మా ఎదురింటి ఆయన మరణించాక ఆయన వారసులు ఆ ఇంటిని అమ్మేశారు. దాన్ని పడగొట్టి అపార్ట్‌మెంట్స్ కట్టడం ఆరంభించడానికి మునుపే ఆగాచారి ఆ స్థలానికి వాచ్‌మేన్ గా వచ్చాడు. యాసని బట్టి అతనిది కరీంనగర్ జిల్లా అని, అతని వెంట తిరిగే డాషన్ జాతి కుక్క ప్రిన్స్ అతని పెంపుడు కుక్కని త్వరలో గ్రహించాను. దాని విలువ వేలల్లో ఉండొచ్చు. కాబట్టి దాన్ని అతను కొని ఉండడు. దొంగిలించాడా? లేదా ఎవరిదైనా తప్పిపోయి వచ్చిందా? ఆ కుక్కంటే ఆగాచారికి బాగా ప్రేమని అతని చర్యల ద్వారా తెలిసిపోతూంటుంది.
ఆగాచారి భార్య వయసు ముప్ఫై, ముప్ఫై ఐదు మధ్య ఉంటుంది. చూస్తే సినిమాల్లో గ్రూప్ డాన్స్‌ల్లో పాల్గొనే డాన్సర్లా అనిపించింది. కొద్దిగా పక్కకి వెళ్తే, ఆకర్షణీయమైన మొహం, చక్కటి శరీర సౌష్టవం గల డేన్సర్స్ ఎందుకు హీరోయిన్స్ కాలేదా అని నాకు అనిపిస్తూంటుంది.
ఓ సోమవారం మధ్యాహ్నం మా ఆవిడ నన్ను అర్జెంట్‌గా కిటికీ దగ్గరికి రమ్మని అరిచింది. తక్షణం నేను వెళ్తే, అపార్ట్‌మెంట్స్ కట్టే ఎదురు స్థలంలోని ఆగాచారి షెడ్‌లోంచి ఏభై పైబడ్డ ఓ వ్యక్తి బయటికి వస్తూ కనిపించాడు. మడత నలగని తెల్లటి ఖాదీ చొక్కా, ఖాదీ పేంట్‌లోని ఆయన మెడలో బంగారు గొలుసు, చేతికి బంగారు బ్రేస్‌లెట్ కనిపించాయి. ఆయన బి.ఎం.డబ్ల్యూ. కారు ఎక్కి వెళ్ళాక మా ఆవిడ నిష్టూరంగా చెప్పింది.‘‘చూశారా?’’‘‘ఏమిటి?’’ అడిగాను.
‘‘మీకు అర్థం కాలేదా?’’ విసుక్కుంది.దాదాపు రెండున్నర గంటల తర్వాత మా ఆవిడ మళ్ళీ పిలిచింది. కిటికీలోంచి చూస్తే ట్రాలీలో ఇనుప చువ్వలతో వచ్చి వాటిని దింపించే ఆగాచారి కనిపించాడు.‘‘వీడు ఇంట్లో లేని సమయంలో ఒంటరిగా ఉన్న వీడి భార్య దగ్గరకి ఆ బిల్డర్ ఎందుకు వచ్చాడో ఇప్పుడైనా మీ మట్టిబుర్రకి అర్థమైందా?’’ ఎకసెక్కెంగా అడిగింది.‘‘ఇలాంటివి ఆడవాళ్ళే కనిపెట్టగలరు.’’ నవ్వుతూ చెప్పాను.తర్వాత మా ఆవిడ ఆఫీస్ నించి వచ్చిన నాతో అప్పుడప్పుడు ‘ఆ బిల్డర్ మళ్ళీ ఇవాళ వచ్చి వెళ్ళాడు’ అని చెప్పేది.
తరచూ ఆగాచారి మాపై అపార్ట్‌మెంట్‌కి వచ్చి, వారిని పచ్చడి ఏదైనా ఇవ్వమని అడిగి తీసుకెళ్తూండటం అలవాటు. ఓరోజు ఆ అపార్ట్‌మెంట్ ఆయన నాతో చెప్పాడు.‘‘ఆగాచారి ప్రిన్స్‌ని వంద రూపాయలకి అమ్ముతాడట. కొంటారా? అని అడిగాడు. నాకు ఆసక్తి లేదు. అది అపార్ట్‌మెంట్లో పెంచుకోతగ్గది. కాబట్టి మీకు ఆసక్తి ఉంటే కొనొచ్చు.’’‘‘అబ్బే. లేదండి.’’ చెప్పాను.ఆగాచారి మా అపార్ట్‌మెంట్స్‌లోని అందర్నీ ప్రిన్స్‌ని కొనమని అడిగాడు. కాని ఎవరూ కొనలేదు. ఆఖరుగా నన్ను అడిగాడు.
‘‘అసలు నీకు అది ఎక్కడిది?’’ అడిగాను.‘‘మా ఊళ్ళో ఒకాయన పొలం పని చేసేవాడిని. ఆయన అమెరికా వెళ్తూ దాన్ని నాకు బహుమతిగా ఇచ్చాడు. ఊరికే ఇస్తే చాలామంది తీసుకుంటారు సార్. కాని డబ్బు ఇచ్చి కొనే వాళ్ళే దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని.’’ ఆగాచారి చెప్పాడు. ‘‘ఎందుకు అమ్మదల్చుకున్నావు?’’ అడిగాను. అతను జవాబు చెప్పడానికి తబ్బిబ్బుపడ్డాడు.
‘‘మా ఆవిడకి ప్రిన్స్ అంటే ఇష్టం లేదు.’’ చివరికి చెప్పాడు.భార్యని కంట్రోల్ చేయలేని అతని అసమర్థతకి నాకు జాలి వేసింది.‘‘అమ్మేటట్లయితే అంత తక్కువకి అమ్మక. దాన్ని ఐదారు వేలకి అమ్మొచ్చు.’’ సలహా ఇచ్చాను.ఆరోజు నేను ఆఫీస్ నుంచి రాగానే మా ఆవిడ చెప్పింది.‘‘మొత్తానికి ఆగాచారి కుక్కని అమ్మాడండి.’’‘‘ఎంతకి?’’ వెంటనే అడిగాను.
‘‘తెలీదు. ఎదురు అపార్ట్‌మెంట్స్‌ని కొన్నవాళ్ళలో ఒకతను ఉడ్‌వర్క్ చేయించడానికి వచ్చిపోతున్నాడు. అతను కొన్నట్లున్నాడు. ఇందాక కారులో ప్రిన్స్‌ని ఎక్కించి తీసుకెళ్ళడం చూసాను. ఆగాచారి ఎవరో పోయినట్లుగా ఏడ్చాడంటే నమ్మండి.’’ చెప్పింది. ‘‘వాళ్ళ ఆవిడ లోని రెండో చెడ్డ గుణం, ఆ కుక్కని ప్రేమించకపోవడం.’’ చెప్పాను. గంటన్నర తర్వాత మా ఆవిడ టి.వి. చూసే నన్ను పిలిచి చెప్పింది.
‘‘చూడండి. మన ఇంటి ముందు పోలీస్ కార్లు ఆగాయి. ఏమైందో కనుక్కురండి.’’నేను వెంటనే చెప్పులు తొడుక్కుని బయటికి వచ్చాను. ఎస్.ఐ. ఆగాచారి షెడ్ ముందు కుర్చీలో కూర్చుని అతని భార్యని ప్రశ్నిస్తూండటం చూసి అక్కడికి వెళ్ళాను.‘‘వాడు కొనుక్కొచ్చింది పురుగుల మందని తెలీదు సారూ. రంగు డబ్బా అనుకున్నా.’’‘‘అది ఎందుకు తాగాడో తెలీదంటావు?’’‘‘తెలీదు సారూ.’’ఆగాచారి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి అదిరిపడ్డాను. అపార్ట్‌మెంట్ టెర్రేస్‌లో అతని శవం ఉందని తెలిసింది. ఆగాచారి భార్యలో భర్త పోయినందుకు సహజంగా కనపడాల్సిన దుఃఖం కనపడలేదు.
ఆగాచారి ప్రిన్స్‌ని మనస్ఫూర్తిగా ప్రేమించాడని, తన భార్యకి గల అక్రమసంబంధం గురించి తెలిశాక చావాలనుకుని ముందుగా దాన్ని అమ్మాడని, ప్రిన్స్‌ని ఎవరూ కొనకుండా ఉంటే అతని ప్రాణం ఇంకొంత కాలం నిలిచేదని నాకు అనిపించింది.


