Diwali: జగమంతా దీపావలి | funday special story on diwali festival | Sakshi
Sakshi News home page

Diwali: జగమంతా దీపావలి

Oct 19 2025 7:15 AM | Updated on Oct 19 2025 7:15 AM

funday special story on diwali festival

ఇంటింటా దివ్వెల వరుసలతో అమావాస్య చీకటిని తరిమే పండుగ బాణసంచా రంగుల వెలుగులతో నింగీ నేలా మెరిసి మురిసే పండుగ దేశ దేశాల్లో పిన్నా పెద్దా జరుపుకొనే జగమంత పండుగ దీపావళి

శరన్నవరాత్రులు ముగిశాక కొద్దిరోజుల విరామంలోనే దీపావళి సందడి మొదలవుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మూడు రోజులు, ఉత్తరాది రాష్ట్రాల్లో ఐదు రోజులు ఘనంగా వేడుకలు జరుపుకొంటారు. దక్షిణాదిలో దీపావళికి ముందు ఆశ్వయుజ బహుళ చతుర్దశి నాడు నరక చతుర్దశి, అమావాస్య రోజున దీపావళి, కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలి పాడ్యమి జరుపుకొంటారు. ఉత్తరాదిలో ఆశ్వయుజ బహుళ త్రయోదశిని ధనత్రయోదశిగా, చతుర్దశిని నరక చతుర్దశిగా జరుపుకొంటారు. అమావాస్య రోజున దీపావళి, కార్తీక శుక్ల పాడ్యమి రోజున బలి పాడ్యమి, కార్తీక శుక్ల విదియ రోజున యమద్వితీయ జరుపుకొంటారు. 

ఉత్తరాది, దక్షిణాది ప్రాంతాల్లో దీపావళి వేడుకలలో మరికొన్ని ఆచార భేదాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో విలక్షణమైన వేడుకలు, పూజలు కూడా జరుపుతారు.దీపావళికి మూలమైన నరకాసుర వధ పురాణగాథ అందరికీ తెలిసినదే! వరాహమూర్తికి భూదేవికి పుట్టిన కొడుకు నరకుడు. పెరిగి పెద్దవాడయ్యాక ప్రాగ్జ్యోతిషపురాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు. నరకుడికి శోణితపుర పాలకుడైన బాణాసురుడితో స్నేహం ఏర్పడింది. బాణుడి ప్రోద్బలంతో నరకుడు దుర్మార్గం పట్టాడు. చుట్టుపక్కల రాజ్యాలపై దండెత్తి, ఆ రాజ్యాల రాజకుమార్తెలను తెచ్చి బంధించాడు. 

అలా పదహారువేల మందిని చెరపట్టాడు. కామాఖ్య అమ్మవారిని ఆరాధించే నరకుడు అమ్మవారి ద్వారా అనేక వరాలు పొందాడు. వరగర్వంతో ముల్లోకాలలోనూ జనాలను పీడించడం మొదలుపెట్టాడు. చివరకు స్వర్గంపై దండెత్తి, ఇంద్రుడిని తరిమికొట్టి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. నరకుడి ఆగడాలు శ్రుతి మించడంతో దేవతలందరూ శ్రీమహావిష్ణువుకు మొరపెట్టుకున్నారు. విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా నరకుడితో యుద్ధం చేసి, అంతమొందించాడు. ఆశ్వయుజ బహుళ చతుర్దశి రోజున నరకుడు అంతమొందడంతో ఆ వార్త తెలిసిన జనాలు మర్నాడు అమావాస్య రోజున ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. అప్పటి నుంచి దీపావళి పండుగ రోజున ఇళ్ల ముంగిళ్లలో దీపాలు వరుసగా వెలిగించడం ఆనవాయితీగా వస్తోందనేది పురాణాల కథనం. 

దీపావళి వేడుకల సందర్భంగా పాటించే ఆచారాల గురించి వివిధ వ్రతగ్రంథాలు విపులంగా తెలిపాయి. వీటి ప్రకారం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజున– ధనత్రయోదశి నాడు అపమృత్యు భయ నివారణ కోసం దీపం పెట్టాలి. దీనినే యమదీపం అంటారు. నరకచతుర్దశి రోజున నరకభయ నివారణ కోసం వేకువ జామునే అభ్యంగన స్నానం చేయాలి. సాయంకాలం దేవాలయాలలో దీపాలు వెలిగించాలి. అమావాస్య నాడు మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు బెరళ్లను నీటిలో నానబెట్టి; ఆ నీటితో అభ్యంగన స్నానం చేయాలి. ప్రదోష కాలంలో– అంటే సూర్యాస్తమయానికి ముందు దీపదానం చేసి, ఇంటి బయట జువ్వి కొమ్మలకు మంటపెట్టి, ఆ దివిటీలు తిప్పాలి. వీటిని ఉల్కలు అంటారు. దివిటీలు తిప్పిన తర్వాత లక్ష్మీపూజ చేసి, తీపి పదార్థాలను ఆరగిస్తారు. సూర్యాస్తమయం కాగానే ఇళ్ల ముంగిళ్లలో వరుసగా దీపాలు వెలిగించాలి. 

దీపావళి అమావాస్య రోజు రాత్రి కొన్ని ప్రాంతాల్లోని స్త్రీలు ఇళ్లల్లో చేటలు, పళ్లేలు, తప్పెట్లు వాయిస్తారు. ఇలా చేయడం వల్ల అలక్ష్మి తొలగి, అషై్టశ్వర్యాలు ప్రాప్తిస్తాయని నమ్ముతారు. దీపావళి అమావాస్య రాత్రివేళలోనే ఇళ్లలో బలి చక్రవర్తిని స్థాపిస్తారు. మర్నాడు పాడ్యమి రోజున ఉదయం బలి చక్రవర్తికి ఉత్సవం చేస్తారు. బలి చక్రవర్తి పూజ ముగిశాక ఉదయం వేళలోనే జూదం ఆడతారు. బలి పాడ్యమినాడు ఆడే జూదంలో గెలిచేవారికి ఏడాది మొత్తం శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఇదే రోజున కొన్ని ప్రాంతాల్లో గోవర్ధనపూజ చేస్తారు. ఆ రోజు పాడి పశువులను అలంకరించి, వాటికి ఆటవిడుపునిస్తారు. యమ ద్వితీయ రోజును భ్రాతృ ద్వితీయ అని కూడా అంటారు. ఆ రోజున సోదరీమణులు తమ సోదరులను ఇళ్లకు పిలిచి, విందుభోజనాలు పెడతారు.

బాణసంచా సందడి
దీపావళి రోజున బాణసంచా కాల్చడం తరతరాలుగా సాగుతోంది. చైనాలో పుట్టిన బాణసంచా అక్కడి నుంచి దేశదేశాలకు వ్యాపించింది. దీపావళి వేడుకల్లో బాణసంచా కాల్చడం దాదాపు పదిహేనో శతాబ్ది నుంచి మొదలై ఉంటుందని చరిత్రకారుల అంచనా. పద్దెనిమిది, పంతొమ్మిదో శతాబ్దాలలో బాణసంచాకు ఆదరణ తారస్థాయికి చేరుకుంది. దీపావళి పండుగ రోజున మాత్రమే కాకుండా; పెళ్లిళ్లు తదితర వేడుకల్లో కూడా బాణసంచా కాల్చడం పదిహేనో శతాబ్ది నుంచి కొనసాగుతోంది. గుజరాత్‌ ప్రాంతంలో 1518 సంవత్సరంలో ఒక పెళ్లివేడుకలో వీథుల్లో బాణసంచా కాల్పులతో జరిగిన సంరంభాన్ని పోర్చుగీసు యాత్రికుడు బార్బోసా విపులంగా రాశాడు. మొఘల్‌ సామ్రాజ్యంలో బాణసంచాకు అమితమైన ఆదరణ ఉండేది. ఔరంగజేబు మినహా మొఘల్‌ చక్రవర్తులందరూ బాణసంచా కాల్పులను, బాణసంచా తయారీ నిపుణులను బాగా ఆదరించారు. 

బ్రిటిష్‌ హయాంలో కూడా బాణసంచా కాల్పుల ప్రదర్శనకు మంచి ఆదరణ ఉండేది. బ్రిటిష్‌ కాలంలోనే తమిళనాడులోని శివకాశి బాణసంచా తయారీకి ప్రధాన కేంద్రంగా ఏర్పడింది. తొలిరోజుల్లో శివకాశిలో ఎవరికి వారు కుటీర పరిశ్రమలా బాణసంచా తయారు చేసేవారు. సరిగా వందేళ్ల కిందట– 1925లో అయన్‌ నాడద శివకాశిలో ‘నేషనల్‌ ఫైర్‌వర్క్స్‌’ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత శివకాశిలో ఇబ్బడి ముబ్బడిగా బాణసంచా తయారీ సంస్థలు ఏర్పడ్డాయి. శివకాశిలో తయారయ్యే బాణసంచా ఉత్పత్తులు విదేశాలకు కూడా భారీ ఎత్తున ఎగుమతి అవుతున్నాయి. దేశంలో తయారయ్యే బాణసంచా సామగ్రిలో ఎనభై శాతం శివకాశిలోనే తయారవుతున్నాయంటే, ఈ పట్టణంలో బాణసంచా పరిశ్రమ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. శివకాశిలో బాణసంచా ఉత్పత్తుల విక్రయాల విలువ ఏటా రూ.26 వేల కోట్ల మేరకు ఉంటుందని తాజా అంచనాలు చెబుతున్నాయి.

పెరిగిన కాలుష్య స్పృహ
బాణసంచా వల్ల వాతావరణ కాలుష్యం, ధ్వని కాలుష్యం ఫలితంగా ఏర్పడే ఆరోగ్య సమస్యలపై గడచిన పాతికేళ్లుగా జనాల్లో అవగాహన పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు బాణసంచా తయారీ, వినియోగాలపై ఆంక్షలు విధించడం కూడా మొదలైంది. ప్రభుత్వాల ఆంక్షల వల్ల బాణసంచా తయారీ సంస్థలు నిబంధనలకు లోబడి పర్యావరణానికి తక్కువ హాని కలిగించే, ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ తయారు చేస్తున్నాయి. బాణసంచా తయారీలో ధ్వనికాలుష్య నియంత్రణకు సంబంధించి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. బాణసంచా తయారీ సంస్థలు ఈ మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనంటూ 2001లో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి దేశంలోని బాణసంచా తయారీ సంస్థలు నిబంధనలకు లోబడి ‘గ్రీన్‌ క్రాకర్స్‌’ తయారీని ప్రారంభించాయి. 

అయినప్పటికీ పలుచోట్ల పాత పద్ధతిలోనే బాణసంచా తయారీ కొనసాగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ‘నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌’ (ఎన్‌జీటీ) 2020లో సంప్రదాయ బాణసంచాపై పూర్తి నిషేధం విధించింది. బాణసంచా కాలుష్య ప్రమాణాలను ధ్రువీకరించే లాబొరేటరీ ఇదివరకు నాగపూర్‌లో ఉండేది. శివకాశిలో తయారయ్యే బాణసంచా నమూనాలను అక్కడకు పంపేవారు. అక్కడి నుంచి ధ్రువీకరణ లభించాక మార్కెట్‌లోకి విడుదల చేసేవారు. శివకాశిలోనే బాణసంచా ప్రమాణాలను పరిశీలించి, ధ్రువీకరించేందుకు కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండిస్ట్రియల్‌ రీసెర్చ్‌ (సీఎస్‌ఐఆర్‌), నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (నీరి) ఉమ్మడిగా ‘సీఎస్‌ఐఆర్‌–నీరి’ లాబొరేటరీని 2019 ఆగస్టులో రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఈ లాబొరేటరీ శివకాశిలో తయారయ్యే బాణసంచా నమూనాలను ఎప్పటికప్పుడు పరిశీలించి, సత్వరమే ధ్రువీకరిస్తోంది.

బాణసంచాతో ఆరోగ్య సమస్యలు
బాణసంచా కాల్చడం వల్ల ఎక్కువగా చిన్నారులలో, వృద్ధులలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. వారితో పాటు ఇదివరకే ఉబ్బసం తదితర శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి, గర్భిణులకు, అలెర్జీలతో బాధపడేవారికి ఆరోగ్య సమస్యలు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. బాణసంచా కాల్పుల్లో వెలువడే పొగలో అత్యంత సూక్షా్మతి సూక్ష్మమైన (పీఎం2.5) పరిమాణంలోని రసాయనిక కణాలు ఊపిరితిత్తుల్లోకి చొరబడి శ్వాసనాళం వాపు, విపరీతమైన దగ్గు, ఉబ్బసం, బ్రోంకైటిస్‌ వంటి శ్వాసకోశ వ్యాధులు తలెత్తుతాయి. ఈ సూక్ష్మ రసాయనిక కణాలు రక్తంలోకి చేరితే అధిక రక్తపోటు, గుండెజబ్బులు, పక్షవాతం వంటి తీవ్ర సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే, వాటి మంటలు అంటుకుని, కాలిన గాయాలు, పేలుళ్ల శబ్దతీవ్రతకు చెవుల వినికిడి శక్తి దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. బాణసంచా వెలుగులు, రంగులు ఆహ్లాదాన్ని ఇచ్చినా, తగిన జాగ్రత్తలతో కాల్చితేనే పండుగ ఆనందభరితంగా ఉంటుంది.

జైనులకు, సిక్కులకు పర్వదినం
దీపావళి హిందువులకు మాత్రమే కాదు జైనులకు, సిక్కులకు కూడా పర్వదినం. జైనుల ఇరవైనాలుగో తీర్థంకరుడైన మహావీరుడు ఇదేరోజున నిర్యాణం పొందాడు. అందువల్ల దీపావళి రోజున జైనులు తమ మందిరాలను దీపాలతో అలంకరించి, ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. జైన పండితుడు ఆచార్య జినసేన క్రీస్తుశకం 705లో రచించిన ‘హరివంశపురాణం’లో దీపావళిని ‘దీపాలికాయ’ అనే పేరుతో ప్రస్తావించాడు. మహావీరుడు నిర్యాణం చెందిన ఈ రోజున దీపాలను వెలిగించే సంప్రదాయాన్ని జైనులు తప్పనిసరిగా పాటిస్తారు. దీపావళి మరునాడు కార్తీక శుక్ల పాడ్యమి నుంచి జైనులకు కొత్త సంవత్సరం మొదలవుతుంది.
సిక్కులు దీపావళిని ‘బందీ ఛోడ్‌ దివస్‌’గా జరుపుకొంటారు. సిక్కుల ఆరో గురువు హరగోబింద్, తన 52 మంది అనుచరులతో కలసి ఖైదు నుంచి విడుదలైన రోజు కావడంతో సిక్కులు దీపావళిని ఖైదు విమోచన దినంగా జరుపుకొంటారు. హరగోబింద్‌ను నాటి మొఘల్‌ చక్రవర్తి జహంగీర్‌ గ్వాలియర్‌ కోటలో బంధించాడు. తర్వాత 1619 సంతవ్సరం దీపావళి రోజున ఆ చెర నుంచి విడుదల చేశాడు. సిక్కులు దీపావళి రోజున గురుద్వారాలలో దీపాలు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాలు జరుపుకొంటారు. రాత్రివేళ బాణసంచా కాలుస్తూ సందడి చేస్తారు.
దీపావళి ముమ్మతాల పండుగ
దీపావళి జగమంతా వేడుక

దీప ప్రశస్తి
దీపం చీకటిని తరిమికొట్టి వెలుగును వెదజల్లుతుంది. దీపాన్ని జ్ఞానానికి, ఆనందానికి, సద్గుణ సంపత్తికి ప్రతీకగా భావిస్తారు. దీపాన్ని లక్ష్మీస్వరూపంగా ఆరాధిస్తారు. దీప ప్రశస్తిని తెలిపే పురాణగాథలు  ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది దేవేంద్రుడు దుర్వాసుడి ఆగ్రహానికి గురికావడం వల్ల తన రాజ్యాన్ని, సంపదలను పోగొట్టుకున్న ఉదంతం. దుర్వాసుడు ఒకసారి స్వర్గానికి వెళ్లాడు. దేవేంద్రుడు అతడికి స్వాగత సత్కారాలు చేసి, చక్కని ఆతిథ్యం ఇచ్చాడు. ఇంద్రుడి ఆతిథ్యానికి దుర్వాసుడు తృప్తిచెందాడు. స్వర్గం నుంచి తిరిగి బయలుదేరే ముందు ఇంద్రుడికి కానుకగా ఒక హారాన్ని ఇచ్చాడు. ఇంద్రుడు ఆ హారాన్ని నిర్లక్ష్యంగా అందుకుని, తన పట్టపుటేనుగు ఐరావతానికి అందించాడు. ఐరావతం ఆ హారాన్ని నేలపై పడేసి, కాళ్లతో తొక్కి చిందరవందర చేసింది. 

ఈ దృశ్యం చూసి ఆగ్రహించిన దుర్వాసుడు ఇంద్రుడిని శపించాడు. ఫలితంగా ఇంద్రుడు తన స్వర్గాన్ని, సిరిసంపదలను కోల్పోయాడు. సర్వం కోల్పోవడంతో ఇంద్రుడు దిక్కుతోచక శ్రీమహావిష్ణువును ప్రార్థించాడు. శ్రీమహావిష్ణువు ఒక దీపాన్ని వెలిగించి, ఇంద్రుడి చేతికి ఇచ్చాడు. ఆ దీపాన్ని మహాలక్ష్మీదేవిగా తలచి, పూజించమన్నాడు. దేవేంద్రుడు ఆ దీపాన్ని పూజించాడు. మహాలక్ష్మి అనుగ్రహం పొంది; తిరిగి స్వర్గాధిపత్యాన్ని, కోల్పోయిన సమస్త సంపదలను పొందాడు. ఈ పురాణ గాథ నేపథ్యంలోనే దీపావళి రోజున దీపాలు వెలిగించి, మహాలక్ష్మీదేవిని పూజించడం సంప్రదాయంగా వస్తోంది. దీపావళి తర్వాత వచ్చే కార్తీక మాసమంతా దీపారాధన చేయడం కూడా సంప్రదాయంగా వస్తోంది. దీపదానం చేయడం వల్ల నరకబాధ తప్పుతుందని కొందరు నమ్ముతారు.

దేశదేశాల్లో దీపావళి
దీపావళి వేడుకలు భారత్‌తో పాటు భారత సంతతి ప్రజలు ఎక్కువగా నివసించే వివిధ దేశాల్లో ఘనంగా జరుగుతాయి. దాదాపు ఇరవై దేశాలలో దీపావళి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. హిందువులు ఎక్కువగా నివసించే నేపాల్, శ్రీలంక, మారిషస్‌ దేశాలతో పాటు అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో, సురినేమ్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, మలేసియా, థాయ్‌లాండ్, మయాన్మార్, ఫిజి, గయానా తదితర దేశాల్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లో దీపావళి సందర్భంగా ‘తీహార్‌’ వేడుకలను ఐదురోజుల పాటు జరుపుకొంటారు. ఈ సందర్భంగా విందు వినోదాలు; బాణసంచా సంబరాలు జరుపుకోవడంతో పాటు కాకులు, శునకాలు, గోవులను పూజించి, వాటికి ప్రత్యేకంగా ఆహారం పెడతారు. సింగపూర్‌లోని లిటిల్‌ ఇండియా ప్రాంతంలో దీపావళి వేడుకలు దేదీప్యమానంగా జరుగుతాయి. 

దీపావళి పండుగను ఫిజి, గయానా, మలేసియా, మారిషస్, మయాన్మార్, నేపాల్, సింగపూర్, శ్రీలంక, సురినేమ్, ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో దేశాలు అధికారిక సెలవుదినంగా పాటిస్తున్నాయి. అమెరికాలో కూడా దీపావళిని జాతీయ సెలవు దినంగా ప్రకటించే దిశగా అక్కడ స్థిరపడ్డ భారత సంతతి ప్రజలు అమెరికన్‌ ప్రభుత్వంపై కొన్నేళ్లుగా ఒత్తిడి తెస్తున్నారు. అమెరికాలో దీపావళి అధికారికంగా జాతీయ సెలవుదినం కాకున్నా, పెన్సిల్వేనియా వంటి కొన్ని రాష్ట్రాలు దీపావళిని సెలవు దినంగా పాటిస్తున్నాయి. కొన్నేళ్లుగా దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్ష నివాసమైన వైట్‌హౌస్‌లో వేడుకలు జరుపుతున్నారు. అలాగే బ్రిటన్‌ ప్రధాని అధికారిక నివాసంలో కూడా కొన్నేళ్లుగా దీపావళి వేడుకలు జరుపుతూ వస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement