జగిత్యాల జిల్లా: తెల్లారితే దుబాయ్ వెళ్లాల్సిన ఓ వలసకార్మికుడు.. పొలంలో పనిచేస్తుండగా గుండెపోటుకు గురై చనిపోయిన సంఘటన రాయికల్ మండలం కుమ్మరిపల్లిలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పంచతి గంగారెడ్డి (48) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. 25 రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. కంపెనీ ఇచ్చిన సెలవులు పూర్తికావడంతో ఆదివారం తిరిగి దుబాయ్ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు.
శనివారం తన పొలంలో కుటుంబసభ్యులతో కలిసి పనులు చేస్తున్నాడు. ఒక్కసారిగా గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు, కుటుంబసభ్యులు వెంటనే రాయికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గంమధ్యలో మృతిచెందాడు. గంగారెడ్డికికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రెండు రోజులుగా కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతున్న గంగారెడ్డి గుండెపోటుతో మృతిచెందడంతో ఆ కుటుంబంలో విషాధ చాయలు అలుముకున్నాయి.


