ఇన్సూరెన్స్ కోసం హత్యలు చేసిన వాళ్లని; ఆస్తులు తగలపెట్టుకున్న వాళ్లని; అక్రమాలకు పాల్పడిన వాళ్లని చూస్తూనే ఉంటాం. వీటన్నింటికీ భిన్నమైన వ్యవహారం 2012లో చోటు చేసుకుంది. అమెరికాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రవాస భారతీయుడు (ఎన్నారై) ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. వీటి నుంచి బయటపడటానికి తనపై ఉన్న ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడమే మార్గమని భావించాడు. దీనికోసం తానే చనిపోయినట్లు కథ అల్లాడు. దీనికి సంబంధించిన వ్యవహారం ఆద్యంతం పక్కాగానే నడిచినా, ఇన్సూరెన్స్ కంపెనీ క్రాస్ వెరిఫికేషన్‌లో అసలు సంగతి వెలుగులోకి వచ్చింది. ఈ హైడ్రామాలో సూత్రధారితో పాటు పాత్రధారులుగా ఉన్న ఓ వైద్యుడు, గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సిబ్బందికీ ఉచ్చు బిగిసింది.
హైదరాబాద్ నగర శివార్లలోని రాజేంద్రనగర్‌లో ఉన్న హైదర్‌గూడ ప్రాంతానికి చెందిన సోమారం కమలాకర్ రెండో కుమారుడు రాజ్‌కమల్. ఇతడికి తొమ్మిది నెలల వయస్సు ఉన్నప్పుడే ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి మేరీలాండ్‌లో స్థిరపడింది. కమలాకర్ మేల్ నర్స్‌గా, ఆయన భార్య స్టాఫ్ నర్స్‌గా పని చేసేవాళ్లు. రాజ్‌కమల్ అక్కడే ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఇతడి తల్లి అక్కడ ఓ ఇల్లు కొనుగోలు చేయడానికి అప్పులు చేసింది. ఆ అప్పులతోనే తిప్పలు ప్రారంభమయ్యాయి. అప్పులకు తోడు వడ్డీలు పెరిగిపోవడంతో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఓ దశలో రాజ్‌కమల్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల కార్డులన్నీ బ్లాక్ అయిపోయాయి. దీంతో గత్యంతరం లేక అతడి సన్నిహితురాలైన శ్రీలంక జాతీయురాలికి చెందిన కార్డుల్నీ వినియోగించేశాడు. దీంతో మరింతగా అప్పుల ఊబిలో కూరుకుపోయాడు.
రాజ్‌కమల్ అమెరికాలోని మెట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 75 వేల డాలర్లు (దాదాపు రూ.15 లక్షలు) విలువైన పాలసీ తీసుకున్నాడు. దీనికి తన సోదరిని నామినీగా పెట్టాడు. 2012లో రాజేంద్రనగర్‌లోని స్వస్థలానికి వచ్చిన రాజ్‌కమల్ అప్పుల బాధ నుంచి బయటపడటానికి ఉన్న మార్గాలను అన్వేషించాడు. ఇక్కడే తాను చనిపోయినట్లు నాటకమాడి, అందుకు అవసరమైన ధ్రువీకరణలు సంపాదించాలని పథకం వేశాడు. వీటిని దాఖలు చేయించడం ద్వారా అమెరికాలో ఉన్న ఇన్సూరెన్స్‌లు క్లెయిమ్ చేసుకోవాలని కుట్రపన్నాడు. దీన్ని అమలులో పెట్టడానికి సహకరించాల్సిందిగా రాజేంద్రనగర్‌లోని శివరామ్‌పల్లిలో నివసించే తన బంధువు, అప్పట్లో జీహెచ్‌ఎంసీ ఉద్యోగి అయిన ప్రసన్నకుమార్‌ను సంప్రదించాడు. రాజ్‌కమల్ ‘చావు’కు సహకరించడానికి ప్రసన్నకుమార్ అంగీకరించారు. ఈ హైడ్రామాకు అవసరమైన పత్రాల సమీకరణ కోసం ఈ ద్వయం అనేక ఫోర్జరీలు చేసింది.
ప్రసన్నకుమార్ తొలుత హైదర్‌గూడలో ఓ నర్సింగ్‌హోమ్ నిర్వహించే తన పరిచయస్తుడిని సంప్రదించాడు. బాగా కావాల్సిన వారి తరఫు వారు మృతి చెందారని, డెత్ సర్టిఫికెట్ కావాలని కోరాడు. నిజమని నమ్మిన ఆయన పూర్వాపరాలు పట్టించుకోకుండా, అంగీకరించారు. ఇలా రాజ్‌కమల్ పేరుతో డెత్ సర్టిఫికెట్ సిద్ధమైంది. 2012 డిసెంబర్ 12న ప్రసన్న కుమార్‌కు కుమారుడు పుట్టి చనిపోయాడు. ఆ శిశువును శివరామ్‌పల్లిలోని శ్మశాన వాటికలో ఖననం చేశారు. ఈ ధ్రువీకరణలను ఫోర్జరీ చేయడం ద్వారా రాజ్‌కమల్‌ను ఖననం చేసినట్లు పత్రాలు సృష్టించారు. వీటి ఆధారంగా రాజేంద్రనగర్ జోన్ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో పని చేసే కుమార్‌ను సంప్రదించారు. అతడి ద్వారా జీహెచ్‌ఎంసీ రికార్డుల్లోకి ఈ మరణాన్ని జొప్పించారు. ఆపై ఈ–సేవ కేంద్రం నుంచి రాజ్‌కమల్ చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రం పొందారు. ఇవన్నీ కలిపి రాజ్‌కమల్ చనిపోయినట్లు మెట్‌లైఫ్ కంపెనీకి తన స్నేహితుడి ద్వారా క్లెయిమ్ పంపారు.
రాజ్‌కమల్ చనిపోయినట్లు వచ్చిన క్లెయిమ్ పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీ సైతం పరిగణనలోకి తీసుకుంది. అయితే నగదు విడుదల చేయడానికి ముందు ప్రాథమిక పరిశీలన చేపట్టింది. ఇందులో భాగంగా హైదర్‌గూడలోని సదరు నర్సింగ్‌హోమ్ అధిపతిని సంప్రదించింది. కంపెనీ అడిగిన ప్రశ్నలకు, ఆయన చెప్పిన సమాధానాలకు పొంతన లేకపోవడంతో కథ అడ్డం తిరిగింది. దీంతో అనుమానం వచ్చిన ఇన్సూరెన్స్ కంపెనీ తమ ప్రతినిధుల్ని రంగంలోకి దింపి లోతుగా ఆరా తీయించింది. ఇలా రాజ్‌కమల్ ‘చావు’తెలివి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో నేరం జరిగినట్లు గుర్తించిన పోలీసులు రాజ్‌కమల్‌తో పాటు ప్రసన్నకుమార్, కుమార్ తదితరులపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ అధికారులూ అంతర్గత విచారణ చేశారు. బాధ్యుల్లో కొందరిని సస్పెండ్ చేయడంతో పాటు మరికొందరిని విధుల నుంచి తొలగించారు. 


