అటవీ భూమి చదును
చందుర్తి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి–రుద్రంగి మండలాల సరిహద్దు వీరునిగడ్డ అటవీ ప్రాంతంలో రాత్రికి రాత్రే అక్రమార్కులు భూమిని చదును చేశారు. రెవెన్యూ, అటవీశాఖ అధికారుల అండదండలతోనే ఇంతకు తెగించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చందుర్తి మండలం లింగంపేట శివారులోని 118 సర్వేనంబర్‌లోని భూమిని కట్టలింగంపేటకు చెందిన ఒకరు అధికారులను మచ్చిక చేసుకుని చదును చేస్తున్నారని ఆరోపించారు. కొన్నేళ్లుగా సాగుచేసుకుంటున్న భూమిని మరొకరు వచ్చి చొరబడడంతో రెండు రోజుల క్రితం చందుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసిన 24 గంటలు గడవక ముందే అటవీ భూమిని చదును చేయడం అక్రమార్కుల బరితెగింపునకు నిదర్శనమని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అటవీశాఖ అధికారులు అక్రమ సాగును అడ్డుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై అటవీశాఖ బీట్ అధికారి వనితను వివరణ కోరగా తమ దృష్టికి రాలేదన్నారు. సిబ్బందితో వెళ్లి పరిశీలిస్తామని, అక్రమంగా సాగుచేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.


