భర్తకు నివాళులర్పించాక విలపిస్తూ కుమార్తెతో వింగ్ కమాండర్ అఫ్షాన్
సెల్యూట్‌తో భర్తకు కడసారి వీడ్కోలు చెప్పిన వింగ్ కమాండర్ అఫ్షాన్
సిమ్లా: దుబాయ్‌లో శుక్రవారం ఎయిర్ షోలో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైన భారత వైమానిక దళం(ఐఏఎఫ్) వింగ్ కమాండర్ నమాంశ్ సియాల్(37) అంత్యక్రియలు ఆదివారం హిమాచల్ ప్రదేశ్‌లోని సొంతూళ్లో జరిగాయి. తమ ప్రియమైన ‘నమ్ము’కు నివాళులర్పించేందుకు అధికారులు, అభిమానులు, స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
వింగ్ కమాండర్ నామాంశ్ సియాల్‌కు ఆయన భార్య, వింగ్ కమాండర్ అయిన అఫ్షాన్ సెల్యూట్‌తో ఘనంగా నివాళులర్పించారు. కన్నీరు చెమర్చిన కళ్లతో కూతురును పొదివి పట్టుకుని భర్తకు ఆమె తుది వీడ్కోలు పలికారు. పూర్తి సైనిక లాంఛనాలు, గన్ సెల్యూట్‌తో అంత్యక్రియలు జరిపారు. నమాంశ్ సియాల్ చితికి బంధువు నిశాంత్ నిప్పు పెట్టారు. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఆయనకు పుష్పాంజలి సమర్పించాయి. నమాంశ్ సియాల్‌కు తల్లిదండ్రులతోపాటు భార్య, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు. ఆయన తండ్రి జగన్నాథ్ సియాల్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా ఉన్నారు.
అంతకుముందు, దుబాయ్ నుంచి తమిళనాడులోని కోయంబత్తూర్‌లో ఉన్న సూలూర్ ఎయిర్‌బేస్‌కు విమానంలో అధికారులు సియాల్ పార్థివ దేహాన్ని తీసుకువచ్చారు. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లో గగ్గాల్ ఎయిర్‌పోర్టుకు ఐఏఎఫ్ విమానంలో మృతదేహాన్ని తరలించారు. పలువురు రాష్ట్ర నేతలు, అధికారులు గగ్గల్ ఎయిర్‌పోర్టు నుంచి స్వగ్రామం పటియాల్కార్ గ్రామానికి ఆర్మీ ట్రక్కులో మృతదేహాన్ని తీసుకువచ్చారు. కాగా, విమానప్రమాదంలో అసువులు బాసిన వింగ్ కమాండర్ నమాంశ్‌కు సినీ ప్రముఖులు కమల్ హాసన్, సోనూ సూద్, అద్నాన్ సమీ నివాళులర్పించారు.


