
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామి వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. శ్రీవారి ఆలయం 2.2 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. స్వామివారి ఆలయం పక్కనే వున్న పుష్కరిణి ఒకటిన్నర ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అటు తర్వాత లడ్డు కౌంటర్లు, బూందీ కౌంటరు, లడ్డు తయారీ కేంద్రం వంటివి రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఉండగా వరాహస్వామి ఆలయం మిగిలిన ప్రాంతం కలుపుకొని దాదాపు 16 ఎకరాల విస్తీర్ణంలో శ్రీవారి ఆలయం ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ మాడవీథులు ఏర్పడ్డాయి. తూర్పు మాడవీథి 750 అడుగుల పొడవున; దక్షిణ, ఉత్తర మాడ వీథులు ఎనిమిది వందల అడుగుల పొడవున; పడమటి మాడవీథి 900 అడుగుల పొడవున ఉంటాయి. శ్రీవారి ఆలయం చుట్టూ ఏర్పడిన ఈ మాడవీథులకు ఎంతో ప్రాశస్త్యం ఉంది.
సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారు తన ఉభయ దేవేరులతో నిత్యం తిరుగాడే ప్రాంతం మాడవీ«థులు. గతంలో వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో మాత్రమే స్వామివారి వాహన సేవలు నిర్వహించేవారు. దీనితో మాడవీథుల్లో ఏడాదికి తొమ్మిది రోజులు పాటు మాత్రమే స్వామివారి ఊరేగింపు నిర్వహించేవారు. ఆ తర్వాత వీ«థి ఉత్సవం పేరుతో స్వామివారు నిత్యం మాడవీ«థులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇచ్చేవారు. సహస్ర దీపాలంకరణ సేవను ఆలయం వెలుపలకు మార్చిన తర్వాత ప్రతినిత్యం స్వామివారు దీపాలంకరణ సేవ పూర్తయ్యాక మాడవీ«థులలో ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇస్తారు. ఇలా మాడ వీథుల్లో నిత్యం స్వామివారి సంచారం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగుతుంది.
మాడవీ«థుల చుట్టూ ఉన్న నిర్మాణాలను భక్తుల సౌకర్యార్థం టీటీడీ 2004 నాటికి పూర్తిగా తొలగించి, గ్యాలరీల నిర్మాణం చేపట్టింది. దీనితో మాడవీథుల ఆధునికీకరణ కూడా చేపట్టింది. మాడవీ«థుల్లో భక్తుల తాకిడి పెరుగుతూ రావడంతో 1970 నుంచి టీటీడీ మాడవీ«థులలో ఆంక్షలు విధించడం ప్రారంభించింది. గతంలో వీవీఐపీలు శ్రీవారి దర్శనార్థం విచ్చేసే సమయంలో దక్షిణ మాడవీ«థి గుండా ఆలయం ముందు వరకు వారి వాహనంలోనే చేరుకునేవారు. శ్రీవారి ఆలయానికి ఈశాన్యం వైపు ఉన్న సహస్ర దీపాలంకరణ సేవ మండపం వరకు వాహనంలో విచ్చేసే వీవీఐపీలకు అక్కడి నుంచి అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికేవారు.
భక్తుల సౌకర్యార్థం అప్పటి ఈవో చంద్రమౌళీశ్వర్ రెడ్డి 1970 ఫిబ్రవరి 22 నుంచి మాడవీ«థులలోకి వాహనాల అనుమతిని నిలిపివేశారు. వీఐపీల కోసం ఆలయం ఎదురుగా టీటీడీ మరో రోడ్డు నిర్మాణం చేపట్టింది. 1996 నుంచి ఈ మార్గం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం వీవీఐపీలు ఈ మార్గం గుండానే మాడవీ«థుల వరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే, వాహనాలను మాడవీథులలోకి అనుమతించరు. ప్రధానమంత్రి, రాష్ట్రపతి స్థాయి వ్యక్తులు అయినా కూడా బ్యాటరీ వాహనాల ద్వారానే ప్రయాణం చేయవలసి ఉంటుంది. మాడవీథుల్లో భక్తులు పాదరక్షలు ధరించకుండా టీటీడీ 2007 నుంచి నిబంధనలను అమలు చేసింది. నిత్యం స్వామివారి వాహన ఊరేగింపులు జరిగే మాడవీ«థులను అంతే పవిత్రంగా చూడవలసిన బాధ్యత భక్తులపై కూడా ఉందంటూ ఈ నిబంధనలను టీటీడీ అమల్లోకి తీసుకువచ్చింది.
∙