సాధారణంగా ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్లి చూసేవి యాక్షన్, అడ్వెంచర్, డ్రామా; ఇంట్లో ఉండి ఓటీటీల్లో చూసేవి క్రైమ్, కామెడీ, ఫాంటసీ. ఇవి కాకుండా.. ఒక ‘బీభత్స, భయానక, భూత, ప్రేత, పిశాచ’ జానర్ కూడా ఉంది. అదే... హారర్! ఈ చిత్రాల ప్రత్యేకత ఏంటంటే.. థియేటర్‌కు వెళితే స్నేహితులతో, ఇంట్లోనైతే కుటుంబ సభ్యులతో కలిసి చూస్తాం. ‘బాబోయ్ హారర్!’ అనుకుంటాం కాని, చూడటం మాత్రం మానం. అదొక మజా. ఫీల్. దెయ్యాలతో సయ్యాట!
ఎందుకంత పడి చచ్చిపోతాం?!
గుండెల్లో దడ పుట్టించే, అరచేతులకు చెమటలు పట్టించే హారర్ సినిమాలను ఎందుకు మనం ఏరి కోరి చూస్తుంటాం? నడిచే శవాలు, భూత్ బంగళాలు కథాంశంగా ఉన్న సినిమాలను క్షణ క్షణం భయపడుతూనే ఎందుకు ఆస్వాదిస్తుంటాం? భయం అన్నది.. నిజ జీవితంలో వెనకడుగు వేసేలా చేస్తుంది. కాని, భయానకమైన సినిమా అనగానే ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా అడుగు ముందుకేస్తారు! ఎందుకిలా ప్రేక్షకులు భయాన్ని ‘కొని’ చూస్తుంటారు? ఎందుకు కొరివి దెయ్యం లాంటి భయంతో తల గోక్కుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం మనస్తత్వశాస్త్రంలో లేకపోలేదు.
‘పోరాడు.. లేదా, పారిపో..’
భయమంటే మనం ఇష్టపడటానికి ముఖ్య కారణం ‘స్టిమ్యులేషన్’’! మెదడుకు చురుకు పుట్టించే ఇంద్రియ చలనం. సైన్స్ పరిభాషలో నాడీ మండల విద్యుత్ ప్రేరణ. భయం మానసికంగా, శారీరకంగా ఉద్రేకాన్ని జనింపజేస్తుంది. గుండె ఝల్లుమనటం ఇందుకే. థ్రిల్లింగ్ కోసం ‘కోరి తెచ్చుకునే’ భయంలో ఆందోళన, ఉత్సాహం.. రెండూ సమపాళ్లలో మిశ్రమంగా ఉంటాయి. ఊపిరి బిగబట్టి, సినిమాలో ఒక భయానక దృశ్యం చూస్తున్నప్పుడు, హఠాత్తుగా ఎదురయ్యే ఊహించని మలుపుతో మన శరీరంలో ఒక్కసారిగా విడుదలయ్యే అడ్రినలిన్ (ఎపినెఫ్రిన్) హార్మోన్.. ‘పోరాడు లేదా పారిపో’ అని సంకేతాలిస్తుంది. సినిమా కనుక మనం పోరాడేది, సీట్లోంచి పారిపోయేదీ (మరీ భయస్థులు అయితే తప్ప) ఏమీ ఉండదు. బదులుగా ఇంద్రియాలు పదునెక్కి థ్రిల్ కలుగుతుంది. అందుకే హారర్ సినిమాలంటే మనం భయపడుతూనే ఇష్టపడుతుంటాం.
‘హారి దేవుడా.. బయట పడ్డాను..’
భయపెట్టే థీమ్‌లో ఉండే ఆసక్తికరమైన అంశం.. ‘కొత్తదనం’. ఆ కొత్తదనమే భయం పట్ల మనకు విపరీతమైన ఆకర్షణను కలుగజేస్తుంది. ‘అపోకలిప్టిక్’ సినిమాలు మీరు చూసే ఉంటారు. ఉదా : ‘ది డే ఆఫ్టర్ టుమారో’, ‘ఎ క్వైట్ ప్లేస్ డే వన్’, ‘ఆర్మగడాన్’ వంటివి. అవి మనకు వాస్తవ ప్రపంచానికి భిన్నంగా కొత్త భయానక లోకాలను చూపిస్తాయి. భూగోళం సమూలంగా ధ్వంసమైపోయి, మనిషి మళ్లీ మొదట్నుంచి పునరుజ్జీవనం పొందే సినిమాల్లోని (పోస్ట్–అపోకలిప్టిక్) భయానక సన్నివేశాలు కూడా థ్రిల్‌ను రేపుతాయి. భూగోళంపై గ్రహాంతర జీవుల దాడి, సమాధుల్లోంచి పైకి లేచి వచ్చే ‘జాంబీ’లు.. మన లోపల సృష్టించే కల్పిత భయాన్ని ‘తట్టుకోవటం’ అన్నది మనం ఏదో సాహసం చేస్తున్నామన్న భావనను, సంతృప్తిని కలిగిస్తుంది. అందుకే హారర్ సినిమాలను అంతా ఇష్టపడతారు. సినిమా పూర్తయ్యాక.. ‘హారి దేవుడా.. ప్రాణాలతో భయపడ్డాను..’ అని సినిమా హాలు నుండి పకపకా నవ్వుతూ బయటికి అడుగులు వేయటం కూడా ఓ గొప్ప అనుభూతిలా, ‘‘ఏం ఫీలున్నది మామా?’’ అనిపించేలా ఉంటుంది.
బిక్కు బిక్కుమంటూ లుక్కు
స్క్రీన్ మీద కనిపించే పాత్రల్లోని భయం, సినిమా చూస్తున్న వాళ్లలో కలిగే భయం ‘సింక్’ అవటం అన్నది ఒక మంచి బీభత్స, భయానక సినిమాలో ఉంటుంది. అందుకే భయం అంటే మనకు అంత క్రేజు. నరమాంస భక్షణ; దౌర్భాగ్యమైన, మానవత్వం లేని హింసాత్మక జీవితాన్ని గడిపే పాత్రలుండే ‘డిస్టోపియన్’ యాక్షన్ చిత్రాల్లోని హారర్ పట్ల ఉండే మన ఆసక్తిని అలాంటి సినిమాలు సంతృప్తి పరుస్తాయి కనుక, పైకి చెప్పకపోయినా లోలోపల ఆ సన్నివేశాలను బిక్కుబిక్కుమంటూనే చూడటానికి ఇష్టపడతాం.
సురక్షిత భయాస్వాదన
భయానక దృశ్యాలను ఆస్వాదించే మన సామర్థ్యం.. సైకాలజిస్టులు చెబుతున్న దానిని బట్టి ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ (భద్రతా చట్రం), డిటాచ్‌మెంట్ ఫ్రేమ్ (నిర్లిప్త చట్రం), కంట్రోల్ ఫ్రేమ్ (నియంత్రణ చట్రం) అనే మూడు మానసిక స్థితులపై ఆధారపడి ఉంటుంది. భయపడుతున్నప్పుడు కూడా మనం సురక్షితంగా ఉన్నామని వెనుక నుంచి వెన్ను తట్టి చెబుతుండే చట్రాలు ఇవి.
హారర్ సినిమా చూస్తున్నప్పుడు... అదంతా నిజం కాదని, లోపలి పాత్రలు బయటికి వచ్చి మన పీక పట్టుకోవని ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ మనకు చెబుతుంటుంది. ఇక తెరపై కనిపిస్తున్న హారర్ నుంచి భావోద్వేగాల పరంగా మనల్ని నిర్లిప్తంగా ఉంచి, భయంలోని మజాను మాత్రమే మన వరకు తెచ్చేది ‘డిటాచ్‌మెంట్ ఫ్రేమ్’. మూడవదైన ‘కంట్రోల్ ఫ్రేమ్’... భయం పట్ల మన ధీమాను సడలనివ్వకుండా, థ్రిల్స్‌ని మాత్రం ఆనందించేలా చేస్తుంది.
కొందరెందుకు ఇష్టపడరు?
హారర్‌ను ఇష్టపడే వాళ్లు ఉన్నట్లే, హారరంటే అస్సలు ఆసక్తి లేని వాళ్లు కూడా ఉంటారు. ఇందుకు కారణం అందరి మెదడూ భయానికి ఒకేలా స్పందించక పోవటం. విపరీత సంచలనాలను, ఉరిమే ఉత్సాహాన్ని కోరుకునే వారు ఈ హారర్ చిత్రాలను లైక్ చేస్తారు. హారర్‌లోని సృజనాత్మకతను, కొత్త అనుభవాలను ఇష్టపడేవారు భయాన్ని కోరుకుంటారు. ‘దయ్యాల్లేవ్, గియ్యాల్లేవ్’ అనుకునేవారు; కల్పనలపై కుతూహలం లేనివారు హారర్ చిత్రాలను పట్టించుకోరు.
‘నీ బాధను అర్థం చేసుకోగలను’
‘సహానుభూతి’ కూడా హారర్ చిత్రాల్లోని భయాన్ని ఇష్టపడటానికి ఒక కారణం అవుతుంటుంది. సహానుభూతి స్థాయి ఎక్కువగా ఉన్న వారు భయానక చిత్రాలను చూస్తున్నప్పుడు.. దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్న తెరపై పాత్రలతో తాము సహానుభూతి చెందుతారు. తెరపై బాధను తమ మనసులోపల మరింత లోతుగా అనుభవిస్తారు. అయితే వయస్సు; స్త్రీ పురుష అంశం కూడా ఇక్కడ ముఖ్యమైనవే. యువ ప్రేక్షకులు, పురుషులు హారర్ చిత్రాలను ఎక్కువగా ఆస్వాదిస్తారు. అందుకు భిన్నంగా మహిళలు తరచుగా చెడును ఓడించి, సమాజాన్ని సవ్యంగా ఉంచే కథలను ఇష్టపడతారు.
హారర్.. కలవారి కాలక్షేపం!
ఇదొక ఆసక్తికరమైన విషయం. సంపన్న దేశాలలోని వారే హారర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడతారట! దీనినే ఇంకోలా చెప్పాలంటే హారర్ చిత్రాలు చూసే వారు సంపన్నులనే అర్థం తీసుకోవచ్చు. ‘రీసెర్చ్‌గేట్’ సైట్‌లో పొందుపరచి ఉన్న వివరాలను బట్టి, 2020లో 82 దేశాలలో జరిగిన అధ్యయనంలో సంపన్న దేశాల ప్రజలు (తలసరి జి.డి.పి. ఎక్కువగా ఉన్నవారు) హారర్ చిత్రాలను ఎక్కువగా చూస్తున్నట్లు వెల్లడైంది. దీనర్థం? ఆర్థిక భద్రత అనేది వ్యక్తులకు హారర్ పట్ల ‘ప్రొటెక్టివ్ ఫ్రేమ్’ని ఏర్పరుస్తోందని! జీవితం సమస్య కానప్పుడు వినోదం కోసం మనం భయంతో ఒక ఆట ఆడుకోవచ్చు.
నవ్వులుగా మారే అరుపులు
భయం ఇద్దర్ని ఏకం చేయడమే కాదు. మానవ సమూహాల మధ్య బంధాన్ని కూడా ఏర్పరుస్తుంది. స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి కూర్చొని భయానక చిత్రాలను చూస్తున్నప్పుడు.. భయం లేదా ఒత్తిడి కలిగే సమయంలో విడుదలయ్యే ‘కనెక్షన్ హార్మోన్’ అయిన ఆక్సిటోసిన్ క్రియాశీలం అవుతుంది. అందుకే భయంతో వేసే అరుపులు చివరికి ఉమ్మడి నవ్వులుగా మారుతాయి.
భయం తర్వాత ప్రశాంతత
హారర్ మూవీలో చివరికి భయానక పాత్ర ఓడిపోయి సినిమా హాల్లో లైట్లు వెలిగినప్పుడు అదొక అద్భుతమైన ప్రపంచంలా ఉంటుంది. మంచి అనుభూతిని కలిగించే రసాయనాలైన ‘ఎండార్ఫిన్’లను మెదడు విడుదల చేస్తుంది. ఫలితంగా సంతృప్తి, సంతోషం కలుగుతాయి. కుదుపు తర్వాతి స్థిరత్వం అది. కొంతమంది తీవ్ర భయం తర్వాత ఎందుకు ఉల్లాసంగా ఉంటారన్న దానికి ఇదే సమాధానం. ఏమైనా అదొక ఫీల్!
· సాక్షి, స్పెషల్ డెస్క్


