
నంద గోపాల్ పాత్రలో మహేష్‌బాబు హీరోగా నటించిన ‘అతడు’ సినిమా గుర్తుందా! అందులో ఓ సీన్ ఉంటుంది. బాజిరెడ్డి (కోట శ్రీనివాసరావు) హత్య కేసు దర్యాప్తు కోసం సీబీఐ ఆఫీసర్ ఆంజనేయ ప్రసాద్ (ప్రకాష్‌రాజ్) రంగంలోకి దిగుతాడు. బాజిరెడ్డిని కాల్చడానికి వినియోగించిన బిల్డింగ్ పైకి వెళ్లి సహచరుల నుంచి వివరాలు తెలుసుకుంటూ ఉంటాడు. ఆ భవనం పైనుంచి తాడు సాయంతో పక్కనే ఉన్న రైల్వేస్టేషన్‌లో రైలు మీదికి నంద గోపాల్ దూకాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. ‘వీడు ఒలింపిక్స్‌కు వెళ్లి ఉంటే ఇండియాకు కచ్చితంగా గోల్డ్‌మెడల్ వచ్చేది’ అంటాడు. అలాంటి తెలివైన నేరగాళ్లు బయటి ప్రపంచంలోనూ ఉన్నారు. అలాంటి వారిలో గౌరు సురేష్ ఒకడు. డబ్బు కోసం కిడ్నాప్స్ చేయడంలో పేరుమోసిన ఈ నేరగాడి ప్లానింగ్‌కు 2005 నాటి తిరుపతి వ్యాపారి కిడ్నాప్ ఓ ఉదాహరణ.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన గౌరు సురేష్ బీకాం పూర్తి చేశాడు. ఎంబీఏ చదవాలనే లక్ష్యంతో 1999లో హైదరాబాద్‌కు వచ్చి బద్రుకా కాలేజీలో చేరాడు. అనివార్య కారణాలతో ఆ కోర్సులో డ్రాపౌట్‌గా మిగిలిన సురేష్.. బతుకుతెరువు కోసం దిల్‌సుఖ్‌నగర్‌లో ‘మార్చ్ స్టడీ సర్కిల్’ ఏర్పాటు చేశాడు. ఈ స్టడీ సర్కిల్ నష్టాలను మిగల్చడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరాల బాట పట్టాడు. 17 దోపిడీలు, 11 బందిపోటు దొంగతనాలు చేసి జైలుకు వెళ్లి వచ్చాడు. 2003 నుంచి కిడ్నాపర్‌గా మారి, పలువురు బడా బాబులను కిడ్నాప్ చేసి భారీ మొత్తాలు వసూలు చేసుకున్నాడు. ఈ నేరాలకు సంబం«ధించి ఆరు కేసులు నమోదు కాగా, పోలీసు రికార్డుల్లోకి ఎక్కని కిడ్నాప్‌లు 14 వరకు ఉంటాయి. 2008లో ఎన్‌కౌంటర్ అయ్యే వరకు ఇతగాడు ఉమ్మడి రాష్ట్ర పోలీసుల్ని పరుగులు పెట్టించాడు. గౌరు సురేష్ ఏదైనా ఓ కేసులో జైలుకు వెళితే బయటకు వచ్చిన తర్వాత చేయాల్సిన నేరానికి అక్కడే స్కెచ్ వేస్తాడు.
అందుకు అవసరమైన ప్రాథమిక ఏర్పాట్లనూ అక్కడ నుంచే పూర్తి చేస్తాడు. 2004లో ఇలానే ముషీరాబాద్ జైల్లో ఉన్న సురేష్– బెయిల్‌పై వచ్చాక చేయాల్సిన కిడ్నాప్‌లో ‘వాడుకోవడానికి’ ఓ ముఠాను తయారు చేసుకోవాలని భావించాడు. దీనికోసం జైల్లో ఉన్న మాజీ నక్సలైట్ మల్లారెడ్డిని, అతడి అనుచరులను పరిచయం చేసుకున్నాడు. తాను త్వరలో చేయబోయే కిడ్నాప్‌కు సహకరించాలని కోరాడు. కథ మొత్తం తానే నడిపిస్తానని, కేవలం తాను అప్పగించిన ప్యాకెట్‌ను (కిడ్నాప్ చేసిన వ్యక్తి) రెండు మూడు రోజులు జాగ్రత్తగా చూసుకోవాలని, తాను చెప్పినప్పుడు వదిలేస్తే చాలని చెప్పాడు. దీనికి మల్లారెడ్డి అంగీకరించడంతో ఓ కిడ్నాప్ స్కెచ్‌కు జైల్లోనే నాంది పడింది. అయితే అప్పటికి ఎవరిని కిడ్నాప్ చేయాలన్నది సురేష్ నిర్ణయించుకోకపోవడం కొసమెరుపు. ముషీరాబాద్ జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన సురేష్ మరో కిడ్నాప్ కోసం ప్లాట్‌ఫామ్ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
తన పని ఎలాంటి ఆటంకాలు, హడావుడి, ఆర్భాటాలు లేకుండా పూర్తి కావాలంటే ఇల్లు, ఇల్లాలు, వాహనం కావాలని భావించాడు. ప్రాథమికంగా వీరారెడ్డి అనే బోగస్ పేరు, వివరాలతో గుర్తింపుకార్డులు తయారు చేసుకున్నాడు. దీని ఆధారంగా కొన్ని సిమ్‌కార్డులు తీసుకుని తన వద్ద ఉంచుకున్నాడు. హోల్‌సేల్ కిరాణా వ్యాపారి అవతారం ఎత్తాడు. ఆ పేరుతోనే వనస్థలిపురంలోని అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకున్నాడు. కొత్తగా పెళ్లి అయిందని, త్వరలోనే భార్యను తీసుకువస్తానని చెప్పి యజమానికి అడ్వాన్స్ ఇచ్చాడు. ఓ చిన్న కుటుంబం సంసారం చేయడానికి అవసరమైన సామాన్లు ఖరీదు చేసి ఆ ఫ్లాట్‌లో పెట్టాడు. ఆపై కృష్ణనగర్‌కు చెందిన ఓ జూనియర్ ఆర్టిస్టును సంప్రదించి నెల రోజుల పాటు తన భార్యగా నటించాలని, రోజుకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఆమెను తీసుకుని వనస్థలిపురంలోని ఫ్లాట్‌కు వెళ్లిన గౌరు సురేష్ అలియాస్ వీరారెడ్డి ‘కొత్త కాపురం’ ప్రారంభించాడు.
ఇలా ఇంటిని, ఇల్లాలిని సిద్ధం చేసుకున్న గౌరు సురేష్ తాను ఎప్పుడు కావాలంటే అప్పుడు వాహనం ఇచ్చే వ్యక్తి కోసం గాలించాడు. అప్పట్లో సెల్ఫ్ డ్రైవింగ్స్ కార్స్ విధానం మొదలు కాలేదు. ఎవరికి వాహనం అవసరమైనా ట్రావెల్స్ నుంచి తెప్పించుకోవాల్సిందే! ఆ కారుతో పాటు డ్రైవర్‌నీ ట్రావెల్స్ నిర్వాహకులే పంపిస్తుంటాడు. ఆపరేషన్ పూర్తి అయిన తర్వాత ఏ దిశలో దర్యాప్తు జరిగినా తన ఉనికి బయటపడకుండా ఉండటానికి అవసరమైన స్కెచ్ వేశాడు. అలా జరగాలంటే తనతో పాటు కారులో డ్రైవర్ ఉండకూడదు. ఈ కోణంలో ఆలోచించిన సురేష్ అలియాస్ వీరారెడ్డి వనస్థలిపురం పరిసరాల్లోని ట్రావెల్ ఏజెన్సీల విషయం ఆరా తీశాడు. చివరకు వెంకట్‌రెడ్డి అనే ట్రావెల్స్ నిర్వాహకుడిని ఎంచుకున్నాడు. ఆయన వద్ద రెండు మూడుసార్లు వాహనం బుక్ చేసుకున్న సురేష్... తన ‘భార్య’తో కలిసి శ్రీశైలం, యాదగిరిగుట్ట, వేములవాడ వెళ్లి వచ్చాడు. ఆయా సందర్భాల్లో వెంకట్‌రెడ్డి కారుతో పాటు డ్రైవర్‌నీ పంపిస్తాడు.
ఇలా వెంకట్‌రెడ్డికి రెగ్యులర్ కస్టమర్‌గా మారిపోయిన సురేష్... ప్రతిరోజూ సాయంత్రం వేళ ఆయన ట్రావెల్స్ వద్దకే వెళ్లి కూర్చునేవాడు. తాను వ్యాపారినని, కొత్తగా పెళ్లి అయిందంటూ పథకం ప్రకారం మాటల సందర్భంలో చెప్పాడు. తన భార్యతో కలిసి తరచు బయటకు వెళ్లి వస్తుంటానని, అలా సరదాగా వెళ్లేప్పుడు కారులో డ్రైవర్ ఉండటం తమ ప్రైవసీకి భంగంగా ఉందంటూ వెంకట్‌రెడ్డికి చెప్పాడు. దీంతో సురేష్ ఇబ్బందిపడుతున్నట్లు భావించిన ఆయన... ‘మీకు డ్రైవింగ్ వచ్చా?’ అని ప్రశ్నించాడు. వచ్చంటూ సురేష్ చెప్పడంతో ఈసారి కారు కావాలంటే మీరే తీసుకువెళ్లండని ఆఫర్ ఇచ్చాడు. ఈ మాట కోసమే ఎదురు చూసిన సురేష్– రెండు సందర్భాల్లో అలానే తీసుకువెళ్లి చెప్పిన ప్రకారం తిరిగి ఇచ్చేశాడు. మరోపక్క తాను ఉంటున్న అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌కు తరచు డబ్బులు ఇస్తూ మచ్చిక చేసుకున్నాడు.
ఇలా సురేష్ అలియాస్ వీరారెడ్డి ఇల్లు, ఇల్లాలు, వాహనం సిద్ధం చేసుకునే సమయానికి మల్లారెడ్డితో పాటు అతడి అనుచరులు ముషీరాబాద్ జైలు నుంచి బయటకు వచ్చారు. ఆ వెంటనే మల్లారెడ్డి తాము విడుదలైన సమాచారాన్ని సురేష్‌కు చేరవేశాడు. దీంతో అతడిని వనస్థలిపురం పిలిపించుకున్న సురేష్... ఎవరికీ అనుమానం రాని, ఎవరి దృష్టీ పడని ఓ సురక్షిత ప్రాంతంలో ఫ్లాట్ అద్దెకు తీసుకోవాలని, అందులో కాస్త సెటిల్ అయ్యాక అసలు కథ మొదలుపెడదామని, ఆ ఫ్లాట్‌కు అద్దె, అడ్వాన్స్ కూడా తానే చెల్లిస్తానని చెప్పాడు. దీంతో మల్లారెడ్డి వారాసిగూడ ప్రాంతంలో ఫ్లాట్ ఎంపిక చేసి, ఆ విషయం సురేష్‌కు చెప్పాడు. దానికి అవసరమైన అడ్వాన్స్‌తో పాటు ఖర్చుల కోసం కొంత మొత్తం మల్లారెడ్డికి ఇచ్చిన సురేష్– అప్పుడు టార్గెట్ కోసం వెతకడం మొదలుపెట్టాడు.
(తరువాయి వచ్చేవారం)