న్యూయార్క్ నగరంలో జరిగే ‘విలేజ్ హాలోవీన్ పరేడ్’కి వెళ్లాలంటే గుండెల్లో దమ్ముండాలి. ఇది గ్రీన్‌విచ్ విలేజ్ పరిసర ప్రాంతంలో ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న రాత్రి ఏడుగంటల నుంచి జరుగుతుంది. ఈ వేడుకలో అడుగడుగునా, దారిపొడవునా హడలెత్తించే రూపాలు దర్శనమిస్తాయి. హాలోవీన్‌లో పాల్గొనే ప్రజలంతా దయ్యాలు, భూతాలు, రక్తపిశాచాలలాంటి భయంకరమైన వేషాలు వేసుకుని తిరుగుతారు.
ఈ హాలోవీన్ పండుగకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అక్టోబర్ 31న వారి కాలమానాల ప్రకారం జీవించి ఉన్న ప్రపంచానికి, చనిపోయిన వారి ఆత్మల లోకానికి మధ్యనున్న తెర పలుచబడుతుందని, దాంతో ఆత్మలు భూమిపైకి వస్తాయని అక్కడివారు నమ్మేవారు. అందుకే చెడు ఆత్మలను తమ దగ్గరికి రాకుండా ఆపడానికి, భయపెట్టడానికి లేదా ఆ ఆత్మలు తమను గుర్తుపట్టకుండా ఉండటానికి ప్రజలు భయంకరమైన లేదా వింతైన వేషాలను ధరిస్తారు.
1974లో చిన్నపాటి కమ్యూనిటీ ఈవెంట్‌గా దీనిని ప్రారంభించారు. ప్రస్తుతం ఇది ప్రపంచంలోనే అతి పెద్ద హాలోవీన్ పరేడ్‌లలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఊరేగింపులో సుమారు 50 వేలమందికి పైగా చిత్రవిచిత్రమైన వేషధారణలతో ఎంట్రీ ఇస్తారు. వేలాదిమంది దీనిని తిలకించడానికి తరలివస్తారు. ఈ పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణ– భారీ తోలుబొమ్మలే.
అవి కూడా హడలెత్తించేలానే హారర్ సీన్‌ను క్రియేట్ చేస్తాయి. ఇందులో పాల్గొనడానికి ఎలాంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. భయపెట్టే కాస్ట్యూమ్ వేసుకున్న ఎవరైనా వచ్చి నేరుగా ఈ ఊరేగింపులో చేరవచ్చు. సాధారణంగా ఈ పరేడ్ మాన్‌హట్టన్‌లోని సిక్స్‌త్ అవెన్యూలో కెనాల్ స్ట్రీట్ నుంచి 15వ వీధి వరకు సాగుతుంది.
నిజానికి ఈ పరేడ్ న్యూయార్క్ నగర ప్రజల సృజనాత్మకతకు ఒక వేదిక. ఈ వేడుకలో పాల్గొనేవారంతా తమకు ఇష్టమైన వేషధారణలో రోడ్లమీదకు వస్తారు. ‘అలా వేరొక వేషధారణలో రావడంతో తమ నిజ జీవిత పాత్రల నుంచి ఒక రాత్రి బయటపడటమనేది ఒక ప్రత్యేక అనుభూతి’ అంటారు వాళ్లంతా. ఏది ఏమైనా ఈ పరేడ్‌లో వణుకు పుట్టించే డెవిల్ వేషాలను చూడాలంటే గుండెల్లో దమ్ము ఉండాల్సిందే మరి!
· సంహిత నిమ్మన
(చదవండి: రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్‌లో..)


