తన ప్రయాణం ప్లాన్ చేసినదేం కాదు. కాని, విధి పిలుపును మాత్రం ఆమె విన్నది. అలా హైదరాబాద్ వీధుల్లో పానీపూరీ తింటూ నవ్వుకున్న సాదాసీదా అమ్మాయి–
నేడు తెరపై సహజ మంత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆమె శివాని నాగారం. ఆమె విషయాలు ఆమె మాటల్లోనే మీ కోసం!
⇒ చిన్నప్పటి నుంచే నేర్చుకున్న కూచిపూడి నాట్యం నాకు ఒక థెరపీలా ఉంటుంది. ఏదైనా టెన్షన్ ఉన్నా, కొన్ని స్టెప్స్ వేస్తే చాలు, మనసంతా రిలాక్స్ అయిపోతుంది.
⇒ హైదరాబాద్‌లోనే పెరిగాను. అందుకే రోడ్డు పక్కన నిలబడి మిర్చి బజ్జీ, పానీపూరీ తినడం, సాయంత్రం రోడ్ల మీద కార్లు వెళ్లే శబ్దం వినడం ఇవన్నీ నా చిన్న చిన్న ఆనందాలు.
⇒ సినిమాల్లోకి రావడం నేను ముందే ప్లాన్ చేసుకున్న విషయం కాదు. కాని, నా ప్రయాణం పెద్ద తెరతో కాదు, చిన్న కథలతోనే మొదలైంది. ఒక చిన్న షార్ట్‌ఫిల్మ్‌లో కొద్దిసేపు మాత్రమే కనిపించినా, అలా మొదటిసారి కెమెరా ముందు నిలబడ్డ ఆ క్షణంలోనే ‘ఇదే నా దారి’ అని నాకు స్పష్టంగా తెలిసిపోయింది.
⇒ మొదటి సినిమా ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ విడుదలైనప్పుడు మనుసులో కొంచెం భయం ఉన్నా, ప్రేక్షకులు చూపిన ప్రేమ ఆ భయాన్ని పూర్తిగా కరిగించింది.
⇒ రెండో, మూడో సినిమాలు వచ్చేటప్పటికి నాలోనే ఒక కొత్త శివానిని చూసుకున్నాను. ప్రతి పాత్ర నాకు ఒక కొత్త నేర్పు, ఒక కొత్త అనుభవం ఇచ్చింది.
⇒ పూలంటే నాకు ప్రత్యేకమైన ప్రేమ. ఏ పువ్వైనా చేతిలో తీసుకుని అలా తిరగేస్తూ, వాసన చూస్తూ ఉండటం నాకు హాబీలా మారిపోయింది.
⇒ కథలు చదవడం నా అలవాటు. పెద్ద నవలలు కాకుండా, హృదయానికి హత్తుకునే చిన్న కథలు బాగా నచ్చుతాయి.
⇒ ఫ్యాషన్ విషయానికి వస్తే నేను చాలా సింపుల్. ఒక మంచి జీన్స్, క్లీన్స్ గా ఉండే కుర్తా, చిన్న చెవిపోగులు. అంతే, నేను సిద్ధం.
⇒ చర్మ సంరక్షణ విషయంలో నేను ఎక్కువ క్రీములు వాడను. రోజూ తగినంత నీళ్లు తాగడం, రాత్రి మాయిశ్చరైజర్ మాత్రం తప్పనిసరి. వారానికి ఒకసారి పెసరపిండి రాసుకుంటే చాలు, చర్మం బాగా ఫ్రెష్‌గా మారుతుంది.
⇒ నాకు ఇష్టమైన రంగులు పింక్‌లోని మృదువైన షేడ్స్, లైట్ బ్లూ.
⇒ అభిమానులతో మాట్లాడటం నాకు చాలా ఇష్టం. వాళ్ల కామెంట్లు, మెసేజులు, వారి ప్రేమ– అవన్నీ నాకు కొత్త శక్తి ఇస్తాయి.


