ఈ వారం కథ: డార్క్‌ లైఫ్‌ | Evaram Katha On Funday | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: డార్క్‌ లైఫ్‌

Jan 4 2026 8:45 AM | Updated on Jan 4 2026 8:45 AM

Evaram Katha On Funday

రాత్రి పదకొండు గంటలైంది. ఆత్రుతగా కారు బయటకు తీశాడు సంజయ్‌. అతని ముఖం నిండా ఆందోళన. దారికి ఇరువైపులా జాగ్రత్తగా గమనిస్తూ కారు వేగంగా డ్రైవ్‌ చేస్తున్నాడు. అంతటా నిర్మానుష్యంగా వుంది. ‘ఎటు వెళ్ళాడో?... ఎక్కడ ఉన్నాడో?’ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. క్షణక్షణం గుండె వేగం పెరుగుతోంది. ఓ చేత్తో స్టీరింగ్‌ కంట్రోల్‌ చేస్తూ మరో చేత్తో డాష్‌ బోర్డ్‌ మీద నుండి సెల్‌ఫోన్‌ తీసుకున్నాడు. నంబర్‌ డయల్‌ చేశాడు. ‘‘దిస్‌ నంబర్‌ ఈజ్‌ స్విచ్డాఫ్‌’’ అని వచ్చింది. చిరాకుగా సెల్‌ పక్కకు విసిరేసి, కారును మరో వీధివైపు తిప్పాడు.    

ఆలోచనలతో తడుస్తున్నాడు. రెండు గంటల క్రితం ఇంట్లో జరిగిన సన్నివేశాలు ఒక్కొక్కటిగా సినిమా రీలులా మెదడులో తిరుగుతున్నాయి. ‘‘ఎంతైనా అలా చేసి ఉండకూడదేమో... కాస్త ఓపిక పట్టాల్సింది... ఇంకోసారి మెల్లగా చెప్పాల్సింది. సహనం కోల్పోయి తప్పు చేశానా?’’ తన వైపు నుంచి కూడా ఆత్మ పరిశీలన చేసుకోసాగాడు. దాదాపుగా టౌన్‌ అంతా చుట్టేశాడు. అతని అన్వేషణ ఫలించలేదు. ఇక మిగిలింది టౌన్‌ చివరన ఉన్న బైపాస్‌ రోడ్డు ఏరియా. అది ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోంది. ఎక్కువశాతం గుట్టలు, చెట్లు ఉన్నాయి. దూరం దూరంగా అక్కడో ఇల్లు, ఇక్కడో ఇల్లు తప్ప పెద్దగా జనావాసం లేదు.

‘అటు వెళ్లాలా? వద్దా?’ నిర్ణయించుకోలేక కారు ఆపాడు. తల సీటు మీదకు వాల్చి, జుట్టులోకి చేతివేళ్ళు పోనిస్తూ గట్టిగా నిట్టూర్పు విడిచాడు. ఇంతలో సెల్‌ రింగైంది. చటుక్కున అందుకున్నాడు. ‘‘హలో.. జానూ..’’ అన్నాడు.‘‘ఏమండీ... కనిపించాడా?’’ దుఃఖ ప్రవాహం కొనసాగుతుందనడానికి సూచనగా ఆమె గొంతు గాద్గదికంగా పలికింది. ‘‘లే...దు... నువ్వు కంగారుపడకు.. దొరకడమే ఆలస్యం బతిమాలి తీసుకొస్తాను...’’ జవాబు చెప్పలేక చెప్పాడు. అతని గుండెలో భారం పెరుగుతోంది. టైం చూశాడు. రాత్రి పన్నెండు. ఫోన్‌ చేయడానికి సమయం కాకపోయినా, తప్పని పరిస్థితి కాబట్టి, కాంటాక్ట్‌ నంబర్స్‌లోని కొన్ని నంబర్స్‌కు డయల్‌ చేశాడు. 

రింగ్‌ మోగి మోగి అలసిపోయిందే కాని, అటునుంచి స్పందన లేదు. చిరాకుగా స్క్రీన్‌ పైకి కిందకు జరుపుతుంటే తెలిసిన నంబర్‌ ఇంకోటి కనిపించింది. రింగ్‌ చేశాడు... ఎత్తలేదు. మళ్ళీ రింగ్‌ చేశాడు... మళ్ళీ... చివరి ప్రయత్నంలో ‘‘హలో... ఎవరండీ...’’ నిద్ర మత్తులో పలికిందా గొంతు.‘‘బాబూ... నేను రాహుల్‌ వాళ్ళ ఫాదర్‌ని... మావాడు నీ దగ్గరకు ఏమైనా వచ్చాడా?’’‘‘లేదంకుల్‌... రాలేదు...’’‘‘బాబూ ప్లీజ్‌... ఒక్క హెల్ప్‌ చేయవా... వాడి క్లోజ్‌ ఫ్రెండ్స్‌ ఎవరైనా వుంటే వాళ్ళ నంబర్స్‌ పంపవా..’’ వేడుకోలుగా అడిగాడు.

‘‘మేము తప్ప వాడికి ఎవరు లేరు... అయినా ఈ టైం లోపల ఇంటికే వస్తాడు కదా అంకుల్‌... రాలేదా...?’’‘‘........’’‘‘అంకుల్‌... ఏమైంది...? మాట్లాడండి...’’చెంపలపై జారిన కన్నీళ్ళు తుడుచుకుంటూ ‘‘ఆ.. బాబూ... నైట్‌ మా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వాడు కోపంతో వెళ్ళిపోయాడు.’’‘‘సమాజంలో మీకున్న గౌరవ మర్యాదలకు వాడలా చేయకూడదు అంకుల్‌. మేము కూడా చాలాసార్లు చెప్పాం, వాడు వినట్లేదు. ఈ మధ్య పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు.’’‘‘అవును బాబూ... నువ్వన్నది కరెక్టే... ఈరోజూ అలాగే చేశాడు. 

నేను చనిపోతానని బెదిరిస్తూ ఇంట్లో నుండి వాడి కారు వేసుకొని వెళ్ళిపోయాడు. కోపం తగ్గాక వస్తాడులే అని రెండు గంటల సేపు ఎదురు చూశాను. రాకపోగా సెల్‌ స్విచాఫ్‌ పెట్టాడు. నాకెందుకో భయంగా వుంది. టౌన్‌ మొత్తం తిరిగినా వాడు కనిపించలేదు. మీ దగ్గరికి కాకుండా ఇంకెక్కడికి వెళతాడో నీకేమైనా తెలుసా’’ అతని గొంతులో సన్నటి వణుకు. ‘‘నా....కు... ఆ...  పెద్దగా గుర్తు లేదు కానీ ఒక్కసారి మాత్రం బైపాస్‌ రోడ్‌ దాటిన తరువాత గుట్ట మీదకు తీసుకుపోయాడు. అదే ఫస్టండ్‌ లాస్ట్‌’’ చెప్పడం పూర్తి కాకముందే....‘‘థాంక్యూ బాబూ...’’ ఠక్కున ఫోన్‌ కట్‌ చేశాడు. కారు స్టార్ట్‌ చేసి బైపాస్‌ రోడ్‌వైపు పోనిచ్చాడు.

మట్టి రోడ్డు కావడం వలన గుంతలు ఎక్కువగా వున్నాయి. అక్కడక్కడా రాళ్ళు... కారు వేగంగా నడపలేకపోతున్నాడు. ఇక లాభం లేదనుకొని... కారు ఆపి నడక మొదలెట్టాడు. వీధిలైట్లు లేవు. ఇల్లు కూడా ఎక్కడో ఒకటి. అవి దాదాపు పూరి పాకలే. వెలుతురు సరిగా లేదని సెల్లులో టార్చిలైట్‌ ఆన్‌ చేశాడు. కొంత దూరం పోయాక అడుగుల శబ్దానికి కుక్కలు మేల్కొన్నాయి. ‘‘భౌ.. భౌ..’’మంటూ మొరగసాగాయి. ఒళ్ళు ఝల్లుమంది అతనికి. వెనక్కి పరుగెత్తాలన్నంత భయం వేసింది. చేతిలోని వెలుగును పరిసరాల మీదకు తిప్పాడు. అల్లంత దూరంలో పూరిపాక. దానిముందు ఓ వ్యక్తి కూర్చున్నాడు. ముఖం సరిగ్గా కనపడ్డం లేదు. ఇంత రాత్రి వేళ నిద్ర పోకుండా ఎవరు ఉంటారు? కచ్చితంగా తన కొడుకేనని అనుకున్నాడు.

ఈ లోపు కుక్కలు అరుచుకుంటూ మీదకి వురికొస్తున్నాయి. ఐనా భయపడ్లేదు. ఏమైనా గానీ అనుకొని... ‘‘రాహుల్‌...’’ అనుకుంటూ పరుగు మొదలెట్టాడు. కుక్కల్ని ఎలా దాటాడో అర్థం కాలేదు క్షణాల్లో పాకను చేరుకున్నాడు. అక్కడ రాహుల్‌ లేడు, వేరే వ్యక్తి కూర్చొని ఉన్నాడు. పాకలోని ఎర్రని బల్బు కాంతి తలుపు సందులోంచి కూర్చున్న వ్యక్తి ముఖంపై సన్నగా పడుతోంది. కళ్ళు ఎండిపోయిన కాలువల్లా వున్నాయి. మాసిన బట్టలు... పెరిగిన జుట్టుతో వున్నాడు. అతని ఆహార్యం చూడగానే తొలుత భయం వేసింది. కాని, అవసరం తనది కాబట్టి మాట్లాడక తప్పలేదు. ‘‘హలో... నాకో హెల్ప్‌ చేస్తారా?’’ వేడుకోలుగా అడిగాడు సంజయ్‌.

పాకముందు కూర్చున్న వ్యక్తిలో చలనం లేదు. తన ముందు ఎవరూ లేనట్టు, తనకేమీ వినబడనట్టు ఉన్నాడు. 
‘‘స్పృహలో వున్నాడా? లేక పిచ్చివాడా?’’ ఆశ్చర్యమూ, అనుమానమూ రెండు కలిగాయి సంజయ్‌లో. ‘‘హలో మిత్రమా మిమ్మల్నే... నాకో హెల్ప్‌ చేస్తారా?’’ మళ్ళీ అడిగాడు. అదే పరిస్థితి... సమాధానం లేదు... కనీసం చూడనూలేదు. ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. ఈలోపు మెసేజ్‌ సౌండ్‌ వినపడింది. రెప్పపాటులో మెసేజ్‌ చూశాడు. ‘‘సారీ డాడ్‌ నన్ను క్షమించు...’’. వెన్నులో వణుకు పుట్టింది. గబ గబా ముందుకు నడిచాడు. తెలియని పరిసరాలు. పైగా ఇవన్నీ కొత్త. తన పనే తనకు లోకంగా బతికినవాడు. తానెప్పుడూ ఇలా బయటకు రాలేదు. మరల పాక దగ్గరికి వచ్చాడు. 

రాహుల్‌ నంబర్‌కు డయల్‌ చేశాడు. ‘‘మీరు కాల్‌ చేస్తున్న నంబర్‌ కవరేజ్‌ ఏరియాలో లేదు’’ వాయిస్‌ రికార్డింగ్‌ వినపడగానే అతనిలో దుఃఖం ఆగలేదు. ఎలుగెత్తి ఏడ్వసాగాడు. అయినా కూర్చున్న వ్యక్తి కదల్లేదు.. మెదల్లేదు. సంజయ్‌ ఏడుపుకు పూరిపాక తడిక తెరుచుకుంది. అందులోంచి ఆవులిస్తూ ఒకావిడ బయటకు వచ్చింది. ఎదురుగా కూర్చున్న భర్తను చూసింది. మామూలుగానే ఉన్నాడు. ‘మరి ఏడ్చేదెవరు?’ అనుకుంటూ ఏడుపు వస్తున్న వైపు పరిశీలించింది. ఓ అపరిచిత వ్యక్తి. ‘గొప్పింటాయనలా ఉన్నాడు, పైగా ఏదో కష్టంలో ఉన్నాడు’ అనుకుంది. 

‘‘ఇగో నిన్నే పైకి లే...’’ భర్త భుజాలు పట్టుకుని గట్టిగా ఊపింది. మెల్లగా ఈ లోకంలోకొచ్చాడు. ‘‘మూడు నెలల నుంచి ఇదే వరస. నిద్ర పట్టనప్పుడల్లా ఇలా ఆలోచనలో మునిగి నిన్ను నీవే మరచిపోతే ఎలాగయ్యా... త్వరగా పైకి లేవయ్యా! ఎవరో పెద్దాయన కావొచ్చు ఒకటే ఏడుస్తున్నాడు’’ అంటూ తొందర పెట్టింది.తాను ఆనుకున్న పందిరి గుంజను ఆసరాగా పట్టుకుని లేచాడు. ‘‘ఎక్కడ?’’ అంటూ ముందుకు కదిలాడు. ‘‘అదిగో’’ అంటూ దీపం పెట్టి చూపించింది. ఇద్దరూ దగ్గరకు పోయారు. అతన్ని పరిశీలనగా చూసారు. పెద్ద ఆఫీసర్‌లా ఉన్నాడు. ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. కాసేపు మౌనంగా వున్నారు. పాకతని భార్య నోరు తెరిచింది. ‘‘ఎవరు సార్‌ మీరు... ఎందుకేడుస్తున్నారు?’’ అన్నది.

అంత రాత్రివేళ మనుషుల ఆసరా దొరకడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ‘‘నా కొడుకు కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. పైగా చనిపోతానని బెదిరించాడు. టౌనంతా వెదుకుతూ వచ్చాను. ఎక్కడా లేడు. మిగిలింది ఈ ఏరియా మాత్రమే. ఇక్కడ చూస్తే దారి లేదు. చీకటిలో ఎటు వెళ్ళాలో తెలియడం లేదు. వాడు ఇటు వైపే వచ్చుంటాడని నా అనుమానం... ప్లీజ్‌ నాకు హెల్ప్‌ చేయరా... నా కొడుకు ప్రాణాలు కాపాడరా... వాడు లేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను’’ ప్రాధేయపడ్డాడు.

సంజయ్‌ నోటి వెంట కొడుకు ప్రాణాలు అనే మాట వినగానే అప్పటి వరకు రాయిలా ఉన్న పూరిపాక వ్యక్తి చలించిపోయాడు. మరో ఆలోచన లేకుండా భార్యను లోపలికి వెళ్ళమని చెప్పి, ‘‘నాకు తెలియని చోటు లేదు సార్‌! చూసొద్దాం పదండి’’ అంటూ ఇంట్లోకెళ్ళి టార్చ్‌ తీసుకొచ్చాడు. తాను ముందు నడుస్తుంటే, సంజయ్‌ వెనుక నడవసాగాడు. ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లను దాటి కొంతదూరం వెళ్ళారు. అక్కడో కారుంది. కారును చూడగానే వెనుక నడుస్తున్న వాడల్లా జింకలా పరుగెత్తాడు సంజయ్‌. 

కారు ఖాళీగా వుంది. భయంతో అతని ముఖం నిండా చెమటలు పట్టాయి. ‘‘రాహుల్‌... నా బంగారం... నన్ను మన్నించరా... నాతో వచ్చెయ్‌ నిన్నేమీ అనను’’ అంటూ పిచ్చి పిచ్చిగా అరుస్తున్నాడు సంజయ్‌. ఆ అరుపులు, ఏడుపులు, పెడబొబ్బలు వింటుంటే పూరిపాక వ్యక్తి చలించిపోయాడు. నోరు తెరవలేకపోయాడు. టార్చ్‌ వెలుతురు చూపించి పదమన్నట్లు సైగ చేస్తూ ముందుకెళ్ళాడు. సంజయ్‌ అతన్ని అనుసరించాడు. సుమారు అర కిలోమీటరు దాటిన తరువాత ఎడమ వైపు తిరిగి గుట్ట దగ్గర ఆగాడు పాకతను. అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు. ‘‘ఏమైంది’’ కంగారుగా అడిగాడు సంజయ్‌.

‘‘ఏమీ లేదు’’ అంటూ గట్టిగా ఊపిరి పీల్చి, వదిలాడు. ఇద్దరూ ఇంకాస్త ముందుకుబోయారు. ఎదురుగా పురాతనమైన బావి. గబుక్కున బావి గోడ పట్టుకుని లోపలికి తొంగి చూశాడు సంజయ్‌. పాకతని చేతిలోని టార్చ్‌ తీసుకొని ఆత్రంగా వెదకసాగాడు. బావి వాడకంలో లేదనడానికి రుజువుగా పెరిగిన చెట్లు దర్శనమిచ్చాయి. బావి కింది భాగంలోనుండి ‘‘అ...మ్మా.. అ...మ్మా...’’ మూలుగులు. ‘‘అదిగో... రాహుల్‌... నా కొడుకు... ఈ టార్చ్‌ పట్టుకో...’’ అంటూ లోపలికి దిగే ప్రయత్నం చేయబోయాడు సంజయ్‌. ‘‘ఓ... ఆగండాగండి... భలేవారే... ఈ బావి గురించి తెలుసా మీకు... మనిషి లోపలికి పోతే ప్రాణాలు పైకి పోవడమే...’’ వెనక్కిలాగాడు పాకతను.

‘‘అంత లోతుందా...?!’’ ఆశ్చర్యపోయాడు సంజయ్‌. ‘‘లోతొక్కటే కాదు... అడుగున తాచు పాములున్నాయి. బావిలో పడితే జీవితం ఖతమే’’ అంటూ టార్చ్‌ తీసుకొని ప్రక్కనున్న చెట్లవైపు పోయాడు. చాలాసేపు వెతికాడు. ‘హమ్మయ్యా! ఇక్కడే వుంది’ అనుకుంటూ కుప్పలా పడున్న తాడు తీసుకొని బావి దగ్గరకు వచ్చాడు. పక్కనే వున్న చెట్టుకు తాడు కట్టి మిగిలినది బావిలోకి విసిరాడు. తాడు పడిన వెంటనే పాములు బుసలు కొడుతున్న శబ్దం రాసాగింది. ‘‘లోపల ఎలావుందో విన్నారుగా’’ అంటూ బావి చుట్టూ టార్చ్‌ తిప్పుతూ సంజయ్‌ కొడుకును చూశాడు.

బావి మధ్యలో చెట్ల కొమ్మలకు చిక్కుకున్నాడు. అదృష్టవశాత్తూ తాడు కట్టిన వైపే వున్నాడు. తనకి గతంలో ఆ బావిలో దిగిన అనుభవం ఉంది. కానీ పొరపాటున జరగరానిదే జరిగితే ఇద్దరి ప్రాణాలకూ ముప్పు. పైగా అర్ధరాత్రి దాటింది. అప్పటికే మూడు రోజులు నుండి సరిగా నిద్ర పోలేదు. నీరసంగా ఉన్నాడు. కానీ కన్నబిఢ్డ కోసం ఓ తండ్రి పడే వేదన తనకు బాగా తెలుసు. అందుకే వెనకా ముందూ ఆలోచించకుండా తువాలును నడుముకు కట్టుకుని, దాని మధ్యలో టార్చ్‌ పెట్టుకొని చిన్నగా వేలాడాడు. అతి కష్టం మీద అబ్బాయి వున్న చోటికి చేరుకున్నాడు. ఎన్నో ప్రయత్నాల పిదప ఇద్దరి నడుములకు తాడును బిగించాడు. ‘‘పైకి లాగండి... సార్‌’’ అంటూ గట్టిగా అరిచాడు. 

ఇద్ధరిని లాగడమంటే చాలా కష్టం. చావు బతుకుల పోరు కాబట్టి శక్తినంతా కూడగట్టుకుని మెల్ల మెల్లగా పైకి లాగాడు సంజయ్‌. క్షేమంగా కొడుకు బయటకు రావడంతో సంజయ్‌ ఆనందానికి అవధుల్లేవ్‌. రాహుల్‌ను వాటేసుకుని ముద్దులు పెట్టాడు. ‘‘మీరు దేవుడండి...! మీరు లేకపోతే నా కొడుకు నాకు దక్కేవాడు కాదు.’’ పాకతన్ని గుండెలకు హత్తుకొని కృతజ్ఞతలు చెప్పాడు సంజయ్‌. ఉన్నట్లుండి పాకతని కళ్ళెంట కన్నీటి ధారలు. సన్నగా మొదలైన ఏడుపు బిగ్గరగా ఏడస్తున్నాడు. ఆర్తధ్వని చేస్తున్నాడు. సంజయ్, రాహుల్‌లు స్థాణువులైనారు. అతనికేమైందో అంతుపట్టడం లేదు. ‘‘ఫ్లీజ్‌...! ఆగండీ...’’ ఓదార్చే ప్రయత్నం చేసాడు సంజయ్‌.  

పది నిమిషాలు గడిచాయి. ‘‘ఏమైంది?’’ అన్నాడు మళ్ళీ సంజయ్‌. ‘‘నా కొడుకయ్యా... కొడుకు....’’ గుండెలు బాదుకోసాగాడు పాకతను.‘‘అయ్యో!.... కంట్రోల్‌ చేసుకోండి... ఏం జరిగిందో చెప్పండి’’ సంజయ్‌లో ఆత్రుత మొదలైంది. మరికొన్ని నిమిషాలు గడిచాయి. మెల్లగా నోరు తెరిచాడు పాకతను. ‘‘మాది మామూలు పల్లెటూరు. నేను పెద్దగా చదువుకోలేదు. వ్యవసాయం చేస్తుండేవాడిని. నాకు పెళ్ళయిన తర్వాత పిల్లలు పుట్టలేదు. చాలా  ఆసుపత్రులకు వెళ్ళాము. డాక్టర్లు పరీక్ష చేసి, పిల్లలు పుట్టరని చెప్పారు. నేను, నా భార్య కుమిలిపోయాం. ఏ దేవుడు దయచూపాడో తెలియదు కాని, చాలా యేళ్ళకు ఒక్కగానొక్క కొడుకు పుట్టాడు. 

మా ఆనందం అంతా ఇంతా కాదు. వాడికి వినయ్‌ అని పేరు పెట్టుకున్నాం. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాము. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా మంచి చదువులు చెప్పించాలని ఈ సిటీకి వచ్చి... ఇగో ఈ మూలకు ఓ గుడిసె వేసుకొని బతుకుతున్నాం. మా ప్రయత్నానికి తగ్గట్లుగా నా కొడుకు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి చదివేవాడు. అన్నిట్లో ఫస్ట్‌ వచ్చేవాడు. పీహెచ్‌డీ చేయడం కోసం హైదరాబాద్‌ వెళ్ళాడు. మొదటి సంవత్సరం పూర్తి అయిన తర్వాత ఒకసారి ఇంటికి వస్తున్నానని ఫోన్‌ చేశాడు. మాకైతే పెద్ద పండగొచ్చినట్లయింది. నా భార్య వాడికి ఇష్టమైన కారçప్పూస, అరిసెలు, గారెలు నాలుగైదు రకాల పిండివంటలు చేసింది. నేను బట్టల షాపుకు వెళ్ళి మూడువేలు పెట్టి కొత్త బట్టలు తెచ్చాను. వాడు బస్టాండ్‌లో దిగేసరికి రాత్రి పదైంది. 

ఆరోజు వాడు బస్సు దిగి నా కళ్ళముందు కన్పడగానే నా సంతోషం ఆకాశమంత పెరిగింది. నా కంటే ఎత్తుగా ఎదిగిన కొడుకుని ప్రయాణీకులు అందరూ చూస్తుండగా అమాంతం పైకెత్తుకున్నాను. కొన్ని క్షణాల తర్వాత కిందకు దించి గుండెలకు హత్తుకున్నాను. మా కోటి ఆశల బంగారాన్ని బండిపై ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాను. మేము ఇంట్లోకి రాగానే ‘‘ఇలా చిక్కిపోయావేంట్రా వినయ్‌...?’’ అంటూ కన్నీళ్ళతో దగ్గరకు తీసుకుంది. అప్పటివరకు నేను కూడా గమనించలేదు. వాడి ముఖమంతా పాలిపోయి వుంది. కళ్ళల్లో జీవం తగ్గింది. లావుగా వుండేవాడు, బాగా చిక్కిపోయాడు. మాకేమీ అర్థం కాలేదు.ఆరోగ్యం ఏమైందోనని గుబులు మొదలైంది నాలో. వాడ్ని దగ్గరకు తీసుకొని ‘‘ఏందిరా... కొడకా? జ్వరమేమైనా వచ్చిందా?’’ అన్నాను. 

‘‘అలాంటిదేం లేదు నాన్న, నీళ్ళు మారాయి, ఫుడ్‌ మారింది... దానివల్లనే కాస్త తగ్గాను.... ఇంతమాత్రం దానికే కంగారుపడతారెందుకు’’ తేలికైన సమాధానంతో మా భయాన్ని పోగొట్టాడు. ‘‘ఏయ్‌... నేనుబోయి చికెన్‌ తెస్తానే... పిల్లాడికి వేడి నీళ్ళు పెట్టు’’ అంటూ బయటకు వెళ్ళాను. నేనొచ్చేసరికి స్నానం చేశాడు. నేను తెచ్చిన కొత్త బట్టలు వేసుకున్నాడు. నిమిషాల మీద చికెన్‌ కూర రెడీ అయ్యింది. అందరం కలిసి భోజనం చేశాం. పిండివంటలు కూడా కొసరి కొసరి తినిపించాం. 

వాడి చదువు గురించి, చేయబోయే ఉద్యోగాల గురించి చెప్తుంటే మా కష్టానికి తగిన ఫలితం దక్కినట్లేనని సంబరపడుతూ నిద్రలోకి జారుకున్నాము. మాకు చీకటితోనే లేచే అలవాటు. పూర్తిగా తెల్లారలేదు. లేచి చూస్తే మంచం మీద మావాడు లేడు. ఇంత పెందలకడనే ఎటు వెళ్ళాడబ్బా అనుకుంటూ... వాడిని వెతుక్కుంటూ ఈ వైపే వచ్చాను. ఈ బావి వెనకనే రాళ్ళ గుట్టొకటుంది కదా, దాని మీద కూర్చుని ఏదో తాగుతున్నాడు. నేను అడుగులో అడుగేసుకుంటూ దగ్గరగా వెళ్ళాను. నన్ను చూడగానే కంగారుగా పైకి లేచి నిలబడబోయాడు. కానీ నిలబడటం వాడి వల్ల కాలేదు. చూస్తుండగానే కుప్పలా కూలిపోయాడు.

నాకు పై ప్రాణాలు పైనే పోయినట్లైంది. వాడి చుట్టూ ఏదో ప్లాస్టిక్‌ పొట్లాలు... వాటిల్లో తెల్లటి పొడి వుంది. ప్రక్కనే సిగరెట్‌ బాక్స్, అగ్గిపెట్టె ఉన్నాయి. కదిలించి చూశాను. సోయిలో లేడు. మత్తుగా మూలుగుతున్నాడు. నా గుండె బరువెక్కింది... పైకి లేపి భుజాల మీద వేసుకున్నాను. పరుగు పరుగున ఇంటికి తీసుకొచ్చాను. మంచంలో పడుకోబెట్టాను. మే ఇద్దరం కన్నీరు మున్నీరుగా ఏడ్వసాగాము. కొంత సమయం తర్వాత చుట్టుపక్కల ఉండేవారు. కొంతమంది పోగయ్యారు. మాకు ధైర్యం చెప్పారు. ఆసుపత్రికి తీసుకెళ్ళమని ఆటోను తీసుకొచ్చి, మమ్మల్ని ఆటో ఎక్కించారు. 

డాక్టర్‌ పరిశీలించిన తర్వాత మావాడు డ్రగ్స్‌కు బాగా అలవాటుపడ్డాడని... ఏవేవో టెస్ట్‌లు చేసి, కొన్ని మందులు రాసిచ్చాడు. ఇకపై జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడు. గుండెనిండా బాధతో ఇంటికి చేరాము.ఒకసారి నిద్రపోతుండగా వాడి సెల్లులోంచి కాలేజీ సార్‌కు ఫోన్‌ చేశాను. ఆయన చెప్పినదాన్ని బట్టి చూస్తే వాడి స్నేహితులే వాడి జీవితాన్ని ఆగం చేశారని, డ్రగ్స్‌ మత్తులో పడి తన భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నాడని అర్థమైంది మాకు. ఇక చదువు సంగతేమో గాని, వాడు మామూలు మనిషి అయ్యేవరకు బయటకు వెళ్ళకుండా జాగ్రత్త పడాలని అనుకున్నాం.

మూడు రోజులు గడిచాయి. ఓ రోజు ఉన్నట్లుండి పిచ్చిపట్టినట్లుగా అరుస్తున్నాడు... కేకలు వేస్తున్నాడు... ఆపడానికి ఎంత ప్రయత్నం చేసినా, మమ్మల్ని నెట్టివేసి రాళ్ళ గుట్ట దగ్గరకు పరుగులు తీసాడు. నేను కూడా వేగంగా పరుగెత్తాను. అతి కష్టం మ్మీద వాడ్ని చేరుకున్నాను. డ్రగ్స్‌ పాకెట్స్‌ కోసం కాబోలు చుట్టూరా వెతుకుతున్నాడు, జుట్టు పీక్కుంటున్నాడు. వాణ్ణా స్థితిలో చూస్తుంటే నేనెందుకు బతికున్నానా? అనిపించింది.‘‘ఒరేయ్‌! నా బంగారమో... నాన్నా... నామాటినురా... ఇంటికెళదాం పదా!’’ ఎంతగానో ప్రాధేయపడ్డాను. నా మాట వినిపించుకోలేదు. నన్ను తప్పించుకొని ఈ బావి వైపు వేగంగా పరుగెత్తుకొచ్చాడు.

నేను అనుసరించే క్రమంలో పట్టుతప్పి రాళ్ళ గుట్ట మీద నుంచి కిందకు దొర్లుకుంటూ వచ్చాను. మోచేతులు, మోకాళ్ళ నిండా గాయాలైనాయి. అయినా వాటిని లెక్కచేయక నేను చేరుకునే లోపే బావిలోకి దూకేశాడు. పడీ పడటమే పాములు కాటేసినట్లున్నాయి. ‘‘అమ్మా... నాన్నా...!’’ అంటూ గావుకేకలు పెడ్తూ ప్రాణాలు విడిచాడు. నానా తిప్పలుపడి ఎలాగోలా పైకి తీసుకొచ్చాను. ఎర్రగా మారాయి పాకతని కళ్ళు. ‘‘ఇంత బాధలో కూడా అర్ధరాత్రి వేళ నా కోసం ఇంత చేశారంటే... మీరు మనిషి కాదు... మహానుభావులు. ఊపిరున్నంత కాలం కాలాన్ని ఈదడమొక్కటే మనిషి చేయగలిగిన పని. బాధపడకండి... పోదాం... పదండి..’’ పాక దగ్గరకు తీసుకొచ్చాడు సంజయ్‌.

సంజయ్‌ కొడుకు దొరికినందుకు సంతోషపడ్తూ... మరో వైపు తన కొడుకు గుర్తుకొచ్చి పాకతని భార్య కూడా కన్నీటిలో మునిగింది. ‘‘చేతికొచ్చిన కొడుకు చూస్తుండగానే వెళ్లిపోయాడు. ఇక మాకు దిక్కెవరు? పిల్లల జీవితాలతో ఆడుకునే ఈ మత్తు పదార్థాలను ఆపేదెవరయ్యా?’’ ‘‘వూర్కోండమ్మా! ఎంత ఏడ్చినా పోయిన ప్రాణం తిరిగిరాదు... మీరింత దుఃఖంలోనూ నాకు చేసిన సాయం ఎప్పటికి మర్చిపోలేను’’ అన్నాడు సంజయ్‌. రాహూల్‌ మనసులో పశ్చాత్తాపం మొదలైంది. 

వినయ్‌లాగా తన జీవితం కూడా ముగిసిపోతే తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభకు గురవుతారోననే అవగాహన తనలో కలిగింది. త్వరగా ఈ డ్రగ్స్‌ మానేయాలనే ఆలోచన చేయసాగాడు. సంజయ్‌ కాంటాక్ట్‌ లిస్టులో ఉన్న ఒక నంబర్‌కు డయల్‌ చేశాడు. ‘‘నమస్తే సార్‌!’’ అన్నాడు అవతలి వ్యక్తి. ‘‘సురేష్‌... ఇన్ని రోజులు డ్రగ్స్‌ మహమ్మారికి డబ్బున్న పిల్లలే బలవుతున్నారని అనుకున్నాను కాని, పేద యువకులు కూడా దారుణంగా బలవుతున్నారు. మన నిఘాను బలోపేతం చేయాలి, డ్రగ్స్‌ రాకెట్‌ను నిర్మూలించాలి’’ అన్నాడు డ్రగ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సంజయ్‌. 

‘‘ఒరేయ్‌! నా బంగారమో... 
నాన్నా... నామాటినురా... ఇంటికెళదాం పదా!’’ ఎంతగానో ప్రాధేయపడ్డాను. నా మాట వినిపించుకోలేదు. నన్ను తప్పించుకొని ఈ బావి వైపు వేగంగా పరుగెత్తుకొచ్చాడు.  
-రాచమళ్ళ ఉపేందర్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement