రక్త నమూనాలతో రూఢి! | Crime Story On Funday | Sakshi
Sakshi News home page

రక్త నమూనాలతో రూఢి!

Jan 4 2026 8:54 AM | Updated on Jan 4 2026 8:54 AM

Crime Story On Funday

ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌ పక్కన ఉన్న పార్కులో డిసెంబర్‌ 14న యూదులపై కాల్పుల సంఘటన తెలిసిందే! ఐసిస్‌ ఉగ్రవాదులైన తండ్రీ కొడుకులు జరిపిన ఈ కాల్పుల్లో పద్నాలుగు మంది మరణించారు. కాల్పులు జరిపిన వారిలో తండ్రి సాజిద్‌ అక్రమ్‌ స్వస్థలం హైదరాబాద్‌ పాతబస్తీలోని దూద్‌బౌలి. ఇలాగే అప్పుడప్పుడు జరిగే ఉగ్రవాద చర్యల్లో విదేశాల్లో ఉన్న భారత ఉగ్రవాదుల పాత్రలు వెలుగులోకి వస్తుంటాయి. అలాంటివారిలో జబీయుద్దీన్‌ అన్సారీ అలియాస్‌ అబు జిందల్‌ ఒకడు. ముంబైలో జరిగిన 26/11 దాడుల్లో కీలక పాత్రధారి. ఇతడి గుర్తింపును రక్తనమూనాల ద్వారా నిఘా వర్గాలు రూఢి చేసుకుని, సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై తీసుకువచ్చాయి.

ముంబైలో 26/11 దాడులు జరిగిన రెండున్నరేళ్ల వరకు అబు జిందల్‌ పాత్రను నిఘావర్గాలు గుర్తించలేదు. పాకిస్తాన్‌లోని కరాచీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్స్‌ నుంచి ఇక్కడి ఉగ్రవాదులకు ఆదేశాలు ఇచ్చిన వారిలో ఇతడూ ఉన్నాడని కనిపెట్టలేకపోయారు. అయితే, తమపై కూడా ఇదే తరహా దాడులు జరగవచ్చనే భయంతో అమెరికా అనేక కోణాల్లో నిఘా ముమ్మరం చేసింది. ఫలితంగా అబు జిందల్‌ పేరు వెలుగులోకి వచ్చింది. సౌదీ అరేబియాలో లొకేట్‌ అయిన ఈ గజ ఉగ్రవాదిని భారత్‌కు రప్పించడంలో వాయిస్‌ శాంపిల్స్, బయోలాజికల్‌ ఎవిడెన్స్‌ కీలక పాత్ర పోషించాయి. 

మహారాష్ట్రంలోని భీండ్‌ జిల్లాకు చెందిన సయ్యద్‌ జబియుద్దీన్‌ అన్సారీ అలియాస్‌ అబు జిందల్‌ నిషిద్ధ స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమీ) ద్వారా ఉగ్రవాదం వైపు మళ్లాడు. నగరంలోని టోలిచౌకీలో కొన్నాళ్లు నివసించిన ఇతగాడు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో కంప్యూటర్‌ కోర్సు చేశాడు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2006 నాటి ఔరంగాబాద్‌ ఆర్మ్స్‌ హౌల్‌ కేసులో పోలీసులకు చిక్కకుండా తప్పించుకున్న జిందల్‌ పాకిస్తాన్‌కు మకాం మార్చాడు. ఉగ్రవాద నేత ఇలియాజ్‌ కశ్మీరీ ద్వారా లష్కరే తోయిబాతో (ఎల్‌ఈటీ) సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుని, తన పేరును రియాసత్‌ అలీగా మార్చుకున్నాడు. ఎల్‌ఈటీ కమాండర్‌ హోదాలో రావల్పిండి యూనివర్సిటీ క్యాంపస్‌లోని సంస్థ కార్యాలయంలో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. 

అబు జిందల్‌ ఫేస్‌బుక్‌ ద్వారా యువతను ఆకర్షించి ఉగ్రవాదం వైపు మళ్లించేవాడు. ఈ నేపథ్యంలోనే 26/11 దాడుల కోసం ఏర్పాటైన ఉగ్రవాద బృందానికి అవసరమైన స్థాయిలో మరాఠీ నేర్పించడంతో పాటు ముంబై భౌగోళిక పరిస్థితులపై అవగాహనæ కలిగించే బాధ్యతలు ఎల్‌ఈటీ ఇతడికి అప్పగించింది. ముంబై మారణహోమంలో పాల్గొన్న ఉగ్రవాదులకు కరాచీలో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూమ్‌ నుంచి అనేక సూచనలు ఇచ్చాడు. జిందాల్‌ ఈ ఆపరేషన్‌లో అబు ఖాషిఫ్‌ పేరుతో పని చేశాడు. కమ్యూనికేషన్‌ కోసం వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రోటోకాల్‌ (వీఓఐపీ)ని మార్గంగా ఎంచుకున్నారు. దీంతో భారత నిఘా వర్గాలకు జిందాల్‌కు సంబంధించిన వాయిస్‌ శాంపిల్స్‌ సేకరించగలిగారు. అప్పట్లో 26/11 ఉగ్రవాదుల వద్ద నాగోలు చిరునామాతో పాటు దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కాలేజీ పేరుతో ఉన్న గుర్తింపు కార్డులు లభించాయి. వీటిని తయారు చేసి ఇచ్చింది కూడా అబు జిందలే! 

ఇలాంటి దాడులు తమపైనా జరగవచ్చని భావించిన అమెరికా గూఢచర్య సంస్థ సీఐఏ భారత్‌ నుంచి ఉగ్రవాదుల వాయిస్‌ శాంపిల్స్‌ సేకరించి, వేట ప్రారంభించింది. మరోపక్క ఎల్‌ఈటీలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు అనుమానిస్తున్న జిందల్‌ కదలికలను 2009లో గుర్తించింది. అనేక దేశాల్లో అమెరికా ఏర్పాటు చేసిన పర్సనల్‌ ఐడెంటిఫికేషన్‌ సెక్యూర్‌ కంపర్షన్‌ అండ్‌ ఎవల్యూషన్‌ సిస్టం (పీఐఎస్‌సీఈఎస్‌) ద్వారా జిందాల్‌ కదలికలు పాకిస్తాన్‌తో పాటు సౌదీ అరేబియాలో ఉన్నట్లు తెలుసుకుంది. 2009లోనే రియాసత్‌ అలీ పేరుతో పాకిస్తాన్‌ నుంచి పొందిన పాస్‌పోర్ట్‌తో జిందల్‌ సంచరిస్తున్నాడని గుర్తించి రీసెర్చ్‌ అండ్‌ ఎనాలసిస్‌ వింగ్‌ (రా)కు పూర్తి ఆధారాలతో సమాచారమిచ్చింది. 

అబు జిందల్‌ 2011 ఏప్రిల్‌లో పాక్‌ నుంచి దుబాయ్‌ చేరుకున్నట్లు గుర్తించిన సీఐఏ ఈ విషయంపై ‘రా’కు సమాచారమిచ్చి అతడిని ట్రాకింగ్‌లో ఉంచింది. సౌదీ–భారత్‌ల మధ్య నేరస్తుల మార్పిడి ఒప్పందం ఉన్నా, అందుకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ తప్పనిసరి. తమకు వాంటెడ్‌గా ఉన్న జిందలే ఈ రియాసత్‌ అలీ అని చెప్పడానికి భారత నిఘా వర్గాల వద్ద వాయిస్‌ శాంపిల్స్‌ తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. దీని కోసం జిందల్‌ సంబంధీకుల రక్తనమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని నిర్ణయించుకుంది. 

వీటిని సౌదీలో ఉన్న జిందల్‌ నమూనాలతో సరిపోల్చి బయోలాజికల్‌ ఎవిడెన్స్‌ రూపొందించేందుకు సిద్ధపడి సీఐఏ సహాయం కోరింది. జిందల్‌ సంబంధీకుల రక్తనమూనాల సేకరణకు ఎన్‌ఐఏను రంగంలోకి దింపిన ‘రా’ భీండ్‌ జిల్లాలో ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టింది. అనేక ప్రాంతాలతో పాటు జిందల్‌ స్వస్థలమైన జియోరాయ్‌లోనూ వాక్సినేషన్‌ పేరుతో అనేక మంది రక్తనమూనాలు సేకరించింది. ఈ రకంగా జిందల్‌ తల్లి నుంచి రక్తనమూనాలు సేకరించిన అధికారులు డీఎన్‌ఏ పరీక్షలు చేయించారు. దీనికి సంబంధించిన అధికారిక నివేదికలను సీఐఏకు పంపారు. జిందల్‌ రక్తనమూనాల సేకరణ కోసం సీఐఏ సౌదీ అరేబియా పోలీసుల సహాయం తీసుకుంది.

 రియాసత్‌ అలీ పేరుతో బోగస్‌ పాస్‌పోర్ట్‌తో జిందాల్‌ ప్రయాణిస్తున్నాడని అక్కడి వారికి సమాచారం ఇవ్వడం ద్వారా అదుపులోకి తీసుకునేలా చేసింది. ఆ దేశ చట్టాల ప్రకారం నిందితులు, అనుమానితులకు సంబంధించిన పూర్తి నమూనాలు తీసుకునే అవకాశం ఉండటంతో సౌదీ పోలీసులు జిందల్‌ రక్త నమూనాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షలు చేయడంతో పాటు నివేదికలను సీఐఏకు అందించారు. వీటిని భారత్‌ పంపిన జిందల్‌ కుటుంబీకుల నమూనాలతో పోల్చిన సీఐఏ జబియుద్దీన్‌ అన్సారీ, అబు జిందల్, అబు ఖాషిఫ్, రియాసత్‌ అలీ ఒక్కరేనని నిర్ధారిస్తూ ‘రా’కు సమాచారం ఇచ్చింది. ఈ నివేదికల ఆధారంగా సౌదీ పోలీసులను సంప్రదించిన ‘రా’ అధికారులు 2012 జూన్‌లో జిందల్‌ను భారత్‌ తీసువచ్చి అరెస్టు చేయగలిగారు. 
∙ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement