తీర్మానాలు వేరు, నిర్ణయాలు వేరు. తీర్మానాలన్నవి.. ‘చేసుకునేవి’. నిర్ణయాలన్నవి.. ‘తీసుకునేవి’. తీర్మానాలు ఫెయిల్ అయితే పోయేదేమీ లేదు. కాని, నిర్ణయాలు మిస్ ఫైర్ అయితేనే... ఫలితం దారుణంగా ఉంటుంది. అందుకు చరిత్రలో అనేక నిదర్శనాలు ఉన్నాయి.
ఒక్కోసారి మనం తీసుకునే ‘చెత్త నిర్ణయం’ మన జీవితాన్నే ట్రాజెడీగా చేస్తుంది. అదే నిర్ణయాన్ని ఒక రాజుగారో,ఏ ప్రభుత్వం వారో తీసుకుంటే? చరిత్రలో అది ఒక ‘సీరియస్ కామెడీ’గా మిగిలిపోతుంది. అహంకారం వల్ల కావచ్చు, అజాగ్రత్త వల్ల కావచ్చు లేదా మన బ్యాడ్ లక్ వల్ల కావచ్చు... చెత్త నిర్ణయం తలపైకి ఎక్కి కూర్చున్నప్పుడు రాజైనా, రాజారావు గారైనా చేసేది ఏమీ ఉండదు. చరిత్రలో ఇలాంటి ట్రాజిక్ కామెడీలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో కొన్ని.. మీ కోసం :::
చెంగీజ్ ఖాన్ కి ‘సారీ’ చెప్పనందుకు..!
చెంగీజ్ ఖాన్ వీరుడు, శూరుడే కాని, క్రూరుడు మాత్రం కాడు. పైగా స్నేహశీలి. 1218వ సంవత్సరంలో ఒకరోజు ఆయనకు అనిపించింది– ఖ్వారెజ్మియన్ సామ్రాజ్యంతో (ప్రస్తుత ఇరాన్/ఇరాక్ ప్రాంతం) కలిసి బిజినెస్ చేద్దామని! మంచి విషయమే కదా. అందుకోసం 450 మంది బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌లను పంపించాడు. కాని, అక్కడి లోకల్ గవర్నర్‌కి వాళ్లపై అనుమానం వచ్చి, వాళ్లంతా గూఢచారులేమోనని అందర్నీ చంపేయించాడు. ‘‘ఇట్స్ ఓకే’’ అని చెంగీజ్ ఖాన్ సర్దుకుపోయాడు. ‘‘కనీసం సారీ అయినా చెప్పండి’’ అని ముగ్గురు రాయబారులను ఖ్వారెజ్మియన్‌కు పంపాడు. అయితే అక్కడి రాజు అతి తెలివి ప్రదర్శించాడు. ముగ్గురిలో ఇద్దరికి గడ్డాలు గీయించి, మూడో రాయబారి తల నరికేయించాడు.
ఫలితం: చెంగీజ్ ఖాన్ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన మంగోల్ సైన్యంతో బయల్దేరి వెళ్లి ఖ్వారెజ్మియన్ సామ్రాజ్యాన్ని రూపుమాపేశాడు. కోట్లాది మంది ప్రాణాలు పోయాయి.
నీతి: పక్కింటి వాళ్లతో గొడవ పడితే పంచాయతీ అవుతుంది. కాని, చెంగీజ్ ఖాన్‌లాంటి వాళ్లతో గొడవ పడితే చరిత్రే మారిపోతుంది! ఇంకోలా చెప్పాలంటే – పులిని నిద్రలేపినా పర్లేదు కాని, చెంగీజ్ ఖాన్ ముఖం మీద చిటికెలు వేయకూడదు.
చలికాలంలో దండయాత్ర
ఇదొక క్లాసిక్ హిస్టరీ కామెడీ! 1812లో నెపోలియన్, 1941లో హిట్లర్.. ‘‘రష్యా ఎంత పెద్దదైతే మనకేంటి? ఉఫ్ అని ఊదేసి ఇంటికి వచ్చేద్దాం’’ అని ప్లాన్ వేశారు. ఉఫ్ అని ఊదేసేవారేనేమో కాని, వాళ్లు రెండు విషయాలను అస్సలు అంచనా వేయలేకపోయారు: ఒకటి రష్యా వైశాల్యం (అది ఒక దేశం కాదు, ఒక ప్రపంచం!), రెండోది అక్కడి భయంకరమైన చలి.
ఫలితం: రష్యాపైకి నెపోలియన్ పంపిన 6 లక్షల మంది సైన్యంలో చివరికి మిగిలింది కేవలం లక్ష మంది మాత్రమే! అటు హిట్లర్ కూడా అదే తప్పు చేసి, తన నాజీ సామ్రాజ్యం కూలిపోవడానికి పునాది వేసుకున్నాడు.
నీతి: రష్యా వాళ్లతో యుద్ధం గెలవొచ్చేమో కాని, వింటర్‌లో అక్కడి మైనస్ డిగ్రీల చలిని మాత్రం ఎవరూ గెలవలేరు. చలికాలంలో యుద్ధం చేయటం కంటే దుప్పటి కప్పుకుని పడుకోవడం ఉత్తమం అని నెపోలియన్, హిట్లర్ తెలుసుకుని ఉంటారు.
కొంప ముంచిన గిఫ్ట్ ప్యాక్!
క్రీ.పూ. 12వ శతాబ్దం నాటి సంగతి ఇది. సుమారు 10 ఏళ్లు యుద్ధం చేసినా గ్రీకులు ట్రాయ్ నగరాన్ని (ప్రస్తుతం టర్కీలోని ఒక భాగం) గెలవలేకపోయారు. అప్పుడు ఒక ‘ఐడియా’ వేశారు. ఒక పెద్ద చెక్క గుర్రాన్ని తయారు చేసి కోట ముందే వదిలేసి, ‘‘మేం ఓడిపోయాం. ఈ గుర్రాన్ని మీకు మా జ్ఞాపకార్థం కానుకగా ఇస్తున్నాం’’ అని చెప్పి అక్కడి నుంచి పడవల్లో వెళ్లిపోయినట్లు యాక్టింగ్ చేశారు. స్థానిక పూజారులు, జోస్యులు ‘‘ఒరేయ్ నాయనా.. ఇదేదో తేడాగా ఉంది, దీన్ని నమ్మకండి’’ అని అరిచినా, ట్రాయ్ పాలకులు వినలేదు. ‘‘అబ్బే.. గిఫ్ట్ వస్తుంటే వద్దంటారేంటి?’’ అని ఆ చెక్క గుర్రాన్ని లాక్కొచ్చి కోట లోపల పెట్టుకుని గ్రాండ్‌గా విజయోత్సవాలు జరుపుకున్నారు.
ఫలితం: అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ చెక్క గుర్రం లోపల గ్రీకు సైనికులు దాక్కుని ఉన్నారు! అందరూ నిద్రపోయాక, వాళ్లు బయటకు వచ్చి కోట గేట్లు తెరిచేశారు. వెళ్లిపోయినట్లుగా మాయ చేసిన గ్రీకు సైన్యం మళ్లీ తిరిగొచ్చి ట్రాయ్ నగరాన్ని నామరూపాలు లేకుండా చేసేసింది.
నీతి: శత్రువు సడన్‌గా వచ్చి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చాడంటే– అది ప్రేమతో ఇచ్చింది కాదు, మనకేదో ‘పెద్ద స్కెచ్’ వేశాడని!
మావో గారి ‘పిచ్చుకల’ వేట
చైనాలో 1958లో ‘గ్రేట్ లీప్ ఫార్వర్డ్’ పేరుతో మావో జెడాంగ్ ఒక వింత నిర్ణయం తీసుకున్నారు. ‘‘ఈ పిచ్చుకలు మన ధాన్యాన్ని తినేస్తున్నాయి, వీటిని అస్సలు వదలకూడదు. తరిమి కొట్టండి’’ అని ఆర్డర్ వేశారు. దాంతో జనం అంతా గిన్నెలు, డబ్బాలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చి ఒకటే గోల.. గోల! ఆ శబ్దానికి పిచ్చుకలు భయపడి ఎక్కడా వాలకుండా గాల్లోనే ఎగురుతూ, ఎగురుతూ అలసిపోయి కిందపడి చనిపోయేవి. అలా లక్షల పిచ్చుకలను ఏరిపారేశారు.
ఫలితం: పిచ్చుకలు ఉన్నప్పుడు అవి కేవలం గింజలనే కాదు, పంటను పాడుచేసే మిడతలను కూడా తినేవి. పిచ్చుకలు లేకపోయేసరికి మిడతల సంఖ్య బీభత్సంగా పెరిగిపోయింది. అవి వచ్చి పిచ్చుకల కంటే వంద రెట్లు వేగంగా పంటనంతా ఊడ్చేశాయి. దీనివల్ల వచ్చిన కరువులో దాదాపు 1.5 కోట్ల నుండి 4.5 కోట్ల మంది చైనా ప్రజలు చనిపోయారు.
నీతి: ప్రకృతిని మనం కంట్రోల్ చేయాలనుకుంటే.. అది మనల్ని ‘అవుట్ ఆఫ్ కంట్రోల్’ చేసి పడేస్తుంది. అలాస్కాని ‘అణాపైసలకి’
అమ్మేసిన రష్యా
ఇది 1867లో జరిగింది. అప్పట్లో రష్యాకి ఒకటే భయం ఉండేది. ‘‘భవిష్యత్తులో బ్రిటిష్ వాళ్లతో యుద్ధం వస్తే, ఈ అలాస్కా ప్రాంతాన్ని మనం కాపాడుకోలేం, వాళ్లు ఫ్రీగా లాగేసుకుంటారు’’ అని టెన్షన్ పడ్డారు. అందుకే ఉచితంగా పోయేదానికంటే, ఎంతో కొంతకి అమ్మేద్దాం అని అమెరికాకి ఆఫర్ ఇచ్చారు. ఎంతకో తెలుసా? కేవలం 7.2 మిలియన్ డాలర్లు! అంటే ఎకరం సుమారు రెండు సెంట్లే (మన లెక్కలో చెప్పాలంటే అణాపైసలకి అన్నమాట).
ఫలితం: అమ్మేసిన కొన్నేళ్లకే అక్కడ భారీ బంగారు గనులు బయటపడ్డాయి. ఆ తర్వాత ఏకంగా బిలియన్ల కొద్దీ బారెళ్ల ఆయిల్ నిక్షేపాలు దొరికాయి. చరిత్రలోనే ఇది అతిపెద్ద ‘రియల్ ఎస్టేట్ తప్పిదం’ అని చెప్పుకోవచ్చు.
నీతి: పనికిరాని మంచుగడ్డ అనుకుని అమ్మేస్తే.. అది కాస్తా ‘బంగారు గని’ అని తర్వాత తెలిసింది. అందుకే ఆస్తి అమ్మే ముందు ఒకటికి పదిసార్లు సర్వే చేయించుకోవాలి!
డ్రైవర్ కొట్టిన ‘రాంగ్ టర్న్’
1914లో ఆస్ట్రియా యువరాజు ఆర్చ్‌డ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌కి ఆ రోజు లేచిన వేళ అస్సలు బాగోలేదు. ఉదయాన్నే ఆయన మీద ఒక బాంబు దాడి జరిగితే తృటిలో తప్పించుకున్నారు. ఆ వాడితో గాయపడిన తన మనుషులను పరామర్శించాలని ఆసుపత్రికి బయలుదేరారు. కానీ కొత్త రూట్ కావడంతో డ్రైవర్ కన్ఫ్యూజ్ అయిపోయి, ఒక చోట పొరపాటున రాంగ్ టర్న్ తీసుకున్నాడు. కారు రివర్స్ చేస్తున్నప్పుడు ఇంజిన్ ఆగిపోయింది. సరిగ్గా అక్కడే, ఆ ఉదయం బాంబు వేసి విఫలం అయిన హంతకుడు (గావ్రిలో ప్రిన్సిప్) సాండ్‌విచ్ తింటూ కూర్చున్నాడు.
ఫలితం: యువరాజును చూసిన ప్రిన్సిప్, వెంటనే గన్ తీసి యువరాజుని కాల్చేశాడు. ఈ ఒక్క హత్య వల్ల ఐరోపా దేశాల మధ్య గొడవలు ముదిరి, ఏకంగా మొదటి ప్రపంచ యుద్ధం దాపురించింది.
నీతి: రాంగ్ రూట్‌లో వెళ్తే ఫైన్ పడుతుంది అనుకుంటాం.. కానీ రాంగ్ టర్న్ కోట్లాది మంది ప్రాణాలు పోయే యుద్ధానికి దారి తీసింది.
బీటిల్స్‌ని కాలదన్నిన డెక్కా
టాలెంట్‌ని గుర్తించడంలో ఇంతకంటే దారుణమైన పొరపాటు చరిత్రలో ఇంకొకటి జరిగి ఉండదేమో! అప్పట్లో, అంటే 1962లో అప్పుడే మొదలైన ‘బీటిల్స్’ బ్యాండ్ టీమ్ తమ పాటలు వినిపించడానికి డెక్కా రికార్డ్ కంపెనీ దగ్గరికి వెళ్లారు. అప్పుడు ఆ కంపెనీ పెద్దాయన డిక్ రోవ్ ఒక ఆణిముత్యం లాంటి మాట అన్నాడు: ‘‘వద్దులే బాబోయ్.. ఈ గిటార్ వాయించే గ్రూపుల కాలం అయిపోయింది..’’ అని, వాళ్లను తిప్పి పంపించేశాడు.ఫలితం: బీటిల్స్ టీమ్ వేరే కంపెనీతో (ఇ.ఎం.ఐ. రికార్డ్స్) ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత వాళ్లు సృష్టించిన ప్రభంజనం తెలిసిందే! ప్రపంచ సంగీత చరిత్రలోనే అత్యధికంగా అమ్ముడైన బ్యాండ్‌గా వాళ్లు రికార్డు సాధించారు. పాపం, ఆ డెక్కా రికార్డ్ వారు చేసిన ఈ తప్పుని సరిదిద్దుకోవడానికి దశాబ్దాల కాలం పట్టింది.నీతి: మన దగ్గరికి అదృష్టం గిటార్ వాయిస్తూ వచ్చినా సరే, అది మనకు నచ్చకపోతే ‘కాలం అయిపోయింది’ అని సాకులు చెబుతాం. అప్పుడప్పుడు పాత స్టెయిలే కొత్త ట్రెండ్‌గా అవుతుందేమోనని ఆలోచించాలి.
అతి పెద్ద అచ్చుతప్పు
ప్రింటింగ్ ప్రెస్‌లో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ జరిగితే ఏం చేస్తాం? సారీ చెప్పి సరిదిద్దుకుంటాం. కానీ రాబర్ట్ బార్కర్, మార్టిన్ లూకాస్ అనే ప్రింటర్లకు మాత్రం అది దిద్దుకోలేని తప్పు అయింది. 1631లో వాళ్లు బైబిల్ ప్రింట్ చేస్తున్నప్పుడు, బైబిల్‌లోని పది ఆజ్ఞలలో (టెన్ కమాండ్‌మెంట్స్) ఒక చిన్న పొరపాటు జరిగింది. ‘వ్యభిచారం చేయరాదు’ (Thou shalt not commit adultery) అనే వాక్యంలో పొరపాటున ’n్టౌ’ అనే పదం ఎగిరిపోయింది.
ఫలితం: ఇంకేముంది.. ఆ ఎడిషన్ బైబిల్ కాస్తా ఘోరమైన ఆ అపరాధంతో పబ్లిష్ అయిపోయింది! ఇది చూసి కింగ్ చార్లెస్–1 కోపంతో రాజ›ప్రాసాదంలోని వస్తువులన్నీ విసిరి పారేశారు. ఆ ప్రింటర్ల మీద భారీ ఫైన్ వేసి, వాళ్లని దివాలా తీయించాడు. వాళ్ల లైసెన్సులు రద్దు చేశాడు. తప్పుగా ప్రింట్ అయిన ఆ కాపీలన్నీ తగలబెట్టేయాలని ఆర్డర్ వేశారు. (కానీ కొన్ని ‘కలెక్టర్స్ కాపీలు’ మాత్రం ఇప్పటికీ అక్కడక్కడా బయటపడుతున్నాయని అంటారు).
నీతి: స్పెల్లింగ్ చెక్ చేయకుండా వాట్సాప్ మెసేజ్ పంపిస్తే పరువు పోతుంది. అదే మతగ్రంథంలో తప్పు చేస్తే మన చాప్టరే క్లోజ్ అయిపోతుంది!
నాసా 125 మి. డాలర్ల మిస్టేక్
మనం కూరగాయలు కొనటానికి వెళ్లి, కిలోలకి బదులు లీటర్ల లెక్కన అడిగితే అంతా వింతగా చూస్తారు. సరిగ్గా అలాంటి తప్పునే నాసా శాస్త్రవేత్తలు చేశారు. 1999లో ‘మార్స్ క్లైమేట్ ఆర్బిటర్’ అనే రాకెట్‌ని అంగారక గ్రహం మీదకి పంపడానికి రెండు టీమ్‌లు పనిచేశాయి. అందులో ఒక టీమ్ లెక్కలన్నీ ఇంగ్లీష్ యూనిట్లలో (పౌండ్లు, ఫోర్స్) వేస్తే, రెండో టీమ్ మాత్రం మెట్రిక్ యూనిట్లను (న్యూటన్స్) వాడారు. దాంతో రెండు టీమ్‌ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఎవరి లెక్కలు వాళ్లు వేసుకున్నారు.
ఫలితం: రాకెట్ అంతరిక్షంలోకి వెళ్లాక, అది అప్లయ్ చేయాల్సిన ‘ఫోర్స్’ లెక్క తప్పింది. దాంతో ఆ రాకెట్ ఉండాల్సిన దానికంటే చాలా కిందకి వెళ్లిపోయి, అంగారక గ్రహ వాతావరణంలో కాలి బూడిదైపోయింది. అలా అప్పట్లోనే దాదాపు 1000 కోట్ల రూపాయలు (125 మిలియన్ డాలర్లు) గాలిలో కలిసిపోయాయి.
నీతి: లెక్కల్లో తేడా వస్తే కోట్లలో లాస్ వస్తుంది.
తగలబడిన అలెగ్జాండ్రియా లైబ్రరీ
ఇది ఏ ఒక్కరో తీసుకున్న తప్పుడు నిర్ణయం కాదు. వరుస అతి తెలివి నిర్ణయాల వల్ల జరిగిన అనర్థం. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాలెడ్జ్ హబ్.. ఈజిప్టులోని ఈ అలెగ్జాండ్రియా లైబ్రరీ. ప్రాచీన కాలపు విజ్ఞానమంతా అక్కడే ఉండేది. అయితే, జూలియస్ సీజర్ గారు యుద్ధం చేస్తూ పొరపాటున ఒక భాగాన్ని తగలబెట్టేశారు. ఆ తర్వాత వచ్చిన కొందరు పాలకులు ‘‘మాకు ఈ పుస్తకాలతో పనేంటి?’’ అని నిర్లక్ష్యం చేశారు, మరికొందరు రాజకీయం కోసమో, మతం పేరుతోనో మిగిలిన పుస్తకాలను కాల్చిపారేశారు.
ఫలితం: ప్రాచీన చరిత్ర, సైన్స్‌కు సంబంధించిన దాదాపు 90 శాతం జ్ఞానం శాశ్వతంగా కాలి బూడిదైపోయింది. మన పూర్వీకులకు ఏమేం తెలుసో, వాళ్లు ఏయే టెక్నాలజీలు వాడారో ఇప్పుడు మనకు కేవలం ఒక అంచనా మాత్రమే ఉంది. ఒకవేళ ఆ లైబ్రరీ సేఫ్‌గా ఉండి ఉంటే, మనం ఈపాటికే అంతరిక్షంలో ఇల్లు కట్టుకుని ఉండేవాళ్లమేమో.
నీతి: పుస్తకాన్ని చదివినా చదవకపోయినా పర్లేదు కానీ, దాన్ని పొరపాటున కూడా కాల్చకూడదు. ఎందుకంటే మనం నాశనం చేసేది పేపర్లను కాదు, తరతరాల జ్ఞానాన్ని!
దేవుడా! ఈ దారుణమైన తప్పులు, పొరపాట్లు చూస్తుంటే.. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ చాలా బెటర్ అనిపిస్తోంది కదా! అలా అని అలక్ష్యంగా ఏ పనీ చేయకండి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
· సాక్షి, స్పెషల్ డెస్క్


