10 మందికి శిక్షలు
పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ భార్య బ్రిగెటీపై సైబర్ వేధింపుల కేసులో 10 మందిని దోషులుగా పారిస్ కోర్టు నిర్ధారించింది. వారికి 4 నుంచి ఆర్నెల్ల జైలుశిక్షలు విధించింది. అయితే వాటి అమలును సస్పెండ్ చేసింది. బదులుగా సైబర్ వేధింపుల అవగాహన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆదేశించింది. విచారణ సందర్భంగా క్షపమాణలు కోరిన ఒక టీచర్‌కు మాత్రం జైలు శిక్ష విధించలేదు. దోషుల్లో ఎనిమిది మంది పురుషులు కాగా ఇద్దరు మహిళలు.
బ్రిగెటీ ట్రాన్స్‌జెండర్ అని, పుట్టుకతో పురుషుడని పేర్కొనడంతో పాటు ఆమెను కించపరిచేలా వీరంతా ఆన్‌లైన్‌లో పలురకాలుగా తప్పుడు సమాచార వ్యాప్తి చేశారని కోర్టు ఆక్షేపించింది. సైబర్ వేధింపులపై పోరాటంలో అందరికీ ఆదర్శంగా నిలిచేందుకే వారిపై కేసులు పెట్టినట్టు బ్రిగెటీ వెల్లడించారు. ఆన్‌లైన్ వేధింపులు మొదలైనప్పటి నుంచీ ఆమె జీవితం గందరగోళంగా మారిందని కూతురు టిఫైన్ అజిరే వాపోయారు. వాటివల్ల తమ కుటుంబమంతా ఇప్పటికీ బాధపడుతూనే ఉందన్నారు.


