
హైదరాబాద్‌లో విమానం దిగిన కిషోర్ అక్కడ నుండి రాజమండ్రిలో తన కోసం వచ్చిన కోటయ్యతో కారులో బయలుదేరాడు. సుమారు ఒక గంటలో ఊరికి చేరుకున్నారు.భూదేవి ఆకుపచ్చటి చీర కట్టుకున్నట్లుగా ఉన్న ఆ పచ్చటి పొలాలు, ఎత్తయిన ఆ కొబ్బరిచెట్లు, అందమైన ఆడపిల్లలా వంపులు తిరిగిన ఆ గోదావరిపాయ– మరోవైపు గంభీర కెరటాల సముద్రం.. చుట్టూ ఆకుపచ్చని గొడుగులు పాతినట్లుగా ఆకాశంలో పచ్చాపచ్చని గూళ్ళు అల్లే కొబ్బరిచెట్లు.. మధ్యమధ్యలో అరటిచెట్లు, అల్లంత దూరాన సరిహద్దులు గీసే తాడిచెట్లు, పచ్చని పొలాలకు పాపిడి తీసినట్టుండే గట్లు.. వాటి వెంబడి పూలమొక్కలూ, పళ్ళచెట్లూ.. ఎంత బావుందో ఇక్కడ అనుకున్నాడు కిషోర్.
తాత చిన్నారావు ఒకప్పుడు మోతుబరి రైతు. బోలెడు ఎకరాల పొలాలు, కొబ్బరితోటలు, చక్కటి ఫలసాయం వచ్చేది. క్రమేపి ఆస్తులు తరిగిపోయాయి. పైగా భాగాలూ పంచుకోవడంతో చిన్నచిన్న ముక్కలయిపోయాయి.ఆ ఉన్నదాన్నే జాగ్రత్తగా పెట్టుకుని కొంతదాంట్లోనే ఈ పూల నర్సరీ పెట్టాడు. అలా ఆ చుట్టుపక్కల కొన్ని వందల ఎకరాల్లో చాలామంది ఈ పూల నర్సరీలు పెంపొందించారు. అంతేకాదు, అన్నిచోట్లా అందమైన పూలమొక్కలు హొయలొలుకుతూ క్రమపద్ధతిలో కొలువుదీరిన దృశ్యాలను చూడటానికి ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. కేవలం హృదయాన్ని తాకే సోయగాలే కాకుండా పర్యావరణ పరిరక్షణ, వందలకోట్ల రూపాయల వ్యాపారం, వేలమందికి ఉపాధిని కల్పిస్తున్నాయవి. మాటల్లో కోటయ్య చెప్పాడు.ఈప్రాంతం టూరిస్టులను బాగా ఆకర్షించడంతో దేశం నలుమూలల నుండి పూల నర్సరీల సందర్శనకు బాగా వస్తున్నారు. ఇక సినిమా షూటింగులు కూడా బాగానే జరుగుతున్నాయని కూడా చెప్పాడు.
‘‘ఏడాదికో సారైనా రావాలిరా కిషోర్. బంధాలను నెమరేసుకోవాలి. బంధుత్వాల్ని పలకరించుకోవాలి. జ్ఞాపకాలను తడిమి చూసుకోవాలిరా.’’ అని తాత ఫోనులో అంటుంటే ఆ మాటలు అప్పుడు చాదస్తం అనిపించినా, ఇప్పుడు ఎంతో నిజం ఉందనిపించింది. ప్రతివారు పలకరించే వారే మా చిన్నారావు మనవడివా అంటూ ఆప్యాయంగా దగ్గరగా వచ్చి చూసేవారే! ఇంత ఆత్మీయత అసలు ఊహించనేలేదు. క్షణం తీరికలేని జీవితం... తాత పోయినప్పుడు కూడా రాలేకపోయేంత బిజీలో ఉన్నాడు. ఒక్కోసారి మార్పు అనేది ఎప్పుడు వస్తుందో చెప్పలేము. అలా కిషోర్‌లో అంతర్మథనం మొదలయింది. దానికితోడు మూడునెలల క్రితం తాతయ్య స్నేహితుడు వ్రాసిన ఉత్తరం కూడా తోడయ్యింది. అదే కిషోర్ ఈ పల్లెటూరుకు రావడానికి కారణం.‘‘ఇది మన ఊరి చెరువు. ఒకప్పుడు అది మంచినీళ్ళ చెరువు కూడా. అయితే, ఈమధ్య మన ఊరికి నది కాలవ నుంచి పైపుల ద్వారా నీళ్ళు వస్తున్నాయని తెలిసింది. నాకు గుర్తుంది చిన్నప్పుడు ఈ చెరువు గట్టున ఎన్నో ఆటలు ఆడుకునేవాళ్ళం. ఈత కొట్టడానికి మటుకు పెద్దవాళ్లు వద్దనేవారు. చెరువంతా తామరాకులు, పువ్వులతో నిండి ఉండేది. అప్పుడప్పుడు బాతులు కూడా కనపడేవి’’ అన్న కిషోర్ మాటలకు కోటయ్య,
‘‘అవును బాబు ఇప్పుడు ఈ చెరువు ప్రభుత్వ పథకం కింద ఉంది. బాగానే మెయింటైన్ చేస్తున్నారు’’ బదులిచ్చాడు,కొంచెం దూరం నడిచాక కోదండ రామాలయం వచ్చింది. పెద్ద గోపురంతో ఠీవిగా నిలబడి ఉంది. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమికి ఇక్కడ పెద్ద కళ్యాణం జరుగుతుంది.‘‘ఏమి కోటయ్యా! అప్పట్లోలానే కళ్యాణం జరుగుతోంది కదా! తొమ్మిది రోజులు చేస్తున్నారా?’’ అతను సమాధానం చెప్పే లోపల అవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు కిషోర్.ఊరిని తలచుకుంటేనే ఎన్ని జ్ఞాపకాలు! ఏ పండుగ వచ్చినా, ఏదో ఒక హరికథ, తోలుబొమ్మలాటల నాటకం ఏర్పాటు చేసేవారు. ముఖ్యంగా వినాయకచవితి తొమ్మిది రోజులు; అలాగే, శ్రీరామనవమికి పందిళ్ళు వేసి స్టేజికి కట్టిన రంగుల దీపాలతో భలే బావుండేది. పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళు. అలా ఒక్కోసారి పిల్లల గ్యాంగ్ అందరూ హరికథలు, బుర్రకథలు ఆ వయసులో అర్థం తెలియకపోయినా, పోయి కూర్చునేవాళ్ళు. మధ్యమధ్యలో దాసుగారు చెప్పే పిట్టకథలు భలే బాగుండేవి.ఆయన గజ్జెలు కట్టుకుని డాన్స్ చేస్తూ, చేతిలో చిడతలు వాయిస్తూ ఏ కథనైనా తన్మయత్వంతో చెబుతుంటే కళ్ళప్పగించి చూస్తుండేవాడు.
ప్రోగ్రాం జరుగుతుండగా నిద్ర వస్తే, అక్కడే పడుకుండిపోడం ఇంకా గుర్తుంది.ఆ తరువాత అమ్మా, నాన్నా వాళ్ళు వచ్చి నిద్రలేపి తీసుకు వెళ్ళేవారు. ఊరి జనమే కాకుండా, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా వచ్చేవారు. పిల్లలు, యువతులు, యువకులు, పెద్దవాళ్ళతో ఊరంతా కళకళలాడుతూ ఓఉత్సవంలా గడిచేవి రోజులు. అప్పటికే ఇలాంటి కళలు తగ్గిపోయాయి. వాటి స్థానాన్ని టీవీ అందునా, ఓటీటీలతో ఇంట్లోనే వినోదం వచ్చేసినా, ఇంకా ఊర్లో తాతలాంటి వాళ్ళు ఉండబట్టి అవన్నీ అప్పుడప్పుడు నడుస్తున్నాయి. తలచుకుంటేనే ఎంత బావుందో తన్మయత్వంతో మురిసిపోయాడు. తమ ఊర్లో ప్రతి ఇల్లు, వసంతకన్యలా మెరిసిపోతోంది. సంపెంగలు, చేమంతులు, పేరు తెలియని ఎన్నో రంగురంగుల పూలు, ఊదాపూలు, ఎఱ<టిపూలు, పచ్చటిపూలు, తెల్లటిపూలు, మరువం, దవనం సువాసనలు వెదజల్లుతున్నాయి. మొత్తానికి అన్నీ కలిపి ఒక కదంబవనంలా ఉన్నాయి.
ఇళ్లన్నీ చక్కగా అందంగా రంగవల్లులు తీర్చిదిద్ది ఉన్నాయి. అంతేకాదు, ప్రతి ఇంటి ముందు ఉన్న ఏదో ఓ పెద్దచెట్టుకి ఒక ఉయ్యాల కూడా ఉంది. ‘‘కిషోర్ బాబు! ఇక్కడ అందరూ ఒకరితో ఒకరు సామరస్యంగా జీవిస్తున్నారు. అలాగే జీవనోపాధి కోసం సాధారణ వ్యవసాయ పనులతో పాటు ఈ నర్సరీ నిర్వహణ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు మన ఊరు ఒక ఆదర్శవంతమైన íపిక్నిక్‌స్పాట్‌గా మారింది. ప్రజలు మార్పు కోరుతున్నారు. అందుకే, ఎవరి ఊరిని వాళ్ళు బాగు చేసుకోవాలి అన్న మీ తాతయ్య మాటలు విని నడుంకట్టుకున్నారు మన ఊరివాళ్ళు’’ అంటూ చెప్పుకుపోతున్నాడు కోటయ్య. కిషోర్‌కి కళ్ళముందు అతని మాటలు ఏవేవో దృశ్యాలుగా కదిలిపోతున్నాయి.
పొలం గట్టున ఉన్న పెద్దచెట్టు దగ్గర నించొని ఉన్న సూరిబాబుని ఒక పెద్దపాము కాటేయటం, బాధతో లుంగలు చుట్టుకు పోవడం ఒకేసారి జరిగింది. అది చూసిన చిన్నారావు వెంటనే పరుగులు పెట్టుకుంటూ దగ్గరగా వెళ్ళాడు. అప్పటికే అతను కిందపడి గిలగిల కొట్టుకుంటున్నాడు. బాధతో ఆర్తనాదాలు చేస్తుంటే, పరుగులు పెట్టుకుంటూ వచ్చి, ‘ఎంతపని జరిగిందిరా కొడకా ఇప్పుడే కదా నీకు చెప్పి ఒంటేలు పోసుకోవడానికి వెళ్ళాను. అంతలోకే ఇలా పాము వచ్చి కాటేసిందా’ అని వలవల ఏడ్చాడట!ఏదో జరిగిందని పక్క పొలాలలో పని చేసుకుంటున్న వాళ్ళు పరుగులు పెట్టుకుంటూ వచ్చారు. అందరూ కలిసి అతన్ని మోసుకుంటూ, ఊర్లో ఉన్న ఆసుపత్రికి తీసుకొని బయల్దేరారు. కాని, లాభం లేకపోయింది. అప్పటికే సూరిబాబు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.చిన్నారావు దంపతులు కొడుకుని తలచుకుని కుమిలిపోతున్నారు. సూరిబాబు భార్య దుఃఖానికి అంతు లేకుండా పోయింది. కొన్ని రోజులకి సూరిబాబు భార్య కొడుకుని తీసుకుని పుట్టింటికి చేరుకుంది.ఆమె వెళ్ళిన కొన్నిరోజులకి సూరిబాబు తల్లి, కొడుకు మీద బెంగతో కన్నుమూసింది.
పుట్టింటికి వెళ్ళిన సూరిబాబు భార్య, అత్తగారు కూడా పోవడంతో ఇక ఈ ఊరి మొహం చూడలేదు. అప్పుడప్పుడు చిన్నారావు ప్రేమని చంపుకోలేక వెళ్లి మనవడిని చూసి వచ్చేవాడు.సూరిబాబు భార్య చాలా కష్టపడి కిషోర్‌ని పెంచి పెద్దచేసింది. పైచదువులు చదివించింది. ఆ తరువాత అనుకోని అదృష్టం కిషోర్‌ని అమెరికా వెళ్ళేలా చేసింది. అయితే, విధి ఇంకోలా ఆడుకుంది. కొడుకు అభివృద్ధిని చూడకుండానే కరోనా మహమ్మారితో కన్నుమూసింది. అతను అక్కడే పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యాడు.∙∙ కొడుకు పోయాడు, భార్య పోయింది, ఉన్న ఒక్క మనవడు దూరమయిపోయాడు. అప్పటి నుంచి చిన్నారావులో ఒక మార్పు వచ్చింది. జీవితం భగవంతుడు ఇచ్చింది. చేతనయినంత వరకు పొరుగువాడికి సాయపడాలి అనుకున్నాడు. ఏడుస్తూ చేతులు ముడుచుకుని కూర్చోకూడదు. తమ ఇంట్లో విషాదం ఎవరికీ కలగకూడదు అని నమ్మాడు.
అందుకే తనకున్న పొలాన్ని జాగ్రత్తగా సాగు చేసుకుంటూ, ఊర్లో అందరినీ ఒక్కచోట చేర్చి, ‘‘చూశారుగా, మా ఇంట్లోజరిగింది. దేన్నయినా ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. కష్టాలు పడనివాళ్ళు ఎవరూ ఉండరు’’ అని మా అందరిలో ఉత్సాహం నింపాడు.ఊరిలోని ప్రతిఇంటినీ చక్కగా ఒక పూలతోటగా మార్చారు. ఎంతోమంది సలహాలు తీసుకుని, కొంతమందిని జట్టుగా తయారయి పనులు చేసునేవారు. క్రమక్రమంగా ఊరికి పేరు రాసాగింది. మొదటగా సినిమా షూటింగులు జరగసాగాయి. ఆ తరువాత మన ఊరిలోనే ఉండే జానపద కళాకారులతో వచ్చిన వాళ్ళకి వినోదం కలిగించడం లాంటివి మొదలుపెట్టారు. సందర్భాన్ని బట్టి చక్కటి కార్యక్రమాలకు రూపకల్పన చేయసాగారు. కిషోర్‌బాబు! మీ తాత అందర్నీ ఇందులో కలిపేశాడు. ఆయనకి తన ఒక్కడి పేరు చెప్పడం ఇష్టం ఉండదు. ఇదిగో ఇదే మీ ఇల్లు’’ అంటూ లోపలికి తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా చిన్నప్పటి జ్ఞాపకాలు చుట్టుముట్టాయి. పూల సౌరభాన్ని మించిన జ్ఞాపకపు పరిమళం పిల్లతెమ్మెరలా కమ్మేసింది. ‘‘ఇదిగో ఇదే మీ తాతగారి ఫొటో’’ అంటూ పెద్ద పూలదండతో ఉన్న చిన్నారావు ఫొటోని చూపించాడు.
అది చూస్తూ ఆలోచనలలోకి జారుకున్నాడు. హఠాత్తుగా ఒకరోజున కోటయ్య ఆస్తి డాక్యూమెంట్స్ పంపినప్పుడు ఈ పల్లెటూరులో ఆస్తి నాకెందుకు అమ్మేద్దామని వచ్చాడు, అతని రాకలోని ఆంతర్యం పసిగట్టాడు కోటయ్య.తను కూర్చున్న ఉయ్యాలబల్ల మీద డాక్యుమెంట్స్ కవర్ పెట్టి, ‘‘కోటయ్యగారు! ఇవాళ భోజనం ఏర్పాట్లు ఎక్కడ’’ అని అడిగాడు. ఆ మాటకి ‘‘ఇక్కడే బాబు! అన్నీ సిద్ధంగా ఉన్నాయి’’ అన్నాడు.అతను ఏదో అడగాలని అనుకుంటున్నాడు. అడగలేకపోతున్నాడు. అది చూసి కూడా గమనించనట్లున్నాడు కిషోర్.ఇంతలో అతని ఫోన్ మోగింది. ‘‘హలో.. అవునండీ. ఓహ్ సారీ ఆ ప్రాపర్టీని నేను అమ్మబోవటంలేదు, ఆ డీల్ చెయ్యబోవటంలేదు. ఆపేశాను’’ అని ఫోన్ పెట్టేశాడు. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. ఫోన్‌లో మాట్లాడుతున్న అతన్ని కోటయ్య, అతని భార్య ఇద్దరూ ఆదుర్దాగా చూస్తున్నారు. ‘‘ హే గీతూ మన పొలాలు అమ్మటంలేదు. అదే ఈ నర్సరీ, పూలతోటలు, కోటయ్యగారు చూసుకుంటారు. వివరంగా నేను అక్కడికి వచ్చి చెబుతాను.
ఇంకో ఇంట్రెస్టింగ్ సంగతి, మన నెక్స్›్ట విజిట్ నేను అన్నట్లు స్విస్, ఆమ్‌స్టర్‌డామ్ మటుకు కాదు, అచ్చమైన మన ఊరికి. చూస్తే వదలవు మన ఊరు ఇప్పుడు ఓ పెద్ద పూలవనంలా ఉంది.అంతేకాదు, పూల నర్సరీల యాజమాన్యాలతో చర్చలు జరిపి, ఎకోటూరిజం డెవలప్ చెయ్యాలనే ప్రతిపాదనను అందరూ ఇష్టపడుతున్నారు.అలా కొన్ని పూల నర్సరీలను కలుపుతూ సైక్లింగ్‌తో పాటు నడక, ఈ రెండింటికీ ఒక మార్గం అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన కూడా ఉందట! సో, అప్పుడు ఇంకా ఈ నర్సరీల అందాలను చూసేందుకు మరింతమంది రావడానికి ఉంటుందట! పర్వాలేదు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, నీకు బాగా నచ్చుతుంది’’ అంటూ భార్యతో మాట్లాడుతున్న మాటలు ఆ దంపతులు విన్నారు.వాళ్ళ అనుమానం పటాపంచలయింది. కృతజ్ఞతతో కిషోర్‌వైపు అభిమానంగా చూశారు.