అది హైద్రాబాద్‌లోని పాపులర్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటి. దాని ప్రిన్సిపాల్ వైద్యరాజ్ గదిలోకి వచ్చిన ప్యూన్ ఓ కాగితాన్ని ఇచ్చాడు. దాని వెనక ‘మీ స్టూడెంట్ ఫాదర్‌ని. దయచేసి ఓ ఐదు నిమిషాలు మీతో మాట్లాడే సమయం కేటాయించగలరా?’ అని ఇంగ్లీష్‌లో రాసుంది.‘‘రమ్మను.’’ ఆయన చెప్పాడు.లోపలకి వచ్చిన ఆయన వయసు నలభైఐదు– ఏభై మధ్య ఉండచ్చని వైద్యరాజ్ అనుకున్నాడు. అతని దుస్తులని బట్టి మధ్యతరగతి మనిషని కూడా గ్రహించాడు.‘‘రండి. కూర్చోండి.’’ మర్యాదగా ఆహ్వానించాడు.‘‘థాంక్ యు సర్. మీరు బిజీ అని నాకు తెలుసు.’’ ఆయన కంఠం సౌమ్యంగా ఉంది.‘‘నేను ఉన్నది మీ కోసమే. చెప్పండి.’’‘‘నా సమస్యని మీకు చెప్పాలని వచ్చాను. మా రెండో అమ్మాయి మీ కాలేజ్‌లో థర్డ్ ఇయర్ స్టూడెంట్. మీ కాలేజీలో చేరక మునుపే దానికి మొబైల్ కొనిచ్చాను.’’ కొద్దిగా బాధగా చెప్పాడు.
‘‘ఈ రోజుల్లో కుటుంబంలో ప్రతివారికీ ఓ మొబైల్ తప్పనిసరి.’’ వైద్యరాజ్ చెప్పాడు.‘‘ఇప్పుడు ప్రతి మొబైల్ పాస్‌వర్డ్ ప్రొటెక్షన్ తో వస్తోంది. కాబట్టి నేను మా నలుగురి పాస్‌వర్డ్స్‌ని ఓ కాగితం మీద రాసి దాన్ని ఫ్రిజ్‌కి మేగ్నెట్‌తో తగిలించాను. నిన్న రాత్రి నేను మా ఆవిడకి పంపే ఈమెయిల్ మెసేజ్‌ని పొరపాటున మా అమ్మాయికి పంపాను. అది మా అమ్మాయి పెట్టే అధిక ఖర్చు గురించిన వివరాలు. నా తప్పుని గ్రహించాక వెంటనే దాన్ని మా అమ్మాయి జీమెయిల్‌లోంచి డిలీట్ చేయాలని అనుకున్నాను. అది ఆ సమయంలో నిద్రపోతోంది.
పాస్‌వర్డ్ చూసి మా అమ్మాయి ఫోన్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తే అది తెరచుకోలేదు. మా అమ్మాయి నిద్ర లేచాక ఫోన్ పాస్‌వర్డ్ ఎందుకు పని చేయలేదని అడిగాను. మార్చానంది. కొత్తది చెప్పమంటే నీళ్ళు నమిలింది. దాన్ని తెరచి ఇవ్వమంటే సందేహించింది. నేను గట్టిగా అరిస్తే వణుకుతూ తెరిచింది. వాట్సప్ ఓపెనైంది. అందులో టాప్‌లో ఓ అబ్బాయి నుంచి అప్పటికే ఐదారు మెసేజెస్ వచ్చి ఉన్నాయి. దాని మీద క్లిక్ చేస్తే...’’అతను స్వల్పంగా సిగ్గుతో ఆగాడు. తర్వాత కొనసాగించాడు.‘‘రెండు బూతు వీడియోలు, అలాంటి ఫొటోలు నాలుగు కనిపించి షాకయ్యాను.’’‘‘ఓ!’’ వైద్యరాజ్ వెంటనే ఆశ్చర్యంగా చెప్పాడు.‘‘ఆ అబ్బాయి తన సీనియర్ అని చెప్పింది.’’
‘‘పేరు?’’‘‘నేను ఆ అబ్బాయి మీద ఫిర్యాదు చేయడానికి రాలేదు. మీ స్టూడెంట్స్ అంతా ఇలా విచ్చలవిడిగా ఉన్నారేమోనని ఫిర్యాదు చేయడానికి వచ్చాను. మీరు మీ స్టూడెంట్స్ తల్లిదండ్రులకి తమ పిల్లల మొబైల్స్ మీద ఓ కన్నేసి ఉంచమని సూచించమని చెప్పడానికి వచ్చాను సార్. వయసులోని వారికి మొబైల్ ద్వారా సీక్రెసీ, ఏక్సెసిబిలిటీ అందుబాటులోకి వచ్చాక మన కళ్ళముందే ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలీదు. వయసు మహిమ. ఇది మీ దృష్టికి తెస్తే కొందరి జీవితాలైనా బాగుపడచ్చు అనిపించింది.’’
‘‘ఇది సీరియస్ ప్రాబ్లం. ఇది నాకు చెప్పినందుకు థాంక్స్. దీని గురించి ఏం చెయ్యాలో ఆలోచిస్తాను.’’ఆయన ఇంకా ఏదో చెప్పాలనుకుని ఆగాడు. ఆయన మొహంలోని అనిశ్చితిని గమనించాక ప్రిన్సిపాల్ అడిగాడు.
‘‘ఇంకేదైనా ఉందా?’’‘‘ఎస్. తర్వాత మా ఆవిడ ఫోన్ ని కూడా నేను పంపింది డిలీట్ చేయడానికి తెరవాలని ప్రయత్నించాను. కాని ఆవిడ కూడా తన పాస్‌వర్డ్‌ని మార్చేసింది! మార్చినా నాకు ఎందుకు చెప్పలేదని అడిగాను. వెంటనే ఆమె మొహం పాలిపోయింది. తెరిపించి చూస్తే వాట్సప్‌లో ఎవరికో ఆమె పంపిన రొమాంటిక్ పోస్ట్‌లు, అక్కడి నుంచి వచ్చినవి కనిపించాయి. అది ఆర్కైవ్స్‌లో దాక్కుని ఉంది! నా దిమ్మ తిరిగిపోయింది సర్. మొబైల్ వరం అనుకున్నాను. కాని శాపం కూడా సార్. చాలామందికి ఈ కొత్తరకం టైమ్‌పాస్ జీవితాలని నాశనం చేసే శాపం అనుకుంటున్నాను.’’ ఆయన బాధగా చెప్పాడు.వైద్యరాజ్‌కి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు. అతను వెళ్ళాక కాగితం అందుకుని విద్యార్థుల తల్లితండ్రులకి ఓ సర్కులర్‌ని డ్రాఫ్ట్ చేయసాగాడు.
ఇంటికి వెళ్ళాక ప్రిన్సిపాల్ వైద్యరాజ్ తన భార్య స్నానానికి వెళ్ళేదాకా ఆగి, ఆవిడ మొబైల్‌ని తెరిచే ప్రయత్నం చేసి, పాస్‌వర్డ్ మారిందని గ్రహించాడు.ఆవిడ వచ్చాక తన మొబైల్ ని ఆవిడకి ఇచ్చి చాలా మామూలుగా చెప్పాడు.‘‘పాస్‌వర్డ్‌లు ఓ పట్టాన గుర్తుండవు. ఫింగర్ ప్రింట్స్‌తో కూడా తెరిచే మొబైల్స్ మనవి. నా దాంట్లో నీ ఫింగర్ ప్రింట్, నీ దాంట్లో నా ఫింగర్ ప్రింటూ పెట్టుకుందాం. ముందు నా దాంట్లో మారుద్దాం.’’ఆమె మొహం కొద్దిగా పాలిపోయింది. తన ఫింగర్ ప్రింట్‌ని కూడా ఆమె దాంట్లో నమోదు చేశాడు. నివారణ చర్య జరిగింది కాబట్టి తన భార్య మొబైల్‌లో ఏం ఉందోనని వెదికి ఆ విద్యార్థిని తండ్రిలా ఆయన తన మనసు పాడుచేసుకోదలచుకోలేదు.
∙మల్లాది వెంకట కృష్ణమూర్తి
‘ఫన్‌డే’లో ప్రచురితమయ్యే
ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా
భాగస్వాములను చేయనున్నారు.
మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో
ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com


