జయవర్మకి చిన్నప్పుడు చంద్రుడి మీదకి మనిషి వెళ్ళాడని తండ్రి చెప్పడం గుర్తుంది. ఏడేళ్ళ వయసులోనే అతను రాత్రుళ్ళు చంద్రుడి మీదకి దిగిన మనిషి కోసం డాబా మీంచి చంద్రుడిని చూసేవాడు. తండ్రి అమెరికన్స్ ఎంబసీకి ఉత్తరం రాసి తెప్పించిన ముగ్గురు ఆస్ట్రొనాట్స్ ఉన్న కలర్ ఫొటోని ఫ్రేమ్ కట్టించి గోడకి తగిలించాడు. అతనిలో స్వతహాగా గల శాస్త్ర జిజ్ఞాసని ఆ ఫొటో బాగా ప్రభావితం చేసింది.
అతని ఆసక్తిని గమనించిన జయవర్మ తండ్రి నండూరి రామ్మోహన్రావు రాసిన విశ్వ దర్శనం పుస్తకాన్ని కొనిచ్చాడు. పెద్దయ్యే కొద్దీ జయవర్మ చాలా సైన్స్ పుస్తకాలని చదివాడు. అతను హెచ్.జి.వెల్స్ 1895లో రాసిన ‘టైమ్ మెషీన్స్ ’ నవలని చదివాక టైమ్ ట్రావెల్ మీద ఆసక్తి కలిగింది. అంతకు మునుపు 1843లో చార్లెస్ డికెన్స్ రాసిన క్రిస్టమస్ కేరల్‌లో కూడా మనిషి భవిష్యత్తులోకి వెళ్ళి తిరిగి రావడాన్ని చదివాడు. మరికొన్ని టైమ్ ట్రావెల్ పుస్తకాలని చదివాక అతను ఎలాగైనా దాన్ని సాధించాలని సంకల్పించాడు. వీసా ఇంటర్వ్యూలో టైమ్ ట్రావెల్ మీద జయవర్మ అభిప్రాయాలని విన్న అమెరికన్స్ కాన్సులేట్ ఆఫీసర్ అతను అమెరికాకి అవసరం అనుకుని, స్టూడెంట్ వీసాని మంజూరు చేసి నవ్వుతూ చెప్పాడు.
‘‘వెల్‌కం. 1967లో షికాగోకి వెళ్తే, మార్సెలో ఫెలినీని కలిస్తే వాళ్ళబ్బాయి హలో చెప్పాడని చెప్పు.’’ ‘‘కచ్చితంగా వెళ్తాను సర్. 1967ని, మార్సెలో ఫెలినీని గుర్తుంచుకుంటాను.’’ జయవర్మ ఆత్మవిశ్వాసంతో చెప్పాడు. జయవర్మ కేలిఫోర్నియాలోని స్టా¯Œ ఫోర్డ్ యూనివర్సిటీలో తన ప్రొఫెసర్‌తో టైమ్ ట్రావెల్ గురించి తరచూ చర్చిస్తూండటంతో దాని మీద అంతదాకా జరిగిన రీసెర్చ్‌ని ఆయన జయవర్మకి ఇచ్చాడు. యూనివర్సిటీ లైబ్రరీలోని పుస్తకాల్లో దానిమీద ఎన్నో డయాగ్రమ్స్‌ని చూసి, థియరీలని చదివాక జయవర్మకి ఓ దారి దొరికింది.
చివరకి అతను లేబరేటరీలో ఓ టైమ్ ట్రావెల్ మెషీన్స్ ని రూపొందించాడు. షికాగో నగరంలోకి, 1967కి వెళ్ళాడు. తను చూసిన ఆధునిక షికాగోలా లేదది. ప్రొహిబిషన్స్ సమయంలో ప్రసిద్ధ అమెరికన్స్ నేరస్తుడు అల్ కపోన్స్ తో సంబంధం గల ది గ్రీన్స్ మిల్ బార్‌కి చేరుకున్నాడు. లైవ్ జాజ్ మ్యూజిక్ జరుగుతోంది. జయవర్మని స్టీవార్డ్ మర్యాదగా ఆహ్వానించి అడిగాడు. ‘‘శుక్రవారం రాత్రి కాబట్టి బాగా బిజీగా ఉంది. దయచేసి ఇంకొకరితో టేబుల్ షేర్ చేస్తారా?’’ ‘‘అలాగే.’’ అతను జయవర్మని రెండు కుర్చీలున్న బల్ల దగ్గరికి తీసుకెళ్ళి ఖాళీ కుర్చీని చూపించి, ఇంకో కుర్చీలోని అరవై పైబడ్డ వ్యక్తిని పరిచయం చేశాడు.
‘‘ఇతను మిస్టర్ డేవ్.’’ జయవర్మ తన పేరు చెప్పి, బడ్‌వైజర్ బీర్ ఆర్డర్ చేశాడు. ‘‘మిమ్మల్ని ఈ బార్‌లో ఎన్నడూ చూడలేదు? ఊరికి కొత్తా?’’ విస్కీ తాగే డేవ్ అడిగాడు. ‘‘అవును.’’ ‘‘ఎక్కణ్ణుంచి వచ్చారు?’’ ‘‘స్టాన్స్ ఫోర్డ్, కాలిఫోర్నియా.’’ ‘‘ఓ. ఐతే మీరు మేధావి అన్నమాట?’’ బాగా తాగి ఉన్న ఆ బ్లూ కాలర్ ఉద్యోగి నవ్వుతూ అడిగాడు. ‘‘రీసెర్చ్ స్కాలర్‌ని.’’ జయవర్మ చెప్పాడు. ‘‘దేని మీద రీసెర్చ్ చేస్తున్నారు?’’ ‘‘టైమ్ ట్రావెల్.’’‘‘అది ఎన్నటికీ మనిషికి సాధ్యం కాదు. సమయం అనేది ఓ ఆలోచన మాత్రమే. అది అసలు లేనేలేదని నా అభిప్రాయం.’’ ‘‘ఉంది. నేను 2016 నించి 1967కి వచ్చాను.’’ జయవర్మ చెప్పాడు.
‘‘నేను దాన్ని నమ్మేంత ఇంకా తాగలేదు.’’ డేవ్ చెప్పాడు.‘‘నెల, తారీకు, సంవత్సరం చూడండి.’’ జయవర్మ తన డ్రైవింగ్ లైసెన్స్‌ని మౌనంగా ఆయనకి ఇచ్చి చెప్పాడు. దాన్ని చూడగానే ఆయన మొహం ఎర్రబడింది. ‘‘నీ పథకం ఏమిటి? నా నుంచి డబ్బు గుంజే స్కామ్ ఇది. అవునా?’’ కోపంగా అడిగాడు. ‘‘లేదు. ఇది నిజం. ఇది నా మొబైల్ ఫోన్. ప్రతి మనిషికి ఒకటి ఉంటుంది. దీనికి వైర్లు ఉండవు. సాటిలైట్‌తో పనిచేస్తుంది. ఇంట్లోనే టీ.వీ.లో ఎప్పుడు కావాలంటే అప్పుడు సినిమాలు చూడొచ్చు. అందుకు టీ.వీ. ప్రసారం చేయక్కర్లేదు...’’ ‘‘ఆపు.
ఇంకో అబద్ధం చెప్తే చంపేస్తాను.’’ తాగి ఉన్న డేవ్ అరిచాడు. ‘‘నిజం. ఓ నల్లజాతి వ్యక్తి మన ప్రెసిడెంట్.’’ జాతి విద్వేషం గల ఆయన వెంటనే బల్ల మీది మటన్ చాప్స్ కోసుకునే కత్తిని తీశాడు. బలాఢ్యుడైన జయవర్మ తనని పొడవబోయిన ఆయన చేతిని పట్టుకుని ఆపాడు. ఆ పెనుగులాటలో ఆ కత్తి ఆయన ఛాతీలో ఊపిరితిత్తుల్లో బలంగా దిగింది.‘‘ మై గాడ్. హత్య. పట్టుకోండి.’’ అరుపులు వినిపించాయి. ఓ మెరుపు మెరిసింది. వెంటనే జయవర్మ తనవైపు వచ్చేవారి వంక కత్తిని ఝుళిపిస్తూ తప్పించుకుని బయటపడ్డాడు. సరాసరి సమీపంలోని పార్క్‌లో ఆపిన తన వాహనం వైపు పరిగెత్తాడు. విరక్తితో అతను మళ్ళీ టైమ్ ట్రావెల్ చేయలేదు.
2025. జయవర్మ తనని అనుసరించే ముప్ఫై ఏళ్ళ యువకుడిని గమనించి అడిగాడు. ‘‘ఎందుకు నా వెంట పడ్డావు?’’ ‘‘ఇందుకు.’’ అతను వెంటనే బొడ్డులోంచి కత్తిని తీసి జయవర్మ ఊపిరితిత్తుల్లో దిగేలా క్రోధంగా పొడిచాడు. ‘‘ఎందుకు? ఎందుకు?’’ జయవర్మ బాధగా అడిగాడు. ‘‘నీ మొహం నాకు బాగా గుర్తు. 1967లో మా తాతని షికాగోలో గ్రీన్స్ మిల్ బార్‌లో పొడిచినప్పుడు అక్కడ ఒకరు తీసిన నీ ఫొటో మా ఇంట్లో వేలాడుతోంది.’’ అతను చెప్పాడు.


