
వరియార్ నా కొలీగ్. మలయాళీ అయిన అతనికి అలెప్పీ నుంచి హైద్రాబాద్‌కి బదిలీ అయి రెండున్నర ఏళ్లైంది. మా అందరికన్నా సీనియర్. మెయింటెనెన్స్ పనిలో అనుభవజ్ఞుడు. తన భార్య ఆరోగ్యంగా లేదని ఓసారి చెప్పాడు. మూడు నెలల క్రితం ఆమె మరణించింది. మృతదేహాన్ని ఆవిడ సొంత ఊరు ఎర్నాకులానికి తీసుకెళ్ళాడు. తిరిగి వచ్చాక వరియార్ మా ఆఫీస్‌లో పనిచేసే ఓ బ్రహ్మచారిని తన అపార్ట్‌మెంట్‌కి వచ్చి ఉండమని కోరాడని నాకు తెలిసింది. నేనున్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్స్ చాలా ఖరీదుగా ఉంది. హాస్టల్స్‌లో సౌకర్యాలు బాగుండవు. అందుకని వరియార్ పనిచేసే మెషి¯Œ షాప్‌కి వెళ్ళి అడిగాను.‘‘మీ అపార్ట్‌మెంట్‌లో నేను ఉండచ్చా?’’వరియార్ మొహం వికసించింది.‘‘తప్పకుండా. ఇద్దరిని అడిగితే రామన్నారు.’’ చెప్పాడు.‘‘నెలకి ఎంత ఇవ్వాలి?’’ అడిగాను.‘‘మీ ఇష్టం. ఇవ్వకపోయినా ఫర్వాలేదు.’’‘‘ఉచితంగా తీసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను భోజనంతో కలిపి ఇప్పుడు నేను నెలకి పదిహేనువేల ఐదొందలు చెల్లిస్తున్నాను.
మీకు ఏడువేల ఐదొందలు ఇస్తాను.’’ చెప్పాను.‘‘అలాగే. మీ ఇష్టం అన్నాగా. కాని సాధ్యమైనంత త్వరగా రాగలరా? వీలుంటే ఇవాళే...’’భార్య పోవడంతో కలిగిన ఒంటరితనం అతన్ని బాధిస్తోందని నాకు అర్థమైంది.ఇంటికి వెళ్ళగానే నేనున్న ఇంటి యజమానికి ఆదివారం ఖాళీ చేస్తానని చెప్పాను.∙∙ నేను వరియార్ అపార్ట్‌మెంట్‌కి వచ్చిన తర్వాత రెండు రోజులు వరుసగా అరుణిక వచ్చింది.‘‘ఈమె అరుణిక. మన పక్క అపార్ట్‌మెంట్‌లో ఉంటుంది.’’ పరిచయం చేశాడు.ఆ తర్వాత ఆమె రెండు మూడుసార్లు వచ్చింది. ఆమె కేరళ వాళ్ళు చేసుకోని కందిపొడో, పచ్చి పులుసో, ములక్కాడ, టొమాటోల కూరో ఇలా ఏదో ఒకటి తెచ్చిచ్చేది. ఆమెకీ, వరియార్ భార్యకి మంచి దోస్తీ ఉండి ఉంటుందని అనుకున్నాను.ఆఫీస్ అయ్యాక నేను ఏదైనా సినిమాకి వెళ్ళి అపార్ట్‌మెంట్‌కి వెళ్తే దానికి తాళం ఉండేది. లోపల వరియార్ ఉండేవాడు కాదు. సెలవు దినాల్లో నేను బయటికి వెళ్తూంటే అతనూ నాతోపాటే బయటికి వచ్చేవాడు. రెండు వారాల తర్వాత అతను అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదని గ్రహించాను.
ఓ రాత్రి చెప్పాను.‘‘మిత్రమా. మీరు మీ ఆవిడని బాగా మిస్ అవుతున్నారు. మీ భార్యని మీరు ప్రేమించినంతగా ఎప్పుడు ఎవరూ తమ భార్యని ప్రేమించలేరు.’’అతను బదులుగా పకపక నవ్వాడు. మర్నాడు ఆదివారం అరుణిక తెచ్చిన గుమ్మడి పులుసుని అన్నంలో కలుపుకుని తింటూండగా చెప్పాడు.‘‘మీకో విషయం నిజాయితీగా చెప్పాలి. నేను అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉండకపోవడానికి కారణం మా ఆవిడ మీద ప్రేమ కాదు.’’‘‘మరి?’’‘‘ఇది రహస్యం. అయినా చెప్తున్నాను. ఎవరికీ చెప్పకండి. కారణం అరుణిక.’’‘‘అరుణికా?’’ ఆశ్చర్యంగా అడిగాను.‘‘అవును. ఆమె భర్త నించి విడాకులు తీసుకుంది. కూతురు, కొడుకుతో మన పక్క అపార్ట్‌మెంట్‌లో ఉంటోందని మీకు తెలుసుగా?’’‘‘తెలుసు?’’కొద్దిగా సందేహించాక చెప్పాడు.
‘‘ఆమెతో దాగుడుమూతలాట ఆడుతున్నాను. కొన్ని నెలల క్రితం మా మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. మా ఆవిడ ఓ రెండు గంటలు బయటకి వెళ్తే మాకు ప్రైవసీ దొరకగానే రమ్మనేవాడిని. వచ్చేది. మా ఆవిడ హాస్పిటల్‌లో చేరినప్పుడు కూడా. ఆమె మరణించాక నాకు ప్రైవసీకి లోపం లేకపోవడంతో రోజూ వచ్చి శారీరక సంపర్కం కోరుతోంది. ఆమెకి మన అపార్ట్‌మెంట్ బయట తాళంకప్ప కనపడితే సరే. లేదా వచ్చేస్తుంది. ఆమె మీద నాకు ఎన్నడో మొహం మొత్తింది. రావద్దని చెప్పి ఆమెని హర్ట్ చేయలేను. ఇది మన కంపెనీ నాకు కేటాయించిన అపార్ట్‌మెంట్ కాబట్టి ఖాళీ చేయలేను. ఇంట్లో ఇంకొకరు ఉంటే అరుణికని దూరంగా ఉంచొచ్చని నిన్ను రమ్మన్నాను.’’ వివరించాడు.ప్రైవసీ కోసం లోకంలోని ప్రేమికులు వెతుకుతూంటే, వరియార్ దాన్ని దూరంగా ఉంచి దాగుడుమూతలాట ఆడటం నాకు నవ్వు తెప్పించింది.
FEED ME A STORY :
మల్లాది వెంకట కృష్ణమూర్తి
‘ఫన్‌డే’లో ప్రచురితమయ్యే
ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా
భాగస్వాములను చేయనున్నారు.
మీరైతే ఈ కథకు క్లైమాక్స్ ఏమి రాస్తారో
ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com