అమెరికా లెక్క | Evaram Katha On Funday | Sakshi
Sakshi News home page

అమెరికా లెక్క

Nov 16 2025 8:22 AM | Updated on Nov 16 2025 8:22 AM

Evaram Katha On Funday

నారప్పకు దిక్కుతోచడం లేదు. ఎప్పుడు చూసినా ఏదో లోకంలో ఉన్నట్లు ఉంటున్నాడు.పని చేసేటప్పుడు, తినేటప్పుడు, పదిమందిలో కూర్చొని ఉన్నప్పుడు.. ఒక్కటేమిటి? నిద్రపోయేటప్పుడు తప్ప ఎప్పుడు చూసినా పరధ్యానంలోనే ఉంటున్నాడు. నారప్ప ఇలా ఉండబట్టి చాలా రోజులవుతోంది. అలాగని అలవిగాని కష్టాలేమైనా ఉన్నాయా అంటే అదీ లేదు. కడుపు నిండా తినడానికి, కంటి నిండా నిద్రపోవడానికి కొదవలేని బతుకు. పిల్లల్ని బాగా చదివించాడు. మంచి సంబంధాలు చూసి పెళ్లి చేశాడు. మనవలు, మనవరాళ్లను చూశాడు. ఆస్తి దండిగా ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే పెదరాయుడులా దర్జాగా కాలుమీద కాలేసుకొని బతకొచ్చు. అయినా, నారప్పలో ఏదో దిగులు మొదలైంది. 

చిన్నాపెద్దా లేకుండా ఊళ్లోవాళ్లంతా నారప్పను ‘నక్కజిత్తుల నారప్ప’అంటుంటారు. పైసా లాభం లేకుంటే ఏ పనీ చేయడనీ, పది పైసలు మిగులుతుందంటే ఏదైనా సరే చేస్తాడని ఆ పేరు పెట్టారు. ఇది నారప్పకూ తెలుసు. అయినా, తెలియనట్లే ఉంటాడు. ఎవరైనా మొఖమ్మీదే అన్నా పట్టించుకోడు. నవ్వుతూ తప్పించుకుంటాడు. నారప్ప ఇలా ఉండడం వెనక చాలా పెద్ద కథే ఉంది. 
నట్టనడి ఊళ్లో ముప్పై రెండు దూలాలు మోసే రాతిమిద్దెలో పుట్టాడు నారప్ప. ముందు అన్న బసప్ప, వెనక చెల్లెలు భీమక్క. అమ్మ వన్నూరమ్మ, నాన్న పుల్లప్ప. నారప్ప పుట్టేనాటికే వాళ్లకు వందెకరాల వరకు పొలం, వెయ్యికి పైగా జీవాలు ఉండేవి. ఆస్తి దండిగ ఉండడంతోపాటు పుల్లప్ప సర్పంచ్‌ కావడంతో ఆ ఇల్లు వచ్చేపోయే వాళ్లతో కళకళలాడేది. ఆ ఇంటికి ఎప్పుడు పోయినా తిండికి కొదవుండదని పేరు తెచ్చింది.కాలం చాలా కఠినమైనది. జీవితాలను తిప్పేస్తుంది. నారప్ప జీవితమూ అలాగే తిరిగింది. 

రెండోసారి సర్పంచ్‌ అయ్యాక పుల్లప్ప దారి తప్పాడు. పేకాటకు, బయటి సంబంధాలకు మరిగాడు. ఆస్తులు తరగడం, అప్పులు పెరగడం మొదలైంది. బసప్ప, నారప్ప చదువు ఊళ్లో బడితోనే ముగిసింది. ఇంటి వద్దకు జనాలు రావడం తగ్గింది. భర్త తిరుగుళ్లు చూసి వన్నూరమ్మ– ఆస్తి కరిగిపోక ముందే కూతురికి పెళ్లి చేయాలని పట్టబట్టింది. చివరికి ఊళ్లోనే ఉండే తన అన్న కదిరప్ప కొడుకు సోమప్పకు ఇచ్చి పెళ్లి జరిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులకే కాలంచేసింది.ఆలోగా పొలం ఇరవై ఎకరాలకు చేరుకుంది. గొర్లు, గొడ్లు ఊరు దాటాయి. పుల్లప్ప పదవీకాలం కూడా పూర్తయింది. మూడోసారీ సీట్లో కూర్చుందామని ఆశపడినా ఊళ్లోవాళ్లు ఒప్పుకోలేదు. ఆ కోపంతోనో బాధతోనో ఇల్లు విడిచి బయటికి రావడమే మానేశాడు. కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేశాక ఊరు విడిచి, కడప జ్యోతిక్షేత్రంలో కాశినాయన ఆశ్రమం జేరి అక్కడే కాలం చేశాడు.పుల్లప్ప పోయిన తర్వాత సర్పంచ్‌ సీట్లో కదిరప్ప కూర్చున్నాడు. దాని కోసమే తన కొడుక్కి చెల్లెలు కూతుర్ని చేసుకున్నాడనే సంగతి తండ్రీకొడుకులు చాటుగా మాట్లాడుకుంటుండగా విన్న నారప్పకు మాత్రమే తెలుసు. 

నాన్న, తమ కుటుంబం అనుభవించిన దర్జా, వైభోగం కాలంతోపాటు దూరమైనా నారప్ప మనసులోంచి మాత్రం పోలేదు. అయితే, పరిస్థితులకు తొందరగానే అలవాటు పడ్డాడు. లౌక్యం నేర్చుకున్నాడు. తినీతినక కూడబెట్టడం, వడ్డీలకివ్వడం మొదలుపెట్టాడు. ఆ అతితెలివితేటలు, లౌక్యం చూసే ‘నక్కజిత్తుల నారప్ప’ అని పేరు పెట్టారు.నారప్ప భార్య ఎర్రమ్మ అమాయకురాలు. భర్త మాట దాటదు. కొడుకు రవి బాగా చదువుకొని అమెరికాలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. అక్కడి అమ్మాయినే పెళ్లి చేసుకొని, సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టి స్థిరపడ్డాడు. తన మాట వినకుండా తెల్లోళ్ల పిల్లను చేసుకున్నాడని కొడుకు మీద కోపమొచ్చినా, కావల్సినంత డబ్బు పంపుతుండడంతో ఏమీ అనలేకపోయాడు నారప్ప. కొడుకు పంపే డబ్బుతో కూతురిని తహసీల్దారుకిచ్చి పెళ్లి చేశాడు. ఊళ్లో డూప్లెక్స్‌ హౌస్‌ కట్టించాడు. కూడేరులో జాగాలు, అనంతపురం, హైదరాబాద్, బెంగళూరులో ఇళ్లు కొన్నాడు. నారప్ప బ్యాంకు అకౌంట్లన్నీ లక్షలతో నిండిపోయాయి. అదిగో అప్పటి నుంచే నారప్పకు మనసులో ఏదో దిగులు మొదలైంది. అదేంటో, దాన్ని ఎలా తీర్సుకోవాలో నారప్పకు తెలిసేలా చేసినవి ఆ రెండు సంఘటనలే!

ఆ రోజు ఆదివారం. పొద్దున్నే బైక్‌ మీద తోటకు వెళ్లి, నిమ్మ చెట్లకు డ్రిప్పుతో నీళ్లు విడిచి ఇంటికి బయల్దేరాడు నారప్ప. ఊరికి ఆనుకొని వచ్చేసరికి ఎల్లప్ప గొర్రెల మంద ఎదురైంది. అసలే అది ఇరుకు దారి. పైగా ముందురోజు పడిన వానకు బురద ఉండడంతో బైక్‌ అదుపు తప్పింది. సర్రున జారి ఒక గొర్రెను బలంగా ఢీకొట్టింది. అది గట్టిగా అరుస్తూ వెనక్కిపడింది. బైక్‌ కూడా కింద పడుతుంటే ఒడుపుగా అదుపు చేశాడు. మంద వెనకాలే వస్తున్న ఎర్రిసామి అది చూసి ‘‘సచ్చెరా గొర్రె..’’ అని అరుస్తూ గబగబా గొర్రె దగ్గరకు వచ్చాడు. అదృష్టం కొద్ది గొర్రె బతికే ఉంది. అయితే, పొట్ట, బర్రెంకల మీద టైరు రాసుకొని పోవడంతో రక్తం కారుతోంది. అదాటున కింద పడడంతో తిరిగి పైకి లేవలేకపోతోంది. ఎర్రిస్వామికి కళ్ల నుంచి నీళ్లు జలజలా రాలాయి. వెనక్కి తిరిగి నారప్పను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడం మొదలుపెట్టాడు. ఆ అరుపులు చెవినబడి పరుగెత్తుకుంటూ వచ్చాడు ఎల్లప్ప. గొర్రెను పట్టుకొని పైకి లేపడానికి ప్రయత్నిస్తూనే కొడుకుతోపాటు తిట్లు అందుకున్నాడు. 

ఇద్దరూ కలసి నారప్పను నోరు తెరవనీయలేదు. ఈ గోలకు బెదిరి మిగిలిన గొర్రెలన్నీ దూరంగా నిలబడి వీళ్లనే చూస్తున్నాయి. జనం గుమిగూడారు. అందరూ కలసి ఎర్రిసామికి, ఎల్లప్పకు సర్దిచెప్పారు. ఈలోగా కిందపడిన గొర్రె లేచి నడవడంతో తిట్లు ముగించి వెనక్కి కదిలారు అబ్బాకొడుకులు. ఇంటికొచ్చి మంచంమీద కూలబడ్డాడు నారప్ప. చెవుల్లో తిట్లు మోగుతున్నాయి. చుట్టూ చేరినవాళ్లు నవ్వుకోవడం కళ్లలో మెదులుతోంది. కోపం, అవమానం కలసి ఏంచేయాలో తెలియక అలాగే ఉండిపోయాడు. మధ్యాహ్నం అన్నానికీ లేవలేదు. విషయం తెలిసి చీకటి పడుతుండగా వచ్చాడు చెన్నప్ప.‘‘న్నో.. అప్పుడప్పుడూ ఇట్టాంటివి జరుగుతాంటాయి.. మామూలే! అయన్నీ పట్టిచ్చుకుంటామా? ఎల్లప్ప నీకు మేనమామ వరస. ఎర్రిస్వామి మేనల్లుడు. మనోళ్లు ఏదో పొరపాటున మాట జారినారని అనుకోన్నా. లే.. అట్లా కూడేరు దాకా పోయొజ్జాం’’ అంటూ నారప్పను ఓదార్చాడు. 

ఇద్దరూ బైక్‌ మీద కూడేరుకు చేరుకునే సరికి ఏడయ్యింది. వైన్‌షాప్‌లో మందు, పక్కనే బజ్జీలు, ఉడకబెట్టిన చెనిక్కాయ విత్తనాలు తీసుకొని ఊరి చివర తోటలో కూర్చున్నారిద్దరూ. అప్పటిదాకా మౌనంగా ఉన్న నారప్ప... గొంతులోకి మందుపోగానే నోరు తెరిచాడు. ‘‘ఊరంతా సూచ్చాండంగా వోళ్లుతిట్నారు సెన్నప్పా. రేపట్నుంచి ఊళ్లో తలెత్తుకుని ఎట్ట తిరగల్ల? మానం, పానం రెండూ పోయినట్లు ఉండ్లా్య..’’ అంటూ కాసేపాగి ‘‘వోళ్లను ఏదో ఒకటి జేయాల.. ల్యాకపోతే  అవమానంతో సచ్చేలా ఉండా..’’ అంటూ కళ్లనిండా నీళ్లు నింపుకున్నాడు. చెన్నప్పకు ఆ రోజెందుకో కొత్తగా కనిపించాడు నారప్ప. ‘ఎవరెన్ని అన్యా తుడ్సుకొని పోయే నారప్పన్న ఈ పొద్దెందుకు ఇట్టా అంటన్నాడు’ అని మనసులో అనుకుంటున్నాడు.‘‘సెప్పు సెన్నప్పా.. వోళ్లను ఏమిజెయ్యాల?’’ చెన్నప్పను కుదుపుతూ మళ్లీ అడిగాడు నారప్ప. ‘‘ఏంజేయాల్సిన పన్లేదులేన్నా.. రెండ్రోజులుంటే అంతా మర్సిపోతారు’’ చెప్పాడు చెన్నప్ప. వినలేదు నారప్ప. అవమానం అతన్ని వెనక్కి తగ్గనీయడం లేదు.

‘‘కూడేరు స్టేషన్‌లో నా బామ్మర్ది ఉండాడు. వానికి సెప్పి ఎస్‌ఐతో మాట్లాడిజ్జాం. అంతో ఇంతో లెక్క కొడితే వాళ్లే స్టేషన్‌కు తీస్కపోయి అబ్బాకొడుకులకు మర్యాద జేస్తారు’’అన్నాడు చెన్నప్ప. ఒప్పుకున్నాడు నారప్ప. నేరుగా ఇద్దరూ స్టేషన్‌కు వెళ్లారు. చెన్నప్ప.. బామ్మర్దికి విషయం చెప్పడంతో లోపలికి వెళ్లి ఎస్‌ఐతో మాట్లాడాడు. బయటికొచ్చి చెన్నప్ప చెవిలో ఏదో గొణిగినాడు. వెంటనే నారప్ప దగ్గరికి వచ్చిన చెన్నప్ప ‘‘న్నో.. ఎస్‌ఐ ఇరవై వేలు అడుగుతనాడంటన్నా..’’ అన్నాడు.ఏమీ ఆలోచించలేదు నారప్ప. జేబులోంచి డబ్బు బయటికి తీశాడు. ‘‘లెక్క ఐదు వేలు ఎక్కువనే ఇచ్చనాగాని.. రెండ్రోజులు దాంకా ఇడ్సకండా తన్నమను’’ అన్నాడు పళ్లు కొరుకుతూ.చెన్నప్పకు అది కలో నిజమో తెలియడం లేదు. ఎప్పుడైనా అవసరానికి డబ్బడిగితే ఇవ్వడానికి ఎన్నో సాకులు చెప్పే నారప్పన్న ఇప్పుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం చూసి నోట మాట రాలేదు.

మరునాడు తెల్లారే సరికి ఊరంతా ఒకటే గుసగుసలు. ఎల్లప్పను, ఎర్రిసామిని అర్ధరాత్రి పోలీసులు తీసుకుపోయారని, నారప్ప కేసు పెట్టించాడని మాట్లాడుకుంటున్నారు. అది తెలియడంతో నారప్ప మనసులో ఏదో తెలియని సంతోషం కలిగింది. ఎప్పుడు లేనిది ఆ రోజు హీరోహోండా పక్కన పెట్టి, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మీద తోట వద్దకు బయల్దేరాడు. కూలిపనికి పిలిచే సాకుతో ఊరంతా తిరిగాడు. ఖద్దరు చొక్కా, రామరాజు పంచె కట్టి దర్జాగా తిరుగుతున్న నారప్పను చూసి ఆరోజు ఊరు నోరెళ్లబెట్టింది. ఎల్లప్పను, ఎర్రిసామిని రెండ్రోజుల దాకా వదల్లేదు పోలీసులు. వాళ్లు కొట్టిన దెబ్బలతో నెలపాటు ఇంటి నుంచి బయటికి రాలేదు వాళ్లు. ఇది జరిగాక ఊళ్లో నారప్ప పరపతి అమాంతం పెరిగింది. ‘నక్కజిత్తుల నారప్ప’ అని కాకుండా వరుసలు పెట్టి పిలవడం, గౌరవంగా మాట్లాడడం మొదలైంది. అప్పుకో సప్పుకో జనం ఇంటికి రావడం మొదలు పెట్టారు. అది చూశాక తనలోని దిగులేందో మెల్లగా అర్థమవసాగింది నారప్పకు. అంతేకాదు, తన బలమేదో తెలిసొచ్చింది.అయితే, నారప్ప పూర్తిగా ఒళ్లు విరుచుకొని తిరిగేలా చేసింది మాత్రం తిమ్మప్పతో గొడవే!

తండ్రి చేసిన అప్పుల కారణంగా తాము అమ్ముకున్న భూములన్నీ తిరిగి కొనుక్కున్నాడు నారప్ప.. ఒక్క తిమ్మప్ప పొలం తప్ప. అది కూడా తీసుకోవాలని ఒకరిద్దరితో అడిగించినా.. అమ్మడానికి తిమ్మప్ప ఒప్పుకోలేదు. దాంతో ఆ పొలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పంతం పట్టాడు.పక్కూరికి వెళ్లే రోడ్డు పక్కనే నారప్ప, పెద్దన్న పొలాలు పక్క పక్కనే ఉంటాయి. పెద్దన్న పొలానికి పైభాగంలో తిమ్మప్ప పొలం ఉంది. అందులోకి వెళ్లాలంటే పెద్దన్న పొలం మీదుగా వెళ్లాలి. ఏళ్ల తరబడి ఉండే దారది. అది కాకుండా తిమ్మప్ప పొలానికి వెళ్లాలంటే చుట్టూ నాలుగు కిలోమీటర్లు కొండ వారగా వెళ్లాలి. రాళ్లూరప్పలు కంపచెట్లతో ఉండే ఆ దారి ప్రమాదకరం.
ఈ అవకాశాన్ని అనుకూలంగా మార్చుకున్నాడు నారప్ప. పెద్దన్న పొలాన్ని కొనేశాడు. అందులో నుంచి తిమ్మప్ప పొలానికి వెళ్లే దారిని మూసేశాడు.

తాను పొలం అమ్మలేదనే కోపంతోనే నారప్ప ఇదంతా చేస్తున్నాడని తిమ్మప్పకు అర్థమైంది. గొడవెందుకని బతిమాలాడు. కాని, నారప్ప చెవికెక్కించుకోలేదు. దాంతో తన మనుషులతో గొడవకు దిగాడు. దీనికి నారప్ప ముందే సిద్ధమై ఉన్నాడు. తన దగ్గర డబ్బు చేరాక చుట్టూ చేరిన దాయాదుల్ని, మనుషుల్ని వెంట బెట్టుకొని అడ్డుకున్నాడు. 
విషయం తెలిసి పోలీసులు వచ్చారు. నారప్పదే తప్పని అందరికీ తెలుసు. కాని, ఎవరూ నోరు తెరవడం లేదు. ఎందుకంటే నారప్ప దగ్గర కట్టలు కట్టలు మూలిగే డబ్బు.. దానితో అవసరం. అందుకే ఏమీ పట్టనట్టు ఉండిపోయారు. తిమ్మప్పను పోలీసులు స్టేషన్‌కు తీసుకుపోయారు.తిమ్మప్ప కూడా అంతో ఇంతో డబ్బున్నోడే. పైగా వెనక్కి తగ్గే రకం కాదు. కాని, రూపాయి కంటే డాలరుకు బలమెక్కువని ఆయప్పకే కాదు ఊరంతటికీ అర్థమవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు.

ఒకటికి రెండుసార్లు తనదే పైచేయి అయ్యే సరికి నారప్పకు పట్టపగ్గాల్లేకుండా పోయాయి. మందిని వెనకేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు తనను వెక్కిరించిన వాళ్లను, ఎగతాళి చేసినవాళ్ల మీద అవకాశం దొరికినప్పుడల్లా పగ తీర్చుకునేవాడు. ప్రతి తగాదాలో తలదూర్చేవాడు. సర్దిచెప్పే సాకుతో అవసరమైనవి లాక్కునేవాడు. మెల్లగా జనానికి నారప్ప సంగతి అర్థమైంది. ఎదిరించి ఇబ్బంది పడేకంటే, గొడవ పడకుండా బతకడమే మేలని నిర్ణయించుకున్నారు. కాని, విషయాలన్నీ నారప్ప కొడుక్కి, కూతురికి చెప్పడం మొదలుపెట్టారు.పిల్లల హితబోధను పట్టించుకోలేదు నారప్ప. భర్తకు చెప్పే ధైర్యం లేని ఎర్రమ్మ.. జరిగేవన్నీ మౌనంగా చూస్తోంది. ‘మీ నాయిన మాదిరే నువ్వూ తయారయితనావని, ఊరంతా శత్రువుల్ని చేసుకుంటనావ’ని చెప్పాలనుకున్న మాటలు ఆమె నోరు దాటి రాలేదు. అంతేకాదు, భర్త అంతిమ లక్ష్యం, దాని కోసం చేస్తున్న ప్రయత్నాలు తెలిసి భయంతో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతోంది. 

భార్యాపిల్లల ఆందోళనలు, ఆవేదనలు ఏవీ నారప్ప చెవికి, మనసుకు ఎక్కడం లేదు. అతని దృష్టంతా మిగిలిన ఆ ఒక్క కోరిక మీదనే ఉంది. అదీ తీరేదే.. ఆ మహమ్మారి రాకుంటే. ∙∙ ప్రపంచాన్ని భయం గుప్పిట్లో బందీ చేస్తూ కరోనా పుట్టుకొచ్చింది.  దేశమంతా లాక్‌డౌన్‌ తెచ్చింది. జనం ఇళ్ల నుంచి కదలడం లేదు.ఎవరి వల్ల వచ్చిందో.. ఎలా వచ్చిందో.. నారప్ప కరోనా బారిన పడ్డాడు. లక్షణాలు వారంలోనే తగ్గాయి. అయినా మూడు వారాలు ఇల్లు దాటొద్దని వైద్య సిబ్బంది చెప్పడంతో ఇంటికే పరిమితమయ్యాడు. టీవీ చూడడం, ఫోన్‌లో మాట్లాడడం ఇదే పని. రెండు వారాలు భారంగా గడిచాయి. ఆ తర్వాత ఉండలేకపోయాడు. భార్యకు తెలియకుండా తోటకు బయల్దేరాడు.

సాయంత్రం ఆరు సమయంలో ఊరంతా తెలిసిందా వార్త.. తోట దగ్గరి బావిలో పడి నారప్ప చనిపోయాడని. భర్త ఎంతకీ ఇంటికి రాకపోవడం, కాల్‌ చేసినా కలవకపోవడంతో వెతుక్కుంటూ వెళ్లిన ఎర్రమ్మకు.. ఊరు దాటాక కొద్ది దూరంలో ఉన్నబావి పక్కన బైక్, బావిలో తేలుతున్న నారప్ప శవం కనిపించింది. ఊళ్లో జనానికి విషయం తెలిసినా ఒక్కరూ రాలేదు. అది కరోనా భయం వల్లో, బతికున్నప్పుడు నారప్ప చేసిన పనుల వల్లో తెలియడం లేదు. చివరకు పోలీసులొచ్చి శవం బయటికి తీశారు.నారప్ప అల్లుడు తాసీల్దారు కావడంతో ఎలాగోలా కర్నూలు నుంచి భార్యను వెంటబెట్టుకుని వచ్చేశాడు. కాని, కొడుకు వచ్చేదానికి ఎలాంటి అవకాశమూ లేదు.పంచనామా పూర్తిచేసి మరుసటి రోజు శవాన్ని అప్పగించారు పోలీసులు. బావిలోంచి తీసేటప్పుడు నారప్ప శరీరం మీద కనిపించిన కముకు దెబ్బల గురించి పోలీసులు ఏమీ చెప్పలేదు. ఎర్రమ్మ కూడా ఏమీ అడగలేదు. అడగబోయిన కూతురు, అల్లుడినీ కూడా ఆపింది.
∙∙ 
బ్యాండు మేళం, డప్పు లేకుండానే నారప్ప అంతిమయాత్ర మొదలైంది. ఎర్రమ్మ ఏడుపు ఊళ్లో జనానికి స్పష్టంగా వినిపిస్తోంది. 
అంతిమయాత్రలో నడుస్తున్న అల్లుడు, కూతురుతోపాటు కొద్దిమంది బంధువుల్లోనూ ఒకటే ఆలోచన... అసలు నారప్పను కొట్టి చంపి, బావిలో వేసిందెవరు? జైలులో పెట్టించి, కొట్టించినందుకు ఎల్లప్ప, అతని కొడుకు చేసిన పనా? తన పొలానికి దారి లేకుండా చేసినందుకు తిమ్మప్ప కుటుంబం చేసిన పనా? స్నేహితుడని నమ్మితే, వావీవరస చూడకుండా తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించినందుకు చెన్నప్ప చేసిన పనా? ఊళ్లో తాను చేసే తప్పుడు పనులు గురించి కొడుక్కు చెప్పాడనే అక్కసుతో ఓబుళప్ప పొలాన్ని ఆక్రమించుకున్నందుకా? ....వాళ్ల ప్రశ్నలన్నింటికీ అక్కడ సమాధానం తెలిసింది ఇద్దరికే.దారిలో.. సోమప్ప ఇంటి బయట.. కరోనా వచ్చినప్పటి నుంచి బయటికి తీయని టాటా సుమో టైర్లకు అంటిన బురద తాజాగా కనిపిస్తోంది.నారెప్ప పాడె మీద చల్లుతున్న చిల్లరలోని నాణేలు కిందపడి తళతళ మెరుస్తున్నాయి.అవి డాలర్లు... అమెరికా లెక్క.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement