దుబాయ్ ఎయిర్ షోలో విషాదం
విన్యాసాల్లో భాగంగా టేకాఫ్ కాగానే ప్రమాదం
ఫైటర్ జెట్ నేలకూలడంతో చెలరేగిన మంటలు
ఘటనా స్థలంలోనే పైలట్ దుర్మరణం
దర్యాప్తు కోసం ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’ ఏర్పాటు
విచారం వ్యక్తం చేసిన భారత వైమానిక దళం
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ
24 ఏళ్లలో రెండో తేజస్ ప్రమాదం
న్యూఢిల్లీ/దుబాయ్: దుబాయ్ వైమానిక ప్రదర్శనలో పెనువిషాదం చోటుచేసుకుంది. భారత వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో తేజస్ పైలట్ మృతి చెందినట్లు భారత వైమానిక దళం ప్రకటించింది. తేజస్ ఎంకే1 కూలిపోయి మంటలు చెలరేగిన దృశ్యాలు టీవీ చానళ్లలో ప్రసారమయ్యాయి.
శుక్రవారం దుబాయ్ ఎయిర్ షోలో భాగంగా టేకాఫ్ తీసుకున్న ఈ ఫైటర్ జెట్ హఠాత్తుగా కిందికి దిగింది. నేలను తాకగానే బంతి ఆకారంలో మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ వెలువడింది. పైలట్, వింగ్ కమాండర్ నమాన్‡్ష సయాల్ అక్కడికక్కడే మరణించారు. ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన జనం ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యారు. చాలాసేపటి దాకా షాక్‌లోనే ఉండిపోయామని చెప్పారు. ప్రమాదం జరగ్గానే అగి్నమాపక, అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగారు. మంటలు ఆర్పేశారు.
సంతాపం ప్రకటించిన సీడీఎస్
ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న దుబాయ్ ఎయిర్ షోలో వివిధ దేశాలకు చెందిన విమానాలు, ఫైటర్ జెట్లు పాల్గొంటున్నాయి. ఐఏఎఫ్‌కు చెందిన లైట్ కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఎల్‌సీఏ) తేజస్ ఎంకే1 కూడా ఇందులో చేరింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.10 గంటలకు విన్యాసాల్లో భాగంగా అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ కాగానే ప్రమాదం జరిగినట్లు భారత వైమానిక దళం ‘ఎక్స్’లో వెల్లడించింది.
తీవ్రంగా గాయపడిన పైలట్ ఘటనా స్థలంలోనే మృతిచెందారని పేర్కొంది. ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని, బాధితుడి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నామని, అన్నివిధాలుగా అండగా ఉంటామని వివరించింది. ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తుకు ‘కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ సైతం స్పందించారు.
పైలట్ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. తేజస్ విమాన ప్రమాదంలో పైలట్ ప్రాణాలు కోల్పోవడం పట్ల సీడీఎస్‌తోపాటు సైనిక దళాల్లోని అన్ని ర్యాంకుల అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేసినట్లు ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధాన కార్యాలయం ‘ఎక్స్’లో పోస్టుచేసింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లోని దుబాయ్‌లో ప్రతి రెండేళ్లకోసారి ఎయిర్ షో నిర్వహిస్తుంటారు. రకరకాల విమానాలను ఇందులో ప్రదర్శిస్తుంటారు. విమానాల విన్యాసాలు సైతం ఉంటాయి. ఈసారి 150 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. భారత వైమానిక దళం నేతృత్వంలోని సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్ ఈ ఎయిర్‌షోలో విజయవంతంగా విన్యాసాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో చివరి రోజు తేజస్ యుద్ధ విమానం కూలిపోవడం విషాదాన్ని నింపింది.
ఆయిల్ లీకేజీ వల్లేనా?
తేజస్ ఫైటర్‌జెట్ కూలిపోవడం గత 24 ఏళ్లలో ఇది కేవలం రెండోసారి మాత్రమే. ప్రమాదం ఎలా జరిగిందో గుర్తించడానికి నిపుణులు ప్రయతి్నస్తున్నారు. దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొంటున్న తేజస్ ఎంకే1 ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో చమురు లీక్ అవుతున్నట్లు వార్తలొచ్చాయి. అయితే, ప్రభుత్వం ఖండించింది. అలాంటిదేమీ లేదని, అంతా సవ్యంగానే ఉన్నట్లు వివరణ ఇచ్చింది. ఇంతలోనే ప్రమాదం జరగడం చర్చనీయాంశంగా మారింది. చమురు లీక్ వల్లే కూలిపోయినట్లు అనుమానిస్తున్నారు. ఇంజన్‌లో మంటలు అంటుకోవడం వల్లే తేజస్ అదుపుతప్పి నేలకూలినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఏమిటీ తేజస్?
తేజస్‌ను బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్), ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఏడీఏ) ఉమ్మడిగా చాలావరకు దేశీయ పరిజ్ఞానంతోనే అభివృద్ధి చేశాయి. ఇది సింగిల్–ఇంజన్, మల్టీ–రోల్ ఫైటర్‌జెట్. 2003లో తేజస్ అని అధికారికంగా పేరుపెట్టారు. ఇందులోని ఇంజన్‌మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నదే.
భారత వైమానిక దళం ప్రస్తుతం ఎంకే1 వేరియంట్ తేజస్‌ను ఉపయోగిస్తోంది. అత్యాధునిక ఎంకే1ఏ వేరియంట్ కోసం ఎదురు చూస్తోంది. తేజస్ విమానం షార్ట్–రేంజ్ క్షిపణులను, ఆకాశం నుంచి ఆకాశంలోకి ప్రయోగించే క్షిపణులను మోసుకెళ్లగలదు. ఆకాశంలోనే ఇంధనాన్ని నింపుకోగలదు. 2020 అక్టోబర్‌లో తేజస్ విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించారు. తర్వాత సరిచేశారు. తేజస్‌ను వైమానిక దళంలో కీలక అస్త్రంగా పరిగణిస్తుంటారు.
ఏడాది క్రితం ప్రమాదం
2024 మార్చి నెల లో ‘భారత్ శక్తి’ ప్రదర్శనలో భాగంగా రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో విన్యాసాలు నిర్వహించి వెనక్కి తిరిగివస్తుండగా తేజస్ విమానం కూలిపోయింది. జైసల్మేర్ సమీపంలోని ఓ కాలనీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పైలట్ క్షేమంగా బయటపడ్డాడు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. తేజస్ జెట్లు 2001లో విధుల్లో చేరగా, కూలిపోవడం అదే మొదటిసారి. తాజాగా దుబాయ్‌లో జరిగిన ప్రమాదం రెండోది.


