తమిళనాడు పిడి కొళుకట్టై
కావలసినవి: బియ్యప్పిండి– ఒక కప్పు, బెల్లం తురుము– రుచికి సరిపడా, నీళ్లు– కొన్ని, పచ్చికొబ్బరి తురుము– అర కప్పు, ఏలకుల పొడి– కొద్దిగా, నెయ్యి– ఒక టీ స్పూన్, ఉప్పు– చిటికెడు
తయారీ: ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోండి. అందులో బెల్లం తురుము, కొద్దిగా నీళ్లు వేసి స్టవ్‌పై పెట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, అందులో ఏదైనా చెత్త ఉంటే తొలగించడానికి ఆ బెల్లం నీటిని వడకట్టుకోవాలి. వడకట్టిన బెల్లం నీటిని తిరిగి పాన్‌లో పోసి, పాకం పట్టించాలి. అందులో ఏలకుల పొడి, కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా గరిటెతో కలపాలి. నీరు బాగా మరుగుతున్న సమయంలో, మంటను పూర్తిగా తగ్గించాలి.
ఇప్పుడు, బియ్యప్పిండిని కొద్దికొద్దిగా చల్లుతూ, గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. పిండి దగ్గరపడుతూ, ముద్దలా మారడం మొదలవుతుంది. ఆపకుండా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. మొత్తం మిశ్రమం దగ్గరపడి, గిన్నె అంచులను వదిలి ముద్దలా మారిన తర్వాత, వెంటనే మంటను ఆపెయ్యాలి.
ఈ ముద్దను ఒక ప్లేట్‌లోకి తీసుకుని, కాస్త వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసుకుని, ఆ మిశ్రమాన్ని చేతులతో బాగా పిసికి, చిత్రంలో ఉన్న విధంగా చేతులతో ఒత్తుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఈ పిడి కొళుకట్టైను పూజా సమయాల్లో నైవేద్యంగా కూడా పెడతారు.
పాకిస్తాన్ హల్వా పూరీ
కావలసినవి: బొంబాయి రవ్వ– ఒక కప్పు
పంచదార – అర కప్పు, బటర్– పావుకప్పు (కరిగించాలి)
పాలు– రెండున్నర కప్పులు, పలుకులుగా చేసిన నట్స్ – ఒక గుప్పెడు, ఏలకులు – 3, నెయ్యి– 3 టేబుల్‌స్పూన్లు
పూరీలు– 4 లేదా 5 (అభిరుచిని బట్టి పిండిలో పంచదార కూడా వేసుకోవచ్చు)
తయారీ: ముందుగా ఒక పాత్రలో బొంబాయి రవ్వ, నెయ్యి వేసి, గరిటెతో తిప్పుతూ వేయించాలి. రవ్వ మంచి వాసన వచ్చాక, బటర్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఏలకుల పొడి వేసి కలపాలి. తర్వాత పంచదార వేసి, కరిగిపోయే వరకు కలుపుతూ ఉండాలి.
అనంతరం నట్స్ వేసి బాగా కలపాలి. చివరిగా, పాలను నెమ్మదిగా పోస్తూ, జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. దగ్గరపడే వరకు కలుపుతూ, ఉడికించాలి. హల్వా వేడిగా ఉన్నప్పుడే, నెయ్యి వేసుకుని బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు పూరీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
క్రిస్పీ కోకోనట్ చికెన్
కావలసినవి: బోన్‌లెస్ చికెన్– అరకిలో (నిలువుగా కట్ చేసుకోవాలి)
జొన్న పిండి, కొబ్బరి తురుము– పావు కప్పు చొప్పున, గుడ్లు– 2
పాలు– 3 టేబుల్ స్పూన్లు(చిక్కటివి)
పచ్చిమిర్చి పేస్ట్– ఒక టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్– అర టీ స్పూన్
ఇంగువ– చిటికెడు,
నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి– అర టీ స్పూన్ చొప్పున
ఉప్పు, నూనె– సరిపడా
తయారీ: ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని, అందులో చికెన్ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చాట్ మసాలా, నిమ్మరసం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి ముక్కలకు మొత్తం ఆ మిశ్రమాన్ని పట్టించి 2 గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక బౌల్‌లో జొన్న పిండి, ఇంకో బౌల్‌లో పాలు–గుడ్లు మిశ్రమం, మరో బౌల్‌లో కొబ్బరి తురుము వేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్క తీసుకుని, మొదట జొన్నపిండిలో, తర్వాత గుడ్ల మిశ్రమంలో, ఆ తర్వాత కొబ్బరి తురుములో ముంచి, బాగా పట్టించి– నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి.
(చదవండి: ‘విలేజ్ హాలోవీన్ పరేడ్’కి వెళ్లాలంటే..గట్స్ ఉండాలి..!)


