
మనిషై పుట్టాక ఊహించని ఉత్పాతాలు, ఉలిదెబ్బలు, ఉలికిపాటులు తప్పవు! అందుకే ‘మనసు గతి ఇంతే, మనిషి బ్రతుకింతే/ మనసున్న మనిషికి సుఖము లేదంతే’ అన్నారు ఆత్రేయ! అయితే ‘మనసు ఉండాలే కాని, సుఖశాంతులను మనంతట మనమే సొంతం చేసుకోవచ్చు’ అంటున్నారు జపనీయులు.
‘మదిలో ఎంత అనురాగం నిండితే అంత వైరాగ్యం’ ఇది మనిషిని స్థిరచిత్తుడిగా మార్చగలిగే గొప్ప మంత్రం! కానీ రాగద్వేషాల నియంత్రణలో ఓటమి లేని కథలు చాలా అరుదు! కాలంతో పరుగులు తీయడం, కాలం రాయని రాతల కోసం తహతహలాడటం, గడచిపోయిన గతాన్ని పదేపదే విశ్లేషించుకోవడం, మిగిలి ఉన్న వయసుని లెక్కలేసుకోవడం ఇవే, ఇవే మనిషికి తీరని వేదనలు. వాటికి తోడు మరణ భయం! ఆ భయం ఊహ తెలిసినప్పటి నుంచి వేధించే మనోగతం! అదెప్పటికీ తప్పని, తప్పించుకోలేని జీవన చక్రం! మనిషిని, మనసునీ అతలాకుతలం చేసే ఆ నిర్వేదం నుంచి బయటపడటానికే ఇప్పుడు ప్రపంచమంతా జపనీయుల వైపు చూస్తోంది. వారు అవలంబించే కొన్ని జీవన విధానాలు మనసుని కుదుటపరుస్తాయట. మనిషిని ఆనందకేళిలో విహరింపజేస్తాయట! అసలేంటా జపాన్ సిద్ధాంతాలు? అవి అంత గొప్పవా?
సంతృప్తికరమైన జీవితాన్ని పొందడానికి జపాన్ లో చాలా సిద్ధాంతాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రస్తుతం ప్రపంచవాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. ఇంచుమించు ఒకేలాంటి భావాలతో, లోతైన అర్థాలతో రూపొందిన వారి జీవిన విధానం గొప్ప తాత్వికతకు నిదర్శనం! వాటిలో కొన్ని, శతాబ్దాల నాటి సంస్కృతిలో ముడిపడినవి కాగా, మరికొన్ని ఆధునిక జీవనశైలితో తలపడేవి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, జీవిత పరమార్థం తెలుసుకోవడానికి ఆ జీవన విధానాలు వేస్తున్న బాటలేంటీ?
జీవితంలో అహ్లాదాన్ని నింపుకోవడానికి జపనీస్ తత్త్వశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోవాలంటే.. ముందుగా అక్కడ అత్యంత ప్రాచుర్యం పొందిన ‘ఇకిగాయ్’ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. ఇకిగాయ్‌లో ‘ఇకి’ అంటే జీవితం, ‘గాయ్’ అంటే విలువ లేదా ప్రయోజనం. ఇది జీవితానికి ఒక కారణాన్ని, ఉద్దేశ్యాన్ని ముందుగానే నిర్ధేశించుకోమని చెబుతుంది. రోజు మొదలయ్యేందుకు ఒక కారణాన్ని ఏర్పరచుకుని ప్రయాణించడం ఉత్తమమని బోధిస్తుంది. ఇందులో ప్రధానంగా నాలుగు అంశాలున్నాయి. ఆ నాలుగింటినీ ఒకదానితో ఒకటి మిళితం చేసుకోగలిగినప్పుడు మనం ఇకిగాయ్ అనే లక్ష్యాన్ని సాధించినట్లే. అందుకు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ నాలుగు ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
‘మీరు దేనిని ప్రేమిస్తారు?’ అనేది మొదటి ప్రశ్న. దానికి అనుబంధంగా మీ అభిరుచులు, హాబీలు, ఏ పని చేసినప్పుడు మీరు సమయం గురించి మర్చిపోగలరు? సంతోషంగా ఉండగలరు? అనే అంశాలన్నీ ఆ ప్రశ్నతో పాటే ఉద్భవిస్తాయి.
‘మీ నుంచి ప్రపంచానికి ఏం అవసరం?’ అనేది రెండవ ప్రశ్న. దానిలో భాగంగా ‘మీ చుట్టూ ఉన్న సమాజానికి లేదా ప్రపంచానికి మీరు ఎలా సహాయపడగలరు? ఏ సమస్యలను పరిష్కరించగలరు? సమాజంలో దేన్ని సరిచేయగలరు?’ అనే అంశాలు తోడవుతాయి.
‘మీరు దేనిలో సమర్థులు?’ ఇది మూడవ ప్రశ్న. దానికి అనుబంధంగా మీ నైపుణ్యాలు, ప్రతిభ, మీకు సహజంగా వచ్చే పనులు అన్నీ లెక్కలోకి వస్తాయి.
‘దేని నుంచి మీరు డబ్బు పొందగలరు? లేదా సంపాదించుకోగలరు’ ఇది నాలుగవ ప్రశ్న. ఈ ప్రశ్నతో ఇకిగాయ్ సంపూర్ణమవుతుంది. దీనిలో మీ నైపుణ్యాలు, ప్రతిభలను ఉపయోగించి మీరు జీవనోపాధిని ఎలా పొందగలరు?’ అనేది నిర్థారించుకోవచ్చు. ‘ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానాలు దొరికి, ఒకదానితో ఒకటి కలిసే చోట, మీ ఇకిగాయ్ ఏర్పడుతుందని జపనీస్ సంస్కృతి చెబుతుంది.
జపాన్ లో, ముఖ్యంగా ఒకినావా వంటి ప్రాంతాలలో ఎక్కువ మంది ప్రజలు నూరేళ్లకు పైగా, సంతోషంగా జీవిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఇకిగాయ్ అని అక్కడి వారు చెబుతున్నారు. తమ జీవితానికి ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉండటం వల్లే, వారు రోజూ ఉత్సాహంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవిస్తారట.
మా అనేది రెండు వస్తువుల మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని లేదా రెండు సంఘటనల మధ్య ఉన్న విరామాన్ని సూచిస్తుంది. ఆ ఖాళీకి కూడా విలువ ఉంటుందని, ఇది కేవలం శూన్యం కాదని జపనీయులు నమ్ముతారు. సంగీతంలో రెండు స్వరాల మధ్య ఉండే నిశ్శబ్దం, మాటల మధ్య ఏర్పడే చిన్నపాటి విరామం.. ఇవన్నీ ఇందుకు ఉదాహరణలుగా ఈ సిద్ధాంతం చెబుతుంది. మా అనేది ఆలోచించడానికి, ప్రతిబింబించడానికి, అర్థాన్ని కనుగొనడానికి కొంత శూన్యాన్ని సృష్టిస్తుంది. ఆ శూన్యమే మనసుని తేలిక పరుస్తుందని ఈ సిద్ధాంత సారాంశం. జీవితంలో తొందరపడకుండా, ప్రతి క్షణాన్ని ఆస్వాదించమని చెప్పడమే మా ఉద్దేశం.
నూరేళ్ల జీవనం
ప్రపంచ ఆరోగ్య లెక్కల ప్రకారం భారతీయుల సగటు ఆయుర్ధాయం 69 నుంచి 70 సంవత్సరాలు. 80 నుంచి 100 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం జీవిస్తున్న వారి దేశాల జాబితాలో జపాన్ ముందువరసలో ఉంది! అయితే మలిదశలో కూడా జపనీయులు చాలా సంతోషంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారట! అందుకు వారి జీవన విధానమే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు.
జపనీయులు ఎల్లప్పుడూ బెస్ట్ హెల్త్ కేర్ సిస్టమ్‌ని
పాటిస్తారు. ఎప్పటికప్పుడు ప్రజల ఆరోగ్య స్థితిగతులను తెలుసుకు
నేందుకు ఆరోగ్య సంస్థలు పనిచేస్తుంటాయి. అవి ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందిం
చడానికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
చాలామంది జపనీయులు ఎంత రుచికరమైన ఆహారాన్ని తింటున్నా 80 శాతం కడుపు నిండాక ఆపేస్తారు. అలా చేస్తే దీర్ఘాయువు కలిగి ఉంటామని అక్కడి ప్రజలు నమ్ముతారు.
జపాన్ ప్రజలు వయసు పైబడిన తమ కుటుంబ సభ్యులను ఒల్డ్ ఏజ్ హోమ్‌లకు పంపించరు. కుటుంబ సభ్యుల సంరక్షణ బాధ్యతను చూసుకోవడం వారి సంప్రదాయంగా భావిస్తారు. వృద్ధాప్యంలో కుటుంబంతో కలిసి జీవిస్తే మానసికంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, సంతోషంగా జీవిస్తారని, పెద్దలతో కలిసి జీవనం సాగిస్తే భవిష్యత్తుకి ఉపయోగకరమని అక్కడి వారు నమ్ముతారు.
నిజానికి జపనీయులు అధిక పరిశుభ్రతను పాటిస్తారు. అక్కడ చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యానవనాలు, రోడ్లు, పబ్లిక్ ప్రదేశాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటాయి.
జపాన్ ప్రజలు నెమ్మదిగా, నమిలి నమిలి తినే శైలిని ఇష్టపడతారు. ఒకే పెద్ద ప్లేట్‌లో కాకుండా చిన్నచిన్న ప్లేట్లలో లేదా చిన్నచిన్న బౌల్స్‌లో ఆహారాన్ని తినడానికి ప్రాధాన్యమిస్తారు.
అక్కడివారు ఎక్కువగా తినే సమయంలో టీవీ చూడటం, సెల్ ఫోన్ వాడటం వంటివి చేయకుండా కుటుంబ సభ్యులంతా కలిసి తింటుంటారు, పైగా చాలామంది డైనింగ్ టేబుల్స్, కుర్చీలు వాడకుండా నేలపై కూర్చుని భోజనం చేయడానికి
ఇష్టపడతారు.
జపనీస్ ప్రజలు సమతుల ఆహారాన్ని తీసుకుంటారు. పండ్లు, తృణధాన్యాలు, సోయా, ఆకు కూరలు ఎక్కువగా తీసుకుంటారు. వారు తీసుకునే ఆహారాలన్నీ తక్కువ మొత్తంలో కొవ్వులు, చక్కెరలను కలిగి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. దాంతో గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు. వారు తీసుకునే ఆహారం వల్లే జపాన్ లో ఊబకాయం రేటు చాలా తక్కువగా ఉందని తేలింది.
జపాన్‌లో అన్ని వయసుల వారు నడవడానికే ఇష్టపడతారు. సమీపంలోని ఉన్న గమ్యస్థానాలకు నడిచి వెళ్లిపోతుంటారు. లేదంటే సైకిల్ వాడతారు. అలాగే బాతాఖానీ వేసేటప్పుడు ఎక్కువగా నేలపైనే కూర్చుంటారు. ఈ పద్ధతుల వల్ల పేగులకు, కండరాలకు మంచి వ్యాయామం అవుతుంది. వారి ఆయుర్దాయం పెరగడానికి అవి కూడా దోహదం చేస్తున్నాయి.
మొత్తానికి జపనీయులు– సమతుల ఆహారాన్ని తీసుకోవడంతో పాటు ఇతరులకు సహాయం చేయడం, ప్రతి దానిపట్ల కృతజ్ఞతతో ఉండటం, స్నేహితులు, కుటుంబ సభ్యులతో ప్రేమగా కలిసి జీవించడం ఇలా ఎన్నో అంశాలు వారి ఆయుర్దాయాన్ని రెట్టింపు చేస్తున్నాయి.
సమస్యల వలయంలో జపాన్ లో జననాల రేటు చాలా తక్కువగా ఉంది, అదే సమయంలో, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీనివల్ల పని చేసేవారి సంఖ్య తగ్గి, సామాజిక భద్రత, ఆర్థిక వ్యవస్థపై భారీ భారం పడుతోంది. 2060 నాటికి జపాన్ జనాభా 8.67 కోట్లకు పడిపోవచ్చని అంచనా!మరోవైపు వివిధ నివేదికల ప్రకారం, జపాన్‌లో 15 సంవత్సరాల లోపు పిల్లల సంఖ్య సుమారు 13.7 మిలియన్లు ఉండగా.. ఆ దేశప్రజలు పెంచుకుంటున్న కుక్కలు, పిల్లుల సంఖ్య కలిపి 15.9 మిలియన్లకు పైగా ఉంది. జపాన్ సమాజంలో ఒంటరితనాన్ని దూరం చేసుకోవడానికి పెంపుడు జంతువులను ఆశ్రయిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఈ సమస్యలను పక్కన పెడితే, ఎక్కువ కాలం సంతోషంగా జీవిస్తున్న వారి సంఖ్య జపాన్‌లో ఎక్కువగా ఉండటంతో ప్రపంచ దేశాలు వారి జీవన విధానంపై దృష్టిపెడుతున్నాయి.
యుటోరి
ఇది జపాన్ లో ఒక విశిష్టమైన భావన. దీనిని తెలుగులో ‘మనసుకి విశ్రాంతినివ్వడం’ లేదా ‘సమయం కేటాయించడం’ అని చెప్పవచ్చు. ఆధునిక ప్రపంచంలో మనం నిరంతరం పరుగులెత్తుతూ, పనిఒత్తిడిలో మునిగిపోతూ, మనసుకి అవసరమైన విరామాన్ని ఇవ్వాలని ఈ సిద్ధాంతం చెబుతోంది.
యుటోరి అంటే కేవలం విశ్రాంతి తీసుకోవడమే కాదు, ఇది జీవితంలోని ఆనందాన్ని గుర్తించడానికి ఉద్దేశపూర్వకంగా సమయం కేటాయించుకోవడం కూడా! మరి అందుకేం చెయ్యాలి?
వేగాన్ని తగ్గించుకోవాలి – ప్రతి పనిని తొందరగా పూర్తి చేయాలనే ఒత్తిడిని పక్కన పెట్టి, నెమ్మదిగా చేయడం అలవరచుకోవాలి.
చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించుకోవాలి– మన చుట్టూ ఉన్న ప్రకృతిని, జీవితంలోని చిన్న చిన్న అద్భుతాలను గమనించడానికి మనసుకు కాస్త సమయం ఇవ్వాలి. ఉదాహరణకు, ఉదయం సూర్యోదయాన్ని చూడడం, ఒక పూలమొక్కను పరిశీలించడం, పక్షుల కిలకిలరావాలు వినడం ఇవన్నీ మనసుని ఉత్తేజపరుస్తాయి.
సహజంగా శ్వాస తీసుకోవాలి– నిజానికి ఉరుకుల పరుగుల జీవనంలో కొన్ని రోజుల పాటు మనం ఊపిరి పీల్చుకునే విధాన్ని కూడా గమనించకుండా గడిపేస్తాం. ఒక్క క్షణం ఆగి ఆ పక్రియను గమనిస్తుండాలి. శ్వాస తీసుకోవడాన్ని గమనిస్తే, మనసుకు ఎనలేని హాయి కలుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం ఈ తరహాకు చెందినవే!
మానసిక విరామం పొందాలి– పనికి, ఆలోచనలకు ఒక విరామమిచ్చి, మనసును ఖాళీగా ఉంచడం నేర్చుకోవాలి.
వీటన్నింటినీ పాటిస్తూ మన జీవితాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రశాంతంగా మార్చుకోవడమే యుటోరీ లక్ష్యం. ఇది మనస్సుకి ప్రశాంతతను అందించి, జీవితాన్ని మరింత అర్థవంతంగా మారుస్తుంది.
మోటైని
మోటైని అంటే ‘వృథా చేయవద్దు’ లేదా ‘విలువను గుర్తించు’ అని అర్థం. ఏదైనా వస్తువు, సమయం, శక్తి లేదా వనరులను వృథా చేయకుండా, వాటిని పూర్తిగా వినియోగించుకోమని ఈ సిద్ధాంతం చెబుతుంది. సృష్టిలో ప్రతిదానిపైనా కృతజ్ఞత కలిగి ఉండాలని, ప్రతిదానికీ విలువను, గౌరవాన్ని ఇవ్వాలని ఇది చెబుతుంది. ఉదాహరణకు మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయకుండా తినడం, పాత వస్తువులను, వస్త్రాలను తిరిగి ఏదో ఒక రూపంలో వినియోగించడం వంటి ఎన్నో విలువలను ఇది నేర్పిస్తుంది.
షిన్–రిన్ యోకు
ఇది జపనీయుల మానసిక చికిత్సా విధానంలో ఒక పద్ధతి. షిన్–రిన్ యోకు అంటే ‘ప్రకృతిలో లీనం కావడం’ అని అర్థం. ఇది ప్రకృతిలో, ముఖ్యంగా సురక్షితమైన అటవీ ప్రాంతాల్లో గడిపే ఒకరకమైన వైద్య విధానం. ఇది అడవిలోని ప్రశాంతతను, శబ్దాలను, సువాసనలను, దృశ్యాలను మనసారా పంచుకోమని చెబుతుంది. చెట్ల సువాసనలను పీల్చడం, పక్షుల కిలకిలరావాలు వినడం, ప్రకృతి అందాలను తాకడం, ప్రకృతితో మమేకం కావడం ఇలా ప్రతి అనుభూతిని మన పంచేంద్రియాలతో పూర్తిగా ఆస్వాదించడమే దీని ముఖ్య ఉద్దేశం. అడవుల్లోని ప్రశాంత వాతావరణం, మొక్కల నుంచి వెలువడే కొన్ని రకాల సుగంధాలు ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. రక్తపోటును తగ్గించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఈ విధానం ఎంతగానో తోడ్పడుతుంది. ప్రకృతిలో గడిపినప్పుడు మనసు తేలికపడి, ఏకాగ్రత పెరుగుతుంది. ఇది ఆధునిక జీవితంలో ఏర్పడే ఒత్తిడి, ఆందోళనల నుంచి బయటపడటానికి ఒక సహజమైన, ప్రభావవంతమైన మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది.
వాబీ– సాబీ
అసంపూర్ణతలోనూ అందం ఉంటుందని చెప్పే గొప్ప తాత్త్వికత ఇది. ప్రతి వస్తువు, ప్రతి మనిషి అసంపూర్ణమేనని చెప్పడంతో పాటు, అందులో కూడా ఒక ప్రత్యేకమైన సౌందర్యం ఉందని, దాన్ని చూడటం నేర్చుకోమని ఈ సిద్ధాంతం చెబుతుంది. నిజానికి దీని ప్రకారం పరిపూర్ణత అనేది ఒక భ్రమ. ఉదాహరణకు పాతబడిన చెక్క బల్లలోనూ, పగిలిన కప్పులోనూ అందాన్ని వెతకగలిగినప్పుడే జీవితాన్ని ఆస్వాదించగలమట. ‘కాలంతో పాటు వచ్చే మార్పులు, పగుళ్లు, లోపాలు, ముడతలు ఇవన్నీ చాలా కథలను చెబుతాయి. వినగలిగితే అవెంతో అద్భుతంగా ఉంటాయి’ అని చెబుతుంది ఈ సిద్ధాంతం. దీని ప్రకారం, లోపాలను లోపాలుగా చూడకుండా వాటిని జీవితంలో ఒక భాగంగా స్వీకరించడంతో, జీవితం పట్ల ఒక కొత్త దృక్పథం ఏర్పడుతుందని వివరిస్తుంది. ఈ విధానాన్ని అనుసరిస్తే మనకు జీవితంలోని మార్పులను, వృద్ధాప్యాన్ని కూడా అంగీకరించగలిగేంత ఓర్పు, నేర్పు అలవడుతుంది.
షోషిన్
షోషిన్ అనే సిద్ధాంతం ‘ఎంతటి జ్ఞాని అయినా ఎల్లప్పుడూ జిజ్ఞాసతో జీవించాలి’ అని చెబుతుంది. అంటే ఎంత జ్ఞానమున్నా, ఎంత తెలుసుకున్నా, ‘నాకు అన్నీ తెలుసు’ అని భావించకుండా, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలట. నిత్యం కుతూహలంతో, పూర్వపు ఆలోచనల ప్రభావం మనసుపై లేకుండా ప్రతిదాన్ని స్పష్టంగా చూడమని, తెలుసుకోమని ఈ విధానం ప్రోత్సహిస్తుంది. దాంతో సృజనాత్మకత పెరుగుతుంది. అలాగే భయం లేకుండా కొత్తకొత్త ప్రయోగాలు చేయగలిగే సత్తా ఏర్పడుతుంది. దాని వల్ల కూడా ఒక సంతృప్తి ఏర్పడుతుంది.
నిజానికి ఎంత గొప్ప నియమమైనా, ఎంత గొప్ప విధివిధానమైనా వివరించి, విశ్లేషించి, అనుభవపూర్వకంగా తెలుసుకుని సిద్ధాంతాలుగా మార్చడమే గొప్ప అనుకుంటే పొరబాటు! దాన్ని తు.చ. తప్పకుండా పాటించి, తాము పాటించిన తత్త్వాన్ని తర్వాత తరాలకు అందించడమే అసలైన గొప్పతనం! అదే చేస్తున్నారు జపనీయులు!
గమాన్
గమాన్ అంటే సహనం లేదా ఆత్మనిగ్రహం అని అర్థం. సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు కూడా నిశ్చలంగా, గౌరవంగా ఉండమని ఈ భావన సూచిస్తుంది. సమస్యలకు కష్టాలకు నిరాశ చెందకుండా, ఎవరితో చర్చించకుండా, ఫిర్యాదులు చేయకుండా, నిశ్శబ్దంగా పరిస్థితులను ఎదుర్కోమని చెబుతుంది. జపనీస్ సంస్కృతిలో, గమాన్ అనేది ఒక బలమైన లక్షణం. ఇది వ్యక్తిగత కష్టాలను ఎదుర్కోవడానికి, సంఘంలో సామరస్యాన్ని కొనసాగించడానికి ఎంతగానో సహాయపడుతుంది.