ఒక్కో కేసుదీ ఒక్కో తీరు. కొన్నిసార్లు చిల్లర దొంగతనం కేసు కూడా నెలల తరబడి పరిష్కారం కాదు. ఒక్కోసారి కోట్లు కొల్లగొట్టిన చోరులు కూడా సొత్తుతో సహా గంటల్లో దొరికేస్తారు. పంజగుట్టలోని అలుకాస్ జ్యూలర్స్‌లో 2006లో జరిగిన భారీ చోరీ కేసు అటువంటిదే! కేవలం 48 గంటల్లో కొలిక్కి వచ్చిన దీని దర్యాప్తులో తొలి అడుగు ఘటనాస్థలిలో దొరికిన గుజరాతీ పత్రికతో పడింది. అలా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారులు ఘరానా దొంగ వినోద్ రాంబోలీ సింగ్‌తో పాటు అతడి అనుచుడు శ్రీకాంత్ సింగ్‌ను పట్టుకుని, చోరీ సొత్తు స్వాధీనం చేసుకోగలిగారు. ఈ నిందితులను న్యాయస్థానంలో 2011లో దోషులుగా నిర్ధారించిన శిక్ష కూడా విధించింది.
అది 2006 మే 16.. పంజగుట్ట పోలీసుస్టేషన్‌కు కూతవేటు దూరంలో అలుకాస్ జ్యూలరీ షోరూమ్ అప్పటికి అది ప్రారంభమై రెండు నెలలైనా కాలేదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతం ఉదయం 11 గంటల సమయంలో హడావుడిగా మారిపోయింది. సైరన్లు కొట్టుకుంటూ వరుసగా వచ్చిన పోలీసు వాహనాలు ఆ షోరూమ్ వద్ద హడావుడి చేస్తుండటంతో చుట్టుపక్కల షాపుల్లో కొనుగోళ్ల కోసం వచ్చిన కస్టమర్లకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు. అంతలోనే ఓ వార్త ఆ ప్రాంతంతో పాటు నగరమంతటా దావానలంలా వ్యాపించింది. అలుకాస్ షోరూమ్‌లో ముందు రోజు రాత్రి దొంగలు పడి, రూ.10 కోట్ల విలువ చేసే బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారనేది దాని సారాంశం.
నాలుగు అంతస్తుల్లో నిర్మించి ఉన్న కార్ప్‌హౌస్‌లోని గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తుల్లో అలుకాస్ షోరూమ్ ఉంది. భవనం వెనుక కుడివైపుగా నిర్మాణంలో ఉన్న మరో నాలుగు అంతస్తుల భవనంపైకి ఎక్కిన చోరులు పంజా విసిరేందుకు అనువైన సమయం కోసం అక్కడ మాటు వేశారు. అంతా సద్దుమణిగాక ఆ భవనం టెర్రాస్ పైనుంచి మూడడుగుల దూరంలో ఉన్న అలుకాస్ షోరూమ్ భవనంపైకి చేరుకుని, మెట్ల మార్గంలో రెండో అంతస్తుకు వచ్చారు. షట్టర్ పగులకొట్టి; రెండు, మొదటి అంతస్తుల్లోని డిస్‌ప్లేల్లో ఉన్న ఆభరణాలను తమతో తెచ్చుకున్న బ్యాగుల్లో సర్దుకున్నారు. లాకర్ల జోలికి వెళ్లని వీళ్లు దుకాణంలోని లైట్లన్నీ ఆర్పేసి, టార్చ్‌లైట్ల వెలుతురులో తమ పని పూర్తి చేసుకున్నారు. మళ్లీ రెండో అంతస్తులోకి వెళ్లిన చోరులు అక్కడ నుంచి ఓ తాడు సాయంతో పక్కనే ఉన్న మరో బిల్డింగ్‌పైకి దూకి పరారయ్యారు.
మర్నాడు ఉదయం ఈ దొంగతనం విషయం యాజమాన్యం పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. తొలుత రూ. ఆరు కోట్ల విలువైన సొత్తు చోరుల పాలైనట్లు అధికారులకు తెలిపింది. పోలీసులు సైతం చోరీ జరిగిన తీరును గుర్తించారు. మరిన్ని కీలక ఆధారాల కోసం షోరూమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేయాలని భావించారు. ఆరాతీస్తే, షోరూమ్‌లో ఉన్న 12 కెమెరాలకు ఆ రోజు 10 పని చేయలేదని తేలింది. మిగిలిన రెండు మాత్రం ఇద్దరు వ్యక్తులు తచ్చాడుతున్నట్లు చూపించాయి. చోరీ జరిగిన తీరు, షోరూమ్‌లో సీసీ కెమెరాలు పని చేయకపోవడం పరిశీలించిన పోలీసుల దృష్టి తొలుత సంస్థ ఉద్యోగులపైనే పడింది. వారిలో ఎవరైనా లేదా వారి సహకారంతో ఎవరైనా ఈ నేరం చేశారా అనే దిశగా దర్యాప్తు చేసినా ఫలితం దక్కలేదు.
చోరులు అలూకాస్‌లోకి ప్రవేశించడానికి ఉపయోగించిన నిర్మాణంలో ఉన్న భవనంపై పోలీసుల దృష్టి పడింది. అక్కడే అసంకల్పితంగా వెతకబోయిన తీగ పేపర్ రూపంలో పోలీసుల కాలికి తగిలింది. ఆ భవనం నాలుగో అంతస్తులో ఖాళీ బిర్యానీ పొట్లాలు, సిగరెట్ పీకలు ఉండటాన్ని బట్టి చోరులు అక్కడే వేచి ఉన్నారని దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అదే ప్రాంతంలో ‘గుజరాత్ సమాచార్’ దినపత్రిక పడి ఉండటాన్నీ గమనించారు. దానిని చోరులే తెచ్చి ఉంటారని భావించిన పోలీసులు ఆ కోణంలో ఆరా తీశారు. ఆ పత్రిక గుజరాత్‌తో పాటు ముంబైలోనూ దొరుకుతుందని తేలడంతో ఆ రెండు రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు. నగరం నుంచి బయలుదేరిన ప్రత్యేక బృందం ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారులను కలిసింది. దుకాణంలోని సీసీ కెమెరాల్లో లభించిన ఫీడ్‌ను వారికి చూపించడంతో పాటు నేరం జరిగిన విధానాన్నీ వివరించింది.
అవన్నీ చూసిన ముంబై క్రైమ్ బ్రాంచ్ అధికారుల మదిలో మెదిలిన పేరు వినోద్ రాంబోలీ సింగ్. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇతను మహారాష్ట్రలోని సౌత్ ముంబైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న దహిసార్‌లో స్థిరపడ్డాడు. ఆ రెండు రాష్ట్రాల్లోనూ అప్పటికే అతడిపై ఇరవైకి పైగా చోరీ, దోపిడీ కేసులు నమోదై ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న వేగులను ఆరా తీయగా, వారం రోజులుగా అతడు కనిపించలేదని, రెండ్రోజుల క్రితమే తిరిగి వచ్చాడని తెలిసింది. దీంతో అలుకాస్ భారీ చోరీ అతడి పనిగా నిర్ధారించిన పోలీసులు 2006 మే 18 అర్ధరాత్రి బరివోలిలోని ఓ బార్‌పై దాడి చేశారు. అక్కడ రాంబోలీ సింగ్‌తో పాటు చోరీ సొత్తు కొనుగోలుకు వచ్చిన సూరత్ వజ్రాల వ్యాపారి అజయ్ షా పట్టుబడ్డారు. వీరి నుంచి రూ. 6 కోట్ల విలువైన బంగారం, వజ్రాభరణాలను రికవరీ చేశారు. రాంబోలీ సింగ్‌కు సహకరించిన శ్రీకాంత్ సింగ్‌ను కొన్ని రోజుల తరవాత అరెస్టు చేశారు.
ఈ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు 2011లో శిక్ష విధించింది. 1982 నుంచి నేరాలు చేస్తున్న వినోద్ రాంబోలీ సింగ్ కదలికలు అలుకాస్ నేరం తర్వాత హైదరాబాద్‌లో కనిపించలేదు. 2017లో థానేలోని అంబర్‌నాథ్‌లో ఉన్న జ్యూలరీ షాపు నుంచి రూ.1.7 కోట్ల నగలు, 2022లో దాదర్‌లో ఉన్న పీడీ పెడ్నేకర్ జ్యూలరీ షాపు నుంచి రూ.1.24 కోట్ల విలువైన నగలు చోరీ చేసి పోలీసులకు చిక్కాడు. అంబర్‌నాథ్ చోరీ తన ‘వృత్తి’లో భాగంగానే చేసినా, పీడీ పెడ్నేకర్‌లో మాత్రం ప్రతీకారంతో చేశాడు. 2022 జూలైలో ఆ దుకాణానికి వెళ్లిన రాంబోలీ సింగ్ కొంత బంగారం ఖరీదు చేశాడు. కేవలం రూ.2 వేల డిస్కౌంట్ విషయంలో దాని యజమాని సోనాలీ ముడ్కేఖర్‌తో వాగ్వాదం జరిగింది. తనకు రాయితీ ఇవ్వని ఆ దుకాణంపై కక్షకట్టిన రాంబోలీ సింగ్ మరో అనుచరుడితో కలిసి ఆ ఏడాది ఆగస్టు 24న ఈ చోరీ చేశాడు.


