
హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు 2007లో నమోదు చేసిన నకిలీ పాస్‌పోర్టుల కుంభకోణం కేసు దర్యాప్తులో రీల్ సీన్‌ను తలపించే రియల్ సీన్ జరిగింది. ఆ స్కామ్‌లో కీలక నిందితుడిగా ఉన్న మహ్మద్ రషీద్ అలీ లొంగుబాటు నేపథ్యంలో అది చోటు చేసుకుంది. టూరిస్ట్ సహా వివిధ వీసాలపై వచ్చి, అక్రమంగా స్థిరపడుతున్న వారిని అరికట్టడానికి అమెరికా, యూకే తదితర దేశాలు గుజరాత్‌కు చెందిన మహిళలు, యువతులకు వీసా ఇవ్వడం మానేశాయి. అయితే రాజకీయ నాయకుల సిఫారసుతో వారి కుటుంబీకులు, సంబంధీకులకు మాత్రం వీటిని జారీ చేసేవి. దీంతో మనుషుల అక్రమ రవాణా కుంభకోణానికి తెరలేచింది.
గుజరాత్‌కు చెందిన వారిని అనేకమందిని ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సంబంధీకులుగా చూపించారు. అలా నకిలీ పాస్‌పోర్ట్స్ జారీ చేయించి, ప్రత్యేక సిఫారసులతో వీసాలు సంపాదించి అక్రమ రవాణా చేశారు. 2007 ఏప్రిల్‌లో నాటి బీజేపీ ఎంపీ బాబూభాయ్ కటారా ఢిల్లీ విమానాశ్రయంలో అరెçస్టయ్యారు. అలా దొరికిన ఈ మనుషుల అక్రమ రవాణా తీగ లాగితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ డొంక కదిలింది. దేశవ్యాప్తంగా అనేక మంది రాజకీయ నాయకులకు ఈ స్కామ్‌లో ‘దళారి’గా వ్యవహరించిన రషీద్ పేరు వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌కు చెందిన మహ్మద్ రషీద్ అలీ, చప్పల్‌బజార్ వాసి రాజు పిత్తీ 2005 నుంచి స్నేహితులు. వ్యాపారి, క్రికెట్ బుకీ అయిన రాజు– రషీద్‌కు అవసరమైన సొమ్మును వడ్డీకి ఇచ్చేవాడు. ఓసారి రషీద్ మనుషుల అక్రమ రవాణా వ్యవహారాన్ని రాజుకు చెప్పాడు. ఆపై గుజరాత్‌కు చెందిన భరత్ భాయ్‌ని రాజు కలుసుకున్నాడు. అతడితో కలిసి నకిలీ పాస్‌పోర్ట్స్ తయారీ ప్రారంభించాడు. ఈ ద్వయం అనేక మంది గుజరాతీలను ప్రముఖ రాజకీయ నాయకుల బంధువులు, కుటుంబ సభ్యులుగా చెబుతూ నకిలీ పాస్‌పోర్ట్స్ ఇప్పించే వారు. దీని కోసం సదరు నేతలకు భారీగానే ముట్టచెప్పేవారు. 2006 నవంబరులో రషీద్ నుంచి రాజు పిత్తీకి ఓ సందేశం అందింది. నేరెళ్ల, బో«ద్ నియోజకవర్గాలకు చెందిన అప్పటి ఎమ్మెల్యేలు కాసిపేట లింగయ్య, సోయం బాబూరావు తమకు సహకరించడానికి సమ్మతించారన్నది దాని సారాంశం.
ఇలా ప్రారంభమైన వ్యవహారం 2007 మేలో ఢిల్లీలో బాబూభాయ్ కటారా, నగరంలో లింగయ్య, బాబూరావు అరెస్టులతో సంచలనంగా మారింది. హైదరాబాద్ సీసీఎస్‌లోనూ నకిలీ పాస్‌పోర్టు స్కామ్, మనుషుల అక్రమ రవాణాపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో రషీద్ అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారాడు. ఇతడితో పాటు మహ్మద్ ముజఫర్ అలీఖాన్, భరత్‌భాయ్, షకీల్‌ల కోసం వేట ప్రారంభమైంది. ఆ కేసు నమోదైన రోజు నుంచి సీసీఎస్ కార్యాలయం హడావుడిగా మారింది. స్థానిక, జాతీయ మీడియా తాకిడితో ఉక్కిరిబిక్కిరైన సీసీఎస్ పోలీసులు ఎవరినీ లోపలకు అనుమతించవద్దంటూ గేటు వద్ద విధుల్లో ఉండే సెంట్రీకి స్పష్టం చేశారు. అయినా కొందరు మీడియా ప్రతినిధులు సెంట్రీ కళ్లుగప్పి లోపలకు వెళ్లారు. దీంతో ఉన్నతాధికారులు ఆ సెంట్రీని హెచ్చరించి, గేటుకు తాళాలు వేయించారు.
రషీద్ కోసం ఢిల్లీ, సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసుల వేట ముమ్మరమైంది. అయితే అప్పటికి అతడి ఫొటో ఎవరి వద్దా అందుబాటులో లేదు. రషీద్ ఒక దశలో పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. వారి ‘ట్రీట్‌మెంట్’ను తప్పించుకోవడానికి కొందరు మీడియా ప్రతినిధుల ద్వారా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపాడు. చివరకు 2007 మే 3న అతడి లొంగుబాటుకు ముహూర్తం ఖరారైంది. ఆ రోజు రషీద్ తన న్యాయవాది, ఇద్దరు మీడియా వ్యక్తులతో కలిసి నేరుగా సీసీఎస్ వద్దకు వచ్చాడు. కాస్త దూరంలో వాహనం దిగిన వీళ్లు నడుచుకుంటూ ఆ కార్యాలయం గేటు వద్దకు చేరుకున్నారు. రషీద్ లొంగిపోవాలనే ఉద్దేశంతో లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సెంట్రీ అతడితో పాటు వెంట ఉన్న వారినీ అడ్డుకున్నాడు. ‘నేను రషీద్‌ని... లొంగిపోతా’ అని చెబుతున్నా వినకుండా బయటకు నెట్టేసినంత పని చేశాడు.
దీంతో అవాక్కైన రషీద్ వెంట వచ్చిన మీడియా ప్రతినిధులు విషయాన్ని ఫోన్ ద్వారా కేసు దర్యాప్తు అధికారికి చెప్పారు. అంతే! రెండో అంతస్తు నుంచి ఉరుకులు పరుగుల మీద వచ్చి ఆయన బృందం రషీద్‌ను తమ వెంట తీసుకువెళ్లింది. రషీద్ విచారణ, అరెస్టు తతంగాలు పూర్తి కావడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఈ అరెస్టు జరిగిన పుష్కర కాలం తర్వాత రషీద్ మరోసారి కటకటాల్లోకి వెళ్లాడు. ఆదాయపు పన్ను శాఖ పేరు చెప్పి ఇద్దరు వ్యక్తుల నుంచి రూ.91 లక్షలు కాజేసిన కేసులో అదే సీసీఎస్ పోలీసులు 2018 జూన్ 20న జైలుకు పంపారు.
హైదరాబాద్, ఢిల్లీలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో తనకు భారీగా ఆస్తులు ఉన్నట్లు రషీద్ డాక్యుమెంట్లు తయారు చేశాడు. తాను ఆదాయపు పన్ను శాఖకు పన్ను బకాయి పడినట్లు, వారు నోటీసులు జారీ చేసినట్లూ నకిలీ నోటీసులు సృష్టించాడు. నోటీసులు అందుకున్నప్పటికీ తాను ఆ మొత్తం చెల్లించకపోవడంతో తనకున్న ఆస్తుల్ని ఐటీ విభాగం అధికారులు సీజ్ చేస్తూ వారు జారీ చేసినట్లు ఓ సీజర్ రిపోర్ట్ సైతం రూపొందించాడు. దీనిపై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన లోగోలు, అధికారుల సంతకాలు సైతం తయారు చేశాడు. ఈ సీజర్ రిపోర్ట్‌తో పాటు ఆస్తుల జాబితా కూడా రూపొందించిన రషీద్ అలీ వీటితో పాటు అప్పటికే సిద్ధం చేసి ఉంచిన నకిలీ ఆస్తుల పత్రాలను జత చేశాడు.
ఇలా రూపొందించిన ఫైల్‌ను వెంటేసుకునే ఇతగాడు ఖరీదైన కార్లతో తిరుగుతూ పరిచయస్తులతో పాటు వారి ద్వారా పరిచయమైన వారికీ చూపించాడు. కేవలం రూ.కోటి, రూ.2 కోట్ల పన్ను చెల్లించనందుకు రూ.200 కోట్ల ఆస్తులు సీజ్ అయ్యాయంటూ నమ్మించాడు. తాను చెల్లించాల్సిన పన్ను మొత్తం ఏర్పాటు చేస్తే ఐటీ విభాగానికి జమ చేసి తన ఆస్తులు విడిపించుకుంటానని, ఆ వెంటనే కొన్నింటికి విక్రయించి అసలుతో పాటు భారీ మొత్తం వడ్డీగా ఇస్తానంటూ ఎర వేసేవాడు. ఈ పేరుతో సయ్యద్ అనీస్ హైదర్, హరీష్ కుమార్‌ల నుంచి రూ.91 లక్షలు తీసుకుని మోసం చేశాడనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ.
∙