మీ వల్లే ఈ ఓటమి: భారత మాజీ క్రికెటర్‌ ఆగ్రహం | Captain Coach have to be held accountable: India Ex Star Slams SKY Gambhir | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌, హెడ్‌కోచ్‌ ఏం చేస్తున్నారు?.. భారత మాజీ క్రికెటర్‌ ఆగ్రహం

Feb 23 2026 5:45 PM | Updated on Feb 23 2026 6:05 PM

Captain Coach have to be held accountable: India Ex Star Slams SKY Gambhir

పొట్టి క్రికెట్‌ ప్రపంచకప్‌ టోర్నీలో భారత్‌కు కనీవినీ ఎరుగని పరాజయం ఎదురైంది. టీ20 వరల్డ్‌కప్‌-2026 ఈవెంట్లో టీమిండియా అవమానకర రీతిలో సౌతాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడింది. సూపర్‌-8 కీలక మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓటమిపాలై.. పరుగుల పరంగా అతిపెద్ద పరాజయం నమోదు చేసింది.

ఊహించని షాక్‌
ఈ నేపథ్యంలో టీమిండియా నాయకత్వ బృందంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌, వైస్‌ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ను తుదిజట్టులో ఆడించకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్‌ సుబ్రమణ్యం బద్రీనాథ్‌ కూడా స్పందించాడు.

తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ఇది ఊహించని షాక్‌. తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది సాధారణ ఓటమి కాదు. వాళ్లు మనల్ని చిత్తు చిత్తుగా ఓడించారు. సౌతాఫ్రికా టీమిండియాపై భారీ విజయం సాధించింది.

కెప్టెన్‌, హెడ్‌కోచ్‌ ఏం చేస్తున్నారు?
ముఖ్యంగా వరుణ్‌ చక్రవర్తి బౌలింగ్‌ను సఫారీ బ్యాటర్లు అటాక్‌ చేసిన తీరు మరీ ఘోరం. ఇందుకు కెప్టెన్‌, హెడ్‌కోచ్‌ జవాబుదారులుగా ఉండాలి. యాజమాన్యంతో పాటు ఆటగాళ్లు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో మైదానంలో అడుగుపెట్టారు.

అహంకారం వద్దు
నెట్‌ రన్‌ రేటు గురించి ఆలోచనే లేదు. సెలక్షన్‌ విషయంలోనూ తప్పులు. మనవాళ్ల బ్యాటింగ్‌ శైలి ఏమాత్రం సరిగ్గాలేదు. వీటన్నిటికీ యాజమాన్యం సమాధానం చెప్పాలి. జింబాబ్వేతో తప్పక గెలవాల్సిన పరిస్థితి. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య సన్నని రేఖ మాత్రమే ఉంటుంది. టీమిండియా దానిని తుడిచివేసేలా కనిపిస్తోంది’’ అంటూ తీవ్ర స్థాయిలో బద్రీనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో టీమిండియా సమిష్టిగా విఫలమైంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్‌ చేసి.. 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 187 పరుగులు సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్‌ అయింది. 

చదవండి: T20 WC 2026: టీమిండియాలో కలకలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement