పగటి వేషాలేనా రాత్రి కలలు?! | Sakshi Funday: Rapid Eye Movement sleep is the sleep stage where most vivid dreaming occurs | Sakshi
Sakshi News home page

పగటి వేషాలేనా రాత్రి కలలు?!

Jan 4 2026 6:16 AM | Updated on Jan 4 2026 6:16 AM

Sakshi Funday: Rapid Eye Movement sleep is the sleep stage where most vivid dreaming occurs

‘‘కల అంటే నిద్రలో వచ్చేది కాదు, నిద్ర పోనివ్వకుండా చేసేది..’’ అని అబ్దుల్‌ కలామ్‌ అనేవారు. జీవితంలో ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని, ఆ లక్ష్య సాధన కోసం రేయింబవళ్లు నిద్రాహారాలు మాని మరీ కృషి చేయటం అనే అర్థంలో చెప్పిన మాట ఇది. ఇక్కడ ‘కల’ అన్నది ఒక లక్ష్యం. లక్ష్యంతో నిమిత్తం లేకుండా వచ్చే కలలు వేరు. అవి దాదాపుగా అందరికీ ప్రతిరోజూ నిద్రలో వస్తూనే ఉంటాయి. అవి మనిషి మానసిక స్థితికి సంకేతాలు అని శాస్త్రవేత్తలు అనటమే కానీ ఇంతవరకు వారికీ ఆ విషయమై ఒక స్పష్టత లేదు. అయితే ప్రతి కలకూ ఒక మూలం ఉంటుందని; అర్థం, అంతరార్థం కూడా ఉంటాయని శాస్త్రవేత్తలలోనే కొందరు విశ్వసిస్తున్నారు! 
ఆ వివరాల్లోకి వెళ్దాం.

ఒక కల సాధారణంగా 5 నుండి 20 నిమిషాల వరకు మాత్రమే కొనసాగుతుంది. అయినప్పటికీ, మనకు పూర్తిస్థాయి సినిమా చూసినట్టుగా అనిపిస్తుంది. ఎలాంటి సినిమా? ఎలాంటిదైనా కావచ్చు. ఆర్జీవీ ‘రాత్‌’ లేదా ‘భూత్‌’లాంటి కల కావచ్చు. లేదా, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘ఏమాయ చేసావె’లాంటి కమ్మటి ప్రేమ కల కావచ్చు. లేదంటే, ‘ఆదిత్య 369’, ‘ప్లే బ్యాక్‌’లాంటి టైమ్‌ ట్రావెల్‌ కలైనా కావచ్చు.

అసలేంటీ కలలు?
హాయిగా మన నిద్ర మనం పోతున్నప్పుడు మధ్యలో ఈ కలలకేం పని? పని గట్టుకుని వాటికేం పని లేదు కాని, కలలు కూడా మన నిద్రలో ఒక భాగమే. మనం నిద్రలో ఉన్నప్పుడు మన మనస్సు సృష్టించే కథలు, చిత్రాలే ఈ కలలు. మనం నిద్ర పోతున్నా, మనసు మేల్కొనే ఉంటుంది. కలలు అనేవి ప్రధానంగా నిద్రలోని కొన్ని దశలలో ఏర్పడే భ్రాంతి దృశ్యాలు (హెల్యూసినేషన్లు). ఇవి ముఖ్యంగా ‘ఆర్‌.ఇ.ఎం. నిద్ర’ దశలో చాలా స్పష్టంగా కనిపిస్తాయి. చిత్రం ఏమిటంటే.. ఈ దశలోని కలలు మనకు అంత స్పష్టంగా కనిపిస్తాయా.. తెల్లారగానే,  ఎందుకో అవి అస్పష్టంగా కూడా గుర్తుకు రావు. ఏదో కల వచ్చిందన్నత వరకే మైండ్‌లో ఉంటుంది! ‘ఆర్‌.ఇ.ఎం. స్లీప్‌’ అంటే ర్యాపిడ్‌ ఐ మూమెంట్‌ స్లీప్‌. కంటి కదలికలు వేగవంతంగా ఉండే దశలోని నిద్రన్నమాట.  

కలల అవసరం ఉందా?
మనిషికి నిద్ర అవసరం ఏమిటో తెలిసిందే. జీవక్రియ సజావుగా సాగటానికి నిద్ర చాలా అవసరం. జీవక్రియనే ‘మెటబాలిజం’ అంటారు. రోజువారీ పనులు చేసుకోవటానికి అవసరమైన శక్తిని శరీరం ఉత్పత్తి చేసుకోవటంలో, జీవకణాలను ఎప్పటికప్పుడు మరమ్మతు చేయటంలో మెటబాలిజం పాత్ర ముఖ్యమైనది. ఇంకో రెండింటికి కూడా నిద్ర చాలా కీలకమైనది. ఒకటి రక్తపోటు, మరొకటి ఆరోగ్యానికి సంబంధించిన ఇతర అంశాల నియంత్రణకు! సరిపడా నిద్ర లేదా సౌఖ్యమైన నిద్రలేకుంటే ఈ మెటబాలిజం, రక్తపోటు, తక్కిన దేహధర్మాలు కుంటుపడి ఆరోగ్యం క్రమేణా దెబ్బతింటుంది. నిద్ర వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. మరి కలల అవసరం ఏమిటి? ఈ ప్రశ్నకు మాత్రం ఇంతవరకు సమాధానం లేదు. ఏళ్ల తరబడిగా... ‘కలల అవసరం’పై పరిశోధనలు జరుగుతూనే ఉన్నా, వాటి అవసరాన్ని మాత్రం శాస్త్రవేత్తలు కనిపెట్టలేకపోయారు.

కలల వెనుక కారణాలు
శాస్త్రవేత్తలు కలల అవసరం ఏంటో కనిపెట్టలేకపోయారు కాని, కలలు ఎందుకు వస్తాయనే విషయాన్ని మాత్రం కొంతవరకు రాబట్టగలిగారు. అందరికీ తెలిసిన ఒక సిద్ధాంతం ప్రకారం, కలలు మన జ్ఞాపకాల నుండి పుట్టుకొస్తాయి. మేల్కొని ఉన్నప్పుడు మనం ఆలోచిస్తుంటాం కదా, అలా.. నిద్రపోతున్నప్పటి మన ఆలోచనలే కలలు అనే భావన కూడా ఒకటి ఉంది! అయితే అది శాస్త్రీయంగా రూఢీ అవలేదు. ఇంకో సిద్ధాంతం ప్రకారం.. జీవితంలో మనకు ఎదురవబోయే సవాళ్లకు కలలు రిహార్సల్స్‌లా పనిచేస్తాయట! అలాగైతే మంచిదే. రేపు రాబోయే సమస్యకు ఇవాళ్టి కలలో పరిష్కారం దొరికినట్లే. కాని ఇది ఎంతవరకు నిజం?!

కలలు పోషించే పాత్రేమిటి?
నిపుణులైన కొంతమంది థెరపిస్టుల పరిశీలన ప్రకారం, మనం మేల్కొని ఉన్నప్పుడు (పగటి వేళల్లో) మనస్సు తప్పించుకునే, లేదా వదిలించుకునే ఇబ్బందికరమైన భావోద్వేగాలను తేలిక పరచటానికి కలలు మనకు సహాయపడతాయి. ఇది ఒక థెరపీలా ఉంటుంది. ఉచితమైన థెరపీ, కాస్త విడ్డూరమైన థెరపీ. కలల్లోని ఈ భావోద్వేగ స్థితిలో మన మెదడు, మనం మేల్కొని ఉన్నప్పుడు చేయలేని ఆలోచనలతో మనల్ని కనెక్ట్‌ చేస్తుంది. మరొక సిద్ధాంత ప్రకారం, మెదడులోని ‘అమిగ్డాలా’ అనే ఒక నిర్మాణం.. కలలు రావటానికి కారణం అవుతోంది. అమిగ్డాలా అనేది మెదడు మధ్యలో లోతుగా ఒక చిన్న భాగంగా బాదం పప్పు ఆకారంలో ఉంటుంది. అది మనలో అవసరమైన సమయాలలో ఆత్మరక్షణ జాగ్రత్తల్ని ప్రేరేపిస్తుంది. ఊహించని ప్రమాదం ఏదైనా మనకు ఎదురైనప్పుడు... ‘‘పోరాడు, లేదా పారిపో..’’ అనే సహజజ్ఞాన ప్రేరేపణను ఇస్తుంది. మనల్ని నిజ జీవితంలోని సవాళ్లకు సిద్ధం చేయటానికే ఈ అమిగ్డాలా కలల్ని సృష్టిస్తుందని ఒక వర్గం పరిశోధకులు భావిస్తున్నారు.

కలల ప్రేరణకు మూలం!
అనేకమంది శాస్త్రవేత్తలు, కవులు, కళాకారులు తమలోని సృజనాత్మకతకు కలలు ప్రేరణనిచ్చేవని వెల్లడించిన సందర్భాలూ ఉన్నాయి. ఐన్‌స్టీన్‌ సైతం తన ఆవిష్కరణలలో కొన్నింటికి కలల నుంచే ఆలోచనలు స్ఫురించాయని తెలిపారు. ఈ మాటను బలపరిచే సిద్ధాంతాలూ ఉన్నాయి. వాటిల్లోని ఒక సిద్ధాంత ప్రకారం, మేల్కొని ఉన్నప్పుడు నిజ జీవితంలోని సృజనాత్మక ప్రవాహాన్ని అడ్డుకునే తర్కపు వడపోత.. నిద్రలో ఉండదు. అందువల్ల నిద్ర సమయంలో ఆలోచనలు, భావనలు స్వేచ్ఛగా పురివిప్పుతాయి. విహరిస్తాయి. ఆ కారణంగానే అత్యద్భుతమైన సృజనలకు కలలు మూలాలు అవుతాయి.

జ్ఞాపకాల అలలు, అరలు
కలల అధ్యయనవేత్తలు చెబుతున్న దానిని బట్టి.. ఒక వరుస క్రమంలో లేని విషయాలను సక్రమంగా అమర్చు కోవడంలో కలలు మెదడుకు సహాయపడతాయి. ముఖ్యమైన జ్ఞాపకాలను భద్రపరుస్తాయి. అవసరం లేని వాటిని తొలగిస్తాయి. అలాగే క్లిష్టమైన ఆలోచనలకు, భావోద్వేగాలకు ఒక అమరికను కూర్చటంలో కలలు కీలక పాత్ర పోషిస్తాయి. కాగా, నిద్ర జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎవరైనా ఒక కొత్త విషయం నేర్చుకున్న తర్వాత నిద్రపోతే, తిరిగి లేచాక అది వారికి బాగా గుర్తుంటుంది. విశ్రాంతి లేకుండా ఊరికే గుర్తు పెట్టుకున్న దానికంటే కూడా ఆ జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉంటుంది. దీని వెనుక కూడా కలలు చేసే మ్యాజిక్‌ ఉండొచ్చని పరిశోధకుల అంచనా.

మరి పీడకలల మాటేమిటి?
ఎవరైనా మిమ్మల్ని వెంటాడుతున్నట్లు, లేదా ఎక్కడో తెలియని ప్రాంతంలో మీరు చిక్కుకుపోయినట్లు, లేదా దెయ్యాలు, భూతాలు మీ కోసం పొంచి ఉన్నట్లు మీకు కల వచ్చి, భయంతో చెమటలు పట్టి, నిద్రలోంచి మీరు దిగ్గున లేచి కూర్చున్నారా? అదే పీడకల! నైట్‌మేర్‌. పీడకలలన్నవి కలతపెట్టే భావోద్వేగాలను రేపుతాయి. వాటిని గుర్తు చేసు కోవటానికి కూడా భయపడతాం. విశేషం ఏమిటంటే, మంచి కలల కంటే కూడా పీడకలలే స్పష్టంగా గుర్తిండిపోతాయి. అది మానవ స్వభావం కాదు. అటువంటి కలల స్వభావం.

పీడకలలకు కారణాలు
పీడకలలకు ప్రధాన కారణాలు వాస్తవ జీవితంలోని ఒత్తిడి, ఆందోళన, పి.టి.ఎస్‌.డి. (తీవ్ర మానసిక గాయం తర్వాత ఉండే భయానక స్థితి),  భావోద్వేగ సమస్యలు, భయాలు, అనారోగ్యాలు! మీకు తెలుసా? జీవితకాలంలో ఒక్కసారైనా పీడకలలు రానివారు ఉండరు. అమెరికన్‌ స్లీప్‌ అసోసియేషన్‌ అంచనా ప్రకారం, ప్రపంచ జనాభాలో కేవలం సుమారు 5 శాతం మందికి ఒక నిద్ర సంబంధ రుగ్మతగా మాత్రమే పీడకలలు వస్తుంటాయి. మామూలు పీడకలలు మిగతా 95 శాతం మందికి వచ్చేవి.

కల తెలుస్తూనే ఉంటుంది!
కల అని తెలుస్తూనే, కనే కలలను లూసిడ్‌ డ్రీమ్స్‌ అంటారు. అంటే, మనం కలగంటున్నామని మనకు తెలుస్తూ ఉంటుంది! అలాంటప్పుడు ఆ కలపై నియంత్రణ కూడా ఉంటుంది. పీడకల అయితే ప్రయత్న పూర్వకంగా కల నుండి మేల్కోవటం సాధ్యం అవుతుంది. అయితే ఈ నియంత్రణ శక్తి వ్యక్తికీ, వ్యక్తికీ వేర్వేరుగా ఉంటుంది. ఇంకా విచిత్రం ఏమిటంటే.. కొంతమంది తమకు ఇష్టమైన కలలు కనేందుకు, ‘లూసిడ్‌ డ్రీమ్స్‌’ను అనుభవించేందుకు తమకు తాము శిక్షణ ఇచ్చుకుంటారు. అంటే.. ఎలాంటి కల రావాలనుకుంటే అలాంటి కల వచ్చేస్తుంది వారికి!!

కలల నిజాలు కొన్ని
· ప్రతి ఒక్కరూ ఒక్క రాత్రిలో సుమారు 3 నుండి 6 సార్లు కలలు కంటారు.
· ప్రతి కల సుమారు 5–20 నిమిషాల పాటు ఉంటుంది.
· ఉదయం కల్లా 95 శాతం మంది కలల్ని మరిచిపోతారు.
· చూపులేని వారు ఎక్కువగా శబ్దాలు, వాసనలు, స్పర్శల ద్వారా కలలు కంటారు.
· ఆహారం, నిద్ర నాణ్యత, నిద్రించే వ్యవధి, మానసిక ఆరోగ్యం, రోజువారీ కార్యకలాపాలు వంటి అంశాలు కలలపై ప్రభావం చూపుతాయి. 

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement