్కరించబడ్డారన్న సంగతే నేటి ఆ గ్రహవాసులకి తెలీదు. కారణం తెలీకపోయినా ఈ గ్రహానికి ఎందుకు పంపబడ్డారో సరిగ్గా ఆ నేరాన్నే వాళ్ళు కొత్త గ్రహంలో చేశారు. వారి డీఎఏ కారణంగా అలాంటి మారణాయుధాలను ఆ జీవులు కనిపెట్టి తయారు చేశారు. అప్పటికి వారి సంతతి సంఖ్య మూడు వందల డెబ్భైరెండు కోట్లకి చేరుకుంది.ఓ రోజు ఓ దేశపాలకుడు పిచ్చి ఆవేశంతో మారణాయుధాలు లేని దేశం మీదకి తమ మారణాయుధాలని ప్రయోగించాడు.
దాంతో ఆ దేశం లొంగింది. ఆ తర్వాత మరో పది దేశాలు కూడా ఆ మారణాయుధాలని తయారు చేసుకున్నాయి. ఆ గ్రహం మీది జనాభా పధ్నాలుగు వందల ఏభై నాలుగు కోట్లకి చేరుకున్నాక ఓ రోజు ఉన్మాదైన మరో దేశపాలకుడు తోటి మారణాయుధాలు గల దేశం మీదకి ఆకస్మికంగా తమ మారణాయుధాలని ప్రయోగించాడు. అది తెలిసి ఆ దేశం కూడా అవి తమని చేరుకునేలోగా జవాబుగా ఆ దేశం మీదకి తమ మారణాయుధాలని కూడా ప్రయోగించింది. మొదటగా ప్రయోగించిన దేశానికి చెందిన మిత్రదేశం అదే అదనుగా భావించి అది మద్దతు ఇచ్చే తమ శత్రుదేశం మీదకి మారణాయుధాలని ప్రయోగించింది.
వారం రోజులు గడవకుండానే ఆ గ్రహంలోని మారణాయుధాలన్నీ ప్రయోగించబడ్డాయి. అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరగడంతో ఓ ఖండంలోని మంచు శిలలు కరిగి ప్రవహించి, ఆ గ్రహం ఉపరితలం మీదకి ఐదు వేల అడుగుల పైకి నీరు చేరుకుని ముంచేసింది.ఏ అపరాధం వల్ల లక్షల సంవత్సరాల క్రితం ఆ గ్రహానికి ఆ జీవులు పంపబడ్డారో అదే అపరాధం వల్ల ఆ గ్రహంలోని వారి జాతి అంతరించి, ఆ గ్రహం మీద తిరిగి ప్రశాంతత నెలకొంది.జరగబోయేది ముందే గ్రహించిన, మొదటగా ఆ గ్రహం మీదకి వచ్చిన మేధావులైన ఆ డజనుమంది, జలప్రళయంతో తమ జాతి అంతరిస్తుందని చెప్పిన విషయం తరతరాలుగా కథగా చెప్పబడింది.
FEED ME A STORY :
మల్లాది వెంకట కృష్ణమూర్తి
‘ఫన్‌డే’లో ప్రచురితమయ్యే
ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా
భాగస్వాములను చేయనున్నారు.
మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో
ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com