
సూరారంలో సుబ్బయ్య అనే ఆస్తి పరుడు ఉండేవాడు. అతను పరమ లోభి. అనేక అక్రమ వ్యాపారాలు చేసి డబ్బు కూడబెట్టాడు. దానం చేసే బుద్ధి, పరోపకార గుణం సుబ్బయ్యలో మచ్చుకైనా లేకుండేవి. ఏ పనైనా వెంటనే కావాలనుకునేవాడు.అయితే, అతనికి దేవునిపై నమ్మకం ఎక్కువ. వీలు దొరికినప్పుడల్లా ఏదో ఒక దేవాలయానికి వెళ్లి తన కోరికలు చెప్పుకునేవాడు.పండరిపుర పాండురంగడు కోరిన కోరికలు వెంటనే తీరుస్తాడని సుబ్బయ్య చెవిన పడింది. వెంటనే పండరిపురం వెళ్లాడు. చంద్రవంక నదిలో స్నానం చేసి పుండరీకుని దర్శనం చేసుకున్నాడు. తన కోరికలు పాండురంగనికి చెప్పమని కోరుకున్నాడు. ఆ తర్వాత పాండురంగని ఆలయానికి చేరుకున్నాడు.పాండురంగని ఆలయం ఎంతో సుందరంగా ఉంది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కళకళలాడుతున్నాయి.
దైవ దర్శనానికి ఉన్న వరుస ఎంతో పొడవుగా భక్తులతో కిటకిటలాడుతోంది.సుబ్బయ్య అక్రమ బుద్ధి అక్కడ కూడా చూపించాడు. వరుసలో భక్తులు ఒకరి వెంట ఒకరు నెమ్మదిగా పాండురంగని భజన చేసుకుంటూ వెళుతున్నారు. సుబ్బయ్య మాత్రం వెంటనే భగవంతుని దర్శనం చేసుకోవాలని వరుసలోంచి పక్కకు వచ్చి అందర్నీ తోసుకుంటూ ముందుకు పోయాడు. పాండురంగని దర్శించుకుని బయటకు వెళ్లాడు. ‘అయ్యా! దానం చేయండి!’ అంటూ బిచ్చగాళ్లు చుట్టుముట్టారు. అందర్నీ విదిలించుకుని వెళ్ళి దూరంగా ఉన్న అరుగు మీద కూర్చున్నాడు.అక్కడ కంటికి నల్ల అద్దాలు పెట్టుకుని పాండురంగని కీర్తిస్తున్న అంధురాలు ‘అయ్యా! గర్భగుడిలో ఇటుక మీద పాండురంగ స్వామి రెండుచేతులు నడుం మీద పెట్టుకుని ఠీవిగా నిల్చున్న అందాన్ని చూడటానికి మన రెండు కళ్ళు చాలవట కదా!’ అడిగింది.
సుబ్బయ్య మాట్లాడలేదు. ‘పాండురంగని పాదాలు మన చేతులతో, శిరస్సుతో స్పృశించవచ్చట కదా! మందిరంలో ఎటు చూసినా తులసి మాలలేనట కదా!?’ తిరిగి అడిగింది. ఆమెకు కళ్లు కనిపించవు. అందుకే చూడలేక అడిగింది. సుబ్బయ్యకు రెండు కళ్లున్నా వెంటనే దర్శనం చేసుకుని బయట పడాలని, ఇతర భక్తులను తోసుకు వెళ్లాడు. అందుకే ఆ అందాన్ని ఆస్వాదించలేకపోయాడు.
తన కళ్ళకూ, కళాత్మకంగా చూసే కళ్లకు చాలా భేదం ఉంది. కళాత్మక హృదయం లేని తనకు గొప్ప శిల్పం కూడా బండరాయి లాగే కనిపించింది’ అనుకున్నాడు సుబ్బయ్య. పరోపకారం, దానగుణం లేని తాను కళ్లున్న అసలైన అంధుణ్ణనుకున్నాడు. అక్రమ మార్గం విడిచి సక్రమంగా జీవించాలనుకున్నాడు. అలా అనుకున్నాక పేదలకు దానధర్మాలు చేస్తూ, భగవంతుని సుందరరూపాన్ని చూడగలిగాడు సుబ్బయ్య.
పువ్వులు
∙ గుండాల నరేంద్రబాబు
పూలమ్మా పువ్వులు
రంగు రంగుల పువ్వులు
రంగేళీ రవ్వలు
రాసగుమ్మ గువ్వలు
రక రకాల పువ్వులు
రమ్యమైన పువ్వులు
రా రమ్మను పువ్వులు
రామచిలుక చిన్నెలు
ముద్ద ముద్ద బంతులు
ముద్దుల చేమంతులు
మల్లెలు మందారాలు
ఎర్రనైన గులాబీలు
అరవిరిసిన సింగారాలు