బాల్యం నుంచే కెమెరా వెలుగుల్లో పెరిగినా, ఆ వెలుగు ఆమె తలకెక్కలేదు. గ్లామర్‌ను అలవోకగా దాటేసి, క్రమశిక్షణను తన నిజమైన బలంగా మార్చుకుంది. అందుకే హిట్స్, ఫ్లాప్స్‌కు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో సైలెంట్‌గా, చాలా స్ట్రాంగ్‌గా స్థానం దక్కించుకుంది నటి మెహ్రీన్ పీర్జాదా. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే..
⇒ చిన్నప్పటి నుంచే కెమెరా నాకు కొత్త కాదు. పదేళ్ల వయసులోనే ర్యాంప్‌పై నడిచాను. అప్పట్లో అది సరదా, ఇప్పుడు అదే నా జీవితం.
⇒ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, నేను భరతనాట్యం డ్యాన్సర్‌ని, ఎయిర్ పిస్టల్ షూటర్‌ని నాట్యంలోను, పిస్టల్ షూటింగ్‌లోను నేర్చుకున్న క్రమశిక్షణే నన్ను జీవితంలో బ్యాలెన్స్సడ్‌గా ఉంచింది.
⇒ ‘కృష్ణగాడి వీర ప్రేమగా«థ’ నా ప్రయాణానికి అసలు మలుపు. మొదటి సినిమా భయం, మొదటి విజయపు ఆనందం అన్నీ ఆ ఒక్క సినిమాతోనే.
⇒ ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘ఎఫ్2’, ‘ఎఫ్3’ ఇలా ప్రతి సినిమా నాలో కొత్త కోణాన్ని బయటకు తీసింది. ఒక విధంగా నటనే నన్ను నేను పూర్తిగా అర్థం చేసుకునేలా చేసింది.
⇒ ట్రెక్కింగ్ అంటే నాకు ప్రాణం. గోముఖ్ ట్రెక్ చేసిన తర్వాత జీవితం మీద గౌరవం మరింత పెరిగింది. ప్రకృతి ముందు మనం ఎంత చిన్నవాళ్లమో అప్పుడు తెలిసింది.
⇒ నాకు ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. మా ఇల్లు చూస్తే అది మీకే అర్థమవుతుంది. ఆ రంగు నాకు ప్రశాంతత ఇస్తుంది.
⇒ ప్రయాణాలు నాకు జ్ఞాపకాలే కాదు, ఆనందాలూ ఇస్తాయి. ప్రతి దేశం నుంచి తెచ్చుకున్న చిన్న ఫ్రిజ్ మాగ్నెట్స్ చూస్తేనే చిరునవ్వు వస్తుంది. ఫిన్లండ్‌లో ఇగ్లూ రూమ్ నుంచి చూసిన నార్తర్న్ లైట్స్ ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతాయి.
⇒ లాక్‌డౌన్ సమయంలో నన్ను నేనే రీడిజైన్ చేసుకున్నాను. ఫిట్‌నెస్, వంట, పెయింటింగ్ నేర్చుకున్నాను. అప్పుడే మనతో మనమే ఉండటం కూడా అవసరమే అని అర్థమైంది.
⇒ 2021లో రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య బిష్ణోయితో జరిగిన ఎంగేజ్మెంట్ రద్దుచేసుకున్నప్పడు, వచ్చిన గాసిప్స్‌కు చాలా బాధపడ్డాను. కాని, ఇప్పుడు అవి గాలి లాంటివే వస్తుంటాయి, పోతుంటాయని అర్థమైంది. ఫేక్ హెడ్‌లైన్స్స నాకు అస్సలు నచ్చవు. చిన్నపాటి ఫేమ్ కోసం అబద్ధాలు సృష్టించేవారికి నేను దూరంగా ఉంటాను.
⇒ తెలుగు ఇండస్ట్రీ నాకు ఇల్లులాంటిది. ఇక్కడ ప్రేక్షకులు నటనలో నిజాన్ని వెంటనే గుర్తిస్తారు. అదే నన్ను ఎప్పుడూ జాగ్రత్తగా ఉంచుతుంది. అందుకే, అభిమానుల నమ్మకమే నాకు అసలు అవార్డు.


