జోరుగా... హుషారుగా... | Tollywood Star Heroes Movies Shooting Update | Sakshi
Sakshi News home page

జోరుగా... హుషారుగా...

Dec 7 2025 1:57 AM | Updated on Dec 7 2025 1:57 AM

Tollywood Star Heroes Movies Shooting Update

ఆడుతుపాడుతూ పని చేస్తుంటే అలుపూ సొలుపేం ఉండదు అంటూ... బిజీ బిజీగా షూటింగ్‌ చేసేస్తున్నారు స్టార్స్‌. జోరుగా షూటింగ్స్‌ జరుగుతుంటే స్టూడియోలు కూడా కళకళలాడుతున్నాయి. కొన్ని స్టూడియోస్‌లో కలర్‌ఫుల్‌ సెట్స్‌ కనువిందు చేస్తున్నాయి. సీన్‌కి తగ్గట్టు సహజమైన లొకేషన్స్‌లో మరికొన్ని షూటింగ్స్‌ జరుగుతున్నాయి. ఇక... ఏ స్టార్‌ ఎక్కడెక్కడ షూటింగ్‌ చేస్తున్నారో చూద్దాం...

దౌలతాబాద్‌ టు అన్నపూర్ణ... 
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌ గారు’. ‘పండక్కి వస్తున్నారు’ అనేది ఉపశీర్షిక. నయనతార హీరోయిన్ . ఈ సినిమాలో హీరో వెంకటేశ్‌ ముఖ్యపాత్రపోషిస్తున్నారు. కేథరిన్, సచిన్‌ ఖేడేకర్‌ ఇతరపాత్రల్లో నటిస్తున్నారు. వెంకటేశ్‌ హీరోగా నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (2025) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. అర్చన సమర్పణలో సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. 

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం కీలక షెడ్యూల్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. హైదరాబాద్‌లోని దౌలతాబాద్‌ అసెంబ్లీ పబ్‌లో రెండు రోజులపాటు పలు సన్నివేశాల చిత్రీకరణ జరిపారు. ఆ తర్వాత తిరిగి అన్నపూర్ణ స్టూడియోలో షూటింగ్‌ ఆరంభించారు. ఈ సినిమా కోసం వేసిన ప్రత్యేకమైన సెట్‌లో చిరంజీవితోపాటు చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు అనిల్‌ రావిపూడి. చాలా గ్యాప్‌ తర్వాత చిరంజీవి నటిస్తున్న పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం ఇది.

ఈ మూవీలో చిరంజీవి–నయనతార భార్యాభర్తలుగా నటిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల..’పాట ఏ స్థాయిలో శ్రోతలను అలరించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ మూవీలో తనపాత్రకు సంబంధించిన చిత్రీకరణ బుధవారంతో పూర్తయినట్లు వెంకటేశ్‌ పేర్కొన్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  

కోఠిలో...  
వరుసపాన్‌ ఇండియా చిత్రాలతో జెట్‌ స్పీడ్‌లో దూసుకెళుతున్నారు ప్రభాస్‌. ప్రస్తుతం ఆయన మారుతి దర్శకత్వంలో ‘ది రాజాసాబ్‌’, సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్‌’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ వంటి ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా ఉన్నారు. ‘అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్, యానిమల్‌’ చిత్రాల ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘స్పిరిట్‌’. ఈ మూవీలో ‘యానిమల్‌’ మూవీ ఫేమ్‌ త్రిప్తీ దిమ్రి హీరోయిన్‌. సీనియర్‌ నటి కాంచన, ప్రకాశ్‌రాజ్, బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఓబెరాయ్‌ ఇతరపాత్రలుపోషిస్తున్నారు.

భద్రకాళి పిక్చర్స్‌ప్రోడక్షన్ ్స,  టీ–సిరీస్‌ బ్యానర్స్‌పై ప్రణయ్‌ రెడ్డి వంగా, భూషణ్‌ కుమార్, కృషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌ తొలిసారి ఓపోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కోఠిలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌పాల్గొనడం లేదు. అయితే ఈ చిత్రంలోని ప్రధాన తారాగణంపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు సందీప్‌ రెడ్డి. నాన్ స్టాప్‌గా జరగనున్న ఈ మూవీ షూటింగ్‌లో తర్వాతి షెడ్యూల్‌లో ప్రభాస్‌ జాయిన్‌ అవుతారట.

ప్రభాస్‌ మొదటిసారిపోలీసాఫీసర్‌గా నటిస్తుండటం.. ‘అర్జున్‌ రెడ్డి, కబీర్‌ సింగ్, యానిమల్‌’ వంటి హ్యాట్రిక్‌ మూవీస్‌ తర్వాత సందీప్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తుండటంతో ‘స్పిరిట్‌’ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. ఈ చిత్రంలో హాలీవుడ్‌ నటుడు డాన్‌ లీ విలన్‌గా నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ‘స్పిరిట్‌’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొమ్మిది భాషల్లో విడుదల కానుంది.

ఆర్‌ఎఫ్‌సీలో...  
‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (2022) వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తర్వాత ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’    (వర్కింగ్‌ టైటిల్‌). మహేశ్‌బాబు హీరోగా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోన్న ఈ భారీ చిత్రంలో ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దుర్గా ఆర్ట్స్‌ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ సినిమా కోసం మహేశ్‌బాబు ΄÷డవాటి హెయిర్‌ స్టైల్, గెడ్డంతో ప్రత్యేకంగా మేకోవర్‌ అయిన సంగతి తెలిసిందే.

అమేజాన్‌ అడవుల నేపథ్యంలో భారీ అడ్వెంచరస్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీ కోసం ఆర్‌ఎఫ్‌సీలో ప్రత్యేకంగా సెట్‌ వేశారు మేకర్స్‌. ప్రస్తుతం అక్కడ మహేశ్‌బాబుతోపాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట రాజమౌళి. మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రాన్ని 120 దేశాల్లో విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. నవంబరులో నిర్వహించిన ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29’ గ్లోబల్‌ ట్రాటర్‌ ఈవెంట్‌ తర్వాత ఈ సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. దయాదాక్షిణ్యం లేని, కరడుగట్టిన, కమాండింగ్‌ ప్రతినాయకుడు కుంభపాత్రలో పృథ్విరాజ్‌ సుకుమారన్  కనిపించనున్నారు. ఆయన లుక్‌కి మంచి స్పందన వచ్చింది. ఆస్కార్‌ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి ఈ నినిమాకి సంగీతం అందిస్తున్నారు.  

ముచ్చింతల్‌లో...  
నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ‘దసరా’ (2023) వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత నాని, డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఓదెల, నిర్మాత సుధాకర్‌ చెరుకూరి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ద్వితీయ చిత్రం ‘ది ప్యారడైజ్‌’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. హిట్‌ కాంబోలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలున్నాయి. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌లో జరుగుతోంది. ఈ మూవీ కోసం ప్రత్యేకంగా వేసిన సెట్స్‌లో జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో నానితోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపాల్గొంటోంది. 

ఈ చిత్రంలో నానిపాత్ర పేరు జడల్‌. ఇప్పటికే విడుదల చేసిన స్టిల్‌లో నాని రెండు జడలు వేసుకుని, పక్కా మాస్‌ లుక్‌లో కనిపించగా మంచి స్పందన వచ్చింది. నాని లుక్, స్టోరీ, టేకింగ్‌... ఇలా ప్రతిదీ వైవిధ్యంగా ఉండేలా తెరకెక్కిస్తున్నారట శ్రీకాంత్‌ ఓదెల. ఈ సినిమాని తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్‌ భాషల్లో 2026 మార్చి 26న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించింది.

అయితే ఆ తేదీకి ఈ మూవీ రిలీజ్‌ ఉండకపోవచ్చనే వార్తలు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ‘పెద్ది’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రామ్‌చరణ్‌ పుట్టినరోజు కానుకగా మార్చి 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘ది ΄్యారడైజ్‌’ చిత్రం విడుదల ఉంటుందా? లేదా? లేకుంటే మరో తేదీ ఫిక్స్‌ అవుతుందా? అన్నది ఆసక్తిగా మారింది. ఈ విషయాలపై స్పష్టత రావాలంటే వేచి చూడాలి.  

దండు మైలారంలో...  
విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘వీడీ 14’ (వర్కింగ్‌ టైటిల్‌). ‘ది ఎండ్, టాక్సీవాలా, శ్యామ్‌ సింగరాయ్‌’ చిత్రాల ఫేమ్‌ రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ–రాహుల్‌ సంకృత్యాన్‌ కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘టాక్సీవాలా’ 2018 నవంబరు 17న విడుదలై, మంచి హిట్‌గా నిలిచింది. ‘టాక్సీవాలా’ వంటి హిట్‌ మూవీ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తోన్న ద్వితీయ చిత్రం ‘వీడీ 14’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని దండు మైలారంలో జరుగుతోంది. 19వ శతాబ్దం నేపథ్యంలో  1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగిన వాస్తవ చారిత్రక ఘటనల ఆధారంగా భారీపాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. బ్రిటీష్‌పాలన కాలం నేపథ్యంలో పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని ఇప్పటివరకూ ఎవరూ తెరకెక్కించని కథాంశంతో పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారట రాహుల్‌ సంకృత్యాన్‌.

దండుమైలారంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. పతాక సన్నివేశాల్లో విజయ్‌ దేవరకొండతోపాటు ఇతర నటీనటులుపాల్గొంటున్నారని సమాచారం. ఈ సినిమాలో హాలీవుడ్‌ దిగ్గజ నటుడు   (‘మమ్మీ’ సినిమా విలన్‌) ఆర్నాల్డ్‌ వస్లూ నటిస్తున్నారనే వార్తలు వచ్చాయి. బ్రిటిష్‌ అధికారిపాత్రలో ఆర్నాల్డ్‌ వస్లూ  నెగటివ్‌ క్యారెక్టర్‌లో నటిస్తుండటంతో వీరి మధ్య భారీ యాక్షన్‌ సన్నివేశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్‌ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

అల్యూమినియం ఫ్యాక్టరీలో... 
వరుణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్‌ టైటిల్‌). ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్‌ రాజా, ఏక్‌ మినీ కథ’ వంటి హిట్‌ చిత్రాలకు దర్శకత్వం వహించిన మేర్లపాక గాంధీ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రితికా నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్ ్స, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్ మెంట్స్‌ బ్యానర్స్‌పై ‘వీటీ 15’ రూపొందుతోంది. ఇండో కొరియన్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి సమీపంలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్‌ జరుపుకుంటోంది.

హీరో హీరోయిన్లతోపాటు ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట దర్శకుడు. వరుణ్‌ కోసం తనదైన శైలిలో అద్భుతమైన వినోదాత్మక కథను సిద్ధం చేశారు మేర్లపాక గాంధీ. గత కొన్నాళ్లుగా వరుసగా యాక్షన్‌ సినిమాలు చేస్తూ వస్తోన్న వరుణ్‌... జస్ట్‌ ఫర్‌ ఛేంజ్‌ అన్నట్లు ఈసారి ఆడియన్స్‌కి వినోదాలు అందించేందుకు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే... అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఇటీవల ఓ ప్రత్యేక సాంగ్‌ని చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ‘జాంబి రెడ్డి, బంగార్రాజు’ చిత్రాల ఫేమ్‌ దక్షా నగార్కర్, వరుణ్‌ తేజ్‌లపై ఈపాట తెరకెక్కించారు. ఈ సినిమాకు ‘కొరియన్‌ కనకరాజు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. మరి... అదే టైటిల్‌ని ఫిక్స్‌ చేస్తారా? లేకుంటే మరేదైనా నిర్ణయిస్తారా? అన్నది వేచి చూడాలి.  

తుక్కుగూడలో...  
సాయిదుర్గా తేజ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్‌ కేపీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తున్నారు. జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కీలకపాత్రలుపోషిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై ‘హను–మాన్‌’ (2024) వంటిపాన్‌ ఇండియన్‌ హిట్‌ అందుకున్న కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోపాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కానుంది.

ఇదిలా ఉంటే... ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ సమీపంలోని తుక్కుగూడలో జరుగుతోంది. అక్కడ ప్రత్యేకంగా వేసిన సెట్‌లో గత కొన్నాళ్లు నుంచి లాంగ్‌ షెడ్యూల్‌ జరుపుతున్నారు మేకర్స్‌. ఈ షెడ్యూల్‌లో హీరో, హీరోయిన్లతోపాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట రోహిత్‌. అక్టోబరు 15న సాయి దుర్గాతేజ్‌ పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘అసుర ఆగమన’ పేరుతో ఈ మూవీ గ్లింప్స్‌ను విడుదల చేయగా, మంచి స్పందన వచ్చింది.

భూత్‌ బంగ్లాలో... 
అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్‌’. ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రదర్శకుడు మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ΄÷డవాటి జుట్టు, గెడ్డంతో ఫుల్‌ మాస్‌ లుక్‌లోకి మారిపోయారు అఖిల్‌. ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని భూత్‌ బంగ్లాలో జరుగుతోంది. శరవేగంగా సాగుతోన్న ఈ చిత్రీకరణలో హీరో, హీరోయిన్లతోపాటు చిత్రంలోని ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారని తెలిసింది. 

రాయలసీమ నేపథ్యంలో సాగే రొమాంటిక్‌ యాక్షన్  డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఏప్రిల్‌ 8న అఖిల్‌ బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్‌ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘‘గతాన్ని తరమడానికిపోతా... మా నాయన నాకో మాట సెప్పినాడు... పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాది రా... పేరు ఉండదు, అట్నేపోయేటప్పుడు ఊపిరుండదు... పేరు మాత్రమే ఉంటాది. ఆ పేరు ఎట్టా నిలబడాలంటే...’’ అంటూ రాయలసీమ యాసలో అఖిల్‌ చెప్పిన డైలాగ్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే ఈ మూవీపై మంచి క్రేజ్‌ నెలకొంది.  

రామానాయుడులో క్లైమాక్స్‌... 
‘పెదకాపు’ (2023) చిత్రం ఫేమ్‌ విరాట్‌ కర్ణ హీరోగా నటిస్తున్న రెండో చిత్రం ‘నాగబంధం’. ‘ది సీక్రెట్‌ ట్రెజర్‌’ అన్నది ట్యాగ్‌లైన్ . నిర్మాత అభిషేక్‌ నామా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేశ్‌ ఐశ్వర్యా మీనన్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో జగపతిబాబు, జయప్రకాశ్, మురళీ శర్మ, బీఎస్‌ అవినాష్‌ కీలకపాత్రలుపోషిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని కిశోర్‌ అన్నపురెడ్డి, నిషితా నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది.

పతాక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌. ‘‘పాన్‌ ఇండియా ఎపిక్‌ మైథలాజికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘నాగబంధం’. నానక్‌రామ్‌గూడలోని రామానాయుడు స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్‌లో క్లైమాక్స్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం. కేవలం క్లైమాక్స్‌ సెట్‌ కోసమే రూ.20 కోట్లు ఖర్చు చేశాం. ఓ మహద్వారం చుట్టూ రూపొందించిన ఈ క్లైమాక్స్‌లోని భావోద్వేగం, డ్రామాను విజువల్‌గా అద్భుతంగా చూపించేలా ఆర్ట్‌ డైరెక్టర్‌ అశోక్‌ కుమార్‌ ఈ సెట్‌ని డిజైన్‌ చేశారు.

థాయ్‌ స్టంట్‌ మాస్టర్‌ కేచా ఖాంఫాక్‌డీ అద్భుతమైన టేకింగ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీతో సీక్వెన్స్‌ని గ్రాండ్‌గా తీర్చిదిద్దితున్నారు’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఇక ఈ సినిమా కోసంప్రోడక్షన్‌ డిజైనర్‌ అశోక్‌ కుమార్‌ ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కేరళలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌ సెట్‌లో విరాట్‌ కర్ణతోపాటు 5000 మంది నృత్య కళాకారులతో ఓపాటని చిత్రీకరించడం విశేషం.  

పై చిత్రాలే కాదు..  మరికొన్ని సినిమాల షూటింగ్స్‌ కూడా హైదరాబాద్‌తోపాటు పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌లు జరుపుకుంటున్నాయి. – డేరంగుల జగన్‌ మోహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement