స్వామివారి పాదాల కింద విరాజిల్లిన విరజానది | Tirumala Tirupati Devasthanams Official Temple History | Sakshi
Sakshi News home page

స్వామివారి పాదాల కింద విరాజిల్లిన విరజానది

Sep 21 2025 6:50 AM | Updated on Sep 21 2025 6:50 AM

 Tirumala Tirupati Devasthanams Official Temple History

స్వామివారి పాదాల కింద ప్రవహించే విరజానది ఆలయంలో సంపంగి ప్రదక్షిణంలో ఉగ్రాణం ముందున్న చిన్న బావినే విరజానది అంటారు. వైకుంఠంలోని ఈ దేవనది స్వామి పాదాల కింద ప్రవహిస్తోందంటారు. నదిలో కొంత భాగాన్నే బావి అంటారు. దీన్ని చతురస్రాకారంలో చెక్కిన రాళ్ళతో నిర్మించారు. రాళ్లపై నాలుగు అంచుల్లో వానరులతో కలిసి ఉన్న సీతారామలక్ష్మణులు, హనుమంత, సుగ్రీవులు, కాళీయమర్దనంలో శ్రీకృష్ణుని వేడుకుంటున్న నాగకన్యలు, ఏనుగును అదిలిస్తున్న వేంకటేశ్వరుడు, గరుడుని బొమ్మలు మలిచారు. అందుకే ఈ బావిని ఆలయ అర్చకులు, స్థానికులు బొమ్మలబావిగా పిలుస్తుంటారు.

స్వామి పవిత్ర నిర్మాల్యం పూలబావికే సొంతం 
అద్దాల మండపానికి ఉత్తర దిశలో ఈ పూల బావి ఉంది. స్వామికి సమర్పించిన తులసి, పుష్ప, పూమాలలను ఎవరికీ ప్రసాదంగా ఇచ్చే సంప్రదాయం లేదు. అందుకే ఆ పవిత్రమైన నిర్మాల్యాన్ని ఎవ్వరూ తిరిగి వాడకుండా ఈ పూలబావిలో వేస్తారు. స్వామికి నివేదించిన అన్ని రకాల నిర్మాల్యం పూలబావి తన ఉదరంలో దాచుకుంటుందని అర్చకులు చెబుతారు. అందుకే దీనికి పూలబావిగా నామం సార్థకమైంది. దీనినే భూ తీర్థం అని కూడా పిలుస్తారు. ఈ తీర్థం కాలాంతరంలో నిక్షిప్తమైపోవడంతో శ్రీనివాసుని ఆదేశంతో రంగదాసు అనే భక్తుడు ఒక బావిని తవ్వగా భూ తీర్థం పునరుజ్జీవం పొందిందని చెబుతారు. రంగదాసు మరుజన్మలో తొండమాన్‌ చక్రవర్తిగా జన్మించి స్వామిని సేవించారని పురాణాల కథనం. 

అభిషేక సేవకు బంగారుబావి నీళ్లు
వకుళమాత కొలువైన పోటు(వంటశాల) పక్కనే బంగారు బావి ఉంది. స్వామి దర్శనం చేసుకుని బంగారు వాకిలి వెలుపలకు వచ్చిన భక్తులకు ఎదురుగానే ఈ బంగారుబావి దర్శనమిస్తుంది. గర్భాలయంలోని మూలమూర్తికి ప్రతి శుక్రవారం నిర్వహించే అభిషేకానికి ఇందులోని జలాన్నే వాడతారు. బావికి చుట్టూ భూ ఉపరితలానికి చెక్కడపు రాళ్లతో వర నిర్మించారు. దీనికి బంగారు తాపడం చేసిన రాగి రేకులు అమర్చడం వల్ల బంగారు బావిగా ప్రసిద్ధి పొందింది. దీనినే శ్రీతీర్థం, సుందర తీర్థం, లక్ష్మీ తీర్థం అని కూడా పిలుస్తుంటారు. వైకుంఠం నుంచి వేంకటాచలానికి వచ్చిన శ్రీమన్నారాయణునికి వంట కోసం మహాలక్ష్మి ఈ తీర్థాన్ని ఏర్పాటు చేశారట! 

త్రైలోక్య దుర్లభాలు
శ్రీవారి పుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శన భాగ్యం, కటాహ తీర్థపానం... ఈ మూడు త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. కటాహ తీర్థం శ్రీవారి హుండీకి వెలుపల ఆనుకుని తొట్టిమాదిరిగా ఎడమ దిక్కున ఉంది. దీన్ని తొట్టి తీర్థమని కూడా అంటారు. స్వామి పాదాల నుండి వచ్చే అభిషేకతీర్థం ఇది. ఈ తీర్థాన్ని స్వీకరించినప్పుడు అష్టాక్షరి లేదా కేశవాది నామాలు లేదా శ్రీవేంకటేశుని నామాలు ఉచ్చరిస్తే పుణ్యం దక్కుతుందని పెద్దలు చెబుతారు.

మోక్షప్రాప్తి కలిగించే పుష్కరిణి పుణ్యస్నానం
బ్రహ్మాండంలోని సర్వతీర్థాల నిలయం శ్రీవారి పుష్కరిణి. శ్రీమహావిష్ణువు ఆనతితో గరుత్మంతుడు వైకుంఠం నుండి క్రీడాద్రితోపాటు పుష్కరిణిని కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రానికి తీసుకొచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. పుష్కరిణి దర్శించడం, తీర్థాన్ని సేవించడం, పుణ్యస్నానమాచరించడం వల్ల సకల పాపాలు తొలగి ఇహంలో సుఖ శాంతులతోపాటు పరలోకంలో మోక్షమూ సిద్ధిస్తుందని నమ్మకం. ప్రతి యేటా బ్రహ్మోత్సవాల చివరి రోజున చక్రస్నానం కార్యక్రమాన్ని పుష్కరిణిలో వేడుకగా నిర్వహిస్తారు. అలాగే ఇందులో ప్రతి ఏడాది ఫాల్గుణ మాసంలో ఐదు రోజుల పాటు తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.

పుష్కరిణిలో ప్రాచుర్యంలోని తొమ్మిది తీర్థాలు
ముక్కోటి తీర్థాల సమాహారమే శ్రీవారి పుష్కరిణి. ఈ పుష్కరిణిలో ప్రధానంగా తొమ్మిది తీర్థాలు విశేషంగా ప్రాచుర్యం పొందాయి. అవి: మార్కండేయ తీర్థం (పూర్వ భాగం), ఆగ్నేయ తీర్థం (ఆగ్నేయ భాగం), యమ తీర్థం (దక్షిణ భాగం), వసిష్ట తీర్థం (నైరుతి), వరుణ తీర్థం (పడమర), వాయు తీర్థం (వాయు భాగం), ధనద తీర్థం (ఉత్తర భాగం), గాలవ తీర్థం (ఈశాన్యం), సరస్వతీ తీర్థం(మధ్య భాగం). «పూర్వం శంఖనుడు అనే రాజు స్వామివారి పుష్కరిణిలో భక్తి శ్రద్ధలతో స్నానమాచరించడం వల్ల పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందాడట! దశరథ మహారాజు పుష్కరిణి తీర్థాన్ని సేవించి స్వామిని వేడుకోవటంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే పుత్రునిగా పొందే భాగ్యం పొందాడు. కుమారస్వామి తారకాసురుని సంహరించడంతో వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని ఈ పుష్కరిణిలో స్నానమాచరించి పోగొట్టుకున్నాడట! ఎందరెందరో భక్తులు ఇందులో స్నానమాచరించి రోగ రుగ్మతలు పోగొట్టుకుని, భోగభాగ్యాలు సంపాదించుకున్నారని పెద్దలు చెప్పే మాట! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement