ఈ వారం కథ: ఓ కాయ కాస్తోంది! | This week's story of funday | Sakshi
Sakshi News home page

ఈ వారం కథ: ఓ కాయ కాస్తోంది!

Aug 24 2025 7:53 AM | Updated on Aug 24 2025 7:53 AM

This week's story of funday

‘తుంటిమీద కొడితే మూతి పళ్ళు రాల్తాయా?’ అని ఎవరైనా అడిగితే, ఇదివరకైతే అందరిలాగే ‘‘అలా ఎలా రాలతాయండీ’’ అంటూ దబాయించేసేది ముద్రిక. ఇప్పుడడిగితే, అనుమానంగా చూసి, ‘రాలినా రాలవచ్చు’ అంటోంది! అనుభవం అలాగుంది మరి!కాకపోతే, పుట్టింట్లో ఆమె అక్క పురుడు జరిగితే, అదే సమయంలో మెట్టినిల్లు పీలికల పందిరి అయిపోవటం ఏమిటి?అదేమని ఎవర్ని అడగటానికి ఏముందీ, వాళ్ళాయన నిర్వాకమే అలా ఉన్నప్పుడు?తల పట్టుకు కూర్చుంది ముద్రిక, తన విభుడితో తలపడేదెలాగో, తగవు తెగేదెలాగో తోచక!‘‘నాకు ఆరోగ్యం బాగుండటంలేదే. ఓ రోజు లేస్తే, రెండు రోజులు పడకేస్తున్నాను.

 ఇటు మీ అక్కనేమో డెలివరీ అయ్యేదాకా బెడ్‌ రెస్ట్‌ తీసుకోమన్నారు డాక్టర్లు. చిన్నవాళ్ళు, మిమ్మల్ని విడదీయటం భావ్యం కాదు గాని, తప్పటం లేదు. అల్లుడుగారు ఒప్పుకుంటే, ఈ నాలుగు నెలలూ ఇక్కడికి వచ్చి, అక్క ఓ పాపని ఎత్తుకునే దాకా సాయం చేయగలవా?’’ అని నాలుగు నెలల క్రితం అడిగింది ముద్రిక తల్లి.ముద్రికకి అక్క అంటే చాలా ప్రేమ. పసివయసు నుంచి ఒక్క క్షణం విడిచి ఉండేవాళ్లు కాదు. అక్కకు పెళ్ళై, వెళ్లిపోతున్నప్పుడు ఇద్దరూ గుండెలవిసేలా ఏడ్చారు.‘‘మూడేళ్ల నుంచి, పిల్లలు కలగటంలేదని చింతలో మునిగిపోయిన అక్కకి, ఇన్నాళ్ళకి శుభ ఘడియలు వస్తుంటే, సాయం చేయకుండా ఎలా ఉంటాను? మనం కాస్త ఇబ్బంది పడదాం సుబ్బూ!’’ అంది బెంగ పడుతున్న భర్తతో.శుభప్రదమైన కార్యం కోసం వెళ్తున్నాననుకుంది గానీ, ఉపద్రవం ముంచుతుందని ఆమె కలలో కూడా అనుకోలేదు.

విధి విధానం అదే కదా!ఈ నాలుగూ నెలలలోనూ, రెండుసార్లు వచ్చివెళ్ళాడు సుబ్బారావు. వచ్చిన ప్రతిసారీ ఒక్క రోజు మాత్రమే ఉండి వెళ్ళాడు. ఇంకొక్క రోజయినా ఉండమని బ్రతిమాలినా, ‘అమ్మో– నీళ్ళు–నీళ్ళు’ అంటూ కాళ్ళు చెప్పుల్లో దూర్చుకుని పారిపోయేవాడు.‘‘ఎలా ఉంటున్నావ్‌ సుబ్బూ’’ అని శయ్యా గృహంలో గుండెల మీద తలపెట్టుకుని ముద్రిక బెంగగా అడిగితే, ‘తలపెట్టుకున్న కార్యంలో తల మునకలవుతున్నానని’ చెప్పేవాడు. ఆ మాటలు అర్థం చేసుకునే ప్రయత్నంచేసే తీరికలేక, దొరికిన ఆ కాస్త సమయాన్నీ సద్వినియోగం చేసుకునే కార్యంలో మునిగిపోయేది ముద్రిక.కార్య నిర్వహణానంతరం, నిద్రలో కూరుకుపోయి ఏవేవో కలవరించేవాడు సుబ్రావు.‘అదిగదిగో చిగురింత’ అనేవాడు.

‘బుజ్జిముండలు లుకలుకలాడుతున్నాయి’ అని నిద్రలోనే నవ్వుకునేవాడు.‘అంత బావుందా పానీయం? లొట్టలు వేస్తున్నారు?’ అనేవాడు.సగం సగం వినబడే ఈ కొత్తరకం పలవరింతలు అర్థమయ్యేవి కావు ముద్రికకి. ఆమె సీరియస్‌గా తీసుకోలేదు.కష్టకాలం ముంచుకొస్తుంటే, ఇష్ట సఖుడి మాటలైనా సరే, అర్థంకావు కదా!అక్కకి పండంటి కొడుకు పుట్టాక, ఘనంగా జరిగిన బాలసారెకి వచ్చిన మొగుడితో కలిసి వెనక్కు బయల్దేరింది ముద్రిక. ఇంట్లోకి అడుగు పెడుతూనే ఏదో తేడా కొట్టింది. కిచెన్‌లోకి వెడుతూనే స్పష్టంగా తెలిసింది.కిచెన్‌ కమ్‌ డైనింగ్‌ రూమ్‌ సగానికి సగం కుంచించుకుపోయి దర్శనమిచ్చింది. 

ఆనుకుని ఉండే బాల్కనీ ‘సుబ్బ’రంగా రెట్టింపయి కనిపించింది. పెరిగిన బాల్కనీలో కాలు పెట్టే చోటు కూడా లేకుండా చిన్నవీ, పెద్దవీ మట్టికుండీలు!‘‘ఏమిటిది సుబ్బూ, ఏమిటిదంతా?’’ అయోమయంగా అడిగింది.‘‘కనిపిస్తోందిగా, కిచెన్‌ గోడ ఇవతలికి జరిపించి, బాల్కనీ వైశాల్యం పెంచేశాను. ఆరోగ్య మహాభాగ్యానికై పెరటి కూరల పెంపకం.’’‘‘ఇదేమిటీ కొత్త వెర్రి?’’ కోపంగా అడిగింది.‘‘నువ్వు వెళ్ళాక, నా మానాన నేను మాడిపోయిన వంట తింటున్నానా, అది చూసి జాలిపడ్డ మా కొలీగ్‌ మిరియాల్రావ్‌ నన్ను ఓ ఆదివారం లంచ్‌కి పిలిచాడు. భోజనంలో వాళ్ళావిడ వడ్డించిన కూరలు నా జిహ్వను గిచ్చి లేపాయి. గుత్తి వంకాయలు నోట్లో కరిగిపోయాయి. 

కూరలోని బెండకాయలు అంత వేపినా, ‘తగ్గేదిలే’ అంటూ ఆకుపచ్చగా నవనవలాడుతూనే ఉన్నాయి. మడిలోంచి నేరుగా పులుసులో పడితే, కొత్తిమీర ఘుమ ఘుమ అంతగా పెరిగిపోతుందని అవాళే తెలిసొచ్చింది.‘చెల్లెమ్మ వంట అదుర్స్‌’ అన్నాను తిని లేస్తూ.‘నాదేముంది అన్నయ్యగారూ, రుచి అంతా కూరగాయల్లోనే ఉంది’ అంది చెల్లెమ్మ చిరుగర్వానికి, వినయం చొక్కా తగిలిస్తూ. అప్పుడు తీసుకెళ్ళి చూపించాడు మిరియాల్రావ్‌ – పెరటి తోట వైభవం. వంగ, బెండ మొక్కలు, దొండ, బీర పాదులు! ఇంకా ఆకుకూరలు– మైక్రో గ్రీ¯Œ ్స అనబడే బుల్లి మొలకలు– ఆహా... అలాగే కోసుకుని, నోట్లో వేసుకోవాలనిపించింది! ఇలా మొత్తం లిస్టు చదివితే, కూరగాయల బండి వాడి కేక గుర్తుకు వస్తుంది నీకు. 

అపుడు అర్థమయింది నాకు, నా వంట ఎందుకలా అఘోరిస్తోందో! నేరం నాది కాదు – కూరలది! బజార్లో దొరికే కూరల్లో రుచి ఉండట్లేదు, పురుగులు, పుచ్చులు తప్ప. ఆకు కూరలు కొంటే వాటినిండా మచ్చలు, చిల్లులు. మిరియాల్రావ్‌ ఒక్క పూటే భోజనం పెట్టినా, జీవితకాల భోజనానికి తగ్గ హితబోధ చేసిపారేశాడు.‘శ్రీమతి పుట్టింటికి వెళ్ళినా, ఏ సుబ్బయ్యనీ ఆశ్రయించలేదు నువ్వు. సుబ్బరంగా వొండుకు తింటూ ‘సుబ్బ’రావనే పేరుని సార్థకం చేసుకున్నావు. అంటే, నీకు ఆరోగ్య స్పృహ నిండుగా ఉందన్నమాట. ఇంత స్పృహ ఉన్న నువ్వు ఇక రెండో స్టెప్పు తీసుకోవాలి. బయటి వంటలకే కాదు, బయటి కూరగాయలకి కూడా నీ కిచెన్‌లో ప్రవేశించే అవకాశం లేకుండా చేయాలి. అప్పుడే, నీ ఆరోగ్యం వంద సంవత్సరాల పాటు వర్ధిల్లుతుంది. పెరటి తోట కోసం పడే శ్రమ, మానసికంగా కూడా ఉల్లాసం ఇస్తుంది. 

మెంటల్‌ హెల్త్‌ అన్నమాట. ఇన్ని లాభాలూ అతి తక్కువ ఖర్చుతోనే! పనికిరావని పారేసే వ్యర్థాలు, మనం మెలకువగా పట్టుకుంటే, పని తీరు ప్రదర్శిస్తాయి! అమలు చేయి నేడు, అనుభవించి చూడు.’మిరియాల్రావ్‌ సలహాకి పడిపోయాను. మనకి పెరడు లేదు గనుక, బాల్కనీని డిసైడ్‌ చేసేశాను.ఒంటి రాతి పార్టిషన్‌ గోడ పడగొట్టి ఇవతలికి జరపటానికి, నాలుగు రోజులు కూడా పట్టలేదు. వెంటనే కుండీలు, మొక్కలు, విత్తనాలు సమస్తం సమకూర్చేశాను – మన వంటింటి తోట రెడీ!’చెప్పటం ఆపాడు సుబ్రావు. ముద్రిక పరిశీలనగా చూసింది. కుండీలన్నిటిలోనూ ఏవేవో మొక్కలు. కొన్ని ఎండిపోతూ, కొన్ని వంగిపోయీ!.‘‘ఇదేమిటీ? ఏ మొక్కకీ పిందెలన్నా లేవు?’’పగలబడి నవ్వాడు సుబ్రావు.

‘‘వెనకటికి ఓ అమ్మాయి అశ్వత్థ ప్రదక్షిణం చేస్తూ, అడుగడుక్కీ కడుపు తడిమి చూసుకుందట! అలా ఉందినీ హడావిడి. కాస్తాయ్, కాస్తాయ్‌. తొందర పడితే అవుతాయా పనులు. ఎంతటి మహర్షి అయినా, తపస్సులో కూర్చోగానే వరం పొందలేడు. పుట్టలు కట్టాలి– జడలు పెరగాలి– ఎన్ని సినిమాలలో చూళ్ళేదూ?’’అతడి ధోరణి సాగిపోతూనే ఉంది.‘‘మొక్కలన్నాక తెగుళ్ళుంటాయ్‌. పోషణ చూసుకోవాలి. పిచ్చి మొహాలు– ఒక్క పూట నీరు పెట్టకపోతే, దిగాలు పడి చూస్తాయ్‌. వేళ్ళ కింది నేల గట్టిపడిపోతే, లోపలికి పాకలేక విలవిల్లాడిపోతాయి. పురుగులు పట్టుకుంటే, గిలగిల్లాడతాయి. ఎన్ని ఉంటాయి వాటికి బాధలు! అన్నీ మనమే చూసుకోవాలి.’’అతడిని అతడి ధోరణికి వదిలి లోపలికి వెళ్ళిపోయింది ముద్రిక.

మర్నాడు తెల్లవారకముందే గుప్పున వస్తున్న దుర్వాసనకి మెలకువొచ్చిన ముద్రికకి.ప్రక్కనే ఉండే సుబ్రావ్‌ కనిపించలేదు. ముక్కుకి చున్నీ అడ్డంపెట్టుకుని వాసన వస్తున్నవైపు నడిచింది.అది బాల్కనీలోకి దారితీసింది. అక్కడ సుబ్రావు మూతికి, ముక్కుకీ కలిపి ఓ గుడ్డ చుట్టుకుని, రెండు లీటర్ల ప్లాస్టిక్‌ సీసాలోంచి, సదరు దుర్వాసనకి హక్కుదారు అయిన నల్లటి ద్రావకం బయటకు తీస్తున్నాడు.‘‘యాక్‌. ఏమిటిదీ?’’ అనడిగింది ముఖం వికారంగా పెట్టిన ముద్రిక.‘‘అయ్యో, అలా అసయ్యించుకోకూడదు. ఇదేం పరాయి పదార్థం కాదు. మన పళ్ల తొక్కులు, కూరగాయల తొక్కులు, మిగిలిపోయిన కూరముక్కలు, మనం పూజ చేసి తీసేసిన పూలు... వీటన్నిటిని ఇలా ఓ రెండువారాలు ఈ బాటిల్లో బంధించి ఉంచితే, మన మొక్కలకి ప్రియాతి ప్రియమైన పానీయం తయారవుతుంది. అదే ఇది. 

ఇవిగివిగో చూశావా, ఈ బాటిల్లో... లుకలుకలాడుతున్నాయి బుజ్జి ముండలు... ఇవి రైతు నేస్తం పురుగులు. ఇవి వొచ్చేశాయంటే, ఇంక మన ద్రావకం ముదిరినట్టే. నేలలోకి చొచ్చుకుపోయి, గుల్లబారుస్తూ, మొక్కల వేళ్ళకి దారి చేస్తాయి ఇవి. ఒక లీటరు నీళ్ళలో వంద గ్రాముల పానీయాన్ని గనక కలిపి, మొక్కలకి తాగించామంటే ...’’ముక్కుతో పాటు చెవులు కూడా మూసుకుని లోపలికి పరుగెత్తింది ముద్రిక. తల తిప్పుకుని, తన పనిలో పడిపోయాడు సుబ్రావు.మర్నాడు మధ్యాహ్నం కునుకు తీస్తున్న ముద్రికని బెల్లు కొట్టి లేపాడు అమెజాన్‌ వీరుడు.‘ఏం తెప్పించాడబ్బా ఈ మహానుభావుడు?’ అనుకుంటూ వెళ్లి సుబ్రావు పేరుమీదున్న పార్సిల్‌ అందుకుంది.తొమ్మిదొందల డెబ్భై రూపాయలు వసూలు చేసుకుపోయాడు వాడు. తెరిచి చూసిన ముద్రిక తెల్లబోయింది.

పాకెట్లో వేపాకులు!‘వేపాకులు అమెజాన్‌ నుంచి? ఏం చేసుకుంటారు? ఇవీ మొక్కలకేనా?’‘‘అవును. వీటిని మిక్సీలో గ్రైండ్‌ చేసి, వేపాకు ముద్ద నీళ్ళలో కలిపి, ఒక రాత్రి నిద్ర చేయిస్తే, మహత్తరమైన పురుగుల మందు తయారవుతుంది. నిద్ర చేసిన వేపరసాన్ని వడగట్టి, ఆ పసరు నిలవ చేసుకోవచ్చు. వారానికి ఒకసారి వంద గ్రాముల వేప పసరు ఒక లీటరు నీళ్ళలో కలిపి...’’సాయంత్రం రాగానే, ప్యాకెట్‌ విషయం చెప్పిన అర్ధాంగికి వివరించబోయిన సుబ్రావు ముద్రిక సగంలోనే నిష్క్రమించిన వైనం గమనించి నిట్టూర్చాడు –‘దీనికి మొక్కలమీద ఎప్పటికి ప్రేమ ఏర్పడేనో... ఏమో..’నాలుగు రోజుల తరవాత పొద్దునే వచ్చింది రావమ్మ ,‘‘తెచ్చావా రావమ్మా’’ అన్నాడు సుబ్రావు తలుపు తీసి.‘‘ఆయ్‌...’’ అంటూ ఒక పెద్ద ప్లాస్టిక్‌ సంచిలో తెచ్చిన ఆవుపేడ అందించింది రావమ్మ. మరో బాటిల్‌ విడిగా ఇస్తూ, ‘‘మూత్రవండి’’ అంది.

బెడ్రూమ్‌లోంచి వచ్చిన ముద్రికకి చెప్పాడు సుబ్రావ్,‘‘ఏం లేదు. తాజా గోమయం, గోమూత్రం తెప్పించాను. ఈ రెండింటినీ కలిపి తొట్టెలో పోసి, ఆరారగా కర్రతో కలియతిప్పుతూ మూడు నిద్రలు చేయిస్తే, భేషయిన ఫెర్టిలైజర్‌ తయారౌతుంది. దాన్ని నాలుగింతల నీటిలో కలిపి....’’‘‘మనమేమైనా ఓ ఎకరం పొలం కొంటున్నామా? ఎందుకింత హడావిడి? ఒక్క మొక్క అయినా పైకి వచ్చి, కాయ కాయలేదు.’’‘‘చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నారు పెద్దలు. పెరటి తోటే కదా అని అశ్రద్ధ చేస్తే, ఫలసాయమూ అలాగే ఉంటుంది. శ్రద్ధ తీసుకోవటానికి ఎకరాలే అక్కర్లేదు. శ్రద్ధగా పెంచాలన్న మనసుంటే చాలు.’’‘‘కావచ్చు. కానీ, మన టూ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్‌లో ఎరువుల తయారీ పెడితే, ఫ్లాటంతా కంపు కొడుతోంది కదా!’’అనునయంగా చెప్పాలని చూసింది.

‘‘చూడు ముద్రీ, మన రైతన్నలు ఇలాగే కంపుకి జడిసి, దూరంగా ఉంటే, మన నాలుగు వేళ్ళూ నోట్లోకి వెళ్ళేవా? మనం ఈ మాత్రమైనా చేసి, వారి బాట మనకి పూబాట అని చాటనవసరం లేదా?’’భర్త అంత హెవీ డైలాగులు చెప్తుంటే, భరించలేక సీన్‌లోంచి నిష్క్రమించింది ముద్రిక.అంతటితో ఆగలేదు. ఆ ఆదివారం పెద్ద దుకాణమే పెట్టుక్కూర్చున్నాడు సుబ్రావ్‌.ముద్రిక కన్నా ముందే కిచెన్‌లోకి దూరాడు. అల్లం, వెల్లుల్లి, పచ్చి మిరపకాయలు కలిపి, నీళ్ళు పోస్తూ మిక్సీలో మెత్తగా రుబ్బాడు. ఆ మిశ్రమాన్ని ఒక పెద్ద బాటిల్‌లో నింపి, 3ఎ సొల్యూషన్‌ అని రాసి పెట్టుకున్నాడు.ఆ ఘాటుకి కళ్ళు మండి, ముక్కులోంచి, చెవులలోంచి పొగలు వచ్చి, ఫ్రేమ్‌లోంచి పారిపోయింది ముద్రిక.తరవాత ఒక గిన్నెలో ముందే సిద్ధంగా ఉంచుకున్న అరటికాయ, పండు తొక్కల్ని, ఉల్లి పొట్టుని వేసి, నీళ్ళు పోసి, అరగంట సేపు బాగా ఉడకబెట్టాడు.

మధ్యలో వచ్చింది ముద్రిక, ‘‘ ఏమిటి సుబ్బూ, ఇవేళ బ్రేక్‌ఫాస్ట్‌ నువ్వే తయారు చేస్తున్నావా?’’‘‘బ్రేక్‌ఫాస్ట్‌ కాదు, లంచ్‌. మనక్కాదు, మొక్కలకి. ఇవేళ్టికి కాదు, పై వారానికి.’’ సీరియస్‌గా చెప్పాడు సుబ్రావ్, తల తిప్పకుండా.తల కొట్టుకు వెళ్లిపోయింది ముద్రిక, స్విగ్గీకి ఫలహారాల ఆర్డరు పెట్టటానికి.అదేం పట్టించుకోకుండా, మరిగిన నీళ్ళని వడగట్టి మరో బాటిల్‌లో నింపాడు. ఉత్సాహంగా హాల్లోకి వచ్చి చెప్పాడు,‘‘మొక్కలకి ఊరగాయలు రెడీ! ఈ ద్రావకాలు ఏటికేడాదీ నిలవ వుంటాయి. రెండు వారాల కొకసారి లీటరు నీళ్ళలో వంద గ్రాముల ద్రావకం కలిపి, మొక్కలకి పోశామనుకో, లొట్టలేసుకుంటూ తాగుతాయి. దిట్టంగా పెరుగుతాయి.’’జవాబు చెప్పలేదు ముద్రిక – ఆ తరవాత కూడా, చాలా రోజుల దాకా! సుబ్రావు కిచెన్‌ తోట పెంపకం సాగుతూనే ఉంది – కిచెన్‌లోంచి రకరకాల పోషకాలు వెళ్తూనే ఉన్నాయి. ఇంకా తోటలోంచి వంటలోకి దిగుబడులు మాత్రం మొదలు కాలేదు, ఎప్పుడన్నా ఓ కొత్తిమీర ఆకు, నాలుగు మెంతి ఆకులు తప్ప. 

ఒక వంగ చెట్టు తాడెత్తున పెరిగింది గాని, అది పోతు మొక్క అన్నారు. దానికి విగ్రహపుష్టి తప్ప, ఒక్క పువ్వు కూడా పూయలేదు, ఒక్క కొమ్మక్కూడా కడుపు పండలేదు! బెండ మొక్కలు పెరిగాయి గానీ, వాటి కాయలు కంచంలోకి వచ్చే ముందే, పురుగులు ఎగరేసుకు పోయాయి – ముక్కలు గిల్లుకుంటూ. వేసిన సేంద్రియ ఎరువులు ఎటు పోయాయో తెలియదు.‘ఇలా కాదు – ఇలా కాదు’ అనుకున్నాడు సుబ్రావు, ‘ఇంకా ఏదో చేయాలి’ అని గొణుక్కున్నాడు.‘ఏదో చేయాలి’ అన్న విషయంతో ముద్రిక కూడా ఏకీభవించింది.‘పెరటి తోట పెంపకం– హరిత విప్లవం– పర్యావరణ పరిరక్షణ – ఆలోచనలన్నీ మంచివే. అయితే, వంద అడుగుల చదరంలో వెయ్యి మొక్కలు పెంచటం, లీటర్ల కొద్దీ ద్రావకాలు పొయ్యటం, ఉన్న రెండు గదుల్లోనూ కంపు కొట్టే సంచులు నింపటం... మొక్కలతో పాటు మన ఆరోగ్యం కూడా కాస్త చూసుకోవాలి కదా! కన్ను సైజుని బట్టే కదా కాటుక పెట్టుకోవాలి!’ అనుకుంది.

‘తిన్నంత తేలిక కాదు కూరలు వండటం – కొన్నంత తేలిక కాదు వాటిని పెంచడం’ అన్న విషయం ఇతగాడికి ఎలా తెలియచెప్పాలబ్బా?’ఏం చేయాలో ఓ క్లారిటీ వచ్చేసరికి, కాలమూ కలిసొచ్చింది – బహు విధాలా!వారం రోజుల కోసం హెడ్డాఫీసుకి టూరు వెళ్ళిన సుబ్రావు తిరిగి వచ్చేసరికి సీను మారిపోయింది.బాల్కనీలో ఒక్క కుండీ లేదు. అంతా చదునుగా విశాలంగా ఉంది. మట్టి కొట్టుకు మాసిపోయిన పాలరాతి పలకలు బయటపడి మెరుస్తూ కనుపించాయి.‘‘మై గాడ్‌! నా కుండీలు, నా మొక్కలు...’’ అంటూ చిందులు తొక్కబోయాడు సుబ్రావు.గోముగా అతడి భుజంమీద తలపెట్టి, తలపెట్టిన పథకం చెప్పేసింది ముద్రిక.

‘‘ఇదీ ఆరోగ్య ప్రణాళికే సుబ్బూ! రేపు వచ్చే బుల్లి సుబ్బారావు ఈ బాల్కనీలోనే పాకుతూ పెరగాలి. ఈ మట్టిలోనూ, కుండీల మధ్య ఎలా.. అందుకే నేను వీటిని తీయించేసి, బాల్కనీ కడిగించేశాను.’’ఒక్క క్షణం ఒళ్ళు మండిపోయింది– ఆనక ఆమె మాటలు స్లో మోషన్‌లో బుర్రలోకి చొరబడ్డాయి. కొండలమాటు చంద్రబింబంలా సుబ్రావు ముఖం మీదికి నెమ్మది నెమ్మదిగా విస్మయంతో కూడిన చిరునవ్వు ఎక్కి వచ్చింది.‘‘అహ్హో .. ఒహ్హో .. అంటే... మనకో బుల్లి సుబ్రావు...’’‘‘మరో ఏడు నెలల్లో...’’ జవాబు చెప్తూ గబుక్కున సిగ్గుపడి, సుబ్రావు ఎదనే ముఖానికి కప్పేసుకుంది ముద్రిక. సుబ్రావు ఉత్తేజితుడైపోయాడు– ‘ఓ కాయ కాస్తోంది!’

ఒక వంగ చెట్టు తాడెత్తున పెరిగింది గాని, అది పోతు మొక్క అన్నారు. దానికి విగ్రహ పుష్టి తప్ప, ఒక్క పువ్వు కూడా పూయలేదు, ఒక్క కొమ్మక్కూడా కడుపు పండలేదు! బెండ మొక్కలు పెరిగాయి గానీ, వాటి కాయలు కంచంలోకి వచ్చే ముందే, పురుగులు ఎగరేసుకు పోయాయి.నాదేముంది అన్నయ్యగారూ, రుచి అంతా కూరగాయల్లోనే ఉంది’ అంది చెల్లెమ్మ చిరుగర్వానికి, వినయం చొక్కా తగిలిస్తూ. అప్పుడు తీసుకెళ్ళి చూపించాడు మిరియాల్రావ్‌ 
– పెరటి తోట వైభవం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement