ఇక్ష్వాకుడికి వందమంది కొడుకులు. వారిలో అందరికంటే చిన్నవాడు చదువు సంధ్యలు లేక మూఢుడిగా మారాడు. పెద్దలను ఏమాత్రం లెక్కచేసేవాడు కాదు. అన్నలను ధిక్కరించేవాడు. ‘వీడి శరీరంపై దండం పడక తప్పదు’ అనుకునేవాడు ఇక్ష్వాకుడు. అల్పతేజస్కుడైన చిన్న కొడుకుకు దండుడు అని పేరుపెట్టాడు. సమస్త భూమండలాన్నీ పాలించిన ఇక్ష్వాకుడు తన కొడుకులందరికీ రాజ్యాలు ఇచ్చాడు. చిన్నకొడుకైన దండుడికి తగిన రాజ్యం కోసం అన్వేషించి, చివరకు వింధ్య, శైవల పర్వతాల మధ్యగల ప్రదేశాన్ని దండుడికి రాజ్యంగా ఇచ్చాడు.
దండుడు ఆ పర్వత మధ్య ప్రాంతానికి వెళ్లి, అక్కడ నివాసయోగ్యమైన గొప్ప పట్టణాన్ని నిర్మించుకుని, దానికి మధుమంతమని పేరుపెట్టాడు. మధుమంతపురాన్ని రాజధానిగా చేసుకుని, దండుడు పరిపాలన సాగించేవాడు. దానవ గురువైన శుక్రాచార్యుడిని తన పురోహితుడిగా నియమించుకున్నాడు. దండుడు తన రాజ్యాన్ని వైభవోపేతంగా పాలించసాగాడు. బృహస్పతిని పురోహితుడిగా చేసుకున్న దేవేంద్రుడిలా; శుక్రాచార్యుడిని పురోహితుడిగా చేసుకున్న దండుడు తన రాజ్యాన్ని స్వర్గతుల్యంగా తీర్చిదిద్దాడు. తన శౌర్య పరాక్రమాలతో రాజ్యానికి శత్రుబాధ లేకుండా చేశాడు. దండుడి పరిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో ఉండేవారు.ఇలా సాగుతుండగా దండుడు చైత్రమాసంలో ఒక రోజున వనవిహారానికి వెళ్లాడు.
వసంత శోభతో వనమంతా కళకళలాడుతూ ఉల్లాసభరితంగా ఉంది. పక్షుల కిలకిలరావాలు తప్ప అక్కడ మరెలాంటి రణగొణలు లేకపోవడంతో వాతావరణం ప్రశాంతంగా ఉంది. అదే వనంలో శుక్రాచార్యుడి ఆశ్రమం ఉంది. శుక్రాచార్యులను దర్శించుకుందామని దండుడు ఆయన ఆశ్రమం వైపు బయలుదేరాడు. శుక్రాచార్యుడి ఆశ్రమ వాటికలో ఒక ముగ్ధమనోహరి పూలు కోసుకుంటూ కనిపించింది. ఆమె శుక్రాచార్యుడి కుమార్తె. ఆ సమయంలో శుక్రాచార్యుడు ఆశ్రమంలో లేడు. సమిధల కోసం శిష్యులతో కలసి అడవిలోకి వెళ్లాడు.ఆశ్రమం ఆవరణలో ఒంటరిగా కనిపించిన శుక్రాచార్యుడి పుత్రికను చూసి, దండుడికి మతి చలించింది. ఆమెను చూసీ చూడటంతోనే మోహావేశం పొందాడు. వడివడిగా ఆమెను సమీపించాడు.‘సుందరీ! నువ్వెవరివి? నిన్ను చూసిన క్షణంలోనే నా మనసు వశం తప్పింది. నీ పొందుతోనే నాకు మోక్షం లభించగలదు. నన్ను కాదనకు’ అని పలికాడు.
అతడి మాటలకు ఆమె విచలితురాలైంది.‘రాజా! నేను శుక్రాచార్యుల జ్యేష్ఠపుత్రికను. నా పేరు అరజ. నా తండ్రి నీ గురువు. నువ్వు ఆయన శిష్యుడివి. మహా తపశ్శాలి అయిన ఆయనకు ఆగ్రహం కలిగిస్తే, నీకు అనర్థం తప్పదు. నన్ను పరిణయం చేసుకోవాలనే ఉద్దేశం ఉన్నట్లయితే, ధర్మసమ్మతమైన మార్గంలో నా తండ్రిని అర్థించు. అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే, నీకు ముప్పు తప్పదు’ అని హెచ్చరించింది. మోహావేశంలో యుక్తాయుక్త విచక్షణ కోల్పోయిన దండుడు ఆమె మాటలను పట్టించుకోలేదు. ‘సుందరీ! అనవసరంగా కాలాన్ని వృథా చేయకు. నువ్వు కాదంటే, నా ప్రాణం పోయేలా ఉంది. నిన్ను పొందిన తర్వాత నాకు మరణమే వచ్చినా, పాపమే చుట్టుకున్నా, మరే ఆపద వచ్చినా నేను చింతించను. ఇక జాగు చేయకు’ అంటూ ఆమెను తన బాహువులతో బంధించాడు. ఆమె విలపిస్తూ, వారించినా వినిపించుకోకుండా ఆమెను బలాత్కరించి, అక్కడి నుంచి తన రాజధానికి వెళ్లిపోయాడు.
కొద్దిసేపటికి శుక్రాచార్యుడు ఆశ్రమానికి వచ్చాడు. దీనురాలిలా విలపిస్తున్న అరజను చూశాడు. జరిగిన ఘోరాన్ని తెలుసుకుని ఆగ్రహోదగ్రుడయ్యాడు. పక్కనే ఉన్న శిష్యులతో, ‘దండుడికి ఎలాంటి ఘోరమైన ఆపద రాబోతోందో వినండి. అగ్నిజ్వాలలాంటి నా కుమార్తెను స్పృశించిన దురాత్ముడు దండుడి పరివారానికి వినాశనం సమీపించింది. ఈ దుర్మార్గుడు తన పాపకర్మకు తప్పక తగిన ఫలితాన్ని అనుభవించగలడు. ఇతడి దేశానికి నూరుయోజనాల పరిధిలో ఇంద్రుడు ధూళి వర్షాన్ని కురిపించి, నాశనం చేయగలడు. ఏడురోజులు అహోరాత్రులు కురిసిన ధూళివర్షంలో దండుడి రాజ్యం పూర్తిగా నశిస్తుంది. మీరందరూ రాజ్యానికి సరిహద్దులు దాటి వెళ్లండి’ అని చెప్పాడు.
తర్వాత అరజతో ‘నువ్వు ఈ ఆశ్రమంలోనే యోగాభ్యాసం చేస్తూ కాలం గడుపు. ఈ ఆశ్రమం, దీని ఎదుట యోజనం విశాలమైన సరోవరం, ఈ ఆశ్రమ పరిధిలో నీ చెంత ఉండే ప్రాణులకు ధూళివర్షం వల్ల ఎలాంటి ఆపదా రాదు. నువ్వు కాలం కోసం నిరీక్షించు’ అని పలికి, దండుడి రాజ్యాన్ని విడిచి శిష్యసమేతంగా శుక్రాచార్యుడు వెళ్లిపోయాడు.శుక్రాచార్యుడు దండుడి రాజ్యాన్ని విడిచి వెళ్లగానే, ధూళి వర్షం కురిసింది. ఏడురోజులు తెరిపి లేకుండా కురిసిన ధూళి వర్షంలో దండుడి రాజ్యం నామరూపాలు లేకుండా సర్వనాశనమైంది. దండుడు, అతడి పరివారం, భృత్యులు ప్రాణాలు కోల్పోయారు.
కొంతకాలం గడిచాక దండుడు రాజ్యం ఏలిన ప్రాంతంలో దట్టమైన కీకారణ్యం ఏర్పడింది. మునులు అక్కడకు చేరుకుని, ఏకాంత ప్రదేశంలో తపస్సు చేసుకునేవారు. దండుడి రాజ్యంలో ఏర్పడిన అరణ్యం కనుక దీనికి దండకారణ్యం అనే పేరు వచ్చింది. మునిజనులు నివాసం ఏర్పరచుకోవడం వల్ల జనస్థానమనే పేరు కూడా వచ్చింది. వనవాస సమయంలో రాముడు కొన్నాళ్లు దండకారణ్యంలో గడిపాడు. ఆ కాలంలోనే అగస్త్య మహర్షి రాముడికి దండకారణ్యానికి సంబంధించిన ఈ వృత్తాంతాన్ని చెప్పాడు.
∙సాంఖ్యాయన
నిన్ను పొందిన తర్వాత నాకు మరణమే వచ్చినా, పాపమే చుట్టుకున్నా, మరే ఆపద వచ్చినా నేను చింతించను.


