
పచ్చని తోరణాలు, చుట్టూ ఎతైన పర్వతాలు– నలువైపులా ఎటు చూసినా ప్రకృతి రమణీయత. దైవకళ ఉట్టిపడేలా నిత్యం గోవింద నామ సంకీర్తన. స్వామివారి వైభవాన్ని చాటే ఆనంద నిలయం తిరుమల. అందుకే మహర్షులు, పురాణేతిహాసాలు పేర్కొన్నట్లుగా సకల సృష్టిలో వేంకటాచల పర్వతాన్ని మించిన పర్వతం మరొకటి లేదు. ఆపద మొక్కులవాడు, అభయప్రదాత అయిన శ్రీవేంకటేశ్వరుడు అర్చావతార మూర్తిగా కలియుగంలో ఆనంద నిలయంలో కొలువై ఉన్నాడు. సామాన్య మానవులు ఇదే ఆలయాన్ని దర్శించుకుని, స్వామివారిని కొలుచుకుంటూ ఉంటారు.
అయితే, దేవతలు, రుషుల కోసం స్వామివారు మరో ఆలయాన్ని తిరుమలపై నిర్మించుకున్నారట! సకల దేవతల నిలయమైన ఈ ఆలయానికి దేవతలు, మహర్షులు వస్తుంటారట! బ్రహ్మాది దేవతలు, సప్తర్షులు, అష్టదిక్పాలకులు ఈ కలియుగంలో శ్రీమహావిష్ణువు ధరించిన శ్రీ శ్రీనివాసుని అవతారాన్ని దర్శించి, సేవించి తరిస్తుంటారట! స్వయంభూ మన్వంతర కాలంలో ఆది కృతయుగంలో శ్రీమహావిష్ణువు వైకుంఠం నుంచి శ్రీదేవీ భూదేవీ సమేతంగా వచ్చి ఇక్కడ వెలశాడట! శ్వేతవరాహ కల్పం చివరి వరకు ఇక్కడే ఉంటానని శ్రీవారు దేవతలకు చెప్పారట! స్వామివారి ఆదేశంపై దేవశిల్పి విశ్వకర్మ నిర్మించిన ఈ ఆలయం అదృశ్యంగా ఉందని, స్వామివారు ఈ ఆలయంలో సజీవంగా సకల సేవలను అందుకుంటున్నారని శ్రీ వేంకటాచల మహాత్మ్యం చెబుతోంది. భౌతిక జీవితాలను గడిపే మానవమాత్రులకు ఈ ఆలయం గోచరించదని స్థలపురాణం చెబుతుంది.