నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసి.. | VHT 2025 26: Shivam Dube Shines Mumbai win last Over Thriller Vs HP | Sakshi
Sakshi News home page

నరాలు తెగే ఉత్కంఠ: శివం దూబే ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసి..

Jan 6 2026 6:31 PM | Updated on Jan 6 2026 6:58 PM

VHT 2025 26: Shivam Dube Shines Mumbai win last Over Thriller Vs HP

టీమిండియా వన్డే వైస్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పునరాగమనంలో శుభారంభం అందుకున్నాడు. గాయం నుంచి కోలుకుని ముంబై కెప్టెన్‌గా తిరిగి మైదానంలో అడుగుపెట్టిన అయ్యర్‌.. తొలి ప్రయత్నంలోనే సత్తా చాటాడు.

విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా హిమాచల్‌ ప్రదేశ్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లోనే అయ్యర్‌ అర్ధ శతకం బాదాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి మొత్తంగా 53 బంతుల్లో  10 ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 82 పరుగులు చేశాడు. 

జైస్వాల్‌, సూర్య ఫెయిల్‌
ఓపెనర్లలో యశస్వి జైస్వాల్‌ యశస్వి జైస్వాల్‌ (15) విఫలం కాగా.. ముషీర్‌ ఖాన్‌ (73) మాత్రం అదరగొట్టాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సర్ఫరాజ్‌ ఖాన్‌ (21).. టీమిండియా టీ20 కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (24) నిరాశపరిచారు.

శివం దూబే (20), హార్దిక్‌ తామోర్‌ (19 నాటౌట్‌), సాయిరాజ్‌ పాటిల్‌ (9 బంతుల్లో 25), షామ్స్‌ ములాని (5 బంతుల్లో 11) ఓ మోస్తరుగా ఆడగా.. తుషార్‌ దేశ్‌పాండే డకౌట్‌ కాగా.. శశాంక్‌ అటార్డే (1) నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా 33 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల నష్టానికి ముంబై 299 పరుగులు సాధించింది.

అయితే, లక్ష్య ఛేదనకు దిగిన హిమాచల్‌ ప్రదేశ్‌కు ఆదిలోనే భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కుశాల్‌ పాల్‌, ఇన్నేశ్‌ మహాజన్‌ డకౌట్‌ అయ్యారు. ఇలాంటి తరుణంలో పఖ్రాజ్‌ మాన్‌ (41 బంతుల్లో 64), అంకుశ్‌ బ్రెయిన్స్‌ (39 బంతుల్లో 53) మెరుపు అర్ధ శతకాలతో ఇన్నింగ్స్‌ చక్కదిద్దారు.

ధనాధన్‌ దంచికొట్టినా..
కెప్టెన్‌ మృదుల్‌ సరోచ్‌ (13) నిరాశపరిచినా.. మయాంక్‌ డాగర్‌ (47 బంతుల్లో 64), అమన్‌ప్రీత్‌ సింగ్‌ (21 బంతుల్లో 42) ధనాధన్‌ దంచికొట్టి గెలుపు ఆశలు రేపారు. ఆఖర్లో అమిత్‌ కుమార్‌ యాదవ్‌ (28) రాణించగా.. చివరి ఓవర్లో విజయానికి ఎనిమిది పరుగులు అవసరం కాగా.. శివం దూబే రెండు వికెట్లు తీయడంతో హిమాచల్‌ ప్రదేశ్‌ ఆలౌట్‌ అయింది. 32.4 ఓవర్లలో 292 పరుగుల వద్ద నిలిచిపోయింది. ఫలితంగా ముంబై ఏడు పరుగుల స్వల్ప తేడాతో గెలిచింది.

ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు తీసి..
ముంబై బౌలర్లలో టీమిండియా స్టార్‌ శివం దూబే నాలుగు వికెట్లతో చెలరేగగా.. సాయిరాజ్‌ పాటిల్‌ రెండు, షామ్స్‌ ములాని, ముషీర్‌ ఖాన్, తుషార్‌ దేశ్‌పాండే తలా ఒక వికెట్‌ పడగొట్టారు. ముంబై గెలుపు కారణంగా.. రీఎంట్రీలో శ్రేయస్‌ అయ్యర్‌కు బ్యాటర్‌గా, కెప్టెన్‌గా అదిరిపోయే ఆరంభం లభించింది. 

చదవండి: రీఎంట్రీ’లో శుబ్‌మన్‌ గిల్‌ అట్టర్‌ఫ్లాప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement