2016 జూన్ 15– హైదరాబాద్‌లోని ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇల్లు– కుటుంబ సభ్యులంతా ‘ప్రత్యేక’ పూజలో నిమగ్నమయ్యారు. పూజ పూర్తయితే ఇంట్లో కరెన్సీ వర్షం కురవాల్సి ఉంది. ఇంటి హాలులో వేసిన ముగ్గులో పెట్టిన రూ.1.33 కోట్లు ఏకంగా రూ.10 కోట్లుగా మారాల్సి ఉంది. పూజ చేయిస్తున్న బాబా కొద్దిసేపటికి ప్రసాదంగా పరమాన్నం పెట్టాడు. అది తిన్న కుటుంబ సభ్యులు స్పృహ కోల్పోయారు. కొన్ని గంటలకు లేచి చూసేసరికి, బాబాతో పాటు నగదు కూడా గల్లంతవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరవైనాలుగు గంటల్లోనే పోలీసులు బుడ్డప్పగారి శివ అనే బురిడీ బాబాను, అతడికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన శివ తండ్రి విద్యుత్ శాఖలో పనిచేసి ఉద్యోగ విరమణ పొందారు.
ఇంటర్ చదువును 1996లో మధ్యలోనే ఆపేసిన శివ తల్లిదండ్రులతో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బెంగళూరు వెళ్లిన ఇతగాడికి రవి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతడి ద్వారా ఒక హోటల్‌లో ఉద్యోగంలో చేరాడు. తర్వాత అక్కడి తిప్పసముద్రంలో ఓ కన్సల్టెన్సీ ఏర్పాటు చేసి, విద్యుత్, పారిశుద్ధ్య కార్మికులను పనికి పంపిస్తూ కమీషన్ తీసుకునేవాడు. కొన్నాళ్లకు ఆ పనీ మానేసి, అక్కడి ఓ ఆశ్రమంలో విద్యుత్ పనులు చేసే ఉద్యోగిగా చేరాడు. కొన్నాళ్లకు తిరుపతి సమీపంలోని కరువాయల్ ఆయుర్వేద ఆశ్రమంలో చేరాడు. అక్కడ షణ్ముగం అనే వ్యక్తి నుంచి కొంత ఆయుర్వేదం నేర్చుకున్నాడు. అప్పుడే ఇతడికి ఉమ్మెత్త గింజల గుజ్జుతో ఎదుటి వారిని మత్తులో దించవచ్చని తెలిసింది. అక్కడ నుంచి తిరిగి మళ్లీ తిప్పసముద్రంలోని ఆశ్రమానికే చేరాడు.
శివకు అక్కడ అనంతాచార్యులు అనే ‘స్వామి’తో పరిచయం ఏర్పడింది. ఆయన ద్వారానే పూజలతో నగదు రెట్టింపు మోసం నేర్చుకున్నాడు. ఈ గురువుతోనే కలిసి హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో 2009లో తొలిసారిగా పంజా విసిరాడు. అక్కడ రూ.25 లక్షలు, బెంగళూరులోని కుమ్మలగూడలో రూ.40 లక్షలు స్వాహా చేశాడు. ఆపై శనేశ్వర్ బాబా అనే మరో దొంగ స్వామితో కలిసి కర్ణాటకలోని చామరాజనగర్‌లో రూ.10 లక్షలు దోచుకున్నాడు. ఈ మూడు ఉదంతాలతో అనుభవం పెంచుకున్న శివ తానే స్వయంగా ‘పూజలు’ చేయడం ప్రారంభించాడు. తాను ఎంచుకున్న ‘టార్గెట్’ దగ్గర పూజ చేయడానికి ముందే శివ నిర్ణీత మొత్తాన్ని తొడ భాగంలో కట్టుకుని, పంచె ధరించి కూర్చుంటాడు.
లక్ష్మీ కటాక్షం కోసం కొంత మొత్తాన్ని పూజలో పెట్టాలని, పూజ పూర్తవగానే అది రెట్టింపు అవుతుందని చెప్తాడు. భక్తుల పెట్టిన మొత్తానికి తాను ‘తొడలో’ దాచిన నగదు చాకచక్యంగా కలిపేస్తాడు. రెట్టింపు మొత్తాన్ని పూజా ఫలితం అంటూ భక్తులకు ఇచ్చేస్తాడు. ఇది చూసిన వారికి బురిడీ బాబాపై పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అక్కడితో బురిడీ బాబా అసలు కథ« ప్రారంభించి అందినకాడికి దోచుకుంటాడు. కొందరు భక్తులకు తాను చెప్పిన మొత్తం పూజలో పెడితే దానికి పది రెట్లు వర్షం రూపంలో (బారిష్) కురుస్తుందని నమ్మిస్తుంటాడు. భక్తులు ‘ముగ్గులోకి’ దిగాక ‘పెద్ద పూజ’కు రంగం సిద్ధం చేస్తాడు.
ఉమ్మెత్త గింజల గుజ్జును తనతో గుట్టుగా తీసుకువస్తాడు. అత్యాశకుపోయే భక్తులు ఈసారి గతంలో పెట్టిన మొత్తానికి ఎన్నో రెట్లు సమీకరించుకుని పూజకు సిద్ధమవుతారు. పూజ చేసేప్పుడు ఇతరులెవ్వరూ ఉండకూడదంటూ కుటుంబీకుల్ని మాత్రమే ఇంట్లో ఉంచుతాడు. తంతు పూర్తయ్యే తరుణంలో ప్రసాదమంటూ పరమాన్నం సిద్ధం చేసే ఈ బురిడీ బాబా అందులో ఉమ్మెత్త గింజల గుజ్జు కలిపేస్తాడు. అది తిన్న వారంతా మత్తులోకి జారుకున్నాక పూజలో ఉంచిన సొత్తు, సొమ్ముతో ఉడాయిస్తాడు. ఈ దొంగ బాబా శివ 2012లో కూకట్‌పల్లిలో ‘పూజ’ చేసి పోలీసులకు చిక్కాడు. ఆపై బెంగళూరుకు మకాం మార్చి 2014 జూన్ 6న తిరుపతి అర్బన్ జిల్లా అలిపిరి ఆటోనగర్‌లో ఉండే రియల్టర్ ఆర్కే యాదవ్ కుటుంబంపై ‘మత్తు మందు’ జల్లాడు. పూజలో ఉంచిన రూ.63.43 లక్షలు తీసుకునే లోపే యాదవ్ సంబంధీకులు దామోదర్ రావడంతో ఉడాయించాడు.
మత్తులో ఉన్న కుటుంబాన్ని చూసిన దామోదర్ ఆ మొత్తం తస్కరించి దొంగ బాబా దొరకడనే ఉద్దేశంతో నేరాన్ని అతడి మీదికి నెట్టాడు. అలిపిరి నుంచి నెల్లూరు చేరుకున్న బురిడీ బాబా అక్కడి ఆనంద్‌రెడ్డి ఇంట్లో ‘పూజ చేసి’ రూ.40 లక్షలు ఎత్తుకుపోయాడు. యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అలిపిరి పోలీసులు శివ హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అమీర్‌పేటలోని ఓ లాడ్జిని అడ్డాగా చేసుకుని నల్లగొండకు చెందిన మరో బడా బాబును మోసం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్నారు. ఆ లాడ్జిపై మెరుపుదాడి చేసిన పోలీసులు శివను పట్టుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో దామోదర్‌ను అరెస్టు చేసి ఇరువురి నుంచి మొత్తం రూ.1.30 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ రియల్టర్‌కు కొంపల్లి వాసితో పరిచయం ఉంది. శివ ఇతడి ద్వారానే హైదరాబాద్ రియల్టర్‌కు పరిచయమయ్యాడు. బెంగళూరు శివార్లలో స్థిరపడిన శివను 2015లో ఆ స్నేహితులు ఇద్దరూ వెళ్లి కలిశారు. పక్కా పథకంతో అక్కడి గోల్ఫ్ కోర్ట్‌లో ‘ప్రత్యేక’ పూజ’ చేసిన శివ వీళ్లు తెచ్చిన రూ.లక్షను రూ.2 లక్షలు చేసిచ్చాడు. దీని కోసం దక్షిణ తప్ప అదనంగా ఏమీ తీసుకోకపోవడంతో హైదరాబాద్ రియల్టర్‌కు పూర్తి నమ్మకం ఏర్పడింది. 2016లో మళ్లీ ఈయన్ను సంప్రదించిన శివ తన వద్ద 1616 నాటి రైస్‌పుల్లర్‌గా పిలిచే ఇరీడియం కాయిన్ ఉన్నట్లు చెప్పాడు. దీన్ని అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.వందల కోట్లకు అమ్మవచ్చని, జర్మనీలో పార్టీని వెతుకుదామని చెప్పాడు. ఈ కాయిన్‌తో పాటు డబ్బును రెట్టింపు చేయడానికి మీ ఇంట్లో పూజ చేద్దామంటూ మరో ఇద్దరితో కలిసి హైదరాబాద్ చేరాడు.
2016 జూన్ 15 హైదరాబాద్ రియల్టర్ ఇంట్లో ముగ్గు వేసి పూజ ప్రారంభించిన శివ ఆ ముగ్గులో హ్యారీపోటర్ పుస్తకాన్నీ ఉంచడం గమనార్హం. అదేమంటే మహిమలకు అతడు ప్రతీకంటూ నమ్మించాడు. బురిడీ బాబా శివ 2009–16 మధ్య పదిమంది నుంచి రూ.4.25 కోట్ల మేర స్వాహా చేశాడు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, కేపీహెచ్‌బీ, మైలార్‌దేవ్‌పల్లి; చిత్తూరు జిల్లా అలిపిరి, బెంగళూరులోని కుంబులుగుడ్డు, కడప జిల్లా రాజంపేట, నెల్లూరుల్లో అరెస్టు అయ్యాడు. రైస్‌పుల్లింగ్ కాయిన్ పేరుతో బెంగళూరు గోల్ఫ్ కోర్ట్‌లో ఇద్దరి నుంచి రూ.52 లక్షలు, చెన్నైలోని ఓ త్రీ స్టార్ హోటల్ యజమాని నుంచి రూ.35 లక్షలు కాజేసిన ఉదంతాల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. 2016 తర్వాత ఇతడి పేరు మళ్లీ రికార్డుల్లోకి ఎక్కలేదు.



