
‘ఓహో.. ఈ చెన్నై అర్ధరాత్రి వీ«థుల్లో ఒంటరిగా ఏలారా వెళ్లడం!’ అని మీరు ఆలోచిస్తున్న సమయానికే, పసుపు, ఆకుపచ్చ ఆటో ఒక సూపర్ హీరో ఎంట్రీ ఇచ్చినట్టుగా బ్రేక్ వేసి మీ ముందుకు ఆగుతుంది. అదే మన రాజి అక్క!
రాజి అక్కకి ఆటో అంటే వాహనం మాత్రమే కాదు, అది ఒక ఇల్లులాంటిది. అంతకంటే, ఎక్కువగా ఆ ఆటోలో ప్రయాణం కొండంత భరోసా, భద్రత! ఇరవై ఏళ్లకు పైగా ఆటో నడుపుతున్న ఆమె, ఒక డ్రైవర్ మాత్రమే కాదు; వేలమంది మహిళలకు రక్షకురాలు, ఆపద్బాంధవురాలు కూడా! ఒక భయంకరమైన ఘటన తన కళ్ల ముందే జరగడం చూసి, నిర్ణయించుకుంది ‘ఇకపై ఒక్క మహిళ కూడా భయపడుతూ ఇంటికి చేరకూడదు’ అని. అప్పటి నుంచి ఆమె ఆటో చక్రాలు కేవలం మీటరు చూపించడం మాత్రమే కాదు; భద్రత, స్నేహం, మనసులో నమ్మకం కూడా అందిస్తున్నాయి.
ఆమె ఆటోలో కూర్చుంటే అందులో ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్, వాటర్ బాటిల్, బిస్కట్ ప్యాకెట్, సానిటరీ న్యాప్కిన్ అలా అలా! చాలా కనిపిస్తాయి. అప్పుడు అడుగుతారు ‘అక్కా, నువ్వు డ్రైవరా లేక ట్రావెల్ మమ్మీనా?’ అని, దానికి అక్క నవ్వుతూ ‘ఇవి ఉంటే ఎవరికైనా కష్టంలో ఉపయోగపడతాయి. అంతే, సేల్స్ కాదు, ప్రమోష¯Œ ్స కాదు మచ్చీ!’ అని చెబుతుంది. ఇలా ఆడుతూ పాడుతూ రోజుకు ముప్పై ట్రిప్స్ పూర్తి చేసి, శరీరం అలసిపోయినా సరే, అర్ధరాత్రి ఎవరో ఒక అమ్మాయి కాల్ చేస్తే? రాజి అక్క వెంటనే ఆటో స్టార్ట్ చేస్తుంది. ‘మహిళలు సేఫ్‌గా ఇంటికి చేరితేనే నాకు నిద్ర వస్తుంది’ అంటుంది. అంతేకాదు సీనియర్ సిటిజన్ ఎక్కితే ఫ్రీ. పిల్లాడు స్కూల్‌కి ఆలస్యమైతే ఫ్రీ. ఎవరికైనా సడెన్ ఎమర్జెన్సీ అయితే ‘మీటర్ ఆఫ్, హాస్పిటల్ ఆన్!’ ఇంతా చేస్తుంది తన ఖాళీ సమయంలో కాదు, తన జీవిత పోరాటంలో భాగంగానే!
ఆమె కష్టాలకు కుటుంబమే సాక్ష్యం
రాజి అక్కకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఇంజినీర్ అయ్యాడు, కూతురు నర్సింగ్ చదువుతోంది. భర్త అనారోగ్యం వల్ల పని మానేశాడు. అప్పటి నుంచి ఈ ఆటోనే వారికి అన్నం పెడుతోంది. కానీ రాజి అక్క ధైర్యం ముందు ఇవేమీ ఇబ్బంది కాలేదు. ‘ఈ చక్రాలు తిరిగేంత వరకు నా ఫ్యామిలీకి ఏ భయం లేదు’ అని గర్వంగా చెబుతుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ‘ఎనయుమ్ కైకల్’ అనే మహిళా ఆటో డ్రైవర్ల గ్యాంగ్ లీడర్ కూడా రాజి అక్కే! ఆమె ఆటోకి పంక్చర్ అయితే, ఐదు ఆటోలు సూపర్ ఫాస్ట్‌గా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టయిల్‌లో వచ్చేస్తాయి. మరెంతోమందికి ఉచిత డ్రైవింగ్ క్లాసులు కూడా ఇస్తుంది. ఆటో నడపడం నేర్చుకోవాలనుకునే మహిళలకు ఆమె గురువు. ప్రస్తుతం అక్క ఆటో ప్రయాణ కథలను విన్నవారంతా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని నగరాల్లోనూ ఇలాంటి అక్క ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. ఎందుకంటే, రాజి అక్క డ్రైవర్ మాత్రమే కాదు ఆపదలో ఆదుకునే అక్క, అమ్మ, ఫ్రెండ్, బాడీగార్డ్ అన్నీ.
నారీ భగీరథ!
కర్నాటకలోని సిర్సి దగ్గర ఒక చిన్న గ్రామం. అక్కడ ఒకప్పుడు నిత్యం నీటి కొరత, ఎండిన పంటలు, దాహంతో అలమటిస్తున్న జీవులు కనిపించేవి. అలాంటి సమయంలో చాలామంది ‘ఎవరైనా వచ్చి పరిష్కరిస్తారు’ అని చేతులెత్తేసి కూర్చుంటే, యాభై మూడు ఏళ్ల గౌరి నాయక్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. తన పంటలు పచ్చగా మారాలని తపనతో ముందడుగు వేసింది. స్వయంగా తన చేతులతో బావి తవ్వడం మొదలుపెట్టింది. యంత్రాలు లేవు, సహాయం లేదు, కేవలం ఒక గిలక, తాడు, బకెట్ మాత్రమే. రోజూ ఆరు గంటలపాటు కష్టపడి, ఆరు నెలల పాటు శ్రమించింది. పక్కవాళ్లు ‘ఇది అసాధ్యం’ అన్నారు. కాని, గౌరి మాత్రం ఆగలేదు. ఆమె పట్టుదల ఫలించింది. అరవై అడుగుల లోతులో నీరు దొరికింది. ఆ నీటితో ఆమె పంటలు తిరిగి పచ్చగా మారాయి. అక్కడితో ఆగిపోకుండా, మరో బావి తవ్వింది.
ఈసారి తనకోసం కాదు– పొరుగువారి కోసం. ‘నా పంటలు బతికితే సరిపోదు, నా ఊరి ప్రజలందరికీ జీవం రావాలి’ అని అనుకుంది. పాఠశాల దగ్గర బావి తవ్వొద్దని అధికారులు ఆపినా, గౌరి వెనక్కి తగ్గలేదు. స్కూల్ పిల్లలకు కూడా నీరు అందేలా చేసింది. మధ్యలో ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, అలసట– అన్నింటినీ తట్టుకుంది. అందుకే, ఈరోజు అందరూ ఆమెను ‘లేడీ భగీరథ’ అని పిలుస్తున్నారు. ఇప్పుడు ఆమె బావులు రైతులకు, పిల్లలకు, జంతువులకు జీవనాధారంగా నిలుస్తున్నాయి. ఇంకా గౌరి ఆగలేదు. గ్రామస్తులు దూరంగా నడుస్తూ నీరు తెచ్చుకోకూడదనే తపనతో, మూడో బావిని కూడా తవ్వుతోంది.