
ముందు వెళ్తున్న కారు ఒక్కసారిగా లెఫ్ట్ ఇండికేటర్ వేసి, రైట్‌కి తిరిగిందంటే, వెనక వున్నవాళ్లు తక్షణమే ‘లేడీ డ్రైవర్!’ అని ఫిక్స్ చేసేసుకుంటారు. కాని కొంతమంది ఓవర్‌టేక్ చేసి ముందుకు వచ్చి చూస్తే, చీర కట్టుకుని, పూలు పెట్టుకుని, స్టీరింగ్‌పై స్పీడ్ రేస్ చేస్తున్న మహిళలని చూసి షాక్ అవుతుంటారు. ఇలా సమాజంలో మహిళల డ్రైవింగ్‌పై ఇంకా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తుంటారు. కాని కేరళకు చెందిన డెబ్బై రెండేళ్ల మణి అమ్మ ఆ మాటలన్నింటినీ రోడ్డుమీద దుమ్ము దులిపేసింది. అందుకే ఆమెను అందరూ ‘డ్రైవర్ అమ్మ’ అని పిలుస్తారు.
మణి అమ్మ కేవలం యాక్టివా నడిపే స్థాయిలో ఆగిపోలేదు. లగ్జరీ కార్లు, బస్సులు, ట్రక్కులు, క్రేన్‌లు, రోడ్ రోలర్లు ఇలా మీరు పేరు చెప్పండి, ఆమె ఆ వాహనాన్ని నడిపేందుకు సిద్ధంగా ఉంటుంది. మొత్తం పద్దెనిమిది రకాల వాహనాలను నడిపేందుకు కావలసిన పదకొండు లైసెన్సులు ఆమె చేతిలో ఉన్నాయి. 2004లో భర్త మరణం తర్వాత అతని ‘ఏ టు జెడ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్‌మెంట్స్’ అనే డ్రైవింగ్ స్కూల్‌ను మూసేయకుండా, తానే స్కూల్ నడిపించి, తన జీవితాన్నే రేస్ ట్రాక్‌లా మార్చేసుకుంది.
ఇటీవల దుబాయ్ వీథుల్లో, సంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని ఆత్మవిశ్వాసంగా రోల్స్–రాయిస్ ఘోస్ట్ కారును నడుపుతున్న ఆమె వీడియో వైరల్ అవ్వడంతో, అది చూసి ‘మహీంద్రా’ అధినేత ఆనంద్ మహీంద్రా కూడా ఆమెకు సెల్యూట్ చేశారు. ప్రస్తుతానికి ఈ అమ్మ ఒక్క విమానం నడపటం మాత్రమే మిగిలి ఉంది, అది కూడా నేర్చుకుని నడిపించే ధైర్యం ఉంది అంటోంది మణి అమ్మ.