
డోర్ హ్యాండిల్ అంటే మనం పెద్దగా పట్టించుకోని చిన్న వస్తువు. కాని, అక్కడే నిత్యం బ్యాక్టీరియా కణాలు పార్టీ చేసుకుంటుంటాయి. తెలియకుండానే వ్యాధులను లోపలికి ఆహ్వానించే ఈ హ్యాండిల్స్‌ని చూసి, ‘ఇక చాలు’ అనుకున్నాడు జమైకా యువ ఆవిష్కర్త రేవాన్స్ స్టూవర్ట్ట్. వెంటనే సెల్ఫ్ క్లీనింగ్ డోర్ హ్యాండిల్‌కు ప్రాణం పోశాడు. జమైకా తీరం దగ్గర పుట్టిన అతడి ఆలోచన ఇప్పుడు ఆసుపత్రుల తలుపులకు చేరి వేలాది మంది ప్రాణాలను రక్షిస్తోంది. రేవాన్స్ స్టూవర్ట్.. జమైకా పర్వతాల మధ్యలోని మౌంట్ ప్రాస్పెక్ట్ అనే చిన్న ఊరిలో పెరిగిన అబ్బాయి. జమైకా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్న విద్యార్థి. అయితే, కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యే విద్యార్థి కాదు, వాస్తవ సమస్యలను గమనించి, వాటికి పరిష్కారాలను వెతికే క్రియేటర్. చిన్నప్పటి నుంచి వస్తువులు ఎలా పనిచేస్తాయో తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువ.
ఆటబొమ్మలు, రేడియోలు
విప్పదీసి మళ్లీ కలపడం అతని ఫేవరెట్ గేమ్. అందుకే అతని తల్లి ఎప్పుడూ అతనికి ‘రేవాన్స్ , వస్తువులను పగలగొట్టడం మానెయ్యి!’ అని చెబుతుండేది. కుటుంబంలో ఎవరికీ అక్షరాలు రాకున్నా, రేవాన్స్ యూనివర్సిటీలోకి అడుగుపెట్టాడు. అక్కడ ఇన్నోవేషన్లపై ప్రేమ పెంచుకున్నాడు. వర్చువల్‌గా దుస్తులు ట్రై చేసుకునే సాఫ్ట్‌వేర్‌ను కూడా తయారు చేశాడు. కాని, అసలైన మలుపు ఒక ఆసుపత్రిలో వాలంటీర్‌గా పనిచేసేటప్పుడు వచ్చింది. అక్కడే గ్రహించాడు ‘డోర్ హ్యాండిల్స్ అంటే అనారోగ్యానికి నేరుగా ఫ్రీ ఎంట్రీ పాస్‌ల లాంటివి’. అప్పుడే ‘జెర్మోసోల్’ అనే మ్యాజిక్ డోర్ హ్యాండిల్‌ను తయారు చేశాడు.
ఎలా పనిచే స్తుందంటే?
సూర్యరశ్మిని సూక్ష్మజీవులు తట్టుకోలేవు కదా! అదే సూత్రాన్ని ఇక్కడ వాడాడు. హ్యాండిల్‌లో ఒక చిన్న అల్ట్రావయొలెట్ లైట్ అమర్చాడు. మనం తాకగానే అది వెలుగుతుంది. అందులోంచి వెలువడే అల్ట్రావయొలెట్ కాంతి ముప్పయి సెకన్లలో హ్యాండిల్‌పై ఉన్న బ్యాక్టీరియాను అంతం చేస్తుంది. దాదాపు 99.9 శాతం శుభ్రత సాధ్యం! ఇది కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు, కరీబియన్స్ వాతావరణానికి సరిపోయే ప్రాణరక్షక కవచం. ఆసుపత్రులు, స్కూళ్లు, ఆఫీసులు సహా ఎక్కడ తలుపులు ఉంటాయో, అక్కడ దీని రక్షణ అవసరం. ఈ అద్భుత ఆవిష్కరణ రేవాన్స్ కి జమైకా ప్రధాని చేతుల మీదుగా జాతీయ యువ శాస్త్రవేత్త అవార్డు, అలాగే కామన్‌వెల్త్ హెల్త్ ఇన్నోవేషన్స్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇప్పుడు తలుపు తీయడం అంటే కేవలం లోపలికి వెళ్లడం కాదు, సూక్ష్మజీవులను బయటే వదిలేయడం కూడా! ఈ విషయమై రేవాన్స్ మాట్లాడుతూ, ‘ఎన్ని కష్టాలు వచ్చినా మా కుటుంబం ఎప్పుడూ ఒకటిగానే నిలిచింది. వాళ్లే నా బలం, వాళ్లే నా ప్రేరణ’. అని చెప్పాడు.
∙