అమెరికా కాదన్నా.. ఆప్షన్స్‌ అన్‌లిమిటెట్‌ | After US Visa Curbs, Indian Students Shift Focus to Germany, Canada, UK & Australia | Sakshi
Sakshi News home page

అమెరికా కాదన్నా.. ఆప్షన్స్‌ అన్‌లిమిటెట్‌

Oct 12 2025 7:33 AM | Updated on Oct 12 2025 11:33 AM

Funday Special story On America Education Indian Student

‘టాలెంట్‌ ఉన్న ప్రతిచూపు అమెరికా వైపే’ అన్నట్లుగా సాగింది ఇంతకాలం. అమెరికాలో సెటిల్‌ అయినవారి పేరెంట్స్‌ దగ్గర నుంచి అమెరికన్‌ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వరకు ప్రతి ఒక్కరూ అమెరికా కాలమానానికి అనుగుణంగా నడుచుకోవడం పరిపాటి అయిపోయింది! కాని, అమెరికా తీరు మార్చింది. పొమ్మనకుండానే ఇండియన్స్‌కు పొగబెడుతోంది.

చదువు, ఉద్యోగం, స్థిరనివాసం కోసం అమెరికా చేరుకోవడమనేది చాలామంది భారతీయుల కల! అందుకోసం ఎంత కష్టమైనా పడడానికి సిద్ధంగా ఉంటారు. కాని, అపారమైన ఆశలతో అమెరికా వైపు చూస్తున్న లక్షలాది మంది భారతీయుల కలలు ఇప్పుడు కరిగిపోతున్నాయి. దీనికి, అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠిన నిబంధనలే కారణం! ఎన్నో ఏళ్లుగా ఇండియా–అమెరికాల మధ్య కొనసాగుతున్న బలమైన అనుబంధం ఇప్పుడు మెల్లమెల్లగా బీటలువారుతోంది. ఈ బంధానికి ప్రధాన వారధి అయిన విద్యారంగంపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపెడుతోంది. ఈ పరిస్థితుల్లో, విదేశీ విద్య కోసం అమెరికా తప్పితే మరో మార్గమే లేదా? మరో దేశమే లేదా?! అంటే ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు పలు అభివృద్ధి చెందిన దేశాల నుంచి సాదర ఆహ్వానాలు అందుతున్నాయి.

క్రమంగా అమెరికాకే కాదు జర్మనీ, కెనడా యూకే వంటి దేశాలకు ఇండియా నుంచి వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. అమెరికాకు బ్రేక్స్‌ పడుతున్న తరుణంలో భారత యువత తమ విదేశీ ప్రయాణాల గమ్యాలను మార్చుకుంటూ
దూసుకుని పోతున్నారు. 

ఏటా విదేశాలకు వెళ్లే మన విద్యార్థులు 


హెచ్‌–1బీ వీసా అనేది అమెరికా– తమ దేశంలో ప్రత్యేక నైపుణ్యంతో నిర్వహించే ఉద్యోగాల కోసం– విదేశీ నిపుణులకు ఇచ్చే ఒక వలస వీసా! ముఖ్యంగా సైన్స్‌, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్‌ (స్టెమ్‌) రంగాల్లో అమెరికాకు చెందిన నిపుణుల కొరతను తీర్చుకోవడానికి ఈ వీసాను 1990లో నాటి అమెరికా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్‌ యాక్ట్‌ ద్వారా ప్రవేశపెట్టింది. దీనివల్ల అమెరికన్‌ కంపెనీలు తమ వ్యాపారాలను విస్తరించుకోడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకోగలిగాయి. ఇది అమెరికా ఆర్థిక వృద్ధికి, సాంకేతిక ఆవిష్కరణలకు ఎంతో తోడ్పడింది! ఇప్పటి వరకూ హెచ్‌–1బీ వీసాలు పొందినవారిలో భారతీయులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. అయితే ట్రంప్‌ నిర్ణయంతో ఎందరో భారతీయుల కలలు చెదిరిపోయాయి. ఈ క్రమంలోనే ‘అమెరికా వద్దంటే ఆగిపోనక్కర్లేదు మా దేశం రండి’ అంటున్నాయి ఎన్నో దేశాలు. ఆ లిస్ట్‌లో జర్మనీ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఐర్లండ్, ఫ్రాన్స్, యూఏఈ (యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌), పోలండ్‌ ఇలా చాలా దేశాలు చక్కటి భవిష్యత్‌ కోసం ఎర్రతివాచీలు పరుస్తున్నాయి. ఏయే దేశాల్లో ఎలాంటి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయో చూద్దాం

 విదేశీయులకు సైతం ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యను, అది కూడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో దాదాపు ఉచితంగా అందించే అరుదైన దేశం జర్మనీ. ఇది కేవలం ఉన్నత ప్రమాణాలకు, ఆధునిక పరిశోధనలకు ప్రసిద్ధి చెందడమే కాక, ప్రపంచంలోని అగ్రశ్రేణి సాంకేతిక, ఇంజనీరింగ్‌ కోర్సులకు కేంద్రంగా ఉంది. జర్మనీలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో చదివే అంతర్జాతీయ విద్యార్థులకు సాధారణంగా ట్యూషన్‌ ఫీజులుండవు. కొన్ని విశ్వవిద్యాలయాల్లో కేవలం సెమిస్టర్‌ కాంట్రిబ్యూషన్‌ లేదా అడ్మినిస్ట్రేటివ్‌ ఫీజు మాత్రమే ఉంటుంది. విద్యార్థులు తమ చదువుపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఏడాదికి గరిష్ఠంగా 140 పూర్తి రోజులు లేదా 280 సగం రోజులు పనిచేయడానికి అనుమతి ఉంటుంది. 

దీనికి ప్రత్యామ్నాయంగా, సెమిస్టర్‌ కాలంలో వారానికి 20 గంటల వరకు పనిచేయవచ్చు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత, అంతర్జాతీయ విద్యార్థులు తమ అర్హతకు సరిపోయే ఉద్యోగం వెతుక్కోవడానికి 18 నెలల వరకు జర్మనీలో ఉండొచ్చు. అందుకు జాబ్‌–సీకింగ్‌ రెసిడె¯ పర్మిట్‌ పొందాల్సి ఉంటుంది. ఈ 18 నెలల కాలంలో వారు పూర్తి సమయం ఉద్యోగం వెతుక్కుంటూనే తమ ఖర్చుల కోసం తాత్కాలిక ఉద్యోగం కూడా చేసుకోవచ్చు. గడువులోపు ఉద్యోగం సంపాదించి, దానిని వర్క్‌ పర్మిట్‌గా మార్చుకున్నట్లయితే, జర్మనీలో స్థిరపడటానికి మార్గం సులభమవుతుంది.

కెనడా
నిజానికి కెనడియన్‌ విద్యార్హతలకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అలాగే కెనడాలో ప్రపంచ శ్రేణి విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి, ఇవి విద్యార్థులకు అద్భుతమైన ఉద్యోగ అవకాశాలనందిస్తాయి. కెనడాలో ప్రభుత్వ నిధులు పొందే విశ్వవిద్యాలయాలలో కూడా విదేశీ విద్యార్థులకు ఫీజులుంటాయి. అయితే కోర్సులను బట్టి, యూనివర్సిటీ స్థాయిని బట్టి ఫీజులు మారుతుంటాయి. 

స్టడీ పర్మిట్‌ ఉన్న విద్యార్థులు తమ చదువుల సమయంలో వారానికి గరిష్ఠంగా 20 గంటలు క్యాంపస్‌లో లేదా క్యాంపస్‌ వెలుపల పనిచేయడానికి అనుమతి ఉంటుంది. సెమిస్టర్‌ బ్రేక్స్‌ సమయంలో పూర్తి సమయం పనిచేయవచ్చు. కెనడియన్‌ డిజిగ్నేటెడ్‌ లెర్నింగ్‌ ఇన్‌స్టిట్యూషన్‌ నుంచి అర్హత కలిగిన ప్రోగ్రామ్‌ పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు తమ కోర్సు వ్యవధిని బట్టి గరిష్ఠంగా 3 సంవత్సరాల వరకు కెనడాలో ఉండొచ్చు. ఉద్యోగం వెతుక్కోవడానికి పనిచేయడానికి అనుమతించే పోస్ట్‌–గ్రాడ్యుయేషన్‌ వర్క్‌ పర్మిట్‌ పొందవచ్చు. ఈ పర్మిట్‌ పొందిన తరువాత, ఒక సంవత్సరం కెనడియన్‌ గ్రాడ్యుయేట్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎంట్రీ వంటి ఇమ్మిగ్రేషన్‌ మార్గాలతో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలుంటాయి. కెనడా ప్రభుత్వం వలసదారులను స్వాగతిస్తుంది కాబట్టి, విద్యార్థులకు ఇది ఒక చక్కటి మార్గమవుతుంది.

యూకే 
విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గమ్యస్థానం యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే). బెస్ట్‌ కోర్సులు, ప్రపంచ ప్రఖ్యాతి చెందిన యూనివర్సిటీలు, గ్రాడ్యుయేషన్‌ తర్వాత సులభంగా ఉద్యోగం వెతుక్కోవడానికి వీలు కల్పించే విధానాలతో యూకే అంతర్జాతీయ విద్యార్థులకు స్వర్గధామం. అక్కడి విశ్వవిద్యాలయాలు క్వాలిటీ ఎడ్యుకేషన్‌కు ప్రసిద్ధి. ఇక్కడి బ్యాచిలర్‌ కోర్సులు సాధారణంగా 3 సంవత్సరాలు, మాస్టర్స్‌ కోర్సులు ఒక సంవత్సరంలోనే పూర్తి అవుతాయి. యూకేలో విదేశీ విద్యార్థులకు ఫీజులు సాధారణంగా దేశీయ విద్యార్థుల కంటే ఎక్కువగా ఉంటాయి. యూనివర్సిటీ ర్యాంకింగ్, నగరంతో పాటు కోర్సును బట్టి ఫీజు మారుతుంది. స్టూడెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు, విద్యార్థి తమ ట్యూషన్‌ ఫీజుతో పాటు తమ జీవనానికి సరిపడా కనీస రాబడిని చూపించాల్సి ఉంటుంది. అలాగే ఎంపికైన యూనివర్సిటీ/కాలేజ్‌ (లైసె¯Œ ్స పొందిన స్పాన్సర్‌) నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రం సిద్ధంగా ఉంచుకోవాలి. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్‌ వంటి అనేక యూనివర్సిటీలు అంతర్జాతీయ విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజులో రాయితీ లేదా పూర్తి స్థాయి స్కాలర్‌షిప్‌లను అందిస్తాయి. కామ¯Œ వెల్త్‌ దేశాలకు చెందిన ప్రతిభావంతులకు కామ¯Œ వెల్త్‌ స్కాలర్‌షిప్‌ కూడా లభిస్తుంది. విద్యార్థులు ఎటువంటి తక్కువ జీతం పొందే ఉద్యోగాన్ని చేస్తున్నా స్కిల్డ్‌ వర్కర్‌ వీసాకు మారే అవకాశం కూడా ఉంటుంది.

ఆస్ట్రేలియా 
అంతర్జాతీయ విద్యార్థులకు చక్కటి విద్యను, అధిక జీవన ప్రమాణాలను, పట్టభద్రులైన తర్వాత గొప్ప ఉద్యోగ అవకాశాలను పుష్కలంగా అందించే దేశాలలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అంతర్జాతీయ విద్యార్థి వీసా (సబ్‌క్లాస్‌ 500) ఉన్నవారు చదువుకునేటప్పుడు ప్రతి రెండు వారాలకు 48 గంటల వరకు పని చేసుకోవచ్చు, ఇంకా చదువు విరామ సమయాల్లో అపరిమిత గంటలు పనిచేసే వెసులుబాటు కూడా ఉంది. ఇది విద్యార్థులకు తమ ఖర్చులను తాము భరించడానికి, నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి, చక్కటి అనుభవాన్ని పొందడానికి సహాయపడుతుంది. గ్రాడ్యుయేషన్‌ పూర్తి అయిన తర్వాత, విద్యార్థులు తమ అర్హతలను బట్టి, 18 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు (కోర్సుతో పాటు ప్రాంతాన్ని బట్టి) ఆ దేశంలోనే ఉండి, తగిన ఉద్యోగం కోసం వెతుక్కోవచ్చు.

న్యూజీలండ్‌
అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత సురక్షితమైన, నాణ్యమైన విద్యను అందించే దేశాల్లో న్యూజీలండ్‌ కూడా ప్రత్యేకమే! ఇక్కడ పర్యావరణం చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది. న్యూజిలాండ్‌లో పలు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు వరల్డ్‌ క్యూఎస్‌ (కోక్వారెల్లి సైమండ్స్‌) ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని పొందాయి. కాబట్టి అక్కడ విద్యాప్రమాణాలు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించొచ్చు. అంతర్జాతీయ విద్యార్థులు పీహెచ్‌డీ (డాక్టోరల్‌) కోర్సులు చదివితే, వారికి దేశీయ విద్యార్థులతో సమానమైన, చాలా తక్కువ ఫీజు వర్తిస్తుంది. ఇక విదేశీ విద్యార్థి వీసా కోసం జీవన వ్యయాలు, తిరుగు ప్రయాణ ఖర్చులు చూపించాల్సి ఉంటుంది. విరామ సమయాల్లో పూర్తి సమయం పనిచేయడానికి అనుమతి ఉంది. న్యూజీలండ్‌లో చదువుకున్న తర్వాత అక్కడ స్థిరపడటం కూడా సులభమే.
మొత్తానికీ అమెరికా చాన్స్‌ పోయిందని నిరాశపడే భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆప్షన్స్‌ ఉన్నాయి. చాలా దేశాలు వెల్‌కమ్‌ బోర్డ్‌తో ఎదురుచూస్తున్నాయి. ఆ నిరాశను వదిలేసి చుట్టూ ప్రపంచం వైపు చూస్తే మారేదేం లేదు.. విమానాశ్రయంలో ఫ్లైట్‌ పేరు తప్ప అంటున్నారు అనుభవజ్ఞులు.

  • ఉత్తమమైన దేశాన్ని ఎలా ఎంచుకోవాలి?
    విదేశాల్లో కెరీర్‌ని ప్లాన్‌ చేసుకునే యువతకు ఆయా దేశాల్లో చదువుకోవడానికి, ఆపై అక్కడే పని చేయడానికి, అక్కడే స్థిరపడటానికి ఏ దేశాన్ని ఎంచుకోవాలి అనేది ప్రధాన సమస్య. కొన్ని దేశాలు సులభమైన పోస్ట్‌–స్టడీ వర్క్‌ వీసా, అలాగే పర్మనెంట్‌ రెసిడెన్స్‌ (స్థిరనివాసం) పొందే మార్గాలను అందిస్తాయి. అయితే ఏ దేశాలను ఎంచుకుంటే మేలు జరుగుతుంది?

  • సులభమైన పోస్ట్‌–స్టడీ వర్క్‌ వీసా, స్థిరనివాస మార్గాలు ఎక్కువగా ఉన్న దేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్‌ వంటి దేశాలు అంతర్జాతీయ విద్యార్థులకు చాలా అనుకూలమైన వీసా విధానాలను పాటిస్తున్నాయి. దాంతో ఈ దేశాలలో పర్మనెంట్‌ రెసిడెన్సీ (స్థిరనివాసం)పొందే మార్గాలు కూడా సులభంగా ఉంటాయి.

  • కెరీర్‌ వృద్ధి కోసం ఇంగ్లీష్‌ మాట్లాడే లేదా ఇంగ్లీష్‌ బోధించే దేశాలను ఎంచుకోవాలి. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజీలండ్, యూకే వంటి ఇంగ్లిష్‌ మాట్లాడే దేశాలు మన భారతీయులకు భాషాపరంగా సౌకర్యంగా ఉంటాయి. అయితే జర్మనీ, నెదర్లండ్స్‌ వంటి కొన్ని నాన్‌–ఇంగ్లిష్‌ దేశాలు ఇంగ్లిష్‌ భాషలో కోర్సులను అందిస్తాయి. కాని, ఉద్యోగం పొందాలంటే మాత్రం స్థానిక భాషను నేర్చుకోవాల్సి ఉంటుంది. అక్కడే సెటిల్‌ అవ్వాలి అనుకునేవారు ఎడ్యుకేష  సమయంలో స్థానిక భాష నేర్చుకోవడంపై కాస్త దృష్టిపెట్టాలి.

  • ఏ రంగంలో చదువుకోవాలనుకుంటున్నారో దాని ఆధారంగా మనం ఎన్నుకునే యూనివర్సిటీల విషయంలో కోక్వారెల్లి సైమండ్స్‌ (క్యూఎస్‌), టైమ్స్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌(టీహెచ్‌ఈ) వంటి సంస్థల ప్రపంచ ర్యాంకింగ్‌లను పరిశోధించుకోవాలి. ఆయా విశ్వవిద్యాలయాల గ్రాడ్యుయేట్‌లకు ఎంత సులభంగా ఉద్యోగాలు లభిస్తున్నాయో, వారి సగటు జీతాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. యూనివర్సిటీల అధికారిక వెబ్‌సైట్లు లేదా లింక్డ్‌ఇన్‌ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వివరాలు లభిస్తాయి.

  • ఒక దేశాన్ని ఎంచుకునే ముందు, అక్కడ అంతర్జాతీయ విద్యార్థులకు ఎంత భద్రత ఉందో తెలుసుకోవాలి. విశ్వవిద్యాలయాలు అంతర్జాతీయ విద్యార్థులకు ఎలాంటి సహాయక సేవలు (అకాడెమిక్‌ సపోర్ట్, కౌన్సెలింగ్, కెరీర్‌ గైడె¯Œ ్స) అందిస్తున్నాయో పరిశీలించుకోవాలి. ఆ దేశంలో జీవన వ్యయం (అద్దె, ఆహారం, రవాణా) సహా విద్యార్థి సంఘాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవాలి.

  • చదువుకునే సమయంలో ఆయా దేశాల్లో తమ వ్యక్తిగత ఖర్చులను తగ్గించుకోవడానికి స్కాలర్‌షిప్‌లు, ట్యూషన్‌ ఫీజు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి. చదువుతున్నప్పుడే ఇంటర్న్‌షిప్‌లు లేదా పార్ట్‌–టైమ్‌ ఉద్యోగాలు లభించే అవకాశాలున్న దేశాలను ఎంచుకోవడంతో వృత్తి అనుభవాన్ని పొందవచ్చు. అంతేకాకుండా, స్థానిక భాష కూడా నేర్చుకోవచ్చు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement