
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న నేరగాడు బత్తుల ప్రభాకర్. కాలేజీలను టార్గెట్‌గా చేసుకుని, స్టూడెంట్ ముసుగులో రెక్కీ చేసి, నల్లధనాన్ని దోచుకుపోయే ఈ గజదొంగ ఈ ఏడాది సెప్టెంబర్ 22న ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా దుద్దుకూరు వద్ద పోలీసు ఎస్కార్ట్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో నేరాలకు పాల్పడ్డ ఈ అంతర్రాష్ట్ర నేరగాడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. రూ.333 కోట్లు సంపాదించాక నేరాలు మానేయాలని, అప్పటికే తన జీవితంలో వందమంది యువతులతో సన్నిహితంగా ఉండాలనీ లక్ష్యంగా పెట్టుకున్న ఘరానా దొంగ ఇతడు.పెద్ద పెద్ద కాలేజీలను టార్గెట్‌గా చేసుకుని, చోరీలు చేసే బత్తుల ప్రభాకర్ చదివింది మాత్రం ఎనిమిదో తరగతే. చిత్తూరు జిల్లా ఇరికిపెంటకు చెందిన ఇతగాడు 7, 8 తరగతులు విజయవాడలో చదివాడు.
తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ 17 ఏళ్ల వయస్సు నుంచే చోరీల బాటపట్టాడు. దాదాపు 15 ఏళ్లుగా ఇంజినీరింగ్ కాలేజీలు, కార్పొరేట్ స్కూళ్లలో చోరీలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. ఇతడికి బిట్టూ, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు తదితర మారు పేర్లు ఉన్నాయి. స్నేహితులు, సన్నిహితంగా ఉండే యువతుల వద్ద, షాపింగ్‌కు వెళ్లినప్పడు మృదు స్వభావిగా ఉంటాడు. ఎక్కడా ఎవరితోనూ గొడవలు పడిన దాఖలాలు లేవని పోలీసులు చెబుతున్నారు. కొన్నేళ్ల కిందట రూ.3 వేలు చోరీ చేయడంతో తన నేరచరిత్ర మొదలైంది. అప్పట్లో ఒకే రోజు రూ.3 లక్షలు, మొత్తమ్మీద రూ.33 లక్షలు చోరీ చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాడు. అందుకే బత్తుల ప్రభాకర్ తన ఛాతీ కుడివైపు 3 సంఖ్యను పచ్చబొట్టుగా వేయించుకున్నాడు.
ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ లక్ష్యాన్ని రూ.333 కోట్లకు పెంచుకున్నాడు. అలాగే 100 మంది యువతులతో సన్నిహితంగా ఉండాలన్నది మరో లక్ష్యమని, విలాసవంతమైన జీవితం గడుపుతున్న తాను ఇప్పటికే 40 మందితో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీనికి గుర్తుగానే ఛాతీ ఎడమ వైపు 100 సంఖ్యను టాటూ వేయించుకున్నాడు. విలాస జీవితం గడిపే ఇతగాడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ముసుగుతో ఉంటాడు. గేటెడ్ కమ్యూనిటీల్లో స్నేహితుల పేరిట ఫ్లాట్ తీసుకొని ఉంటూ ఇతర రాష్ట్రాల యువతులతో సహజీవనం చేస్తుంటాడు. ప్రతిరోజూ ఉదయం జిమ్‌కు వెళ్లడం, వీకెండ్స్‌లో పబ్స్‌లో జల్సాలు చేయడం ఇతడి నైజం. కేవలం హైఎండ్ కార్లు మాత్రమే వాడే ప్రభాకర్ సెకండ్ హ్యాండ్ వాహనాలను స్నేహితుల పేరిట కొంటాడు. కొన్నాళ్లు వాడిన తర్వాత ఆ వాహనాన్ని ఆ స్నేహితుడికే వదిలేసి తన మకాం మార్చేస్తాడు. పోలీసులకు చిక్కకుండా ఉండటానికే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడు. ఓ ఫ్లాట్ ఖాళీ చేసిన తర్వాత మరో దాంట్లోకి చేరే వరకు ఖరీదైన ప్రాంతాల్లో ఉన్న పేయింగ్ గెస్ట్ అకామడేషన్స్‌లో ఉంటాడు.
ఓ కాలేజీని టార్గెట్‌గా చేసుకున్న తర్వాత ప్రభాకర్ ముందుగా రెక్కీ చేస్తాడు. దీనికోసం ఆ కాలేజీ విద్యార్థి మాదిరిగా కొన్ని పుస్తకాలు పట్టుకుని, అందుకు తగ్గ దుస్తులు ధరించి లోపలకు ఎంటర్ అవుతాడు. క్లాసుల్లోకి వెళ్లకపోయినా.. 15 రోజుల నుంచి 20 రోజుల వరకు ఆ కాలేజీకి వెళ్తాడు. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, ఆఫీస్ రూమ్, లాకర్ తదితరాలు ఎక్కడ ఉన్నాయి? ఎలా ఉన్నాయి? పరిశీలిస్తాడు. ఈ రెక్కీ పూర్తయ్యాక తన రూమ్‌లో ఓ పేపర్ మీద డ్రాయింగ్ వేస్తాడు. అందులో లాకర్ రూమ్‌తో పాటు అక్కడకు ప్రవేశించడానికి ఎంచుకోవాల్సిన మార్గాలను గీస్తాడు. లాకర్‌ను కట్ చేయడానికి ఎలక్ట్రిక్ కట్టర్ వాడే ప్రభాకర్... దానికి ప్లగ్ పెట్టడానికి పాయింట్ ఎక్కడ ఉందో కూడా చూసుకుంటాడు.
నేరం చేశాక చేతికి చిక్కిన సొమ్ముతో జల్సాలు చేసే ప్రభాకర్, సాధారణంగా ఆ డబ్బు మొత్తం ఖర్చయ్యే వరకు మరో నేరం చేయడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం వరుసపెట్టి నేరాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఫ్లాట్‌లో కలిసి ఉండే క్రమంతో తనకు స్నేహితులుగా మారిన వారికి తన గతం తెలియకుండా జాగ్రత్తపడతాడు. అనుకోకుండా ఎవరికైనా తెలిస్తే వారికి భారీ మొత్తం ఇచ్చి నోరు మూయిస్తాడు. చోరీ నగదును స్నేహితుల అకౌంట్లలో వేసి, వారి యూపీఐలు తన ఫోన్‌లో యాక్టివేట్ చేసుకుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తాడు. జిమ్, పబ్స్‌తో పాటు గోల్ఫ్, బౌలింగ్ ఆటలు, సినిమాలు ఇతడి హాబీ. వీటిలో ఎక్కడికి వెళ్లినా తన ముఖం సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా కచ్చితంగా మాస్క్ ధరిస్తాడు. ఇతడు చోరీ చేసే డబ్బు డొనేషన్లకు సంబంధించిన నల్లధనమైతే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు కూడా చేసే వారు కాదు.
విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ఉన్న ఇతగాడిని అనకాపల్లిలో నమోదైన కేసు విచారణ నిమిత్తం 2022 మార్చి 23న అక్కడి కోర్టుకు తీసుకువెళ్లారు. విచారణ అనంతరం వైజాగ్ తీసుకువచ్చిన ఎస్కార్ట్ పోలీసులు సంకెళ్లు తీసి జైలు అధికారులకు అప్పగిస్తుండగా తప్పించు కున్నాడు. అప్పటినుంచి సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, సూర్యాపేట్ పరిధిలో కాలేజీలలో చోరీలు చేశాడు. విశాఖపట్నం జైల్లో ఉండగా పరిచయమైన, వివాదం జరిగిన ఓ వ్యక్తిని చంపడానికి తుపాకీ తూటాలు ఖరీదు చేశాడు. వీటితో సంచరిస్తుండగా ఈ ఏడాది ఫిబ్రవరి 1న గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసులపై కాల్పులు జరిపాడు.
∙