ప్లాన్–ఏ ని రెండు వారాల్లో.. ప్లాన్–బీ ని 8 వారాల్లో మా ముందుంచండి
ఏసీబీ డీజీకి హైకోర్టు ఆదేశం.. తదుపరి విచారణ ఈనెల 26కి వాయిదా
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి పరకామణి వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. హుండీల్లో భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు, రవాణా, సీలింగ్, డీ–సీలింగ్, ఖాతాల నిర్వహణ వంటి అంశాల్లో ఇప్పటికీ అనుసరిస్తున్న పాత విధానాల్లో మానవ జోక్యాన్ని తగ్గిస్తూ, కృత్రిమ మేథస్సు (ఏఐ), ఆధునిక యంత్రాలు, డిజిటలైజేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాల్సిన అవసరం ఉందని టీటీడీకి తేల్చిచెప్పింది.
హుండీల్లో కేవలం డబ్బు మాత్రమే కాకుండా ఎన్నో వస్తువులు భక్తులు సమర్పిస్తారని కోర్టు గుర్తుచేసింది. ఇవన్నీ వర్గీకరించడంలో నేటి ఆధునిక యంత్రాలు, ఏఐ సాంకేతికత సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపింది. తక్షణ, శాశ్వత ప్రణాళికలను రూపొందించి వాటిని తమ ముందుంచాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.
సీఐడీ, ఏసీబీ దర్యాప్తునకు ఆదేశం..
శ్రీవారి పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్‌లో రాజీచేసుకోవడంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తిరుపతికి చెందిన పాత్రికేయుడు ఎం.శ్రీనివాసులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే, నిందితుడు రవికుమార్ ఆస్తులపై దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశించింది.
ఆ కానుకలు.. భక్తుల మనోభావాలకు ప్రతీకలు..
శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించిన ప్రతి కానుక భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. అందుకే వాటి భద్రత, పారదర్శక లెక్కింపునకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నామని పేర్కొంది. హుండీ నిర్వహణ, కానుకల లెక్కింపులో పారదర్శకత లేకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని టీటీడీకి తేల్చిచెప్పింది. భక్తుల మనోభావాలను పరిరక్షించాల్సిన బాధ్యత టీటీడీదేనని స్పష్టంచేసింది.
ఇక పరకామణి వ్యవస్థలో తక్షణ సంస్కరణల కోసం ప్లాన్–ఏ ను రెండు వారాల్లో, శాశ్వత ఆధునీకరణ కోసం ప్లాన్–బీని ఎనిమిది వారాల్లో సమర్పించాలని టీటీడీ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ప్లాన్–ఏ అమలుకు అవసరమైన నిపుణుల కమిటీలను ఏర్పాటుచేయాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కలిగిన భక్తుల సేవలను వినియోగించుకోవచ్చని సూచించింది.
అలాగే, పరకామణిలో చోరీచేస్తూ దొరికిన ఓ ప్రైవేటు మఠం ఉద్యోగి సీవీ రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు జరిపిన ఆస్తుల బదలాయింపు వివరాలను సీల్డ్ కవర్‌లో ఒక వారంలో తమ ముందుంచాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.


